దక్షిణ కొరియా: మార్షల్ లా ప్రకటించిన కొద్దిగంటలకే ఉపసంహరణ, పార్లమెంటులో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Reuters
దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ మార్షల్ లా (తాత్కాలిక సైనిక పాలన)ను ఎత్తివేస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ ప్రకటించారు. ‘‘కొద్దిసేపటి కిందటే జాతీయ అసెంబ్లీ నుంచి ఎమర్జెన్సీని ఎత్తివేయాలంటూ వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా సైనిక పాలనను ఉపసంహరించుకుంటున్నాం’’ అని యోల్ తెల్లవారుజామున 4.30 గంటలకు టెలివిజన్ ద్వారా ప్రకటించారు.
దేశంలో మార్షల్ లా విధిస్తున్నట్టు అధ్యక్షుడు ప్రకటించిన కొద్దిసేపటికే ఎంపీలందరూ ఆయన చర్యను నిరసించారు. సైనిక పాలనను అడ్డుకోవడానికి పార్లమెంటు వద్దకు చేరుకున్నారు.
పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు కొంతమంది బారికేడ్ల మీద నుంచి దూకారు. మరికొందరు భద్రత కోసం ఏర్పాటు చేసిన కంచెలపై నుంచి భవనం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ప్రదర్శనకారులకు మధ్య తోపులాట జరిగింది.
అయితే సైనిక పాలనను ఉపసంహరించినట్టు వెలువడిన ప్రకటనతో పార్లమెంటు బయట గుమికూడిన ప్రదర్శనకారులు సంబరాలు చేసుకున్నారు.
ప్రస్తుతం దక్షిణ కొరియా పార్లమెంటు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. జర్నలిస్టులు లోపలకు వెళ్లేందుకు గుర్తింపు కార్డును చూపాల్సి వస్తోంది.
మంగళవారం రాత్రితో పోల్చుకుంటే పరిస్థితి కొంత సద్దుమణిగినప్పటికీ కొంతమంది ప్రదర్శనకారులు మాత్రం అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోపక్క యాన్ సుక్ యోల్ సైనిక పాలన నిర్ణయంతో ఆయన సిబ్బంది మూకుమ్మడి రాజీనామాకు సిద్ధపడ్డారని యోన్హాప్ న్యూస్ కథనం తెలిపింది.
అధ్యక్షుడు యోల్ ఇంకా బహిరంగంగా ప్రజలకు కనిపించ లేదు.

అసలేం జరిగింది?
ఉత్తర కొరియా కమ్యూనిస్టు దళాల నుంచి దేశాన్ని రక్షించడం కోసం దేశంలో మార్షల్ లా విధిస్తున్నట్టు దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ మంగళవారం అర్ధరాత్రి ప్రకటించారు. ఆయన జాతినుద్దేశించి టెలివిజన్‌లో చేసిన ప్రసంగంలో దేశ వ్యతిరేక శక్తులను అంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇందుకోసం తనవద్ద మరో మార్గం లేదని ఆయన చెప్పారు.
మార్షల్ లా ఎప్పటివరకు అమల్లో ఉంటుందో ఆ సమయంలో యాన్ సుక్ యోల్ చెప్పలేదు.
దేశంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సైనిక పాలన (మార్షల్ లా)ను విధిస్తారు.
ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దక్షిణ కొరియా మీడియా కథనాల ప్రకారం, దేశంలో అన్ని రకాల పార్లమెంటరీ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది.
పార్లమెంట్ భవనంలోకి సభ్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారని యోహప్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
రాజధాని సోల్ నగరంలోని పార్లమెంట్ భవనం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది.
పార్లమెంటు భవనంపై హెలికాప్టర్లు దిగాయని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, EPA
ఈ నిర్ణయానికి నిరసన తెలిపేందుకు ప్రజలంతా పార్లమెంటు దగ్గరకు రావాలంటూ దక్షిణ కొరియా ప్రధాన ప్రతిపక్షం డెమొక్రటిక్ పార్టీ నేత లీ జే యుంగ్ పిలుపునిచ్చారు.
పార్లమెంట్ భవనంలోకి ఎవరూ రాకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
తాజా పరిణామాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తన ఇంటి సమీపంలో హెలికాప్టర్ల శబ్దంతో ఆందోళనగా ఉందని సోల్ నివాసి జి సో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయేమోననే ఆందోళనతో ఎమర్జెన్సీ కిట్ దగ్గర ఉంచుకున్నట్లు సోల్‌కు చెందిన కిమ్ మి రిమ్ తెలిపారు.
మార్షల్ లాను ఉల్లంఘించిన వారిని ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారంటూ యోహప్ న్యూస్ పేర్కొంది. మీడియా సంస్థలతో పాటు, ప్రచురణకర్తలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు.
నియంత పార్క్ చుంగ్ హీ హత్య కారణంగా 1979లో దక్షిణ కొరియాలో మార్షల్ లా అమలు చేశారు. ఆ తర్వాత దీనిని అమలు చేయడం ఇదే తొలిసారి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















