ఒక మహిళ టికెట్ లేకుండా విమానం ఎక్కి, బాత్రూంలో దాక్కుని వేల కిలోమీటర్లు ప్రయాణించారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాచెల్ లూకర్
- హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్
విమానంలోని బాత్రూంలో దాక్కుని అమెరికాలోని న్యూయార్క్ నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు వెళ్లిన ఒక మహిళను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అమెను 57 ఏళ్ల స్వెత్లానా డాలీగా గుర్తించారు.
ఆమె గతవారం బోర్డింగ్ పాస్ లేకుండా న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి పారిస్‌లోని చార్లెస్ డి గాలె విమానాశ్రయానికి డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు.
విమానం పారిస్‌కు చేరుకోగానే ఆమెను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
డాలీ, రష్యా పౌరురాలు అని ఫ్రాన్స్ పోలీసులు వెల్లడించారు. వీసా లేనందువల్ల ఆమెను ఫ్రాన్స్‌లోకి అనుమతించలేదని, ఆమెపై ఇంకా ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని వారు తెలిపారు.
జేఎఫ్‌కే విమానాశ్రయంలో బాడీ స్కానింగ్ చేసేటప్పుడు, గుర్తింపు పత్రాల పరిశీలన సమయంలో, భద్రతా తనిఖీల సమయంలో ఆమె చాకచక్యంగా తప్పించుకున్నారని పోలీసులు చెప్పారు. తప్పుడు పత్రాలతో విమానాశ్రయంలో అడుగుపెట్టారని అన్నారు.

‘‘బోర్డింగ్ పాస్ లేని ఒక వ్యక్తి భౌతిక తనిఖీలు, రెండుసార్లు ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రక్రియలు, బోర్డింగ్ స్టేటస్ స్టేషన్లను దాటుకొని విమానం ఎక్కారు. ఆ వ్యక్తి వద్ద నిషేధిత వస్తువులేవీ లేవు’’ అని అమెరికా అధికారులు చెప్పారని బీబీసీ న్యూస్ పార్ట్‌నర్ సీబీఎస్ పేర్కొంది.
కానీ, ఆమె ఈ ప్రక్రియలన్నీ దాటుకొని ఆ మహిళ ఎలా విమానం ఎక్కగలిగారనేది ఇంకా స్పష్టత లేదు.
‘‘భద్రత, రక్షణకు మించిన ప్రాధాన్య అంశాలేవీ లేవు. అందుకే ఏం జరిగిందనేదానిపై సమగ్ర విచారణ చేపడుతున్నాం’’ అని డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘విమానంలోకి వెళ్లిన తర్వాత, ఒక బాత్రూంలోకి వెళ్లిన డాలీ అక్కడి నుంచి మరో బాత్రూంకు వెళ్లారు. విమానంలోని సిబ్బంది గమనించేంతవరకు ఆమె మళ్లీ సీటు దగ్గరికి రాలేదు’’ అని గార్డియన్ పత్రిక పేర్కొంది.

సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రయాణికుడు పోస్ట్ చేసిన వీడియోలో, ఆ మహిళను తీసుకెళ్లడానికి అధికారులు వస్తున్నారంటూ విమానంలోని ప్రయాణికులకు, కెప్టెన్ చెబుతుండటం కనిపిస్తోంది.
‘‘నేను విమాన కెప్టెన్‌ను మాట్లాడుతున్నా... పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాం. బహుశా వారు ఇక్కడే ఉన్నారేమో. విమానంలోని ఆ అదనపు ప్రయాణికురాలిని బయటకు పంపించేంతవరకు దయచేసి మీరంతా మీ సీట్లలోనే కూర్చోవాలని వారు సూచించారు’’ అని ఆ వీడియోలో కెప్టెన్ చెబుతున్నారు.
ఆ అదనపు ప్రయాణికురాలికి సంబంధించిన వీడియోను విమానంలోని ఒక వ్యక్తి, వార్తా సంస్థ సీఎన్‌ఎస్‌కు పంపించారు.
న్యూయార్క్‌కు తిరుగు పయనమవుతున్న మరో విమానం వద్ద ఆమె అలజడి సృష్టించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ఫ్రాన్స్‌లోనే ఉన్నారు.
‘‘నేను అమెరికాకు వెళ్లను. ఒక జడ్జి మాత్రమే నన్ను తిరిగి అమెరికా పంపించగలరు’’ అని ఆమె పదే పదే అన్నారని మొబైల్ ఫోన్‌లో వీడియో తీసిన వ్యక్తి చెప్పారు.
బీబీసీ ఈ వీడియోలను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. ఆ మహిళ మాటలకు అర్థమేంటో కూడా ఇంకా స్పష్టంగా తెలియలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














