పుష్ప 2 సినిమా టికెట్ ధర రూ. 800.. ఎందుకింత క్రేజ్

ఫొటో సోర్స్, Mythri Movie Makers/FB
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2.. ది రూల్ మూవీపైనే చర్చ.. సినిమా ఎలా ఉంటుందనే విషయానికంటే టికెట్ల రేట్ల గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
పుష్ప 2 సినిమా టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
మరోపక్క పుష్ప 2 టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై డిసెంబరు 3న విచారణ జరిగింది. సినిమా విడుదలను ఆపలేమని చెబుతూ, తదుపరి విచారణను డిసెంబరు 17కు వాయిదా వేసింది.
భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్లు బాగా పెరగడమనేది పుష్ప 2 తోనే మొదలు కాలేదని, బాహుబలి, ఆర్ఆర్ఆర్, దేవర వంటి సినిమాలకూ పెంచారని అల్లు అర్జున్ అభిమానులు చెబుతున్నారు.

టికెట్ ధరలు ఎంత పెరిగాయి?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న విడుదలవుతోంది. 2021లో విడుదలైన పుష్ప 1.. ది రైజ్ కు కొనసాగింపుగా వస్తోందీ చిత్రం. సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ అభ్యర్థన మేరకు టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.
ఒక రోజు ముందుగా.. అంటే డిసెంబరు 4వ తేదీ రాత్రి బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతి లభించింది. ఇందుకు ప్రతి టికెట్ ధర రూ.800కు (జీఎస్టీ కలపకుండా) పెంచుకునేందుకు రెండు ప్రభుత్వాలు అనుమతించాయి.

ఫొటో సోర్స్, APGOVT

ఫొటో సోర్స్, APGOVT
‘‘డిసెంబరు 5వ తేదీన ఆరు షోలు వేసుకోవచ్చు. లోయర్ క్లాస్ టికెట్లు అదనంగా రూ.100 పెంచుకోవచ్చు. అప్పర్ క్లాస్ టికెట్లు అంటే బాల్కనీ సీట్ల టికెట్ల ధరలు అదనంగా రూ.150 పెంచుకోవచ్చు. మల్టీప్లెక్సులలో టికెట్ల ధరలను అదనంగా రూ.200 పెంచుకోవచ్చు. ఈ ధర జీఎస్టీతో కలుపుకుని ఉంటుంది. ఇవే ధరలతో డిసెంబరు 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రతి థియేటర్‌లో ఐదు షోలు వేసుకోవచ్చు.’’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలంగాణలో డిసెంబరు 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు రూ.800 ధరతో బెనిఫిట్ షో వేసుకునేందుకు ప్రభుత్వం నవంబరు 29నే ఉత్తర్వులు జారీ చేసింది. 5వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట, తెల్లవారుజామున నాలుగు గంటలకు అదనపు షోలు వేసుకునేందుకు అనుమతించింది. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150, 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రూ.105, 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రూ.20 చొప్పున టికెట్ ధరలు అదనంగా పెంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మల్టీప్లెక్స్‌లలో 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రూ.200, 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రూ.150, 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రూ.50 చొప్పున టికెట్ ధరలు అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది.
అయితే, బెనిఫిట్ షో టికెట్ ధరలు ప్రభుత్వం అనుమతించిన ధర కంటే రెండు, మూడింతలు అధిక ధరకు అమ్ముతున్నారన్న విమర్శలు సినీ అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. టికెట్ల రేట్ల పెంపుపై మైత్రీ మూవీ మేకర్స్ వివరణ కోసం బీబీసీ ప్రయత్నిస్తోంది. వారి నుంచి స్పందన రాగానే ప్రచురిస్తాం.

ఫొటో సోర్స్, Mythri Movie Makers/FB
జీఓ 13
మార్చి 2022 లో అప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లలో టికెట్ల రేట్ల పెంపుపై జీవో నం.13 జారీ చేసింది.
కార్పొరేషన్లలో కనీస టికెట్ ధర రూ.40గా నిర్ణయించింది. మున్సిపాలిటీలలో కనీస టికెట్ ధర రూ.30, నగర పంచాయతీ లేదా పంచాయతీలలో కనీస టికెట్ ధర రూ.20గా నిర్ణయించింది. రిక్లైనర్ సీట్లు ఉన్న థియేటర్లలో రూ.250 గరిష్ఠ ధర పెట్టుకునేందుకు అనుమతించగా రెగ్యులర్ సీట్లకు నగర, పట్టణ, పంచాయతీల పరిధి బట్టి రూ.150, రూ.125, రూ.100 వరకు ఉంది. ఇవన్నీ జీఎస్టీ కాకుండా అని ప్రభుత్వం చెప్పింది. జీఎస్టీతో కలుపుకొని మరికొంత పెరిగే అవకాశం ఉంది.
ప్రతిథియేటర్ లోనూ నాన్ ప్రీమియం కేటగిరీ కింద 25శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. వీటి టికెట్ ధరలు తక్కువగా ఉంచాలి. థియేటర్లు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అందులో ఒక షో తప్పకుండా చిన్న బడ్జెట్ సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది.
టికెట్ రేట్లు ఎంతశాతం పెంచుకోవచ్చన్నది జీఓ ప్రస్తావించలేదు. సూపర్ హై బడ్జెట్ చిత్రాల విషయంలో టికెట్లు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.
‘‘క్రియేటివిటీ, అత్యాధునిక సాంకేతికతతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమా తీసినప్పుడు నిర్మాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అలాంటి వాటిని సూపర్ హై బడ్జెట్ సినిమాలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అది కూడా నిర్మాణ వ్యయం రూ.100 కోట్లకుపైగా ఉండాలి. ఇందులో హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ల పారితోషికాలు రావు. అలాంటి సూపర్ హై బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నప్పుడు వాటిని పరిశీలించి విడుదల తేదీ నుంచి పది రోజులపాటు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ సినిమాలన్నీ కూడా 20శాతం షూటింగ్ కచ్చితంగా ఏపీలో జరుపుకొని ఉండాలి.’’ అని ఆ జీవో పేర్కొంది.

ఫొటో సోర్స్, Mythri Movie Makers/FB
‘అల్లు అర్జున్‌కు అత్యధిక పారితోషికం’
నటుల పారితోషికాలతోపాటు, సినిమా బడ్జెట్ పెరగడం కూడా టికెట్ రేట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తోందన్నారు సినీ జర్నలిస్టు అన్వర్. సూపర్ హై బడ్జెట్ సినిమాల కేటగిరీ కింద రూ.100 కోట్లకుపైబడి నిర్మాణం వ్యయం పెట్టినవని ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోలో ప్రస్తావించింది. ఇందులో హీరోల రెమ్యూనరేషన్ రాదు. ప్రస్తుతం విడుదలవుతున్న పుష్ప 2 సినిమాకు ఎంత బడ్జెట్ కేటాయించారనేది స్పష్టత లేదు.
అయితే, పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్‌కు నిర్మాణ సంస్థ ఏకంగా సుమారు రూ.300 కోట్లు చెల్లించినట్లుగా ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ దాదాపు రూ.300 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు మనీకంట్రోల్ వెబ్ సైట్ కూడా రాసింది.

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI
టికెట్ రేట్లు పెరిగితే ఎవరికి లాభం?
సినిమాలకు ప్రేక్షుకులు మళ్లీ మళ్లీ రావడం తగ్గిపోయిందని, ఇది కూడా టికెట్ల రేట్ల పెంపుకు ఒక కారణంగా చెప్పొచ్చన్నారు ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్. ఆయన టికెట్ల రేట్ల పెంపుపై బీబీసీతో మాట్లాడారు.
‘‘కల్కి సినిమా టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. ఆ సినిమా కోసం ఇండియాలో ఉన్న ఎంతో మంది స్టార్స్ ను తీసుకువచ్చి ఒకచోట చేర్చాం. విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు..ఉన్నతంగా తీసుకువచ్చాం. అయినప్పటికీ రేట్లు పెద్దగా పెరగలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్లకు వచ్చే ఆడియన్స్ కూడా తగ్గిపోతున్నారు. డిజిటల్ ప్లాట్ ఫాంల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది.’’ అని అశ్వినీదత్ అన్నారు.
అయితే, టికెట్ల రేట్లు పెంచడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులకు పెద్దగా లాభం ఉండదని హైదరాబాద్ కు చెందిన ఓ థియేటర్ యజమాని బీబీసీకి చెప్పారు.
‘‘పెంచిన ధరల సొమ్మంతా నిర్మాతలకే చేరుతుంది. మాకు ఇంత అని ఫిక్స్‌డ్‌గా ఇస్తుంటారు. థియేటర్ యజమానులకు పెద్దగా లాభం ఉండదు. ఎగ్జిబిటర్లకు ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు పుష్ప 2కు బెనిషిట్ షో వేస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్ కు రూ.15లక్షల ఆదాయం వస్తుందనుకుంటే.. మాకు కేవలం రూ.30వేలు ఇస్తారు.’’ అని సదరు థియేటర్ యజమాని చెప్పారు.
‘ఇతర సినిమాలపై ప్రభావం’
పెద్ద సినిమా పేరుతో టికెట్ రేట్లు పెంచడం మిగిలిన సినిమాలపై ప్రభావం చూపుతోందన్నారు తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసన్నకుమార్.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘టికెట్ రేట్లు పెంచడం తప్పకుండా ఇబ్బంది అవుతుంది. సమాజానికి ఉపయోగపడే, చరిత్ర ఆధారిత సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడమో, పన్ను రాయితీలు కల్పించడమో చేస్తే బావుంటుంది. అప్పుడు నిర్మాతలకు ఉపశమనం లభించి ధరలపై ప్రభావం పడకుండా ఉంటుంది.’’ అని చెప్పారు.
‘‘ఒకప్పుడు సినిమాలకు రిపీట్ ఆడియెన్స్ వచ్చేవారు. టికెట్ రేట్లు సాధారణంగానే ఉండటం వల్ల మళ్లీ మళ్లీ వచ్చేవారు. ఇప్పుడు రానురాను ఆ పరిస్థితి తగ్గిపోతోంది.’’ అని ప్రసన్నకుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, RRR
అది ప్రేక్షకుల క్రేజ్...
పుష్ప 2 టికెట్ ధరలు భారీగా పెరిగాయని చెప్పడానికి లేదన్నారు సినీ జర్నలిస్టు అన్వర్.
‘‘సినిమా డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు చూస్తుంటారు. టికెట్ రేట్లు భారీగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అందులో పూర్తిగా వాస్తవం లేదు. కేవలం బెనిఫిట్ షో వరకే రూ.800-1000 టికెట్ రేట్లున్నాయి. తర్వాత రోజు నుంచి గతంలో పెంచినట్లుగానే పెంచారు. అంతేకాదు, టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా సినిమా చూడాలని ప్రేక్షకుల్లో బాగా ఉంది. అందుకే బుక్ మై షో వంటి ఆన్ లైన్ పోర్టల్స్ లో థియేటర్ల లిస్టు పెట్టిన వెంటనే టికెట్లు అప్పటికప్పుడు అయిపోతున్నాయి. సినిమా కోసం ఎంత ధర అయినా పెట్టి చూద్దామని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాకు రూ.3వేలు కూడా పెట్టి సినిమాకోసం వచ్చిన అభిమానులున్నారు. ’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, X/Kalki2898AD
ఇదో ట్రెండ్‌గా మారిందా..
భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచడమనేది పుష్ప2తోనే మొదలు కాలేదు. గతంలోనూ కొన్ని చిత్రాలకు రేట్లు పెంచిన సందర్భాలున్నాయి. బాహుబలి.. ది బిగినింగ్, బాహుబలి.. ది కన్ క్లూజన్, ఆర్ఆర్ఆర్, కల్కి2898 ఏడీ, దేవర, ఆదిపురుష్, ఆచార్య, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తదితర సినిమాలకు టికెట్ల రేట్లు పెరిగాయి. ఇప్పుడు మరోసారి పుష్ప2..ది రూల్ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతించాయి.
‘‘సినిమా అనేది కామన్ మ్యాన్ ఎంటర్ టైన్ మెంట్ నుంచి ధనికుల ఎంటర్ టైన్ మెంట్ గా మారిపోయింది.’’అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచే సంస్కృతి 2005 నుంచే మొదలైందని అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అధ్యక్షుడు జి.ఎల్. నర్సింహారావు బీబీసీతో చెప్పారు.
‘‘భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్ల పెంపుతో సగటు ప్రేక్షకుడు నెలలో ఒక సినిమాకే పరిమితమైపోయి మిగిలిన సినిమాలకు రావడం లేదని, టికెట్ల రేట్ల పెంపు పరోక్షంగా పైరసీకి కారణమవుతోంది’’ అని ఆయన అన్నారు.
గతంలో రెండు వారాల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం ఇచ్చిన జీవో తన పోరాటం కారణంగానే రద్దయిందని చెప్పారు నర్సింహారావు.
‘‘2005లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జీవో నం.269 తీసుకువచ్చింది. దాని ప్రకారం రెండు వారాలపాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుండేది. దీనిపై ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశాను. ఉమ్మడి ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు 2008లో జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచారు. ఆ తర్వాత బాహుబలి నుంచి మళ్లీ సినిమా విడుదలైన తేదీ నుంచి పది రోజులు, రెండు వారాలపాటు టికెట్లు రేట్లు పెంచుకునే సంస్కృతి మొదలైంది.’’ అని ఆయన అన్నారు.
‘ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలి’
సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తే టికెట్ల రేట్ల పెంపు సమస్యకు కొంతవరకు పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ తెలుగు ఫిలిం ఎగ్జిబిటర్స్ అండ్ కంట్రోలర్స్ అసోసియేషన్ ప్రతినిధి గోవింద్ రాజ్ బీబీసీకి చెప్పారు.
‘‘టికెట్ల రేట్లు పెంచడం నిర్మాతలు, ప్రభుత్వాల పరంగా తీసుకుంటున్న నిర్ణయం. అదే సమయంలో సినిమా ప్రదర్శించే థియేటర్ల సంఖ్యను పెంచితే ప్రేక్షకులపై భారం పడకుండా ఉండే అవకాశం ఉంది. కొన్ని థియేటర్లకే పరిమితం కాకుండా వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల చేసేలా ఉండాలి. ఇప్పుడంతా డిజిటల్ వెర్షన్ కాబట్టి ప్రింట్ ఖర్చులు కూడా ఉండవు’’ అని చెప్పారు గోవింద్ రాజ్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














