విజయనగరం-గుర్ల: ఈ ఊళ్లో ఏడు రోజుల్లో ఏడు మరణాలు, ఏం జరిగింది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో సుమారు మూడు వేల జనాభా ఉంటుంది. ఆ గ్రామానికి వెళ్తే దాదాపు అందరూ మాస్కులు పెట్టుకుని కనిపిస్తారు. వారం వ్యవధిలో ఈ ఊరిలో ఏడుగురు మరణించారని గ్రామస్థులు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఐదుగురే అంటున్నారు.
గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులన్నీ ఆసుపత్రి వార్డుల్లా, స్కూల్ బల్లలు రోగులకు మంచాలుగా, తరగతి గది కిటికీ చువ్వలు సెలైన్ బాటిళ్ల స్టాండ్లుగా మారిపోయాయి.
ప్రస్తుతం ఈ బడి ఆసుపత్రిగా మారింది. విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. పదుల సంఖ్యలో రోగులకు వైద్య సిబ్బంది చికిత్స చేస్తున్నారు.
వైద్యశాఖ ఉన్నతాధికారులంతా ఈ గ్రామంలో పర్యటిస్తున్నారు. గురువారం నాటికి ఐదుగురు మరణించారని అధికారులు ప్రకటించారు.

వారంరోజుల్లో మరణాలు సంభవించిన ఆరు కుటుంబాలను బీబీసీ గురువారం(17.10.24) కలిసి, మాట్లాడింది.
మరణాలు సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ, వీరందరూ డయేరియాతో చనిపోయారని గ్రామస్థులు చెప్తున్నారు.
కానీ, డయేరియా వల్ల ఒక్కరు కూడా మరణించలేదని వైద్యాధికారులు బీబీసీతో చెప్పారు.
మరి వీరు ఏ కారణంతో చనిపోయారు? గ్రామంలో నెలకొన్న భయాలను తొలగించేందుకు అధికారులు ఏ చర్యలు చేపట్టారు? అసలు గుర్ల గ్రామంలో ఆకస్మాత్తుగా ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది?

గుర్ల గ్రామంలో అసలేం జరిగింది?
గ్రామంలోని 45 ఏళ్ల కలిశెట్టి సీతమ్మ ఈ నెల 13న వాంతులు, విరేచనాలతో పాటు డయేరియా లక్షణాలతో బాధపడ్డారు. దాంతో ఆమెను చికిత్స కోసం స్థానిక పీహెచ్‌సీకి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో అదే రోజు విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె 14న చనిపోయారు. అలాగే 65 ఏళ్ల సారిక పెంటయ్య కూడా 14న వాంతులు, విరేచనాలతో బాధపడుతూ...15న మరణించారు.
వీరిద్దరితోపాటు తొండ్రంకి రామాయమ్మ(60), జి. పైడమ్మ(50), బోడసింగి రాములమ్మ (70)లు డయేరియా లక్షణాలతో బాధపడుతూ మరణించారు.
ఆ తర్వాత ఈ నెల 17న మరడాన అప్పల నరసమ్మ(57), 18న పతివాడ సూరమ్మ(65) కూడా మృతి చెందారు.
వీరంతా వారం రోజుల వ్యవధిలోనే చనిపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
గ్రామంలోని సగం ఇళ్లల్లోని ప్రజలకు డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో చాలా మంది గుర్ల పాఠశాలతో పాటు, చీపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రి, విజయనగరం సర్వజన ఆసుపత్రి, విశాఖ కేజీహెచ్‌లలో చికిత్స పొందుతున్నారు.
శుక్రవారం(18వ) నాటికి వీరంతా 166 మంది ఉంటారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్. భాస్కర రావు బీబీసీకి చెప్పారు.
అయితే, ఈ సంఖ్య 250 వరకు ఉంటుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని వైద్యాధికారులు తెలిపారు.

అధికారులు ఏమంటున్నారంటే...
గుర్లలో డయేరియా లక్షణాలు ఉన్నవారందరికీ చికిత్స అందిస్తున్నామని, వారికి పూర్తిగా నయమయ్యేంత వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుతున్నామని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చెప్పారు.
అందుకే స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండేందుకు జిల్లా పరిషత్ పాఠశాలని తాత్కాలిక మెడికల్ క్యాంప్‌గా మార్చివేశామంటూ తెలిపారు.
గుర్లలో పరిస్థితి అదుపులో ఉందని, వదంతులను నమ్మవద్దని, ఈ విషయంలో ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంబేద్కర్ అన్నారు.
చనిపోయిన ఐదుగురిలో ఇద్దరికి మాత్రమే డయేరియా లక్షణాలు ఉన్నాయని, కానీ వారి మరణానికి డయేరియా కారణం కాదని, అప్పటికే ఉన్న ఇతర వ్యాధుల కారణంగా మరణించారని భాస్కర రావు బీబీసీతో చెప్పారు.
“మరణించిన ఐదుగురిలో ఇద్దరు కిడ్నీ సమస్యలతో, ఒకరు గుండె సంబంధిత వ్యాధి, ఇంకొకరు ఊపిరితిత్తుల వ్యాధి, అలాగే మరొక వ్యక్తి నరాలకు సంబంధించిన వ్యాధితో అప్పటికే బాధపడుతున్నారు. ఏ ఒక్కరూ కూడా పూర్తిగా డయేరియా లక్షణాలతో మరణించలేదు. వదంతులను ప్రజలు నమ్మవద్దు” అని భాస్కర రావు తెలిపారు.

గ్రామమంతా డయేరియా లక్షణాలు
సాధారణంగా కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా వస్తుంది. గ్రామంలో ఎవరూ కలుషిత ఆహారం తిన్నట్లుగా తెలియలేదు. దీంతో కొన్ని బోర్ల నుంచి నీటిని సేకరించి వాటికి పరీక్షలు చేశారు. ఆ నీరు కలుషితమైనట్లు రిపోర్టులు వచ్చాయి.
గ్రామంలో 11 బోర్ల శాంపిల్స్‌ను పరీక్షిస్తే.. అందులో 5 బోర్ల నుంచి వచ్చే నీరు కలుషితమైందని, అందులో ఇ.కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని భాస్కర రావు తెలిపారు.
ఈ బ్యాక్టీరియా అంత ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ... అనారోగ్యాలను కలిగించే టాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంటుందని, అధిక మోతాదులో ఈ టాక్సిన్లు విడుదలైనప్పుడు వాంతులు, విరేచనాలు వస్తాయని చెప్పారు.
చంపావతి నది నుంచి వచ్చే నీరు ఈ గ్రామానికి ఎస్ఎస్ఆర్ పేట నుంచి పైపు లైన్ల ద్వారా వస్తుంది. చంపావతి నది నీటితో పాటు... పైపుల ద్వారా గ్రామానికి వచ్చే నీరు కలుషితమైనట్లు ప్రాథమిక పరీక్షలో తేలిందని భాస్కర రావు చెప్పారు.
“బోరింగ్ పంపుల ద్వారా వచ్చే నీటిని ఉపయోగించవద్దని గ్రామస్థులకు చెప్పాం. ఐదు బోర్లను సీజ్ చేశాం. మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రాథమికంగా గ్రామంలో నీరు కలుషితం కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని నిర్ధరణకు వచ్చాం. ట్యాంకుల ద్వారా గ్రామస్థులకు సురక్షిత నీటిని సరఫరా చేస్తున్నాం” అని తెలిపారు.
క్రమంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గుతోందని, నాలుగు రోజుల్లో పూర్తిగా పరిస్థితి అదుపులోకి వస్తుందని భాస్కర రావు తెలిపారు.
పండగ పూట అందరం చికెన్, మటన్ తిన్నామని, అప్పుడు ఎవరికి ఏమి కాలేదని, నాలుగైదు రోజుల తర్వాతే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు గ్రామస్థులు బీబీసీతో చెప్పారు.

గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది?
గురువారం రోజు అంటే 17వ తేదీన గుర్ల గ్రామంలో బీబీసీ పర్యటించింది. ఆ సమయంలో గ్రామంలోని ప్రజలంతా మాస్కులు పెట్టుకుని కనిపించారు.
ఆసుపత్రిగా మారిన స్కూల్‌లో కొందరు వాంతులు చేసుకుంటున్నవారు కనిపించారు. మందుల డబ్బాలతో వైద్య సిబ్బంది హడావిడిగా తిరుగుతున్నారు. ఊర్లోకి అంబులెన్సులు రావడం, పోవడం కనిపించింది.
గ్రామమంతా బ్లీచింగ్ పౌడరు చల్లారు. ప్రతి ఇంటి ముందు మురుగు నీరు కనిపించింది. ఆ మురుగుకు, ఇంటికి మధ్య కనీసం ఒక అడుగు కూడా దూరం లేదు. ఇళ్ల ముందు ఉన్న కాలువలన్నీ మురుగుతో నిండి ఉన్నాయి.

“అధికారులకు ఎన్నోసార్లు ఈ మురుగు గురించి చెప్పాం. పట్టించుకోలేదు. గట్టిగా అడిగితే బ్లీచింగ్ పౌడరు కొట్టేవారు. ఎన్నిసార్లు మురుగు తీయమని అడిగినా బ్లీచింగ్ పౌడరు కొట్టడమేగానీ, దానిని తొలగించిందే లేదు. ఇంట్లో నుంచి బయటకు వస్తే ముందుగా కనిపించేది ఈ మురుగు నీరే” అని గ్రామస్థురాలు కుమారి బీబీసీకి చెప్పారు. కుమారి ఇంటి ముందే మురికి కాల్వ ఉంది.
కుమారి ఇంటికి దగ్గర్లో ఉండే 70 ఏళ్ల అప్పల నర్సమ్మ మరణించారు. బీబీసీ ఆ గ్రామంలో పర్యటించినప్పుడు, గ్రామస్థులు ఆమె అంత్యక్రియలకు సిద్ధమవుతున్నారు.
“గత వారం రోజులుగా ఊర్లో మరణాలు సంభవించడం, శవాలకు పాడే కట్టడం చూస్తున్నాం. ఇది మాకు అలవాటైపోయింది. అధికారులే సీరియస్‌గా తీసుకోలేదు” అని లక్ష్మీ అన్నారు.
ఊర్లో పిల్లలెవ్వరూ కనిపించలేదు. చాలా మంది తల్లిదండ్రులు వారిని తమ బంధువుల ఇళ్లకు పంపించారు. స్కూల్‌కు సెలవులు ఇచ్చారు కాబట్టి, ఇక్కడ ఉంచడం కంటే బయట ఉంచడమే మేలని పంపించేశామని తల్లిదండ్రులు అన్నారు.

భయం తొలగిపోలేదు : గ్రామస్థులు
కరోనా సమయంలో కూడా ఇంతలా భయపడలేదని, అప్పుడు తమ గ్రామంలో ఇన్ని మరణాలు సంభవించలేదని గుర్ల గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న శ్రీనివాస రావు చెప్పారు. ఆయను కొడుకు కూడా గుర్ల పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నాడు.
వారంలో ఏడుగురు చనిపోవడంతో పాటు ప్రతి రోజు పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరడంతో తమ గ్రామానికి ఏమైందోననే భయం కలుగుతోందని, అధికారులు దీనికి ఒక పరిష్కారం చూపించాలని గ్రామానికి చెందిన చిరంజీవి బీబీసీతో అన్నారు.
“వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. రోగులకు సెలైన్ ఎక్కించి ఇళ్లకు పంపుతున్నారు. కానీ, పరిస్థితి తిరిగి మొదటికే వస్తోంది. 17న చనిపోయిన రాములమ్మ కూడా స్థానిక పీహెచ్‌సీలో వైద్యం అందుకుంది. అయినా ఆమె మరణించింది” అంటూ తన భయాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి.

‘పరిస్థితి అదుపులోనే ఉంది’
గుర్ల గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ అన్నారు.
చంపావతి నీటి ప్రవాహంలో ఎగువ ప్రాంతం నుండి కళేబరాలు కొట్టుకురావడం వల్లనే నీరు కలుషితమై, గుర్లలో డయేరియా ప్రబలిందనే ప్రచారం అపోహ మాత్రమేనని కలెక్టర్ చెప్పారు.
ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటి వరకు ఎవరూ డయేరియా వ్యాధితో మృతి చెందలేదని, చనిపోయిన వారు గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులు తదితర వ్యాధులతో బాధపడుతున్న వారని తెలిపారు.
వాస్తవ పరిస్థితులపై వెంటనే నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
“ప్రతి ఇంటికి వెళ్లి బ్లీచింగ్, స్ప్రే చేయాలని, కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని డీపీవోలకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లా వైద్యశాఖ, పంచాయితీ రాజ్, రెవెన్యూ , ఇంజనీరింగ్ విభాగాలను కలుపుకుని ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం” అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి భాస్కర రావు తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














