తిరుపతిలో తొక్కిసలాట: వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాలలో ఆరుగురి మృతి

ఫొటో సోర్స్, screengrab
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
హెచ్చరిక: కలచివేసే అంశాలు ఉన్నాయి
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కోసం తిరుపతిలో ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు.
టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రులతోపాటు, ప్రభుత్వ రుయా ఆస్ప్రతికి తరలించారు.
వైకుంఠ ఏకాదశి టోకెన్లు గురువారం నుంచి తిరుపతిలోని 8 ప్రాంతాల్లో జారీచేస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రానికి భారీగా భక్తులు అక్కడకు చేరుకుని క్యూలైన్లలో బారులు తీరారు.
తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న రామానాయుడు స్కూల్ ప్రాంతం, విష్ణునివాసం కేంద్రాలలో తొక్కిసలాట జరిగింది. మొత్తం ఆరుగురు మరణించారు. గాయపడినవారికి రుయాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


ఫొటో సోర్స్, screengrab

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం అన్నారు.
ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. జిల్లా, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారని సీఎం కార్యాలయం జారీచేసిన ప్రకటన తెలిపింది.
హోం మంత్రి అనిత కూడా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుకి ఫోన్ చేసి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఫొటో సోర్స్, screengrab
జగన్ సంతాపం
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాలలో తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. జరిగిన ఘటన తీవ్ర విచారకరమని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

‘ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలి’
తిరుపతిలో భక్తుల మృతి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచి వేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














