‘‘సిజేరియన్ అయిన వెంటనే సెక్స్‌వర్క్‌కు వెళ్లాల్సి వచ్చింది’’

సోఫీ
ఫొటో క్యాప్షన్, కొత్త చట్టంతో జీవితం మెరుగుపడుతుందని చెప్పిన మహిళల్లో మెల్ ఒకరు
    • రచయిత, సోఫియా బెటిజా
    • హోదా, జెండర్ అండ్ ఐడెంటిటీ కరెస్పాండెంట్, బీబీసీ వరల్డ్ న్యూస్

హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక అంశాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి.

సోఫీ ఒక సెక్స్ వర్కర్. ఆమె బెల్జియంకు చెందినవారు.

‘‘నేను 9 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా పనిచేయాల్సి వచ్చింది. బిడ్డను కనడానికి ఒక వారం ముందు కూడా క్లయింట్లతో సెక్స్‌లో పాల్గొన్నాను’’ అని సోఫీ చెప్పారు.

అయిదుగురు పిల్లలకు తల్లిగా వారి బాగోగులు చూసుకోవడంతో పాటు, సెక్స్ వర్కర్‌గా పనిచేయడం నిజంగా ఎంతో కష్టమని ఆమె అన్నారు.

బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘బిడ్డ పుట్టగానే పనికి వెళ్లా’

సోఫీ సిజేరియన్ ద్వారా అయిదో బిడ్డకు జన్మనిచ్చారు. ఆపరేషన్ తర్వాత ఆమెకు ఆరు వారాలు పూర్తిగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కానీ, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె వెంటనే పనికి వెళ్లాల్సి వచ్చింది.

‘‘పని మానేసి విశ్రాంతి తీసుకునే అవకాశం నాకు లేదు. ఎందుకంటే డబ్బు అవసరం’’ అని సోఫీ తెలిపారు.

ఒకవేళ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ (ప్రసూతి సెలవు) తీసుకునే హక్కు ఉండి ఉంటే బాలింతగా ఉన్నప్పుడు ఆమె జీవితం సాఫీగా సాగిపోయి ఉండేది.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సెక్స్‌వర్కర్ల కోసం బెల్జియం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం, సెక్స్‌వర్కర్లు చేసే పనిని కూడా ఒక మామూలు ఉద్యోగంలా పరిగణించి వారికి అధికారికంగా ఉద్యోగ కాంట్రాక్టు, హెల్త్ ఇన్సూరెన్స్‌, పెన్షన్, మెటర్నిటీ లీవ్, సిక్ లీవులు ఇస్తారు.

‘‘మాములు మనుషుల్లా బతికేందుకు ఇది మాకొక అవకాశం’’ అని సోఫీ చెప్పారు.

ఇంటర్‌నేషనల్ యూనియన్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.2 కోట్ల మంది సెక్స్‌వర్కర్లు ఉన్నారు.

ఈ వృత్తిని 2022లో బెల్జియం ‘నేరంగా పరిగణించని వృత్తుల’ జాబితాలో చేర్చింది. తుర్కియే, పెరూ వంటి ఇతర దేశాల్లోనూ ఇది చట్టబద్ధమే. కానీ, సెక్స్‌వర్కర్లకు ఉద్యోగ హక్కులు, కాంట్రాక్టులు కల్పించడం మాత్రం ప్రపంచంలో ఇదే తొలిసారి.

‘‘ఇంతకుముందు ఇలాంటి హక్కులు లేవు. ఇది చాలా మంచి పని. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటిది చూడలేదు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని హ్యుమన్ రైట్స్ వాచ్‌కు చెందిన పరిశోధకులు ఎరిన్ కిల్‌బ్రిడ్ అన్నారు.

కరోనా మహమ్మారి తర్వాత సెక్స్ వర్కర్లకు కార్మిక చట్టాలు వర్తింపచేయాలంటూ జరిగిన నిరసనలు
ఫొటో క్యాప్షన్, కరోనా మహమ్మారి తర్వాత సెక్స్ వర్కర్లకు కార్మిక చట్టాలు వర్తింపచేయాలనే ఆందోళనలు జరిగాయి

ఈ వ్యాపారం మానవ అక్రమ రవాణా, దోపిడీ, దూషణలకు కారణమవుతుందని, ఈ కొత్త చట్టం ఇవి జరుగకుండా నిరోధించలేదని విమర్శకులు అంటున్నారు.

‘‘ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే, హింస మిళితమై ఉన్న ఒక వృత్తిని ఈ చట్టం సాధారణ పనిగా మార్చుతుంది’’ అని ఇసాలా అనే ఎన్జీవో వలంటీర్ జులియా క్రుమియర్ అన్నారు. బెల్జియం వీధుల్లోని సెక్స్‌వర్కర్లకు ఈ ఎన్జీవో సహాయపడుతుంది.

చాలామంది సెక్స్‌ వర్కర్లకు ఈ పని అవసరం. ఈ చట్టం కొంచెం ఆలస్యంగా వచ్చిందని వారు భావిస్తున్నారు.

మెల్ కూడా ఒక సెక్స్ వర్కర్. ఆమె పనిచేసే పరిసరాలలో లైంగిక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఆ సమయంలో ఒక క్లైంట్ కండోమ్ లేకుండా ఓరల్ సెక్స్ చేయాలని తనను బలవంతం చేశారని, అప్పుడు వారు చెప్పింది చేయడం తప్ప తను చేయగలిగిందేమీ లేదని ఆమె వెల్లడించారు.

‘‘నాకున్న దారి ఒక్కటే, ఆ పని చేసి వ్యాధిని వ్యాప్తి చేయడం లేదా డబ్బుల్లేకుండా ఖాళీ చేతులతో తిరిగి రావడం’’ అని మెల్ చెప్పారు.

డబ్బు అవసరం ఉండటంతో 23 ఏళ్ల వయస్సులో ఆమె ఈ వృత్తిలోకి వచ్చారు. చాలా త్వరగా, అనుకున్నదానికంటే ఎక్కువే ఆమెకు సంపాదన రావడం మొదలైంది. కానీ ఎస్టీఐ (లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల) ప్రభావాలతో ఆమె భయాందోళనకు గురయ్యారు.

మెల్ ఇప్పుడు తాను అసౌకర్యంగా భావించే లైంగిక చర్యను, క్లయింట్లను తిరస్కరించ గలుగుతున్నారు.

‘‘నేను మా మేడమ్‌ను నిలదీసి ఉండాల్సింది. మీరు నియమాలను ఉల్లంఘిస్తున్నారు. మా పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?’ అని అమెను అడిగి ఉండాల్సింది. చట్టపరంగా నాకు న్యాయం జరిగి ఉండేది’’ అని మెల్ భావిస్తున్నారు.

విక్టోరియా
ఫొటో క్యాప్షన్, సెక్స్‌వర్క్ కూడా సామాజిక సేవ అని విక్టోరియా అంటారు

‘అదో సామాజిక సేవ’

బెల్జియం తాజాగా తీసుకున్న నిర్ణయం, 2022లో నెలల పాటు జరిగిన నిరసనల ఫలితం. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వ మద్దతు సరిగా లేకపోవడంతో ఈ నిరసనలు జరిగాయి.

ఈ నిరసనలను ముందుండి నడిపించిన వారిలో బెల్జియన్ యూనియన్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ (యూటీఎస్‌ఓపీఐ) అధ్యక్షురాలు విక్టోరియా ఒకరు. గతంలో ఆమె 12 ఏళ్ల పాటు ఒక ఎస్కార్ట్‌గా పనిచేశారు. డబ్బు తీసుకొని ఇతరులతో కలిసి సోషల్ ఈవెంట్లకు వెళ్లేవారిని, సెక్స్‌లో పాల్గొనేవారిని ఎస్కార్ట్‌ అని పిలుస్తారు.

ఇది ఆమెకు ఒక వ్యక్తిగత పోరాటం లాంటిది. వ్యభిచారాన్ని ఆమె సామాజిక సేవగా పరిగణిస్తారు. తాము చేసే పనులను శాతాల వారీగా చెబితే సెక్స్‌లో పాల్గొనడం అనేది కేవలం 10 శాతమే ఉంటుందని ఆమె అంటున్నారు.

‘‘మా దగ్గరికి వచ్చిన వారి పట్ల శ్రద్ధ తీసుకోవడం, వారి కథలను వినడం, వారితో కలిసి తినడం, మ్యూజిక్‌కు తగినట్లుగా డ్యాన్స్ చేయడం ఇలాంటి పనులన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఒంటరితనాన్ని పోగొట్టడం’’ అని మెల్ వివరించారు.

కానీ, తమ పనికి చట్టబద్ధత లేకపోవడం వల్ల గతంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నామని ఆమె చెప్పారు. అసురక్షిత వాతావరణంలో ఆమె పని చేశారు.

ఒక క్లయింట్ తనపై అత్యాచారం చేశారని విక్టోరియా చెప్పారు.

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడున్న మహిళా అధికారి తనతో పరుషంగా మాట్లాడారని విక్టోరియా గుర్తు చేసుకున్నారు.

‘‘సెక్స్ వర్కర్లను రేప్ చేయలేరని ఆమె అన్నారు. అదంతా నా తప్పేనని, నేను చేస్తున్న పని వల్లే అలా జరిగిందని నేను అనుకునేలా ఆమె మాట్లాడారు. అక్కడి నుంచి ఏడుస్తూ బయటకు వెళ్లిపోయాను’’ అని విక్టోరియా తెలిపారు.

మేం మాట్లాడిన సెక్స్ వర్కర్లలందరూ ఏదో ఒక సమయంలో తమకు నచ్చని పని చేసేలా తమను ఒత్తిడి చేశారని చెప్పారు.ఈ కారణంగానే, కొత్త చట్టం తమ జీవితాలను మార్చుతుందని విక్టోరియా బలంగా నమ్ముతున్నారు.

‘‘మీరు చేసే పనికి ఒక చట్టమంటూ లేకుంటే, మీ పని చట్టవిరుద్ధమైనదైతే మీకు సహాయంగా ఉండే ఎలాంటి నిబంధనలు ఉండవు. ఈ చట్టం వల్ల మాకు భద్రత దక్కుతుంది’’ అని విక్టోరియా అభిప్రాయపడ్డారు.

అలెగ్జాండ్రా, క్రిస్
ఫొటో క్యాప్షన్, అలెగ్జాండ్రా, క్రిస్ దంపతులు 15మంది సెక్స్‌వర్కర్లకు పని కల్పిస్తున్నారు

మధ్యవర్తులకు చెక్

కొత్త చట్టం ప్రకారం, సెక్స్‌వర్లర్లకు క్లయింట్లకు మధ్యవర్తులుగా వ్యవహరించేవారు (పింప్) చట్టబద్ధంగా, కొన్ని నియమాలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. ఒక తీవ్రమైన నేరంలో దోషిగా తేలిన వారెవరైనా సెక్స్‌వర్కర్లకు పని కల్పించలేరు.

‘‘నాకు తెలిసి చాలా వ్యాపారాలు మూతబడతాయి. ఎందుకంటే చాలా మంది యజమానుల పేరు మీద క్రిమినల్ రికార్డులు ఉన్నాయి’’ అని క్రిస్ రీక్మన్స్ అన్నారు. బెక్‌వూర్ట్ అనే ఒక చిన్నపట్టణంలో తన భార్య అలెగ్జాండ్రాతో కలిసి ఆయన ఒక మసాజ్ పార్లర్‌ను నడుపుతారు.

క్రిస్, ఆయన భార్య వద్ద 15 మంది సెక్స్ వర్కర్లు పనిచేస్తారు. వారి పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ మంచి వేతనాలను చెల్లిస్తామని వారు చెప్పారు.

‘‘ఈ మహిళల పట్ల చెడుగా ప్రవర్తించే యజమానుల వ్యాపారాలు మూతపడతాయని అనుకుంటున్నా’’ అని క్రిస్ అన్నారు.

మెల్
ఫొటో క్యాప్షన్, సెక్స్ పరిశ్రమను ఎలా నియంత్రించాలనేది ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారిపోయింది.

తమ సహాయం అందుకున్న సెక్స్‌వర్కర్లందరూ ఈ వృత్తి నుంచి బయటపడి ఒక కొత్త సాధారణ ఉద్యోగం చేయడానికి సహాయపడాలని కోరినట్లు జులియా చెప్పారు. కార్మిక హక్కుల్ని వారు కోరుకోలేదని అన్నారు.

బెల్జియం కొత్త చట్టం ప్రకారం, సెక్స్ కార్యకలాపాలు జరిగే ప్రతీ గదిలో కచ్చితంగా ఒక అలారమ్ బటన్ ఉంచాలి. ఈ బటన్ సెక్స్‌వర్కర్‌ను ఆమెకు సంబంధించిన వ్యక్తులతో కనెక్ట్ చేసేలా ఉండాలి.

కానీ, సెక్స్ వర్క్‌ను సురక్షితంగా చేయడానికి మార్గం లేదని జులియా నమ్ముతున్నారు.

‘‘వేరే ఏ ఇతర పనుల్లోనైనా ప్యానిక్ బటన్ అవసరం ఉంటుందా?’’ అని ఆమె ప్రశ్నించారు.

సెక్స్ పరిశ్రమను ఎలా నియంత్రించాలనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా మారిపోయింది.

కొత్త చట్టం మహిళలకు సహాయపడుతుందని మెల్ భావిస్తున్నారు.

‘‘బెల్జియం ఈ విషయంలో మిగతా వారికంటే చాలా ముందు ఉన్నందుకు గర్వంగా ఉంది. నా భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది’’ అని మెల్ అన్నారు.

ఈ కథనంలో పేర్కొన్న వ్యక్తుల భద్రత దృష్ట్యా కొన్ని పేర్లు మార్చాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)