కానిస్టేబుల్ నాగమణి హత్య: కులాంతర వివాహం, తన భూమి తనకు తిరిగి ఇవ్వమన్నందుకు అక్కను చంపిన తమ్ముడు

కానిస్టేబుల్ నాగమణి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, డిసెంబర్ 2న కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యారు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(గమనిక: ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలిచివేయచ్చు)

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ కొంగర నాగమణి(27) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం (డిసెంబర్ 2, 2024) స్కూటీపై డ్యూటీకి వెళుతున్న ఆమెను వెనుక నుంచి కారుతో ఢీ కొట్టి.. కుడివైపు మెడ, దవడపై కత్తితో నరకడంతో చనిపోయారు.

కులాంతర వివాహం చేసుకోవడమే కాక, తన భూమి తనకు తిరిగి ఇచ్చేయమని అడగడం వల్ల ఆమె తమ్ముడే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.

నాగమణి కులాంతర వివాహం చేసుకోవడంతో స్నేహితులు, బంధువులు, ఊళ్లో వాళ్ల ముందు తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని భావించడంతోపాటు ఎకరా భూమిని తిరిగి అడుగుతుండటంతో నాగమణిని తమ్ముడు పరమేశే దారుణంగా చంపాడని సీఐ బీ. సత్యనారాయణ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు తెలిపారు.

‘‘నన్ను కులాంతర వివాహం చేసుకుంది. తన భూమిని తనకు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమె తమ్ముడు పరమేశే ఆమెను చంపాడు. ఇది మమ్మూటికీ పరువు హత్యే ’’ అని నాగమణి భర్త బండారి శ్రీకాంత్ బీబీసీకి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నాగమణి భర్త శ్రీకాంత్
ఫొటో క్యాప్షన్, నాగమణి భర్త శ్రీకాంత్

'తమ్ముడు చంపేస్తున్నాడు, త్వరగా రా’

ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన కొంగర నాగమణి.. హయత్ నగర్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

డిసెంబర్ 2వ తేదీ ఉదయం 8.50 గంటల సమయంలో రాయపోలులోని అత్తగారింటి నుంచి టీఎస్ 07జెఆర్4801 నంబరుగల స్కూటీపై ఆమె డ్యూటీకి బయల్దేరారు.

రాయపోలు శివారులోని సబ్ స్టేషన్ వద్దకు చేరుకోగానే నాగమణి హత్యకు గురయ్యారు. తన భార్య నడుపుతున్న స్కూటీని కారుతో వెనుక నుంచి గుద్ది.. ఆమె కింద పడ్డాక మెడపై కత్తితో నరికి చంపారని నాగమణి భర్త శ్రీకాంత్ బీబీసీకి చెప్పారు.

‘‘నేను ఇబ్రహీంపట్నం వైపు బయల్దేరాను. నా భార్యకు ఫోన్ చేస్తే.. ఇంటి నుంచి బయల్దేరి డ్యూటీకి వెళ్తున్నానని చెప్పింది. నాతో ఫోన్‌లో మాట్లాడుతుండగానే.. మా తమ్ముడు కారు వేసుకుని వచ్చి నన్ను గుద్దాడు. నన్ను చంపేస్తున్నాడు.. త్వరగా రా.. అని చెప్పింది. తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. తిరిగి చేస్తే కలవలేదు. మా అన్న శ్రీనుకు కాల్ చేసి సబ్ స్టేషన్ వద్దకు వెళ్లమని చెప్పా. ఆయన వెళ్లేసరికే మెడపై నరికినట్లుగా ఉంది. కొన ఊపిరితో కనిపించింది. మా అన్న కళ్ల ముందే నాగమణి చనిపోయింది’’ అని శ్రీకాంత్ చెప్పారు.

నాగమణి హత్యకు వినియోగించిన కత్తి, టీఎస్ 09 ఎఫ్ హెచ్ 0257 నంబరు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌కు బీబీసీ వెళ్లిన సమయంలో కారు అక్కడే ఉంది. దీనికి ముందు వైపు బంపర్ విరిగిపోయి ఉంది. నంబరు ప్లేటు ఉన్న బంపర్ ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. నాగమణి ఎలక్ట్రిక్ స్కూటీని పోలీసుస్టేషన్‌లో ఉంచారు. స్కూటీ వెనుక భాగం దెబ్బతింది. పక్కన గీసుకుపోయినట్టు కనిపించింది.

హత్యకు వాడిన కారు
ఫొటో క్యాప్షన్, హత్యకు వినియోగించిన కత్తి, టీఎస్ 09 ఎఫ్ హెచ్ 0257 నంబరు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రహదారి
ఫొటో క్యాప్షన్, రాయపోలు నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ హైవేకు అనుసంధానంగా ఉన్న రహదారిపై నాగమణి హత్యకు గురయ్యారు.

ఘటనా స్థలానికి బీబీసీ

రాయపోలు నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ హైవేకు అనుసంధానంగా ఉన్న రహదారిపై ఈ హత్య జరిగింది. సోమవారం సాయంత్రం ఘటనా స్థలాన్ని బీబీసీ పరిశీలించింది.

చుట్టూ నిర్మానుష్యంగా ఉంది. కొంచెం దూరంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉంది. వాహన సంచారం మరీ ఎక్కువగా కనిపించలేదు. రోడ్డుపై రక్తం మడుగు కట్టిన చోట మట్టి పోసి ఉంది. అది మినహా మిగిలిన గుర్తులేవీ అక్కడ లేవు.

‘‘ఎవరో అరిచినట్లు వినిపించింది. కానీ, హత్య జరిగిందని అనుకోలేదు’’ అని సబ్ స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగి ఒకరు బీబీసీకి చెప్పారు.

ప్రేమ పెళ్లి
ఫొటో క్యాప్షన్, యాదగిరిగుట్టలో శ్రీకాంత్, నాగమణి వివాహం ఈ ఏడాది నవంబర్ 10న జరిగింది.

ప్రేమ పెళ్లితో..

రాయపోలుకు చెందిన నాగమణి, శ్రీకాంత్‌కు స్కూల్‌ రోజుల నుంచే పరిచయం. నాగమణిది కురుమ సామాజిక వర్గం కాగా, శ్రీకాంత్ మాల సామాజిక వర్గానికి చెందినవారు. తమ పరిచయం ప్రేమగా మారిందని శ్రీకాంత్ చెప్పారు.

ఎనిమిదేళ్ల కిందట వీరి ప్రేమ గురించి నాగమణి ఇంట్లో తెలిసి పంచాయతీ జరిగినట్లు శ్రీకాంత్ తల్లి హంసమ్మ చెప్పారు. ఆ తర్వాత నాగమణికి మరొకరితో పెళ్లి చేసినా.. ఆ వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. దీంతో నాగమణి విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల కిందట ఆమె తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు.

తరువాత నాగమణి, శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకుంటానని నాగమణి గట్టి పట్టుదలతో ఉండటంతో 2024 నవంబరు 10వ తేదీన యాదగిరిగుట్టలో వారికి వివాహం చేశామని శ్రీకాంత్ తల్లి హంసమ్మ చెప్పారు.

‘‘మేం మాల.. నువ్వు కురుమ. మరి మా ఇంట్లో నువ్వు ఉండగలవా..? అని నాగమణిని అడిగాను. ఉంటానని చెప్పింది. గతంలో చేసుకున్న పెళ్లికి విడాకులు అయిపోయాయని చెప్పింది. వాళ్ల కుటుంబంతో ఇప్పుడు సంబంధం లేదని చెప్పింది. శ్రీకాంత్‌ను చేసుకునేందుకు మీ తమ్ముడు, అక్క ఒప్పుకుంటారా.. అని అడిగితే చాలా రోజుల నుంచి అడుగుతుండటం వల్ల మాటవరుసకు అంగీకరించారని చెప్పింది’’ అని తెలిపారు హంసమ్మ.

కానీ తమ పెళ్లికి నాగమణి తరఫు బంధువులు ఎవరూ రాలేదని శ్రీకాంత్ చెప్పారు.

‘‘నువ్వు వేరొక కులం వ్యక్తిని చేసుకుంటున్నావని ఆమె తమ్ముడు, బంధువులు ఇబ్బంది పెట్టారు. పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తా.. నిన్ను చంపుతా.. అని ఆమెను బెదిరించారు. అయినా, మేం ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం’’ అని చెప్పారు శ్రీకాంత్.

పోలీస్ స్టేషన్
ఫొటో క్యాప్షన్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్

‘పోలీస్ స్టేషన్ వద్దే బెదిరించాడు’

పెళ్లి అయ్యాక ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినట్లు శ్రీకాంత్ బీబీసీకి చెప్పారు.

‘‘ఆ సమయంలో నాగమణి తమ్ముడు పరమేశ్, ఇతర పెద్దలను పిలిచి పోలీసులు మాట్లాడారు. కానీ స్టేషన్ నుంచి వెళ్లేటప్పుడు పరమేశ్ మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు.’’ అని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు.

పెళ్లయ్యాక ఊళ్లో కాకుండా, ఎల్బీనగర్ సమీపంలోని మన్సూరాబాద్ వద్ద కాపురం పెట్టారు శ్రీకాంత్, నాగమణి దంపతులు. ఆదివారం సెలవు కావడంతో ఊరికి వచ్చారు. రాయపోలులో నాగమణి తమ్ముడు పరమేశ్ ఉంటున్న ఇంటికి, శ్రీకాంత్ ఇంటికి దాదాపు కిలోమీటరు దూరం ఉంది. ప్రస్తుతం ఇంట్లో పరమేశ్, ఆయన నానమ్మ ఉంటున్నారని స్థానికులు చెప్పారు.

రాయపోలును బీబీసీ సందర్శించినప్పుడు పరమేశ్ ఇంటికి తాళం వేసి ఉంది.

‘‘పరమేశ్ హత్య చేస్తాడని అసలు అనుకోలేదు. ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తుంటాడు. పని బాగానే చేస్తాడు. అతనికి కారు కూడా ఉంది’’ అని స్థానికుడు నాగభూషణం బీబీసీకి చెప్పారు.

నాగమణి 2021 బ్యాచ్ కానిస్టేబుల్. చిన్నప్పటి నుంచి పోలీసు ఉద్యోగం చేయాలనేది ఆమె కల అని చెప్పారు శ్రీకాంత్. కొన్నేళ్లుగా కుటుంబం నుంచి విడిపోయి, సొంతకాళ్లపై నిలబడాలని హైదరాబాద్‌లో ఉంటూ కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధమైందని చెప్పారు.

శ్రీకాంత్ తండ్రి సత్తయ్య
ఫొటో క్యాప్షన్, శ్రీకాంత్ తండ్రి సత్తయ్య

‘తన భూమి ఇచ్చేయమంది’

నాగమణి కుటుంబానికి నాలుగు ఎకరాల భూమి ఉండగా.. పరమేశ్‌కు రెండెకరాలు, ఆడపిల్లలకు ఇద్దరికీ చెరో ఎకరా చొప్పున ఇవ్వాలని తల్లిదండ్రులు భావించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ ఎకరా పొలం ధర కోటిన్నర రూపాయలు ఉన్నట్టు చెప్పారు.

నాగమణి తన వాటాగా వచ్చిన భూమిని తమ్ముడికి ఇచ్చినట్లుగా శ్రీకాంత్ తెలిపారు.

‘‘ఆమెకు ఎకరా పొలం వచ్చింది. దాన్ని 2017-18 సమయంలో తమ్ముడికి రాసిచ్చింది. అతని ప్రవర్తన నచ్చక తన భూమిని తనకు తిరిగి ఇవ్వాలని అడిగింది. దీంతో పరమేశ్ ఆమెను చంపేశారు.’’ అని శ్రీకాంత్ అన్నారు.

‘‘వాళ్లకూ మాకు ఏ తగాదా లేదు. కాకపోతే వాళ్లు కురుమ.. మేం మాల. మొదట వారిద్దరూ ప్రేమించుకున్న విషయం తెలియదు. ఆమె కానిస్టేబుల్ అయ్యేందుకు కూడా శ్రీకాంత్ సాయం చేశాడట. ఇద్దరూ ఇష్టపడ్డారనే పెళ్లి చేశాం. కానీ ఇలా జరిగిపోయింది’’ అని శ్రీకాంత్ తండ్రి సత్తయ్య బీబీసీతో చెప్పారు.

తమ్ముడే చంపాడు: పోలీసులు

కానిస్టేబుల్ నాగమణిని చంపింది అతని తమ్ముడే.. కులాంతర వివాహంతో పరువు పోయిందని, ఎకరా భూమి తిరిగి ఇమ్మని అడిగినందుకు హత్య చేశాడని పోలీసులు తేల్చారు. నాగమణి తమ్ముడు పరమేశ్‌ను అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుడి నుంచి కత్తి, టీఎస్ 09 ఎఫ్ హెచ్ 0257, వాహనం బంపర్, ఐఫోన్ -15 స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు ఇబ్రహీంపట్నం సీఐ బి.సత్యనారాయణ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘నాగమణి ప్రేమించిన బండారి శ్రీకాంత్ మాల సామాజికవర్గానికి చెందినవాడు కావడంతో పెళ్లికి నిందితుడు పరమేశ్, కుటుంబసభ్యులు అడ్డు చెప్పారు. నాగమణిది కురుమ కమ్యూనిటీ కావడంతో అదే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అలాగే మొదటి వివాహం సందర్భంగా పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఎకరా భూమిని తిరిగి తమ్ముడు పరమేశ్ కు ఇచ్చేశారు నాగమణి. కుటుంబం నుంచి బయటకు వచ్చి వేరుగా ఉంటూ బండారి శ్రీకాంత్ ను నవంబరు 10న వివాహం చేసుకున్నారు.’’ అని చెప్పారు సీఐ సత్యనారాయణ.

‘‘పెళ్లి చేసుకున్నాక నాగమణి తన భూమిని తనకు ఇవ్వాలని పరమేశ్ ను అడిగారు. కులాంతర వివాహం కారణంగా పరువు పోయిందని, ఎకరా భూమి కూడా తిరిగి ఇవ్వాలని అడుగుతుండటంతో ఆమెను చంపాలని పరమేశ్ నిర్ణయించుకున్నారు. డిసెంబరు 2వ తేదీన రాయపోలు గ్రామం నుంచి డ్యూటీకి వెళుతున్న క్రమంలో వెనుక నుంచి కారుతో ఢీకొట్టి, కత్తితో నరికి చంపాడు.’’ అని సీఐ తెలిపారు.

పరమేశ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు పోలీసులు. నాగమణికి సంబంధించి కదలికల సమాచారం పరమేశ్ కు అతని స్నేహితుడు అచ్చన శివ అనే వ్యక్తి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.

సామేలు
ఫొటో క్యాప్షన్, కుల వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామేలు

కులాంతర వివాహాల విషయంలో అవగాహన లేకఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని కుల వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామేలు బీబీసీకి చెప్పారు.

ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని అవగాహన కల్పించాలన్నారు.

‘‘నాగమణి భర్త శ్రీకాంత్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఈ హత్య చేసిన వ్యక్తినే కాదు, దాన్ని ప్రోత్సహించిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి నిందితుడికి శిక్ష విధించాలి’’ అని సామేలు డిమాండ్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)