ఆస్పత్రిలో చనిపోయిన తన కుటుంబీకుల రక్తంతో తడిసిన బెడ్‌ను గర్భిణితో శుభ్రం చేయించారు, అసలేం జరిగిందంటే..

ఆస్పత్రి బెడ్‌ను శుభ్రం చేస్తున్న బాధితురాలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రోష్ని

ఆస్పత్రిలో రక్తంతో తడిసిపోయిన మంచాన్ని ఒక గర్భిణి శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌‌లోని దిండోరి జిల్లాలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఆస్పత్రి అధికారుల తీరుపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అక్టోబర్ 31న ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు. బాధితురాలిని రోష్ని మరావిగా గుర్తించారు.

ఈ ఘటనపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు రావడంతో దిండోరి జిల్లా వైద్యాధికారి స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమైనదన్నారు. ఈ కేసులో ఇద్దరు నర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. సంబంధిత వైద్యాధికారిని బదిలీ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆస్పత్రి చెప్పినవన్నీ చేశానని రోష్ని అన్నారు.
ఫొటో క్యాప్షన్, రోష్ని

బాధితురాలు ఏం చెప్పారు?

దీపావళి రోజు దిండోరి జిల్లాలో ఓ కుటుంబంపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. రెండు కుటుంబాల మధ్య నడుస్తున్న భూ వివాదం కారణంగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో రోష్ని భర్త శివ్‌రాజ్, బావ, 65 ఏళ్ల మామ ధరమ్‌సింగ్ తీవ్రంగా గాయపడ్డారు.

ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రోష్ని, గాయపడ్డ ముగ్గురినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులను ఉంచిన మంచాలను శుభ్రం చేయాల్సిందిగా గర్భిణి అయిన రోష్నిని ఆస్పత్రి సిబ్బంది ఆదేశించారు.

‘‘మా బావను ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిపొమ్మని చెప్పారు. ఆయన్ను తీసుకెళ్లేముందు.. తను పడుకున్న మంచాన్ని శుభ్రం చేయమన్నారు. ఓ వైపు మా బావ రక్తంతో తడిసిపోయి ఉన్నారు. మరోవైపు నన్ను ఆ రక్తపు మరకలన్నింటినీ తుడవమన్నారు. ఆ సమయంలో వాళ్లు అలా చెప్పకూడదు. నాకేమీ తోచలేదు. అప్పుడు వాళ్లేం చెబితే అది చేశాను. వాళ్లు నాతో చాలా తప్పుగా ప్రవర్తించారు’’ అని రోష్ని ఆవేదన వ్యక్తంచేశారు.

తన కుటుంబంలో ఉన్న నలుగురు పురుషుల్లో ముగ్గురు చనిపోయారని రోష్ని చెప్పారు. తన కుటుంబానికి ఇప్పుడు ఎలాంటి ఆధారం లేదన్నారు.

‘‘నాకు ముగ్గురు పిల్లలున్నారు. ఇప్పుడు కడుపులో మరో బిడ్డ పెరుగుతోంది. నాకు ఐదో నెల. నా కుటుంబంలో ఎవరూ మిగల్లేదు. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మాకున్న భూమిని వాళ్లు ఆక్రమించుకన్నారు’’ అని రోష్ని ఆందోళన చెందుతున్నారు.

‘‘మా వాళ్ల మృతదేహాలు ఉంచిన దగ్గర రక్తపు మరలకన్నింటినీ శుభ్రం చేయమని నాకు చెప్పారు. ఆ సమయంలో నాకేమీ అర్థం కాలేదు. ఆస్పత్రి సిబ్బంది నేనున్న పరిస్థితిని కనీసం గమనించాలి కదా..’’ అని రోష్ని అన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు

రోష్ని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆస్పత్రి అధికారులపై తీవ్ర విమర్శలొచ్చాయి.

అమానవీయతకు ఇది నిదర్శనమని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ అధికారయంత్రాంగం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తోందనేదానికి ప్రతిరోజూ ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆదివాసీలు అధికంగా ఉండే దిండోరి జిల్లాలో భర్త చనిపోయిన బాధలో ఉన్న ఓ గర్భిణితో బెడ్ శుభ్రం చేయించిన ఘటన అమానవీయతకు నిలువెత్తు నిదర్శనం’’ అని ఈ వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఆరోపించింది.

భర్తను కోల్పోయిన మహిళతో ఆస్పత్రి అధికారులు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ తెలిపింది.

ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ‘ఎక్స్‌’లో ఈ వీడియోను షేర్ చేసింది.

‘‘బీజేపీ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ నిర్వహణకు ఇది చీకటి కోణం. క్రూరత్వానికి సంబంధించిన అన్ని హద్దులనూ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రిలో బీజేపీ ప్రభుత్వం చెరిపివేసింది’’ అని ఆప్ విమర్శించింది.

‘‘ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ఆస్పత్రిలో ఆదివాసీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ఇది సహించరానిది’’ అని మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత ఉమాంగ్ సింఘార్ ఆరోపించారు.

ముగ్గురిపై చర్యలు

ఈ కేసును తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గడసరాయ్ వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ సింగ్‌ని నవంబరు 2న బదిలీ చేసింది. ఇద్దరు నర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

‘‘మృతుడి భార్యతో ఆస్పత్రి బెడ్ శుభ్రం చేయించారు. గడసరాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు జిల్లాలోని మిగిలిన ఆస్పత్రులను శుభ్రపరచడానికి ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నప్పటికీ మృతుడి భార్యతో ఇలా చేయించడం దురదృష్టకరం’’ అని దిండోరి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)