ఆంధ్రప్రదేశ్‌పై అభిమానం చూపే అవకాశం ఇన్నాళ్లకు వచ్చిందన్న ప్రధాని మోదీ.. ఏయే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారంటే..

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మోదీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తరాంధ్ర వాసుల నాలుగు దశాబ్దాల కల విశాఖ ప్రత్యేక రైల్వే జోన్.

52 ఎకరాల్లో నిర్మిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ (విశాఖ రైల్వే జోన్) కార్యాలయానికి ప్రధాని మోదీ బుధవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.

దీనితో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

ఏయూ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

అంతకుముందు ఈ ముగ్గురు కలిసి ఒకే వాహనంపై రోడ్ షో చేస్తూ సభ వద్దకు చేరుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఏయూ ప్రాంగణం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పూడిమడకలో శంకుస్థాపన చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వల్ల ఉపాధి అవకాశాలతో పాటు పర్యావరణానికి ఎంతో ఉపయోగకరమని మోదీ అన్నారు

ఇప్పుడు అవకాశం లభించింది: మోదీ

ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు చెబుతున్నానని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ, ఏపీపై అభిమానం చూపే అవకాశం ఇప్పుడు లభించిందన్నారు.

"ఏపీ అభివృద్ధి మా విజన్, ఏపీ ప్రజల సేవే మా సంకల్పం. ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం" అని మోదీ సభలో చెప్పారు.

చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు అండగా ఉంటామన్నారు. ఐటీ, సాంకేతికతకు ఏపీ కేంద్రంగా మారిందని, ఇక్కడి ప్రజలు సృజనాత్మకత కలిగిన వారని ప్రధాని మోదీ ప్రశంసించారు.

పూడిమడకలో శంకుస్థాపన చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వల్ల ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు పర్యావరణానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరమని అన్నారు.

'2047 నాటికి 2.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఏపీ వికాసానికి తోడ్పడతాయి' అని ప్రధాని మోదీ ప్రకటించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశామని అన్నారు. దీంతో పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని’ చెప్పారు.

"ఆంధ్రప్రదేశ్‌లో 7 వందే భారత్‌ రైళ్లు కొనసాగుతున్నాయి. అమృత్‌ భారత్‌ కింద ఏపీలోని 70కి పైగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేపట్టాం" అని ప్రధాని మోదీ వివరించారు.

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మోదీ

ఫొటో సోర్స్, UGC

ఇంకా ఏ పనులకు శంకుస్థాపన చేశారంటే..

విశాఖ రైల్వేజోన్ కార్యాలయంతో పాటు రూ. 1.85 లక్షల కోట్లతో పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌, నక్కపల్లిలో బల్క్‌పార్క్‌, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి ప్రధాని శంకుస్థాపన చేశారు.

కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీనగర్ లైన్ల డబ్లింగ్ పనులు, గుత్తి-పెండేకల్లు రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో 17 రోడ్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్‌ను జాతికి అంకితం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు.

ఇన్ని లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన రోజును తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు.విశాఖపట్నం వాసుల చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్ పనులు ఈ రోజు ప్రారంభమయ్యాయని చెప్పారు.నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, క్రిష్ సిటీ నిర్మాణం, ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, మూడు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం ఇవన్నీ ఈ రోజు జరిగాయి. ఇలాంటి రోజు నా జీవితంలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తొలిసారి" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ మోదీ సర్కార్‌ నిధులు ఇవ్వడంతోనే మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు వేయగలుగుతున్నాం అని తెలిపారు. రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లతో 7 లక్షల మందికి ఉపాధి కలిగే ప్రాజెక్టులకు శంకుస్థాపనచేసినందుకు మోదీ సంకల్పం, సహకారానికి కృతజ్ఞతలు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజా సంఘాలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి.

స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

మోదీ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అందోళన చేపట్టారు. వామపక్షాలు, ప్రజా సంఘాలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా నిరసన కార్యక్రమాలకు దిగాయి. అయితే, వారిని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

''విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా ఆపి, ఐరన్ గనులను కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని నమ్మవచ్చు, కానీ అలాంటిదేమీ కనిపించడం లేదు." అని స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకుడు రామచంద్రబాబు బీబీసీతో అన్నారు.

ఇక ఏపీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్న మోదీ వ్యాఖ్యలపై పొలిటికల్ ఎనలిస్ట్ ఎం. యుగంధర్‌రెడ్డి బీబీసీతో మాట్లాడారు.

"ఇప్పుడు ఏపీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది అని ప్రధాని అనడం వెనుక ఉద్దేశం...తాము కూడా భాగస్వామి గా ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉందనే భావించి అని ఉండవచ్చు. అయితే బల్క్ డ్రగ్ ప్రాజెక్టు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం మంచి పరిణామం. ఇంకా రైల్వే జోన్ కి ప్రధాని శంకుస్థాపన చేశారు కాబట్టి ఆ పనులు ఊపందుకుంటాయి. కాకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఏదైనా ప్రకటన చేస్తే బాగుండేది" అని పొలిటికల్ ఎనలిస్ట్ ఎం. యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)