నిర్మల్ జిల్లా: దిలావర్‌పూర్ రైతులు ఇథనాల్ పరిశ్రమను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిర్మల్ నుంచి మహారాష్ట్ర కళ్యాణ్‌కు వెళ్లే జాతీయ రహదారిపై రైతు కుటుంబాలు బైఠాయించడంతో మంగళవారం నుంచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మహిళలే ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. ఆందోళన తీవ్రం కావడంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
చర్ఛలు సఫలమయ్యాయని, ఆందోళన విరమిస్తున్నామని రైతుల ప్రతినిధులు ప్రకటించారు.
“మా ఆందోళనకు ప్రభుత్వం స్పందించింది. కలెక్టర్‌తో జరిగిన చర్చల్లో ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలన్న ఏకైక ప్రతిపాదనను ముందుపెట్టాం. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఇప్పకిప్పుడు నిలిపివేస్తున్నట్టుగా కలెక్టర్ తెలిపారు. పనులు నిలిపివేయడం కాదు, ఫ్యాక్టరీని పూర్తిగా ఇక్కడి నుంచి తరలించాలని మేం కోరాం. మా ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం” అని రైతుల ప్రతినిధిగా వెళ్లిన గుండంపల్లి గ్రామానికి చెందిన తక్కెల సాగర్ రెడ్డి తెలిపారు.

వివాదం ఏంటి?

దిలావర్‌పూర్- గుండంపల్లి గ్రామాల మధ్య పీఎంకే గ్రూప్‌కు చెందిన బయో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు గత ఏడాది ప్రారంభమయ్యాయి. ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. గతేడాది ఫ్యాక్టరీ ప్రహరీని కొంతమంది రైతులు కూల్చివేశారు. వారిపై కేసులు నమోదయ్యాయి.
ఈ వివాదంపై నిర్మాణ సంస్థ పీఎంకే గ్రూప్ స్పందన కోసం ‘బీబీసీ’ ప్రయత్నించింది. వారి కార్యాలయానికి ఫోన్ చేయగా ఫ్రంట్ ఆఫీస్ సిబ్బందిగా చెప్తున్నవారు మాట్లాడారు. కార్యాలయంలో ఎవరూ లేరని, అందుబాటులోకి వచ్చాక తమ స్పందన తెలియజేస్తామని చెప్పారు. వారి స్పందన రాగానే ఇక్కడ పేర్కొంటాం.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కలుషితమవుతుందని, గోదావరి ఒడ్డున ఉండే గడ్డి భూముల్లోని కృష్ణ జింకలు, చుక్కల దుప్పులు, నెమళ్లు వంటి వన్యప్రాణులకు హాని జరుగుతుందని స్థానికులు ఆందోళనకు దిగారు. ఆరు నెలలుగా నిరవధిక దీక్షలను చేస్తున్నారు. తాజాగా గత రెండు రోజుల నుంచి జాతీయ రహదారి 61పై రాస్తారోకోకు దిగారు.
మంగళవారం (నవంబర్ 26) రైతులతో చర్చలు జరిపేందుకు వచ్చిన నిర్మల్ ఆర్డీఓ వాహనాన్ని రైతులు చుట్టుముట్టి కదలనివ్వలేదు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు ప్రత్యేక వలయంగా ఏర్పడి ఆర్డీఓను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
రైతుల ఆందోళనపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
అయితే, ఈ రోజు కూడా (నవంబర్ 27) రైతులు ఆందోళన కొనసాగించారు. తెల్లవారుజామున దిలావర్‌పూర్‌కు చెందిన కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీంతో దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాల ప్రజలు దిలావర్‌పూర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ సందర్బంలో గ్రామస్థులు జాతీయ రహదారిపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దాంతో, స్థానికులు రాళ్లదాడికి దిగి పోలీసులను అక్కడి నుంచి తరిమేశారు. ఈ క్రమంలో నిర్మల్ డీఎస్పీ వాహనం ధ్వంసం అయ్యిందన్న వార్తలు వచ్చాయి. వాహనం ధ్వంసం అయిన విషయాన్ని బీబీసీ స్వయంగా ధ్రువీకరించుకోలేదు.

‘విత్తనాల ఫ్యాక్టరీ అని చెప్పారు’
“మా ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీ ఏంటన్నదానిపై గోప్యత పాటించారు. మొదట విత్తనాల ఫ్యాక్టరీ వస్తుందన్నారు. ఆ తర్వాత అది ఇథనాల్ ఫ్యాక్టరీ అని తెలిసింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే మా భూములు, నీరు కలుషితం అవుతాయని, అనారోగ్యాల బారిన పడతామని మొదటి నుంచి మేం వ్యతిరేకిస్తూ వస్తున్నాం. ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించలేదు. తప్పుడు పత్రాలతో ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకున్నారు. అడిగితే తప్పుడు కేసులు పెట్టారు” అని దిలవార్‌పూర్‌కు చెందిన అల్లూరి రమణ బీబీసీతో చెప్పారు.
“మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు. మొదటి రోజు నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నాం. మా మాట వినకపోవడం వల్లే పిల్లాపాపలతో రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సి వచ్చింది. అది వస్తే మా ఆరోగ్యాలు పాడవుతాయి” అని సుగుణ అన్నారు.
ఫ్యాక్టరీ అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో స్థానికులు చేస్తున్న ఆందోళనలు, ఆరోపణలపై నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీబీసీ సంప్రదించే ప్రయత్నం చేసింది. అయితే, ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన స్పందిస్తే ఆ విషయాలను ఇక్కడ పేర్కొంటాం.

‘శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు పనికిరాకుండా పోతుంది’
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దిలావార్‌పూర్, గుండంపల్లి రైతులకు పక్క గ్రామాల వారు మద్దతు ప్రకటిస్తూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పిల్లాపాపలతో రోడ్డెక్కి నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా అక్కడే రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు.
ఫ్యాక్టరీ వల్ల తమ ప్రాంతంలో సాగు, తాగు నీరు కలుషితమవుతుందనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తం అవుతోంది.
“ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఎలాంటి నష్టం లేదని, వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని కొందరు నాయకులు చెబుతున్నారు. అయితే అది వాస్తవం కాదు. ఇథనాల్ ఫ్యాక్టరీలు ఏర్పాటైన చిత్తనూరు, నందిగామ వెళ్లి అక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాం. వారు పడే ఇబ్బందులు కళ్లకు కట్టినట్టు చూపారు. జీరో పొల్యూషన్ అని చెబుతున్నారు. కానీ అది సాధ్యం కాదు. పక్కనే ఎస్సారెస్పీ ఉంది. గ్రామాలకు మిషన్ భగీరథ కింద నీరు అక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఫ్యాక్టరీ వ్యర్థ్యాలను భూమిలోకి ఇంకిస్తామని చెబుతున్నారు. అదే జరిగితే చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు నీరు కలుషితం అవుతుంది” అని దిలావార్‌పూర్‌కు చెందిన సామ సాయిరెడ్డి బీబీసీతో చెప్పారు.

‘సంయమనం పాటించాలి’
దిలావార్‌పూర్‌తో పాటు ఆందోళనలో పాల్గొంటున్న ఇతర గ్రామాల ప్రజలు సంయమనం పాటించాలని నిర్మల్ జిల్లా ఉన్నతాధికారులు కోరారు.
“పరిశ్రమల శాఖ కార్యదర్శితో మాట్లాడి ఫ్యాక్టరీ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయించాం. పుకార్లను నమ్మి చట్టాన్ని అతిక్రమించి దాడులకు పాల్పడితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎలాంటి పుకార్లనూ నమ్మెద్దు. రైతులు కోరినట్టే పనులు ఆగిపోయాయి. ఈ విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపుతుంది’’ అని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిలా చెప్పారు.
పుకార్లను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినయ్ అన్నారు.
“రైతుల ఆందోళనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ప్రజల మనోగతానికి అనుగుణంగా నడుచుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన. ఫ్యాక్టరీ పనులను తాత్కాలికంగా నిలిపివేయిస్తున్నాం. ఇక ఎలాంటి నిర్మాణ పనులూ జరగవు. ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది. ఇది ప్రజాపాలన, రైతు పాలన” అని కలెక్టర్ తెలిపారు.
మరోవైపు దీనిపై నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ‘బీబీసీ’తో మాట్లాడుతూ... దిలావర్ పూర్ ఇథనాల్ పరిశ్రమను తరలించాలని ఇదివరకే సీఎం దృష్టికి తీసుకెళ్లాను. పరిశ్రమల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజలు సంయమనం పాఠించాలి. ఎప్పటికీ రైతుల నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. పోలీస్ అధికారులు రైతులపై ఎలాంటి కేసులు పెట్టొద్దు’ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














