మీ పేగుల్లో నివసించే వైరస్‌ల రహస్యం తెలుసా?

బ్యాక్టీరియా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

మైక్రోబయోమ్ గురించి బహుశా మీరు వినే ఉంటారు. ఇది మీ శరీరం లోపల, ముఖ్యంగా మీ జీర్ణ వ్యవస్థలో నివసించే బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల సమూహం. అయితే, ఆ బ్యాక్టీరియా లోపలా, బయటా వైరస్‌లు ఉన్నాయని ఇటీవల వెల్లడైంది. దీని వల్ల ఆ బ్యాక్టీరియాలో, మనలో ముఖ్యమైన మార్పులు జరుగుతున్నాయి.

మానవ జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా ఫేజెస్ (గ్రీకులో "బ్యాక్టీరియాను తినేవి") లేదా "ఫేజ్‌లు" అని పిలిచే వైరస్‌లు బిలియన్లు, బహుశా ట్రిలియన్ల కొద్దీ ఉన్నాయి. ఫేజియోమ్ సైన్స్ ఇటీవల బాగా అభివృద్ధి చెందిందని కొలరాడో విశ్వవిద్యాలయం పరిధిలోని అన్‌షుజ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పనిచేస్తున్న బ్యాక్టీరియాలజిస్ట్ బ్రెక్ డ్యూర్కాప్ చెప్పారు.

పరిశోధకులు వీటి విస్తృత వైవిధ్యం గురించి తెలుసుకోవడానికి కృషి చేస్తున్నారు. వైద్యులు సరైన ఫేజ్‌లను ఉపయోగించుకోగలిగితే మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

"మంచి ఫేజ్‌లతో పాటు చెడు ఫేజ్‌లు కూడా ఉంటాయి" అని అంటువ్యాధుల వైద్యులు, పరిశోధకుడు పాల్ బొల్లికీ అన్నారు. అయితే ప్రస్తుతం, మన పేగుల్లో ఎన్ని ఫేజ్‌లు ఉన్నాయో ఇంకా స్పష్టంగా తెలియదు. బహుశా ప్రతి బ్యాక్టీరియా కణానికి ఒకటి లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. ఫేజ్ జన్యువులు ఉన్న బ్యాక్టీరియా కూడా ఉన్నాయి, కానీ అవి వైరస్‌లను చురుకుగా ఉత్పత్తి చేయవు.

ఇంకా గుర్తించని ఫేజ్‌లు చాలా ఉన్నాయి. శాస్త్రవేత్తలు వీటిని ఫేజియోమ్ "డార్క్ మ్యాటర్" అని పిలుస్తారు. ప్రస్తుత ఫేజ్ పరిశోధనలో సింహభాగాన్ని ఈ వైరస్‌లను, వాటి హోస్ట్ బ్యాక్టీరియాను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

గట్ ఫేజ్ డేటాబేస్‌లో 1,40,000లకు పైగా ఫేజ్‌లు ఉన్నాయి. అయితే ఇది చాలా తక్కువ అంచనా.

"వాటి వైవిధ్యం అసాధారణమైనది’’ ఐర్లాండ్‌కు చెందిన మైక్రోబయాలజిస్ట్ కోలిన్ హిల్ అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫేజియోమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫేజియోమ్‌లు వ్యక్తి నుంచి వ్యక్తికి విస్తృతంగా మారుతూ ఉంటాయి.

ఫైటింగా, డాన్సా?

మానవ మల నమూనాల నుంచి సేకరించిన జెనెటిక్ సీక్వెన్స్ ద్వారా శాస్త్రవేత్తలు ఫేజ్‌లను కనుగొంటారు. పరిశోధకులు క్రాస్‌ఫేజ్ అనే అత్యంత సాధారణ గట్ ఫేజ్ సమూహాన్ని వీటిలోనే కనుగొన్నారు.

ఈ క్రాస్‌ఫేజ్‌లు మానవ ఆరోగ్యంలో ఏమైనా మార్పులు తీసుకొస్తాయో లేదో స్పష్టంగా తెలియదు. అయితే అవి పేగులలోని బ్యాక్టీరియా అత్యంత సాధారణ గ్రూపులలో ఒకటైన బ్యాక్టీరాయిడ్స్‌కు సోకుతాయి కాబట్టి, అవి మార్పులు తీసుకువచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని హిల్ అంటున్నారు.

ఫేజియోమ్‌లు వ్యక్తి నుంచి వ్యక్తికి విస్తృతంగా మారుతూ ఉంటాయి. హిల్, ఆయన సహచరులు మైక్రోబయాలజీ 2023 వార్షిక సమీక్షలో వివరించినట్లు వయస్సు, లింగం, ఆహారం, జీవనశైలిని బట్టి అవి మారుతుంటాయి.

బ్యాక్టీరియాకు ఫేజెస్ సోకి, కొన్నిసార్లు వాటిని చంపినప్పటికీ, వాటి మధ్య సంబంధం దాని కంటే క్లిష్టమైనది. "ఫేజ్, బ్యాక్టీరియా పోరాడుతుంటాయని అనుకుంటున్నాం" అని హిల్ అన్నారు. "కానీ అవి నిజంగా కలిసి డ్యాన్స్ చేస్తుంటాయని ఇప్పుడు మాకు అర్థమైంది; అవి భాగస్వాములు" అని చెప్పారు.

కొత్త జన్యువులను తీసుకురావడం ద్వారా ఫేజెస్ బ్యాక్టీరియాకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక ఫేజ్ కణం ఇన్ఫెక్ట్ అయిన బాక్టీరియమ్ లోపల చేరినప్పుడు, అది తన ప్రోటీన్ షెల్‌లోకి తన సొంత జన్యు పదార్ధంతో పాటు కొన్నిసార్లు బ్యాక్టీరియా జన్యువులనూ నింపుతుంది. తరువాత, ఇది ఆ జన్యువులను కొత్త హోస్ట్‌గా మారుస్తుంది, దీనికి అనుకోకుండా బదిలీ అయిన జన్యువులు సహాయపడతాయని డ్యూర్కాప్ చెప్పారు. అవి యాంటీబయాటిక్స్‌ నిరోధకతను, లేదా కొత్త పదార్థాలను జీర్ణం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి.

బ్యాక్టీరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫేజేస్ వేటాడే తోడేళ్లలాంటివి

ఫేజెస్, బ్యాక్టీరియా సంఖ్యను మితిమీరకుండా చేస్తుంది. పేగు అనేది అడవిలాంటి పర్యావరణ వ్యవస్థ అనుకుంటే, ఫేజెస్ బ్యాక్టీరియాను వేటాడే తోడేళ్లలాంటివి. అడవులకు తోడేళ్లు అవసరం అయినట్లే పేగులకు ఫేజ్‌లు అవసరం. ఆ తోడేలు-వేటాడే జంతువు సంబంధంలో మార్పు చోటు చేసుకుంటే, వ్యాధులు సంక్రమించవచ్చు.

పరిశోధకులు ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), ఇర్రిటబుల్ బోవెల్ డిసీజ్, కొలొరెక్టల్ క్యాన్సర్‌లలో ఫేజియోమ్ మార్పులను గమనించారు.

ఉదాహరణకు, ఐబీఎస్‌తో బాధ పడుతున్న వాళ్ల వైరల్ వ్యవస్థలో వైవిధ్యం తక్కువగా ఉంటుంది.

ప్రజలు గట్ మైక్రోబయోమ్‌ను డైట్‌లతో లేదా మరీ తీవ్రమైన వైద్య సందర్భాల్లో, మల మార్పిడితో తిరిగి రీబ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు.

కడుపులో అల్సర్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఇన్ఫెక్ట్ చేయడానికి చికిత్సాపరంగా ఉపయోగించగల ఫేజ్‌‌ల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.

మన పేగు వ్యవస్థను నిర్వహిస్తున్న ట్రిలియన్ల సంఖ్యలోని ఫేజ్‌లకు బహుశా మనం కృతజ్ఞత చూపాలేమో. అవి లేకుంటే, కొన్ని రకాల బ్యాక్టీరియా త్వరగా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని హిల్ భావిస్తున్నారు.దీని వల్ల మనం కొన్ని ఆహారాలను జీర్ణించుకోలేక, గ్యాస్, ఉబ్బరానికి లోనయ్యే అవకాశం ఉంది.

అందుకే ఈ అద్భుతమైన ఫేజియోమ్ అటు బాక్టీరియా. ఇటు మనుషులకూ ఇద్దరికీ ఒక డ్యాన్సింగ్ పార్ట్‌నర్‌లాంటిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)