ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య, రెండున్నర గంటల ఉత్కంఠ, ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండింగ్

సురక్షితంగా ల్యాండ్ అయిన ఎయిరిండియా విమానం
ఫొటో క్యాప్షన్, రెండున్నర గంటలు ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం

తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం సాంకేతిక లోపంతో దాదాపు రెండున్నర గంటలపాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 20కి పైగా అంబులెన్సులు, ఫైర్ టెండర్లు ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉంచారు.

చాలా సేపు ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం, తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు, వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రూట్ మ్యాప్

ఫొటో సోర్స్, https://www.flightaware.com/live/flight/AXB613

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య

ఎయిర్ ఇండియా విమానం సాయంత్రం 5.44 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరింది. ఆ విమానంలో 140 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి.

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ తలెత్తినట్టు పౌర విమానాయాన శాఖామంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.

భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని మళ్లీ తిరుచ్చిలో ల్యాండ్ చేయాలని నిర్ణయించారు. దీంతో తిరుచ్చి విమానాశ్రయంలో ముందు జాగ్రత్త చర్యలు శరవేగంగా చేపట్టారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అగ్నిమాపక శాఖ ఈ భద్రతా ఏర్పాట్లు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

సిద్ధంగా ఉన్న అంబులెన్సులు
ఫొటో క్యాప్షన్, తిరుచ్చి ఎయిర్‌పోర్టు

గాలిలో చక్కర్లు

వెంటనే విమానాశ్రయంలో 18 అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సాయం చేయడానికి వీలుగా వైద్యుల బృందాన్ని కూడా సిద్ధంగా ఉంచారు.

అదే సమయంలో ముందుజాగ్రత్త చర్యగా ల్యాండింగ్‌కు ముందు ఇంధనాన్ని ఖాళీ చేసేందుకు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. విమానం తిరుచ్చి విమానాశ్రయం ప్రాంతంలో గంటన్నరకు పైగా గాలిలో చక్కర్లు కొట్టింది.

ఆకాశంలో విమానం చాలా సేపు చక్కర్లు కొడుతుండడంతో పుదుకోట్టై జిల్లాలోని నార్తమలై, అన్నవాసల్ ముక్కనమలైపట్టి, కిరనూర్, అమ్మసముద్రం తదితర గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. విమానం క్షేమంగా ల్యాండ్ అవ్వాలని కోరుతూ పుదుకోట్టై జిల్లాని ఉచాని గ్రామంలో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.

ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఏం చెప్పారు?

‘‘తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దింపాలని నిర్ణయించాం. ల్యాండ్ అయ్యే ముందు ఇంధనాన్ని తగ్గించేందుకు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఏదన్నా ప్రమాదం జరిగితే ఎదుర్కొనేందుకు వీలుగా 20కి పైగా అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచాం’’ అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ గోపాలకృష్ణన్ చెప్పినట్టు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

సురక్షితంగా ల్యాండింగ్

రెండు గంటలకుపైగా ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం షెడ్యూల్ ప్రకారం 8.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా సరిగ్గా 8.10గంటలకు విమానం తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.

విమానం మెల్లగా తన ఎత్తును తగ్గించుని షెడ్యూల్ ప్రకారం సరిగ్గా 8.15కి రన్‌వేని తాకింది. చక్రాలు రన్‌వేను తాకిన తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.

ల్యాండింగ్ గేర్ ఓకే

"తిరుచ్చి నుండి షార్జాకు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరుచ్చి విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ అయింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. విమానం ల్యాండింగ్ గేర్ యథావిధిగా పని చేస్తోంది. అందువల్ల విమానం ఎలాంటి సమస్యా లేకుండా సాధారణంగా ల్యాండ్ అయింది’’ అని విమానయాన మంత్రిత్వశాఖ చెప్పినట్టు ఏఎన్‌ఐ తెలిపింది.

‘ఇంధనాన్ని ఖాళీచేసి’

విమానం టేకాఫ్ అయ్యే ముందు మొదట దాని చక్రాలు లోపలికి వెళ్తాయి. ఇది కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఒకవేళ చక్రాలు లోపలికి వెళ్లకపోతే, పైలట్ విమానాన్ని వెనక్కి తీసుకురావాలి. అయితే టేకాఫ్ బరువుతో విమానాన్ని కిందకు దించడం సాధ్యం కాదు. కాబట్టి ఇంధన బరువు తగ్గించాలి. కొన్ని పెద్ద విమానాలు ఇంధనాన్ని గాలిలోకి పంపే ప్రత్యేక సాంకేతికతను కలిగి ఉంటాయి. అయితే ఈ విమానంలో అది సాధ్యం కాకపోయుండచ్చు. దీంతో విమానాన్ని నడిపి ఇంధనం తగ్గించే ప్రయత్నాలు జరిగాయి’’ అని మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి రామ్ బీబీసీ తమిళ్‌తో చెప్పారు.

" తిరుచ్చి నుంచి షార్జా 1500 'నాటికల్ మైళ్లు' (2800 కి.మీ) ఉంటుంది. ఈ ప్రయాణానికి సరిపడా ఇంధనం విమానంలో ఉంటుంది. కాబట్టి చాలా ఇంధనం అయిపోయిన తర్వాత మాత్రమే వారు విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తారు. విమానం షార్జాకు వెళ్లడానికి నాలుగు గంటలు పడుతుంది. ఇంధనం తగ్గించడానికి రెండున్నర గంటల సమయం చాలు’’ అని ఆయన అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)