పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ బాధలు, కాలుష్యం సమస్యల్ని తొలగిస్తుందా?

ఎన్టీపీసీ టవర్లు
ఫొటో క్యాప్షన్, ఎన్టీపీసీ టవర్లు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది.

మనదేశంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2021లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి ఏడాదికి అయిదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం.

పూడిమడకలోని 1200 ఎకరాల్లో రాబోతున్న ఈ ప్రాజెక్టు గ్రీన్ ఎనర్జీ పవర్‌హౌస్‌ అవుతుందని, ఈ ప్రాజెక్టుతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా భారత్ మారుతుందని కేంద్రం చెబుతోంది.

రూ.1,85,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగనుంది. రోజుకి 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? దీన్ని ఎలా తయారు చేస్తారు? దీని వల్ల ప్రయోజనాలేంటి? గ్రీన్ హైడ్రోజన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గ్రీన్ హైడ్రోజన్

ఫొటో సోర్స్, HindustanShipYard

ఫొటో క్యాప్షన్, హైడ్రోజన్ గ్యాస్ ఫ్యూయల్ సెల్స్

గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి?

కర్బన రహిత లేదా శిలాజ ఇంధనాలకు బదులుగా వాడే ఇంధనమే గ్రీన్ హైడ్రోజన్. భారతదేశాన్ని గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చేందుకు రూ. 22 వేల కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను 2021లో కేంద్రం ఆమోదించింది.

2030 నాటికి కనీసం అయిదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసి దేశీయ అవసరాలను, దానిని 10 మిలియన్ టన్నులకు పెంచి ఎగుమతులు కూడా చేయాలని కేంద్రం భావిస్తోంది. 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడం ఈ మిషన్ లక్ష్యం.

విండ్ లేదా సోలార్ పవర్ వంటి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చెయ్యవచ్చు. నీటి ద్వారా విద్యుత్‌ను పంపినప్పుడు జరిగే విద్యుద్విశ్లేషణ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది.

ఈ హైడ్రోజన్‌ను తయారు చేయడానికి ఉపయోగించే విద్యుత్తు కూడా పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా కాలుష్య రహితం. అందుకే దీనిని గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు.

 ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు

గ్రీన్ హైడ్రోజన్ ప్రయోజనాలు

2030 నాటికి దేశ వ్యాప్తంగా ఉన్న ఇంధన అవసరాలను తీర్చే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ద్వారా రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని ఏయూ రసాయన విభాగం ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

  • గ్రీన్ హైడ్రోజన్, నీటి నుంచే తయారవుతుంది
  • ఇది ఉత్పత్తి చేసే వ్యర్థం కూడా నీరే. కాబట్టి ఇది కర్బన రహితం
  • సముద్రపు నీటి నుంచి కూడా దీన్ని తయారు చేయవచ్చు
  • గ్రీన్ హైడ్రోజన్‌ను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు
  • గ్రీన్ హైడ్రోజన్‌ను వాహనాలకు ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు

అంతే కాకుండా రూ. లక్ష కోట్ల విలువయ్యే చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని, 50 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను అదుపు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆయన తెలిపారు.

"పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్ నుంచి ఎలక్ట్రోలైజర్, ఫ్యూయల్ సెల్ తయారీ జరుగుతుంది. అంతే కాకుండా అనుబంధ పరిశ్రమలు, ఇంక్యుబేషన్, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటవుతాయి. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటివి కూడా ఉత్పత్తి అవుతాయి.

ఇవన్ని కూడా ఎగుమతులను ప్రొత్సహించి, విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచుతాయి. అయితే గ్రీన్ హైడ్రోజన్ ఈ స్థాయిలో ఉత్పత్తి జరిగి, అది సామాన్యులకు అందుబాటులోకి రావాలంటే మరో 10 నుంచి 15 ఏళ్ల సమయం పట్టే అవకాశముంది.'' అని ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

గ్రీన్ హైడ్రోజన్

గ్రీన్ హైడ్రోజన్ అందుబాటులోకి వస్తే

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చాలా వరకు కాలుష్యం తగ్గిపోతుందని ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత...

"మన ఇంట్లోనే ఒక ఎలక్ట్రోలైజర్ ఉంటుంది. ఒక స్ట్రీట్ లైట్‌కి సోలార్ ప్యానల్ పెట్టి ఎలాగైతే విద్యుత్ అవసరం లేకుండా నిరంతరం వెలుగులు పొందుతున్నామో, అలాగే ఎలక్ట్రోలైజర్‌కి కూడా పైన చిన్న సోలార్ ప్యానల్ పెడతాం. దానికి శక్తి అందుతుంటుంది. ఎలక్ట్రోలైజరులో హైడ్రోజన్ తయారవుతూ ఉంటుంది. ఆ ప్రక్రియలో హైడ్రోజన్ కాలుతూ శక్తిని ఇస్తుంటుంది. ఆ శక్తే మన ఇంటి అవసరాలకు కావాల్సిన విద్యుత్‌గా మారుతుంది.

మనం వాడుతున్న ల్యాప్‌టాప్, సెల్ ఫోన్లకి కూడా బ్యాటరీలకు బదులుగా చిన్న హైడ్రోజన్ సిలిండర్ వస్తుంది. దాని నుంచే చార్జింగ్ జరుగుతుంది. అలాగే అన్నీ ఇతర విద్యుత్ అవసరాలకు కూడా కాలుష్య రహితమైన హైడ్రోజన్ సెల్స్‌ను వాడుకోవచ్చు. హైడ్రోజన్ చార్జీబుల్ బ్యాటరీస్ కూడా ఉంటాయి. చార్జీంగ్ అయిపోగానే మరొకటి మార్చుకోవచ్చు. ఇంట్లో డొమెస్టిక్ సిలిండర్లు ఎలా వాడతామో అలా అన్నమాట" అని ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు వివరించారు.

ఇప్పటికే విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ముందడుగు వేసింది. కొరియన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అసోసియేట్, భారతీయ పరిశ్రమ భాగస్వామి లోటస్ వైర్లెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సముద్రంలో ఉపయోగించే పరికరాలకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు షిప్‌యార్డ్ తెలిపింది.

సముద్రపు పరికరాలకు వాటి అవసరాలకు సరిపడా ఈ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను తాము అందిస్తామని హిందుస్థాన్ షిప్ యార్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

గ్రీన్ హైడ్రోజన్

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది?

నీరు, గాలి, సూర్యుడి నుంచి కర్బన రహిత విద్యుత్తును పొందవచ్చు. సాధారణంగా పునరుత్పాదక విద్యుత్తుకు జల విద్యుత్ ప్రాథమిక వనరు. రెండవ స్థానంలో పవన శక్తి ఉంది, సౌర విద్యుత్తు మూడో స్థానంలో నిలిచింది. ఈ పునరుత్పాదక వనరుల ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు.

నీటి అణువు (H2O)లో హైడ్రోజన్ (H), ఆక్సిజన్ (O) ఉంటాయి. ఎలక్ట్రోలసిస్ లేదా నీటి విద్యుద్విశ్లేషణ అనే ప్రక్రియలో నీటి అణువులో ఉండే హైడ్రోజన్, ఆక్సిజన్‌లను వేరు చేస్తారు. ఈ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంలో అవసరమయ్యే శక్తి వనరు(విద్యుత్ వంటివి)లను పొందేందుకు కాలుష్య కారకమయ్యే (బొగ్గు, కర్రలు వంటివి) వనరులను వినియోగించకుండా నీరు, గాలి, సూర్యుడు ద్వారా లభించే వనరులను వాడినట్లైయితే...ఈ పద్దతి ఉత్పత్తయ్యే హైడ్రోజన్ ను గ్రీన్ హైడ్రోజన్ అంటారు.

"ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక ప్రకారం, హైడ్రోజన్ ఇన్‌స్టాలేషన్‌ల ఖర్చు రానున్న రోజుల్లో 40% నుంచి 80% వరకు తగ్గుతుంది. ఇది గ్రీన్ హైడ్రోజన్‌ను 2030 నుంచి లాభదాయకంగా మారుస్తుంది" అని విశాఖలోని ఒక ఎన్విరాన్‌మెంటల్ టెస్టింగ్ ల్యాబ్‌లో పని చేస్తున్న బి. రవిప్రసాద్ బీబీసీతో అన్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర రావు

గ్రీన్ హైడ్రోజన్ ధర ఎంత?

గ్రీన్ హైడ్రోజన్ వల్ల వాతావరణం వేడెక్కదు. కానీ, ఇది ప్రస్తుతం ఖరీదైన వ్యవహారమే. పెట్రోల్, డీజీల్‌తో పోల్చితే గ్రీన్ హైడ్రోజన్‌ను పొందే స్థోమత అందరికి ఉండకపోవచ్చు. అందుకే శాస్త్రవేత్తలు దీనిని పైలట్ ప్రాజెక్ట్ నుంచి దశ నుంచి మేజర్ ప్రాజెక్ట్‌గా తయారు చేసి దానిలో ప్రైవేట్ ప్లేయర్స్ పోటీ పడేలా కృషి చేస్తే మరో పదేళ్లలో గ్రీన్ హైడ్రోజన్‌నే ఇంధన వినియోగంలో రారాజుగా భావించవచ్చని ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు చెప్పారు.

ఒక లీటరు నీటి నుంచి 200 గ్రాముల హైడ్రోజన్ తయారు చేయవచ్చు. ఈ 200 గ్రాముల హైడ్రోజన్ నుంచి 2 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చునని ఒక ప్రాథమిక అంచనా.

అయితే ఇవన్ని అక్కడున్న వాతావరణం, తయారీ విధానం, అనుసరించే పద్దతులపై ఆధారపడి ఉంటాయని ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు వివరించారు.

"ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల్లో విరివిగా ఉపయోగించే లిథియం బ్యాటరీలు పెద్ద ఎత్తున విద్యుత్తును నిల్వ చేయలేవు. కానీ, గ్రీన్ హైడ్రోజన్ సిలిండర్లు చాలా ఎక్కువ పరిమాణంలో నిల్వ చేయగలవు. అందుకే దూరం ప్రయాణించే ట్రక్కులు, బ్యాటరీతో నడిచే కార్లు, పెద్ద పెద్ద సరుకు రవాణా నౌకలు, రైళ్లకు అద్భుతమైన శక్తి వనరుగా ఇది ఉపయోగపడుతుంది. అయితే భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చౌకగా ఉన్నప్పుడే దాని వినియోగం పెరుగుతుంది" అని ప్రొఫెసర్ జి. నాగేశ్వరావు చెప్పారు.

ప్రస్తుతం, గ్రీన్ హైడ్రోజన్‌తో తయారు చేసిన ఉక్కు ఖర్చు, సంప్రదాయ ఇంధనంతో తయారు చేసిన ఉక్కు కంటే 50 నుంచి 127 శాతం ఎక్కువ అవుతుంది.

ప్రస్తుతం భారతదేశంలో హైడ్రోజన్ ధర కిలో రూ.340 నుంచి రూ.400 వరకు ఉంది. పరిశ్రమలో గ్రీన్ హైడ్రోజన్ వినియోగం పెరుగుతుంటే దాని ధర కిలో రూ. 150కి చేరుతుంది.

గ్రీన్ హైడ్రోజన్

ఎన్టీపీసీ ఏం చేస్తుంది?

అనకాపల్లి జిల్లా పూడిమడకలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఎన్టీపీసీ చెప్పింది. ఎన్టీపీసీ సింహాద్రి చెప్పిన వివరాల ప్రకారం, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేది ఎన్టీపీసీ అనుబంధ సంస్థ.

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది పని చేస్తోంది. అనకాపల్లి జిల్లాలోని పూడిమడక వద్ద సముద్రపు నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.

సముద్రపు నీటి ప్రాసెసింగ్ కోసం, ఎన్టీపీసీ (థర్మల్ పవర్ ప్లాంట్) తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది. డీశాలినేషన్ అనగా నీటిలోని ఖనిజ లవణాలను తొలగించడం. సముద్రపు నీటిని తక్కువ ఖర్చుతో హైడ్రోజన్-గ్రేడ్ వాటర్‌గా మారుస్తుంది.

గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి మన దేశంలో శుద్ధి చేసిన నీటి కొరత ఉన్నందున సముద్రపు నీరు, మురుగు నీటిని కూడా ఉపయోగించి వాటి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)