వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజున భక్తులెందుకు పెద్దసంఖ్యలో ఆలయాలకు వెళ్తారు?

వైకుంఠ ఏకాదశి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలతో పాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి.

తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతుంటారు.

అసలు వైకుంఠ ఏకాదశికి ఎందుకింత ప్రాధాన్యత?

భక్తులు ఎందుకు వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని, విష్ణుమూర్తిని/ వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటూ ఉంటారు?

దాని వెనకున్న నమ్మకాలేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? తిథి ప్రాధాన్యత ఏంటి?

వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తుంటారు. గుడిలో ఉండే వైకుంఠ ద్వారం ఒక రోజంతా తెరచివుంచే మహోత్సవం అని వైకుంఠ ఏకాదశిపై డాక్టర్ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మలు రచించి, టీటీడీ ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు.

‘‘సంవత్సరానికి ఒకే ఒక్కమారు లభించే మహా భాగ్యం – ముక్కోటి ఏకాదశి రోజున శ్రీవారి సేవ అని, మరునాటి ద్వాదశి పుష్కరిణీ చక్రస్నానం అనేక కోట్ల జన్మల పుణ్యఫలమ’’ని ఆ పుస్తకంలో తెలిపారు.

తిరుమలలో ఏడాదికి నాలుగుసార్లు చక్రస్నానం జరుగుతుంది. అనంత పద్మనాభవ్రతం నాడు, బ్రహ్మోత్సవాల చివరి రోజు, వైకుంఠ ఏకాదశి మరునాడు వచ్చే ద్వాదశి రోజున, రథసప్తమి మధ్యాహ్నం..ఇలా నాలుగుసార్లు ఉంటుంది.

అందుకే, పెద్ద సంఖ్యలో భక్తులు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) రోజున తిరుమల శ్రీనివాసుడని దర్శించుకునేందుకు వస్తుంటారు.

సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణాయణం, ఆరు నెలలు ఉత్తరాయణం.

''వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ఉండే ద్వారమే వైకుంఠ ద్వారం. దేవతల పరంగా చూసుకుంటే, స్వామివారు నిద్ర నుంచి లేచి ముక్కోటి దేవతలకు సుప్రభాత దర్శనం ఇస్తారు. దేవకాలంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు చీకటి. ఏడాదంతా ఒక రోజుగా భావిస్తే, రాత్రి తొలగి, పగలు ప్రారంభమయ్యే ముందు, స్వామి వారు దేవతలకు తన దర్శనం ఇస్తారు'' అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ చెప్పారు.

వైష్ణువు

ఫొటో సోర్స్, Getty Images

ప్రతి మాసంలో రెండు ఏకాదశులు(శుక్ల -బహుళ) వస్తాయి.

నెలకు రెండు చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు. వాటిల్లో, సూర్యమానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా చెబుతుంటారని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన పుస్తకంలో తెలిపింది. దీన్నే 'ముక్కోటి ఏకాదశి' అని ఆంధ్రులు అంటారని ఈ పుస్తకంలో వివరించింది. సాధారణంగా ఈ ధనుర్మాసం తెలుగువారి మార్గశిర/ పుష్య మాసాల్లో వస్తుంది.

శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడి కన్ను. చంద్రుడు ఎడమ కన్ను. కన్నులు వేర్వేరుగా ఉన్నా దృష్టి ఒక్కటే అయినట్లు, సూర్యుచంద్రులు వేర్వేరుగా కనిపిస్తున్నా.. కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్త్వాన్ని ఈ పండగ సూచిస్తుందని ఈ పుస్తకం వివరించింది.

విష్ణుమూర్తి

ఫొటో సోర్స్, Getty Images

వైకుంఠ ఏకాదశి వెనకున్న పురాణ కథ?

రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మదేవుణ్ని వెంటబెట్టుకుని వైకుంఠం వెళ్తారు. మార్గశిర శుక్ల ఏకాదశి రోజున శ్రీవారిని ప్రార్థించి, తమ బాధలను విన్నవించుకుంటారు.

స్వామిబ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇస్తాడు. దేవతల బాధా నివారణకు ఈ ఏకాదశే మార్గం చూపిందని ఈ పురాణ కథను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు.

మరో కథ.. మధుకైటభులను మహావిష్ణువు సంహరించినప్పుడు, వారు దివ్యరూపాలు ధరించి, దివ్య జ్ఞానాన్ని పొంది , ''దేవా! వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి, ఏకాదశి పూజ గావించి, నిన్ను దర్శించి, నమస్కరించి, ఉత్తరద్వార మార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీవైకుంఠ ప్రాప్తి కలిగించు'' అని ప్రార్థించారు. స్వామి వారు అందుకు తథాస్తు అని సంతోషంగా అనుగ్రహించారని కథలో ఉంది.

ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కనుక 'ముక్కోటి ఏకాదశి' అని పేరు. అలాగే, వైకుంఠదర్శనం కలిగిస్తుంది కనుక 'వైకుంఠ ఏకాదశి' అని పేరుగాంచింది.

పద్మ పురాణంలో ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను గురించి చెప్పినట్లు ఒక హిందూ బ్లాగ్‌లో పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడనాడుల్లో వైష్ణవ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పండగ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు.

వైకుంఠ ఏకాదశి పండగను తిరుపతి బాలాజీ ఆలయంలో, శ్రీరంగం శ్రీ రంగనాథ ఆలయంలో, భద్రాచలం ఆలయంతో సహా అన్ని ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో జరుపుతుంటారు. కేరళలో దీన్ని స్వర్గావతిల్ ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు.

''తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రంలో ఈ ఉత్సవం బాగా జరుగుతుంది. 20 రోజుల పాటు చేస్తారు. 12 మంది ఆళ్వార్‌లను తీసుకొచ్చి పూజిస్తారు. దక్షిణ భారతదేశంలోని అన్ని వైష్ణవాలయాల్లో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఏకాదశి రోజు భక్తులు ఉపవాస దీక్షలు చేస్తుంటారు'' అని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్ తెలిపారు.

పద్ధతిగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుందని రంగరాజన్ చెప్పారు.

గోదావరి జిల్లాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆంజనేయస్వామి దేవాలయాల్లో ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా ఉంది.

తిరుమల

ఫొటో సోర్స్, Getty Images

వైకుంఠ ఏకాదశిని పవిత్రంగా భావించే భక్తులు

''తిరుమలలో ఉత్తర ద్వారం ఏడాదికి ఒకసారే తెరుస్తారు. ప్రస్తుతం పది రోజుల వరకు ఉత్తర ద్వారం నుంచి దర్శనం కల్పిస్తున్నారు. ఆ దర్శనం కోసం ప్రత్యేకం టోకెన్లు ఇస్తుంది టీటీడీ. భక్తుల కోసం పెద్దసంఖ్యలో కౌంటర్లు పెడుతుంది’’ అని ఓ భక్తుడు చెప్పారు.

ఏకాదశి రోజున సాధారణంగా భక్తులు ఉపవాసం ఉంటారు. కొందరైతే మంచినీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తుంటారు. హిందూవులు ఏకాదశినే పవిత్రంగా భావిస్తుంటారు. అందులో వైకుంఠ ఏకాదశిని అంతకంటే ఎక్కువ పవిత్రమైనదిగా భావిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)