నోబెల్ శాంతి బహుమతి : అణుదాడి బాధితుల కోసం పనిచేస్తున్న జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి

- రచయిత, అన్నా లమ్చె, జేమ్స్ లాన్‌డేల్
- హోదా, బీబీసీ న్యూస్
అణుబాంబు నుంచి ప్రాణాలతో బయటపడ్డవారికి చెందిన జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యో 2024 సంవత్సరానికిగానూ నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైంది.
1945లో హిరోషిమా, నాగసాకిలో జరిగిన బాంబుపేలుళ్ల నుంచి ప్రాణాలతో బయటపడిన ఈ గ్రూపు హిబాకుషాగా ప్రసిద్ధి పొందింది. అణ్వాయుధాల నుంచి ప్రపంచాన్ని బయటపడేసేందుకు ఈ గ్రూపు చేసిన ప్రయత్నాలను నార్వే నోబెల్ కమిటీ గుర్తించింది.
అణ్వాయుధాలపై నిషేధం తీసుకొచ్చేందుకు నిహాన్ హిడాంక్యో గ్రూప్ ఎంతగానో కృషిచేసిందని నోబెల్ కమిటీ అధ్యక్షులు జోర్గెన్ వాట్నే ఫ్రిడ్నెస్ చెప్పారు.
‘‘అణ్వాయుధాల నిషేధం’’పై ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి ఉందని’’ ఫ్రిడ్‌నెస్ చెప్పారు. తమ బాధలనే సాక్ష్యంగా చూపించి అణ్వాయుధాలను మళ్లీ ఉపయోగించకూడదని సంస్థ ప్రచారం చేయడాన్ని ఆయన ప్రశంసించారు.1956లో ఈ సంస్థను స్థాపించారు. అణ్వాయుధాల ప్రయోగం వల్ల కలిగిన దారుణనష్టాన్ని, బాధలను సాక్ష్యాలతో వివరించడానికి తమ గ్రూపులోని సభ్యులను ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు పంపింది అని వారి వెబ్‌సైట్ తెలియజేస్తోంది’’ అని చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
అణ్వాయుధాలకు వ్యతిరేకంగా కృషి
హీరోషిమా, నాగసాకి విధ్వంసం జరిగిన దాదాపు దశాబ్దం తర్వాత ఆ సంస్థ కార్యకలాలపాలు మొదలయ్యాయి.
హీరోషిమాపై 1945 ఆగస్టు 6న అమెరికా యురేనియం బాంబు ప్రయోగించింది. దీంతో ఆ నగరంలో 1,40,000మంది మరణించారు.
మూడు రోజుల తర్వాత అమెరికా రెండో అణ్వాయుధం నాగసాకిపై జారవిడిచింది. రెండు వారాల తర్వాత జపాన్ లొంగుబాటుతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.
తమ గ్రూపుకు నోబెల్ శాంతి బహుమతి లభించడంపై నిహాన్ హిడాంక్యో గ్రూప్ సహ అధినేత టోషియుకి మిమకి ఆనందం వ్యక్తంచేశారు.
ఈ కల నెరవేరుతుందని తానెప్పుడూ అనుకోలేదని మిమకి కన్నీళ్లతో మీడియాకు చెప్పినట్టు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
హీరోషిమాపై అణుబాంబు దాడి జరిగిన సమయంలో తన వయసు మూడేళ్లే అయినప్పటికీ క్షతగాత్రులు బాధతో పరుగులు తీస్తున్న దృశ్యాలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని మిమకి గత ఏడాది బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
నోబెల్ బహుమతిని డిసెంబరులో ప్రదానం చేస్తారు. ఓస్లోలో ఈ కార్యక్రమం జరుగుతుంది. శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతి రోజు నోబెల్ బహుమతులు అందిస్తారు. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నవారికి బంగారు పతకంతో పాటు రూ.8కోట్ల41లక్షలకు పైగా నగదు అందుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పద నామినేషన్లకు దూరం
నిహాన్ హిడాంక్యోను గుర్తించడం ద్వారా శాంతి బహుమతి కోసం అత్యంత వివాదాస్పదంగా ఉన్న నామినీలకు... నోబెల్ కమిటీ దూరంగా ఉందని అర్ధమవుతోంది.
పాలస్తీనియులకు మద్దతుగా నిలుస్తున్న ఐక్యరాజ్యసమితి సంస్థ -యూఎన్‌డబ్ల్యుఆర్ఏ-ను ఈ ఏడాది శాంతి బహుమతికోసం పరిగణనలోకి తీసుకుంటారని విస్తృతంగా ప్రచారం జరిగింది.
గాజా ప్రజలకు మానవతాసాయం అందిస్తున్న వారిలో యూఎన్‌డబ్ల్యుఆర్ఏ ప్రధానమైనది. అయితే గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో ప్రమేయముందన్న ఆరోపణలతో సంస్థకు చెందిన 9మంది సభ్యులపై వేటుపడింది.
యూఎన్‌డబ్ల్యుఆర్ఏకు శాంతి బహుమతి ఇవ్వొద్దని కోరుతూ 12వేలమందికిపైగా ప్రజల సంతకాలతో నోబెల్ కమిటీకి పిటిషన్ సమర్పించారు.
అంతర్జాతీయ న్యాయస్థానం నామినేషన్‌పైనా ఇలాంటి అభ్యంతరాలే ఉన్నాయి.
గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తోందనే ఆరోపణలను ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయవిభాగం పరిశీలిస్తోంది. హింసాత్మక చర్యలు నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను కోరుతూ యూఎన్ న్యాయవిభాగం ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది.
నిహాన్ హిడాంక్యోను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయడం ద్వారా నోబెల్ కమిటీ వివాదాలకు దూరంగా ఉండడంతో పాటు అణ్వాయుధాల సంక్షోభంపై ప్రపంచం దృష్టిపెట్టేలా చేసింది.
యుక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలతో అణ్వాయుధాల గురించి చర్చ జరగుతోంది.
యుక్రెయిన్‌పై ఆక్రమణ ప్రారంభించిన దగ్గరినుంచి రష్యా అణ్వాయుధాల ప్రయోగం గురించి మాట్లాడుతోంది. తమకు ఆమోదయోగ్యం కాని రీతిలో యుక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు సాయాన్ని పెంచితే అణ్వాయుధాల ప్రయోగానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా నాయకులు పదే పదే హెచ్చరిస్తున్నారు.
పశ్చిమదేశాల మద్దతు యుక్రెయిన్‌కు మరింతగా పెరగకుండా ఈ బెదిరింపులు అడ్డుకుంటున్నాయి.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ వ్యూహాలు ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందనే భయంతో ఆధారపడి రూపొందిస్తున్నవే. అయితే ఈ వాదనను తెహ్రాన్ ఖండిస్తోంది.
తమ అణ్వాయుధసామర్థ్యం గురించి కొన్ని దేశాలు మాట్లాడుతున్న సమయంలో నోబెల్ కమిటీ నిర్ణయంతో అణ్వాయుధాల ప్రయోగంపై కొత్త చర్చ జరిగే అవకాశముంది.
286 నామినేషన్లు
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం 286 నామినేషన్లు వచ్చాయి. వాటిలో 197 నామినేషన్లు వ్యక్తులకు చెందినవి. 89 వివిధ సంస్థల తరఫున దాఖలయ్యాయి.
జాతీయ అసెంబ్లీలు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ న్యాయసంస్థలు సహా కీలక సంస్థలకు చెందిన వ్యక్తులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
2023లో ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మది నోబెల్ శాంతి బహుమతి పొందారు. ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికిగానూ ఆమెకు ఈ బహుమతి లభించింది.
ప్రస్తుతం నర్గేస్ తెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో ఉన్నారు. 12 ఏళ్లగా ఆమె జైల్లోనే ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














