బోర్డర్ దాటడానికి బస్ దొంగతనం.. చివరకు ఏమైందంటే

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియాకు తిరిగి వెళ్లాలనుకునే వాళ్లు చాలా అరుదు

ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు చాలాకాలం కిందట పారిపోయి వచ్చిన ఓ వ్యక్తి తిరిగి ఉత్తర కొరియాలోకి ప్రవేశించే ప్రయత్నంలో దొరికిపోయారు.

బస్ దొంగిలించి అందులో బోర్డర్ దాటి ఉత్తర కొరియా వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన్ను దక్షిణ కొరియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెండు కొరియాలను వేరు చేసే యూనిఫికేషన్ బ్రిడ్జ్‌పై మంగళవారం ఆ వ్యక్తి పోలీసులకు దొరికాడు.

బస్ ఆపమని కోరిన సైనికులను పట్టించుకోకుండా ఆ వ్యక్తి బారికేడ్‌ను ఢీ కొట్టారు.

70 ఏళ్ల కిందట కొరియా ద్వీపకల్పం విడిపోయినప్పటి నుంచి దాదాపు 34,000 మంది ఉత్తర కొరియన్లు దక్షిణ కొరియాకు పారిపోయినా.. ఉత్తర కొరియాకు తిరిగి వచ్చే వాళ్లు చాలా అరుదు.

దక్షిణ కొరియా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఈ 30 ఏళ్ల వ్యక్తి దక్షిణ కొరియాలో పలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించున్నట్లు పోలీసులకు తెలిపారు.

ఆయన దశాబ్దం క్రితం ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ వ్యక్తి మంగళవారం పజు నగరంలోని ఒక గ్యారేజీలో బస్సును దొంగిలించి, అరగంట తర్వాత పోలీసులకు దొరికిపోయారు.

గ్యారేజ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో.. ఒక టోపీ ధరించిన వ్యక్తి అనేక వాహనాల డోర్లను తెరవడానికి ప్రయత్నించి.. చివరికి ఒక బస్సు డోర్ తెరిచి లోపలికి ఎక్కడం కనిపించింది.

సంఘటన జరిగిన సమయంలో ఆయన మద్యం, డ్రగ్స్ మత్తులో లేరని రిపోర్టులలో వెల్లడైంది.

ఆయన దక్షిణ కొరియాలోని పజు, మరికొన్ని నగరాలలో ఇంతకాలం కూలీగా పనిచేసినట్లు స్థానిక వార్తాపత్రిక ‘ది డాంగ్-ఎ ఇల్బో’ పేర్కొంది.

తెలుగు బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దక్షిణ కొరియా చట్టం ప్రకారం, ఆ దేశ పౌరులు ఎవరూ ప్రభుత్వ అనుమతి లేకుండా సరిహద్దులు దాటి ఉత్తర కొరియా వెళ్లడం నిషేధం.

నేరం రుజువైతే వాళ్లకు పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అలాగే ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు వచ్చినవాళ్లకు వెంటనే పౌరసత్వం మంజూరు చేస్తారు.

ఏటా ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు వెయ్యిమందికి పైగా రహస్యంగా సరిహద్దులను దాటి వస్తుంటారు.

అయితే.. 2012 - 2022 మధ్య పదేళ్ల కాలంలో ఉత్తర కొరియాకు 31 మంది మాత్రమే తిరిగి వెళ్లారు.

దక్షిణ కొరియాకు వచ్చిన వాళ్ల జీవితాలు వాళ్లు అనుకున్న విధంగా లేకపోవడం వల్ల కొందరు ఉత్తర కొరియాకు తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తారు.

మరికొందరు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు తిరిగి వెళ్లాలనుకుంటారు.

అయితే ఇలా తిరిగి ఉత్తర కొరియా వెళ్లడం అత్యంత ప్రమాదకరం.

తిరిగి వెళ్లినవాళ్లలో కొంతమందికి జైలు శిక్షలు, ఇతర శిక్షలు ఉంటాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)