'బిగ్ ఫుట్' కోసం వెతుకుతూ వెళ్లి దట్టమైన అడవిలో ఇద్దరు మృతి

ఫొటో సోర్స్, Skamania County Sheriff's Office
- రచయిత, మేక్స్ మట్జా
- హోదా, బీబీసీ న్యూస్
బిగ్‌ఫుట్, సాస్‌క్వాచ్ అని పిలిచే 'భారీ జంతువు'ను వెతుకుతూ వెళ్లిన ఇద్దరు శవమై కనిపించారు.
ఈ మేరకు అమెరికాలోని వాషింగ్టన్ పోలీస్ అధికారులు ధ్రువీకరించారు.
సాస్‌క్వాచ్ అనే భారీ జంతువు అడవిలో తిరుగుతుంటుందని అమెరికా జానపద కథల్లో, స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో చెప్తుంటారు. దీన్నే బిగ్ ఫుట్ అని కూడా వ్యవహరిస్తుంటారు.
ఆరెగన్‌లోని పోర్ట్‌లాండ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు క్రిస్మస్ సమయంలో అడవిలోకి వెళ్లారు.
సాస్‌క్వాచ్ ఉందని చెప్పడానికి ఆధారాలు వెతికేందుకు గిఫార్డ్ పిన్‌చాట్ నేషనల్ ఫారెస్ట్‌కు వెళ్లిన తమవాళ్లు తిరిగి రాలేదని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అడవిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
ఎముకలు గడ్డకట్టే చలిలో, దట్టమైన ఆ అడవిలో తప్పిపోయిన ఇద్దరి కోసం విమానాలు, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, డ్రోన్లు, జాగిలాలతో పోలీసులు వెతికారు. సుమారు 60 మంది వాలంటీర్లు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
మూడు రోజుల సెర్చ్ ఆపరేషన్ తరువాత అడవిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి.

సరైన ఏర్పాట్లు చేసుకోకుండా వెళ్లడంతో విపరీతమైన చలికి గురికావడంతో చనిపోయినట్లుగా ఉందంటూ స్థానిక స్కమానియా కౌంటీ షరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
విల్లార్డ్ ప్రాంతానికి సమీపంలో మృతులు ఉపయోగించిన కారును గుర్తించారు.
కాగా చనిపోయిన ఇద్దరిలో ఒకరి వయసు 59 కాగా, రెండో వ్యక్తి వయసు 37 అని చెప్పిన అధికారులు వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు.
గిఫార్డ్ పిన్‌చాట్ నేషనల్ ఫారెస్ట్ ఉన్న పర్వత ప్రాంతమంతా బాగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
ఇక్కడ చెట్లు పడిపోయి ఉండడం, నదుల్లో నీరు ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలు చాలా కష్టమయ్యాయని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ సాస్‌క్వాచ్
ఒళ్లంతా దట్టమైన జుత్తుతో రెండు కాళ్లపై నడుస్తూ అడవిలో తిరిగే జంతువుగా జానపద గాథల్లో దీన్ని వర్ణిస్తుంటారు.
అమెరికాలో 'లాచ్ నెస్ మాన్‌స్టర్' అనే కాల్పనిక జీవిలాగే ఈ సాస్‌క్వాచ్ కూడా ప్రపంచంలో చాలా ఫేమస్ క్రిప్టిడ్ (ఉనికిలో ఉందని చెప్తారు కానీ అందుకు స్పష్టమైన ఆధారాలు లేని జీవి). సాస్‌క్వాచ్ ఉనికి వివాదాస్పదం. ఇలాంటి ఒక భారీ జీవిని చూశామని చెప్పేవారు ఉన్నారు కానీ, సైన్స్ పరంగా అలాంటి జీవి లేదంటారు శాస్త్రవేత్తలు.
అయితే, ఉందనడానికి ఆధారాలు లేని ఈ జీవిని రక్షణకు అంటూ స్థానికంగా కొన్ని కమ్యూనిటీస్ చర్యలు చేపడుతుంటాయి.
తాజాగా ఇద్దరు మరణించిన స్కమానియా కౌంటీలో 'సాస్‌క్వాచ్'కు 'హాని' తలపెడితే ఏడాది శిక్ష కానీ, వెయ్యి డాలర్ల జరిమానా కానీ విధించేలా నిబంధనలున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














