కమిల్లా నోరోవా: ‘పాస్‌పోర్టులో జెండర్ మార్చుకోవడానికి వెళ్తే చిత్రహింసలు పెట్టారు’

- రచయిత, ఇబ్రత్ సఫో
- హోదా, బీబీసీ న్యూస్ ఉజ్బెక్
''నీకు అందమైన శరీరం ఉంది, ఎలాంటి సెక్స్ అంటే ఇష్టం'' అని ఆ ఆఫీసర్ ఆమెను అడిగారు.
మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్‌లో తనకు కస్టడీలో ఎదురైన అసభ్యకర ప్రవర్తన, లైంగిక వేధింపుల గురించి చెబుతూ 25 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ మహిళ కమిల్లా నోరోవా ఆవేదనకు గురయ్యారు.
లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం కోసం ఆమె 17 ఏళ్ల వయసులో రష్యా వెళ్లారు, అయితే తన ఉజ్బెక్ పౌరసత్వాన్ని ఆమె కొనసాగించారు.

ఉజ్బెకిస్తాన్‌లో లింగమార్పిడి అంత కష్టమా?
ఇలాంటి శస్త్రచికిత్సలు ఉజ్బెకిస్తాన్‌లో అంత సులువు కాదు.
ఇప్పటి వరకూ ఎంతమంది వ్యక్తులు లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకున్నారనే గణాంకాలు అందుబాటులో లేవు. అయినప్పటికీ హార్మోన్ థెరపీ చేయించుకునేందుకు, అరుదుగా అయినా.. అవసరమైతే లింగమార్పిడి చేయించుకునేందుకు అవకాశమున్నట్లు గత రికార్డులు సూచిస్తున్నాయి.
కానీ, అలాంటి ఆపరేషన్లు చేయించుకోవాలనుకునే వారిలో ఎక్కువ మంది రష్యా లేదా ఇతర దేశాలకు వెళ్లేందుకే మొగ్గుచూపుతారు.
లింగమార్పిడి ఆపరేషన్ తర్వాత కమిల్లా తన పాస్‌పోర్టును రెన్యువల్ చేసుకునేందుకు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ వచ్చారు.
ఆ సమయంలో తనపై తప్పుడు ఆరోపణలతో తనను నిర్బంధంలోకి తీసుకున్నారని, 25 రోజులు బంధించి ఉంచారని ఆమె చెప్పారు.
లైంగికంగా వేధించడంతో పాటు తనను కొట్టారని, చంపేస్తామని బెదిరించారని, బలవంతంగా వైద్య పరీక్షలు చేశారని ఆమె తెలిపారు.
ఉజ్బెకిస్తాన్ చట్టాల్లో ట్రాన్స్‌జెండర్స్ హక్కుల గురించి ప్రస్తావన లేదు.
అయితే, లింగమార్పిడి ఆపరేషన్లు విదేశాల్లో చేయించుకున్నప్పటికీ, వారి లింగ మార్పును నిర్ధరిస్తూ కొత్త గుర్తింపు కార్డులు, లేదా పాస్‌పోర్టులను జారీ చేయొచ్చు.
ఆన్‌లైన్‌లో ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, తాష్కెంట్‌లో తన నిర్బంధానికి ముందు జారీ అయిన ఐడీ కార్డుని కమిల్లా మాకు చూపించారు. అందులో ఆమెను 'ఫీమేల్'(మహిళ)గా పేర్కొన్నారు.
''ఐడీ కార్డు వచ్చిన వెంటనే, ట్రావెల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నా. తమ ప్రొసీజర్ ప్రకారం విదేశాల్లో ఉంటున్న వారిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుందని పాస్‌పోర్ట్ ఆఫీస్ హెడ్ చెప్పారు'' అని ఆమె తెలిపారు.
అందుకు కమిల్లా సరేనన్నారు.
‘‘ఇంటర్వ్యూ కోసం తాష్కెంట్‌లోని డిస్ట్రిక్ట్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లోని రూమ్ 3 కి నన్ను రమ్మన్నారు. అక్కడికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న బోబర్ అనే యువ పోలీసు అధికారి నా దగ్గరికి వచ్చారు. అతను నా మొబైల్ ఫోన్ తీసుకుని చూడడం మొదలుపెట్టారు. అందులో లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత తీసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి.’’ అని కమిల్లా చెప్పారు.

ఫొటో సోర్స్, Kamilla Norova
'నా రొమ్ములు చూపించమని అడిగారు'
''నువ్వు చాలా అందంగా ఉన్నావ్, నీ రొమ్ములు బావున్నాయ్. నీకు ఎలాంటి సెక్స్ అంటే ఇష్టం? త్రీసమ్ ఇష్టమేనా, ఇద్దరు మగాళ్లతో ఒకేసారి? అని అడిగారు''
ఈ మాటలతో తనకు కోపం వచ్చిందని కమిల్లా అన్నారు. అయినా బోబర్ ఆగలేదని కమిల్లా చెప్పారు. నీ రొమ్ములు చూపించమంటూ, తనను తాకేందుకు ప్రయత్నించారని, తాను బోబర్ చేతిని తోసేసినట్లు కమిల్లా చెప్పారు. అయినా బోబర్ వెనక్కి తగ్గలేదని ఆమె చెప్పారు.
''ఒక పేపర్ ముక్క చించి, దానిపై ఆయన తన ఫోన్ నంబర్ రాశారు. నా ఫోన్‌లో తన ఫోన్ నంబర్ టైప్ చేసి, సేవ్ చేశారు. ఎక్కడ ఉంటున్నావని అడిగారు. ఆ దగ్గర్లో హోటళ్లు ఉన్నాయా? అని అడిగారు.’’ అని ఆమె వెల్లడించారు.
‘‘మనం హోటల్‌లో కలుద్దాం అన్నారు. ఆ మాటలు పట్టించుకోకుండా నా పాస్‌పోర్ట్ ఎప్పటికి సిద్ధమవుతుందని అడిగాను. మనం హోటల్‌లో కలుద్దాం, ఆ వెంటనే పాస్‌పోర్ట్ సిద్ధమవుతుందని ఆయన అన్నారు. దీంతో నేను ఏడుస్తూ అక్కడి నుంచి వచ్చేశా'' అని ఆమె చెప్పారు.
బోబర్ యాంటీటెర్రరిజం విభాగానికి చెందిన అధికారి అని ఆ తర్వాత పాస్‌పోర్ట్ ఆఫీస్ హెడ్ ఆమెకు చెప్పారు
కమిల్లా ఇచ్చిన నంబర్‌తో బోబర్‌ను సంప్రదించేందుకు బీబీసీ న్యూస్ ఉజ్బెక్ ప్రయత్నించింది. చాట్ యాప్ ద్వారా ఆయనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించింది, అయితే ఆయన మెసేజ్ చదివారుగానీ, ఎలాంటి స్పందనా రాలేదు.
తనకు ఎదురైన దారుణ అనుభవంతో దిగ్భ్రాంతికి గురైన కమిల్లా, న్యాయపరమైన సలహా తర్వాత అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత విచారణ కోసమంటూ మరో ప్రభుత్వ కార్యాలయానికి రావాలన్నారు.
అక్కడ ఒక మగ, మరో మహిళా పోలీసు అధికారి ఉన్నారు. తన ఫోన్‌ను రిసెప్షన్‌లోని లాకర్‌లో పెట్టాలని చెప్పారు. మేడమీద విచారణ గదికి తీసుకెళ్లారు. తనతో వచ్చిన కుటుంబ సభ్యులు, ఆమె స్నేహితులను లోపలికి అనుమతించలేదు.
''కొద్దిసేపు మామూలుగానే సాగింది. కానీ కొద్దినిమిషాల తర్వాత వాళ్లు దారుణంగా మాట్లాడడం మొదలుపెట్టారు'' అని కమిల్లా గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Kamilla Norova
'మీరంతా వ్యభిచారులు'
''అంతా (ట్రాన్స్‌జెండర్ మహిళలు) ఒకటే, మీరంతా వేశ్యలు. నీకు ఎంపీలవంటి పెద్ద పెద్దోళ్లతో సంబంధాలు ఉంటాయి(అంటూ దూషించారు). కొద్దిసేపటి తర్వాత నాకు కొంచెం నీళ్లు కావాలని అడిగా.’’ అని కమిల్లా వెల్లడించారు.
''నేను బాటిల్‌లో మూత్రం పోస్తా, అవి తాగు' అని వారిలో ఒకరు అన్నారు. బోబర్‌పై ఎందుకు ఫిర్యాదు చేశారని మరొకరు అడిగారు. దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.'' అని అన్నారని కమిల్లా గుర్తు చేసుకున్నారు.
కొద్దిసేపటి తర్వాత ఆ బెదిరింపులు, అవమానాలు భౌతిక దాడులుగా మారాయని కమిల్లా చెప్పారు. వారిలో ఒక అధికారి ఆమె గొంతు పట్టుకుని, గోడకు ఆనించి, చేతిలో తుపాకీ చూపిస్తూ ''నువ్వు ఇక్కడ చచ్చిపోతావ్'' అన్నారని చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
''ఆ తర్వాత తలుపు తెరుచుకుంది, ఒక మగ, మరో మహిళా అధికారి లోపలికి వచ్చారు. నాపై దాడికి దిగిన వ్యక్తి నా చెంపలపై కొట్టడం మొదలుపెట్టారు. నన్ను వెనక్కి నెట్టేశారు, హైహీల్స్ వేసుకుని ఉండడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడ్డా. అక్కడున్న వాళ్లు నన్ను చూసి నవ్వుకున్నారు. పైకి లేవగానే, ఆయన మళ్లీ కొట్టారు. సాయం చేయమని మహిళా అధికారిని బతిమిలాడా. మీరూ ఆడవారే కదా, ఆడవారిపై చేయి చేసుకోవడం మీ కంటికి కనిపించడం లేదా? అన్నాను. దానికి ఆమె నువ్వు ఆడదానివే కాదు, నీలాంటి వాళ్లను చంపేయాలి అన్నారు.'' అని కమిల్లా తెలిపారు.
‘‘లాయర్‌ను అనుమతించాలని అడిగినా పట్టించుకోలేదు. దానికితోడు ఇంకా ఎక్కువ మంది పోలీసులు లోపలికి వచ్చారు. ఆ దారుణం అలాగే కొనసాగింది. ఆ తర్వాత, ఉజ్బెక్‌లో రాసివున్న పత్రాలపై సంతకం పెట్టాలని ఒత్తిడి చేశారు. ఉజ్బెక్ పూర్తిగా రాకపోవడం వల్ల, అందులో ఏం రాసుందో నాకు తెలియలేదు.’’ అని ఆమె తెలిపారు.
అనంతరం, మేడమీద ఉన్న కోర్టు గదిలోకి తీసుకెళ్లిన తర్వాత తనపై చేసిన ఆరోపణలు విని షాకైనట్లు ఆమె చెప్పారు.
‘‘వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే నిన్ను అదుపులోకి తీసుకున్నారు, నీ పేరు ఏంటి, ఎక్కడ ఉంటావు అని వివరాలు అడిగితే చెప్పలేదు. పోలీసులు తమతో రావాలంటే సహకరించలేదు’’ అని న్యాయమూర్తి తనపై మోపిన అభియోగాలను వెల్లడించినట్లు కమిల్లా చెప్పారు.
ఆ ఆరోపణలను తను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. అయినప్పటికీ ఆమెకు 15 రోజుల జైలు శిక్ష పడింది.
'ఫిర్యాదు చేసే హక్కు ఉంది'
తనకు జైలులోనూ ఇబ్బందులు కొనసాగాయని కమిల్లా చెప్పారు. అవమానకర రీతిలో, తీవ్రమైననొప్పితో కూడిన బలవంతపు వైద్య పరీక్షలను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు.
తన 15 రోజుల జైలు శిక్ష ముగిసే సమయంలో పత్రాల కోసం అధికారులకు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలతో మరో 8 రోజుల జైలు శిక్ష పడింది. ఆ ఆరోపణలను ఆమె తిరస్కరించారు.
బీబీసీ న్యూస్ ఉజ్బెక్, కమిల్లా ఆరోపణలను వివరంగా ప్రస్తావిస్తూ ఉజ్బెకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారులపై దర్యాప్తు జరిపిస్తారా? అని ప్రశ్నించింది.
''చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ విభాగాల పనితీరుపై అసంతృప్తి ఉంటే పౌరులు ఫిర్యాదు చేయొచ్చు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది'' అని ఆ శాఖ పత్రికా కార్యాలయ అధిపతి బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీపై తప్పుడు భావన
సాధారణంగానే, ఉజ్బెకిస్తాన్‌లో ట్రాన్స్‌జెండర్లు, ఎల్జీబీటీ కమ్యూనిటీపై ప్రతికూల వైఖరి ఉంది. ట్రాన్స్‌జెండర్లను వేధిస్తున్న వీడియోలు, కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.
అధ్యక్షులు షావ్కత్ మిర్జియోయేవ్ ప్రభుత్వం మతపరమైన సంప్రదాయాలకు స్వేచ్ఛనివ్వడంతో ఇస్లామిక్ సెంటిమెంట్ పెరుగుతోంది. దీంతో మతపరమైన బ్లాగర్లు, ఇమామ్‌ల వంటి వారు ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులను బహిరంగంగా విమర్శించడం మొదలైంది.
దీనిని ముప్పుగా భావిస్తున్న చాలామంది ఎల్జీబీటీలు లేదా ట్రాన్స్‌జెండర్లు ఉజ్బెకిస్తాన్ నుంచి వెళ్లిపోవడానికే మొగ్గు చూపుతున్నారు.
కమిల్లా 17 ఏళ్ల వయసులో మాస్కోలో ఉంటున్న తన సోదరి వద్దకు వెళ్లిపోయారు. అక్కడ లింగమార్పిడి ప్రక్రియ జరిగింది. తన వృషణాలను తొలగించే ఆర్కిఎక్టమీ సహా పలు ఆపరేషన్లు అక్కడే జరిగాయి.
అభియోగాలు వెనక్కి..
రష్యాలో సింగర్‌గా, పాటల రచయితగా కెరీర్ మొదలుపెట్టిన కమిల్లాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 200,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. తన మ్యూజిక్ వీడియోలు, ఫోటోలను ఆమె పోస్ట్ చేస్తుంటారు.
ఎట్టకేలకు తన కొత్త జెండర్‌ను గుర్తిస్తూ, ఉజ్బెక్ అధికారులు కమిల్లాకి కొత్త పాస్‌పోర్ట్ ఇచ్చారు.
తనపై మోపిన అభియోగాలను కూడా ఉపసంహరించుకున్నట్లు ఆమె చెప్పారు.
ఇన్ని కష్టాల తర్వాత ఇప్పుడు, ఆమె తనకు నచ్చినట్లు తాను బతకొచ్చని భావిస్తున్నారు.
''నేను ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నా. చట్టం అనుమతిస్తే ఒక పాపను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నా.'' అన్నారామె.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














