‘సీజ్‌ ద షిప్‌’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ఆదేశించినా ఇంకా ఆ షిప్‌ను ఎందుకు సీజ్‌ చేయలేదు?

కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, FB/Janasenaparty

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

‘సీజ్‌ ద షిప్‌..’

నాలుగు రోజులుగా ఏపీలో బాగా హల్‌ చల్‌ చేస్తోంది ఈ మాట.

కాకినాడ యాంకరేజీ పోర్టులో బియ్యం తరలింపు కోసం సిద్ధమైన పనామా దేశానికి చెందిన ‘స్టెల్లా ఎల్‌’ అనే షిప్‌ను సీజ్‌ చేయాలంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించిన తర్వాత ‘సీజ్‌ ద షిప్‌’ అనే మాట ట్రెండ్ అయ్యింది.

అయితే, స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ అధికారులు ఆ షిప్‌ను ఇంకా ఎందుకు సీజ్ చేయలేదు? మరో దేశానికి చెందిన షిప్‌‌ను సీజ్‌ చేసే అధికారం రాష్ట్ర అధికారులకు ఉంటుందా? తనకు సంబంధం లేని శాఖలో పవన్‌ జోక్యం చేసుకున్నారా? అసలు అలా పోర్టులోని నౌకలో తనిఖీలు చేసే అధికారం మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ఉంటుందా? వంటి ప్రశ్నలు, అంశాలు చర్చనీయమయ్యాయి.

వీటన్నింటినీ పరిశీలించే ముందు, అసలు కాకినాడ పోర్టు నుంచి బియ్యం రవాణా వివాదం ఎక్కడ మొదలైందో ఒక్కసారి చూద్దాం.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్టెల్లా ఓడ

ఫొటో సోర్స్, FB/Janasenaparty

కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే...

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ఓడ రేవు నుంచి పెద్ద మొత్తంలో రేషన్‌ బియ్యం తరలింపు వ్యవహారం కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే వెలుగులోకి వచ్చింది.

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఏడాది జూన్‌ నెలాఖరులో కాకినాడలో రెండు రోజులు మకాం వేసి గోదాములను తనిఖీ చేశారు.

గోదాముల్లోని నిల్వలకు సంబంధించి స్టాక్‌ రిజిష్టర్లు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి 5,300 మెట్రిక్‌ టన్నుల బియ్యం సీజ్‌ చెయ్యాలని ఆదేశించారు. కాకినాడ కేంద్రంగా రేషన్‌ బియ్యం మాఫియా రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు బియ్యం స్మగ్లింగ్‌ అవుతోందని, పోర్టును వైసీపీ మాజీ ఎమ్మెలే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం ఆక్రమించిందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

మళ్లీ మనోహర్‌ ఆగస్టు నెలలో జరిపిన తనిఖీల్లో సరైన వివరాలు లేని రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు.

ఇక నవంబర్ 27న జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌, కాకినాడలోని యాంకరేజీ పోర్టు నుంచి ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన పనామా దేశానికి చెందిన స్టెల్లా ఎల్‌ అనే నౌకను ఆపారు. అందులో 640 టన్నుల బియ్యం బస్తాలు ఉన్నాయి. దాంతోపాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్‌‌లో ఉన్న 1,064 టన్నుల బియ్యాన్ని గుర్తించారు.

ఇందుకోసం ఆయన బార్జ్‌లు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్, పోర్టు, మెరైన్, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల బృందంతో కలిసి ఐదు నాటికల్‌ మైళ్ల (సుమారు తొమ్మిది కిలోమీటర్ల) దూరం సముద్రంలో ప్రయాణించి స్టెల్లా ఎల్‌ నౌక వద్దకు చేరుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకు 29వ తేదీ (శుక్రవారం) అదే నౌక వద్దకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెళ్లి పరిశీలించారు. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ప్రత్యేక బోటులో ఆయన అక్కడికి వెళ్లారు.

ఓడ

ఫొటో సోర్స్, FB/Janasenaparty

ఫొటో క్యాప్షన్, ఈ బార్జ్‌‌లో 1,064 టన్నుల బియ్యం ఉన్నట్టు గుర్తించారు

‘సీజ్‌ ద షిప్‌’ అన్నా సరే..

‘‘కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడి నుంచి ఇంత భారీగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? తీరప్రాంతంలో అక్రమ రవాణాను అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైతే దేశ భద్రతకే ముప్పుగా మారుతుంది. భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలు అక్రమంగా దేశంలోకి రావని గ్యారంటీ ఏంటి?’’ అని అధికారులను ప్రశ్నించిన పవన్‌ కల్యాణ్‌.. ‘సీజ్‌ ద షిప్‌’ అని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఆ షిప్‌ను సీజ్‌ చేయడంతో పాటు, ఈ బియ్యం రవాణా వెనుక ఎవరున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఆ తర్వాత ఏం జరిగిందంటే...

పవన్‌ పర్యటన తర్వాత అధికారులు మిన్నకుండిపోయారు. ఏం చేయాలో తెలియకో లేక నిబంధనల వల్లనో, ఇంకేదైనా కారణం వల్లనో ఏమో గానీ.. మీడియాతో మాట్లాడేందుకు కూడా మల్లగుల్లాలు పడిపోయారు. షిప్‌ను సీజ్‌ చేయడం మాట అటుంచి ఆ రేషన్‌ బియ్యాన్ని కూడా సీజ్‌ చేయలేకపోయారు.

అయితే, గతంలో నాదెండ్ల మనోహర్‌ సీజ్‌ చేయగా బిల్లులు చూపించడంతో విడుదలైన ఆ బియ్యం, ఇప్పుడు పట్టుపడిన బియ్యం ఒక్కటేనా అన్నది పరిశీలిస్తున్నామని, అందుకే సీజ్‌ చేయలేదని నాలుగు రోజుల కిందట కలెక్టర్‌ బీబీసీకి తెలిపారు. ఆ తర్వాత దీనిపై ఎక్కడా ఆయన స్పష్టత ఇవ్వలేదు. షిప్‌ సీజ్‌ విషయంపై కూడా మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు.

చివరికి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని రాష్ట్ర కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఇంత పెద్ద కేసులో పౌర సరఫరాల శాఖ అధికారిని మాత్రమే బాధ్యులను చేశారన్న వాదనలు వినిపించాయి.

కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, FB/Janasenaparty

ఇంకా షిప్‌ సీజ్‌ కాలేదు.. పరిశీలిస్తున్నాం: కాకినాడ పోర్టు ఆఫీసర్‌

‘‘ఇంకా షిప్‌ సీజ్‌ చేయలేదు. అందులో పీడీఎస్‌ బియ్యం పట్టుబడటంతో పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. కస్టమ్స్‌ అధికారులతో మాట్లాడుతున్నారు. ఇది కస్టమ్స్‌ నోటిఫైడ్‌ పోర్టు కాబట్టి వాళ్లే నిర్ణయం తీసుకోవాలి’’ అని కాకినాడ పోర్టు ఆఫీసర్‌ ధర్మ శాస్త బీబీసీతో చెప్పారు.

‘‘మన తీరంలోకి వచ్చి.. ఇక్కడి నిబంధనలను అతిక్రమించిన ఏ షిప్‌నైనా సీజ్‌ చేసే అధికారం మన పోర్టు అధికారులకు ఉంటుంది’’ అని విశాఖ పోర్టులో పని చేసి ఇటీవలే రిటైర్‌ అయిన అధికారి బీబీసీతో చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

‘‘కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అధీనంలోని పోర్టులకు, స్టేట్‌ పోర్టులకు పోర్టు ఆఫీసర్‌ బాధ్యులుగా ఉంటారు. కేంద్రం పరిధిలోని పోర్టులకు హార్బర్‌ మాస్టర్‌ ఉంటారు. ఇండియన్‌ పోర్ట్స్‌ 1908 యాక్ట్‌ ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా ఎగుమతులు చేసే ఏ దేశపు షిప్‌నైనా సీజ్‌ చేసే అధికారం వారికి ఉంటుంది. ఎందుకంటే ఆ షిప్‌ మన తీరంలో ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనం తెలంగాణలో ప్రమాదానికి కారణమైతే ఎలా కేసు నమోదు చేస్తారో ఇది కూడా అంతే..’’ అని ఆయన వివరించారు.

‘నోటీసుల్లేకుండా షిప్‌లను తనిఖీ చేయకూడదు’

‘‘వాస్తవానికి స్టేట్‌ పరిధిలోని పోర్టు కాబట్టి మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ పరిశీలించాలని భావిస్తే ముందస్తు సమాచారం ఇవ్వాలి. ప్రయర్‌ నోటీసు ఇవ్వకుండా అలా తనిఖీలు చేసే అధికారం ఎవరికీ లేదు. ఏ పోర్టులోకి అయినా సరే నోటీసు ఇవ్వకుండా వెళ్లడానికి వీల్లేదు. రైట్‌ ఆఫ్‌ అడ్మిషన్‌ అనేది సాధారణంగా ఇస్తారు. కానీ ముందస్తు అనుమతి తీసుకోవాలి’’ అని రిటైర్డ్‌ పోర్టు ఆఫీసర్‌ చెప్పారు.

‘‘బియ్యం స్మగ్లింగ్‌ కిందకు రాదు, ఎగుమతుల కిందకే వస్తుందనేది నాకు తెలిసిన విషయం. మరి అక్కడి పరిస్థితి నాకు తెలియదు’’ అని ఆయన అన్నారు.

‘ప్రభుత్వ అనుమతి వచ్చే వరకూ ఆ షిప్‌ను పంపొద్దు’

కాగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోమవారం మధ్యాహ్నం భేటీ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వెలువడింది.

కాకినాడ పోర్టుకు ఐపీఎస్‌ కేడర్‌ స్పెషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌‌ను నియమించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్‌ యాదవ్‌, ఉన్నతాధికారులతో సోమవారం జరిగిన సమీక్షలో నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. పోర్టులో ఉన్న ఆ షిప్‌ను ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు పంపొద్దని ఆదేశాలిచ్చినట్టు స్పష్టం చేసింది.

ఏపీలోని పోర్టుల నుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

మంత్రి నాదెండ్ల మనోహర్

ఫొటో సోర్స్, FB/Janasenaparty

ఫొటో క్యాప్షన్, కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్‌కు డెన్‌గా మార్చారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు

మంత్రి నాదెండ్ల ఏమన్నారు?

2019లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కాకినాడ పోర్టులో 41.12% వాటాను అరబిందో సంస్థకు కట్టబెట్టారని, ఆ తర్వాతే అక్కడి నుంచి విదేశాలకు రేషన్‌ బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలోని చివరి మూడేళ్లలో కాకినాడ పోర్టు నుంచి రూ.48,537 కోట్ల విలువైన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని ఆరోపించారు.

ఇంకా మనోహర్‌ ఏమన్నారంటే.. ‘‘కాకినాడ పోర్టు మీదే కూటమి ప్రభుత్వం ఎందుకు దృష్టిపెట్టిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం ఉంది. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదు. అక్కడ ఏం జరుగుతోందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. పకడ్బందీగా వ్యూహం రచించి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతులు చేసి కోట్లు కూడబెట్టారు. మన రాష్ట్రంలో గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో గంగవరం పోర్టు నుంచి 2,20,289 మెట్రిక్‌ టన్నులు, కృష్ణపట్నం పోర్టు నుంచి 23,51,218 మెట్రిక్‌ టన్నులు, విశాఖపట్నం పోర్టు నుంచి 38,02,000 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగితే... ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,31,18,346 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. ఒక్క కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయిన బియ్యం విలువే రూ. 48,537 కోట్లు అంటే బియ్యం మాఫియా ఏ విధంగా రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ సీపోర్ట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి అరబిందో రియాల్టీకి 41.12 శాతం వాటా బదిలీ అయ్యింది. అరబిందో కంపెనీ పోర్టు టేకోవర్‌ చేసిన తరువాత ఊహించని తీరిలో 1,31,18,346 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేశారంటే ఏ మేరకు దందా జరిగిందో ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని మనోహర్‌ అన్నారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ఆరోపణలపై అరబిందో సంస్థ స్పందన కోసం బీబీసీ ప్రయత్నిస్తోంది. ఫోన్‌ ద్వారా ఆ సంస్థ ప్రతినిధులు అందుబాటులోకి రాకపోవడంతో, ఈమెయిల్ చేశాం. ఆ సంస్థ స్పందన రాగానే ఇక్కడ పేర్కొంటాం.

బొత్స సత్యనారాయణ

ఫొటో సోర్స్, FB/BotchaBSN

‘పవన్ కల్యాణ్ అక్కడికి ఎందుకెళ్లారు?’: మాజీ మంత్రి

మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ పోర్టులో పవన్‌ కల్యాణ్‌ హంగామా.. గబ్బర్‌సింగ్‌ సినిమా పార్ట్‌–3లా ఉందని విమర్శించారు. బియ్యం అక్రమ రవాణాపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యేను నిలదీసిన పవన్‌ కల్యాణ్‌కు అసలు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తోంది తన పార్టీ సభ్యుడే(నాదెండ్ల మనోహర్) అనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు.

‘‘బియ్యం రవాణాపై సంబంధిత మంత్రి తనిఖీలకు వెళ్ళారంటే అర్థం ఉంది. పవన్‌ కల్యాణ్‌ కూడా వెళ్లారంటే తన మంత్రిపై అనుమానంతో కూడా వెళ్ళి ఉండొచ్చని అనుకోవాల్సి వస్తోంది. బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం చిత్తశుద్ధి ఏమిటో త్వరలోనే బయటకు వస్తుంది’’ అని బొత్స అన్నారు.

నేను వచ్చిన తర్వాత మొత్తం మాట్లాడుతా: ద్వారంపూడి

కాకినాడ పోర్టు కేంద్రంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై, తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి స్పందించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నానని, మరో రెండు రోజుల్లో కాకినాడకు వచ్చి, ఈ విషయంపై పూర్తి వివరాలతో మాట్లాడుతానని చెప్పారు.

మంగళవారం (డిసెంబర్ 3) విజయవాడ నుంచి కస్టమ్స్ కమిషనర్ కాకినాడ పోర్టుకు వచ్చి స్వయంగా విచారించనున్నారని కాకినాడలో పనిచేస్తున్న కస్టమ్స్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

‘‘రేపు (మంగళవారం) విజయవాడ నుంచి కస్టమ్స్ కమిషనర్ కాకినాడ పోర్టుకు వచ్చి స్వయంగా విచారిస్తారు. ట్రేడర్లతో మాట్లాడుతారు. ఆ తర్వాతే ఆ షిప్ సీజ్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’’ అని ఆ అధికారి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)