బెజవాడలో పాకిస్తాన్ కాలనీ.. అక్కడి ప్రజలు ఏం చెబుతున్నారు?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఏమిటా అనుకుంటున్నారా.. దానికో చరిత్ర ఉంది.
విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలోని 62వ డివిజన్‌లోని ఓ ప్రాంతం పేరు పాకిస్తాన్ కాలనీ. అక్కడి ప్రజల ఆధార్, పాన్, రేషన్ కార్డు సహా అన్ని సర్టిఫికెట్లలోనూ వారి చిరునామా పాకిస్తాన్ కాలనీ, బెజవాడగా నమోదవుతుంటుంది.
ఇంతకూ ఈ కాలనీకి ఆ పేరు ఎందుకు వచ్చింది.
దీని వల్ల అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి?
విజయవాడలో 1980లలో ఈ కాలనీ కట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు చెప్పారు.
‘‘పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం 1980లలో విజయవాడలో కాలనీ ఏర్పాటు చేశారు. దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు. ఆ తర్వాత బర్మా నుంచి వచ్చిన వాళ్ల కోసం బర్మా కాలనీ కూడా ఏర్పాటైంది’’ అని ఆ ప్రాంత కార్పొరేటర్‌గా గతంలో పనిచేసిన బాబూరావు తెలిపారు.
‘‘నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఇక్కడ పాకిస్తాన్ వాళ్ల కోసం కాలనీ కట్టారు. వాళ్లు బట్టల వ్యాపారం చేసేవారు. అయితే అమ్మకాలు సరిగ్గా లేకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయారు’’ అని పాకిస్తాన్ కాలనీ నివాసి షేక్ మస్తాన్‌బీ బీబీసీకి చెప్పారు.


ఎక్కడి నుంచి వచ్చారు?
తూర్పు పాకిస్తాన్ (ఈస్ట్ బెంగాల్), పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం జరిగింది. నాడు ఈస్ట్ బెంగాల్ తరపున భారత్ పోరాడింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడంతో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించింది.
నాడు యుద్ధ సమయంలో లక్షల మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చారు. వారికి భారత్ ఆశ్రయం ఇచ్చి, శిబిరాలు ఏర్పాటు చేసింది. ఇలాంటి శిబిరాలు ఎక్కువగా ఈశాన్య భారతదేశంలోనే ఉన్నాయి. మరికొందరు శరణార్థులు ఇతర రాష్ట్రాల్లోనూ ఆశ్రయం పొందారు.
బహుశా ఇలా ఈస్ట్ బెంగాల్ నుంచి శరణార్థులు విజయవాడకు వచ్చి ఉండొచ్చు. ఒకనాడు ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్‌లో భాగంగా ఉంది కాబట్టి, వాళ్లను పాకిస్తానీలుగా పిలిచి ఉంటారని చెబుతున్నారు. కానీ దీనిని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఇప్పుడు ఎవరుంటున్నారు?
ప్రస్తుతం పాకిస్తాన్ కాలనీలో నాటి శరణార్థులు ఎవరూ లేరని స్థానికులు తెలిపారు.
‘‘పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లు కొంతకాలమే ఇక్కడున్నారు. అప్పట్లో ఇది బెజవాడకు శివారు ప్రాంతం. చుట్టూ ఇళ్లు లేవు, సరైన రోడ్లు లేవు, కరెంటు ఉండేది కాదు. వర్షాకాలం మొత్తం బురద.దానికి తోడు ఓసారి బుడమేరుకి భారీగా వరద రావడంతో ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయింది. దాంతో వాళ్లంతా వెళ్లిపోయారు. ఖాళీగా ఉండటంతో మాలాంటి వాళ్ళం వచ్చాం ’’ అని ఆ కాలనీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా నివాసముంటున్న కగ్గా సీతారామయ్య బీబీసీతో చెప్పారు.
''మేమంతా కష్టజీవులమే. చిన్న చిన్న పనులతో జీవనం సాగించుకునే వాళ్లం. సిటీ డెవలప్ కావడంతో కాలనీలో రోడ్లు, మంచినీటి సదుపాయాలొచ్చాయి. కొంతమందికి పట్టాలు కూడావచ్చాయి.మొత్తం 40 ఇళ్లు ఉండగా,దాదాపు 80 కుటుంబాలు నివసిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.
అయితే బర్మా కాలనీ గురించి చాలామందికి తెలుసు కానీ, ఈ పాకిస్తాన్ కాలనీ ఉన్నట్టు విజయవాడ నగరంలో చాలామందికి తెలియదు. 1987 నుంచి 1992 వరకు ఐదేళ్ల పాటు నగర మేయర్‌గా పనిచేసిన డాక్టర్ జంధ్యాల శంకర్ కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘‘శరణార్థుల కోసం బర్మా కాలనీ కట్టినట్టు గుర్తుంది కానీ పాకిస్తాన్ కాలనీ ఉన్నట్టు నాకు గుర్తులేదు’’ అని ఆయన బీబీసీతో అన్నారు.

‘‘ఆ పేరు వల్ల ఇబ్బందులు’’
‘‘పాకిస్తాన్ కాలనీ అనే పేరు వల్ల మేం ఇబ్బందులు పడుతున్నాం. పీజీ పూర్తి చేసిన నేను టెక్సాస్ వెళ్లాలని పాస్ పోర్ట్ ఆఫీస్‌కి వెళ్లినపుడు థంబ్ ఇంప్రెషన్‌లో పాకిస్తాన్ కాలనీ అనే పేరును రౌండ్ చేసి అసలు ఆ కాలనీ ఉందా లేదా అని ఇంటర్వ్యూలో ఒకటికి రెండు సార్లు అడిగారు. ముంబయిలో వీసా ఇంటర్వ్యూకి వెళ్లినపుడు కూడా పాకిస్తాన్ కాలనీ ఉందా? అని ప్రశ్నించారు. ఇక్కడి యువకులు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లినపుడు ఈ పేరు వల్ల ఒకింత ఇబ్బంది ఎదురవుతోంది'' అని ఆ కాలనీకి చెందిన రాణిమేకల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘పొరుగు దేశం పేరును కించపరచాలనే ఉద్దేశం పొరపాటున కూడా లేదు, కానీ మేము ఆ పేరు వల్ల పడే ఇబ్బందుల దృష్ట్యా కాలనీ పేరు మార్చాలని స్థానిక పెద్దలను కోరాం’’ అని సతీష్ తెలిపారు.

ఉద్యోగం రాలేదు: రాజు
''నేను ఇదే కాలనీలో పాతికేళ్ల పైబడి ఉంటున్నాను. అప్పట్లో నగరంలోని ఓ స్థానిక ట్రాన్స్‌పోర్టు కంపెనీలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే అందరికీ వచ్చాయి. కానీ, నాతో పాటు కాలనీలో ఉన్న మరొకరికి రాలేదు. కేవలం పాకిస్తాన్ కాలనీ అంటే ఏంటి అని ఇవ్వలేదు. అప్పుడు ఉద్యోగంలో చేరితే ఇప్పుడు మూడు నాలుగు లక్షల వరకు పీఎఫ్ వచ్చేది. ఈ పేరు వల్ల చాలా నష్టపోయాం’’ అని కాలనీ నివాసి డ్రైవర్ ఎం. రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘పాకిస్తాన్ పేరు మన పట్టణంలో ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నారు. దీన్ని తీసివేసి స్వతంత్ర సమరయోధులు మహనీయులు వల్లభాయ్ పటేల్ పేరుగాని నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరు గానీ పెట్టాలి. లేదంటే రాష్ట్రం కోసం పనిచేసిన వారి పేర్లు పెట్టాలి’’ అని కాలనీ నివాసి అబ్రహం చెప్పారు.

పేరు మార్చి, అభివృద్ధి చేయాలి
‘‘పాకిస్తాన్ వాళ్లు ఇక్కడ పనులు చేసుకుంటూ నివాసం ఉన్నారు. వాళ్లు వరదలు వచ్చినప్పుడు వెళ్లిపోయారు. ఖాళీగా ఉందని మాలాంటి వాళ్లం ఇక్కడి వచ్చేశాం. వదరలొచ్చినా ఉండిపోయాం. అప్పట్లో నీళ్లు, కరెంటు లేవు. రోడ్లు లేవు ఏమీ లేవు. అంతా బురదే.. మేం ఇక్కడే ఉండి ఒకటికి పదిమార్లు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగితే కొన్ని సదుపాయాలొచ్చాయి. అప్పట్లో కట్టిన చాలా ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం స్పందించి కాలనీ పేరు మార్చడంతో పాటు రూపురేఖలు కూడా మార్చాలి’’ అని స్థానిక మహిళ కన్యాకుమారి కోరారు.

''కాలనీ పేరును మార్చాలని నిర్ణయించాం. భగీరథ కాలనీగా అనుకున్నాం. ఎవరైనా పెద్ద వాళ్లతో ప్రారంభింప చేయాలని భావిస్తున్నాం’’ అని స్థానికుడు కగ్గా సీతారామయ్య చెప్పారు.
''పాకిస్తాన్ కాలనీ గురించి తెలుసు. అక్కడి ప్రజలు పేరు వల్ల ఇబ్బంది పడుతున్నారని భావిస్తే.. ఆ పేరు మార్చాలని స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా ప్రతిపాదన పంపిస్తే కచ్చితంగా పరిశీలిస్తాం’’ అని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి బీబీసీకి తెలిపారు.
మా రికార్డుల్లో లేదు
''పాకిస్తాన్ కాలనీ అనే పేరు ఉందని రెవెన్యూ వర్గాలకు తెలుసు కానీ ఆ పేరిట మా రికార్డుల్లో వివరాలు ఉండవు. కేవలం ఆ ప్రాంత సర్వే నెంబర్లు, రెవెన్యూ గ్రామ పరిధి వివరాలు మాత్రమే మా వద్ద ఉంటాయి. ఆ పేరు మార్పుతో కూడా మాకు సంబంధం ఉండదు అదంతా కార్పొరేషన్ వాళ్లు చూడాలి'' అని విజయవాడ ఉత్తర తహశీల్దార్ ఎం. సూర్యారావు బీబీసీకి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














