అడవి దున్నల పుర్రెల కొండ వెనక ఒక జాతిని తరిమేసే దారుణమైన కుట్ర కథ

జంతువుల పుర్రెల పర్వతం

ఫొటో సోర్స్, Detroit Public Library

ఫొటో క్యాప్షన్, అడవి దున్నల పుర్రెలతో ఏర్పడిన పర్వతం
    • రచయిత, లూసీ షెరిఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అడవి దున్నల పుర్రెలను పేర్చగా ఏర్పడిన ఓ పర్వతంపై ఇద్దరు వ్యక్తులు నిల్చున్న ఫోటో అమెరికా వలసవాద కాలం నాటి వేటకు చిహ్నంగా ప్రసిద్ధి పొందింది. కానీ ఆ ఫోటో వెనుక దారుణమైన కథ ఉంది.

నల్లటి సూట్‌, బౌలర్ టోపీ ధరించి ఇద్దరు వ్యక్తులు ఈ పుర్రెల కొండమీద నిలబడి ఫోటోకు పోజులిచ్చారు. ఒకదానిపై ఒకటి చక్కని వరుసల్లో పేర్చిన వేలాదిపుర్రెలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తాయి.

19వ శతాబ్దానికి చెందిన ఈ ఫోటో జంతు ప్రేమికులను కలిచివేసేలా ఉంటుంది. ఈ భయంకరమైన ఫోటో వెనుక ఇప్పటికీ ఓ చీకటి రహస్యం దాగి ఉంది.

ఈ పుర్రెలు అమెరికాలో అత్యుత్సాహంతో సాగించిన వేట తాలూకు అవశేషాలు కావు. వాటి మీద నిల్చున్న ఇద్దరు వ్యక్తులు కూడా వేటగాళ్లు కాదు.

స్థానిక ఇండియన్లను ( అమెరికా మూలవాసులను) అక్కడి నుంచి పంపేసి, ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి, వారికి ప్రధాన ఆహార వనరైన అడవి దున్నలను ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేసి, వారు బలవంతంగా అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితులు కల్పించే ప్రయత్నాలకు ఈ పుర్రెలు ఒక నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''విధ్వంసాన్ని వలసవాదులు ఎలా వేడుకగా చేసుకుంటారనేది చూపడానికి ఈ ఫోటో ఒక ఉదాహరణ'' అని కెనడాలోని ఆల్బెర్టా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ నేటివ్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ తాషా హుబ్బర్డ్ అన్నారు.

అడవి దున్నల నిర్మూలన అనేది వలస రాజ్యాల విస్తరణలో ఒక వ్యూహాత్మక భాగమని హుబ్బర్డ్ వివరించారు. పశ్చిమ దేశాలను మచ్చిక చేసుకోవడానికి, నివాసయోగ్యమైన ప్రదేశంగా ఈ అటవీ ప్రాంతాన్ని మార్చుకోవడంలో ఈ జంతువుల నిర్మూలనను ఒక భాగంగా వారుచూశారు.

వలసవాదులు పాల్పడిన ఈ అడవిదున్నల సామూహిక వధ, జీవనోపాధి కోసం జంతువులపై ఆధారపడిన తెగలను శాశ్వతంగా దెబ్బ తీసింది. అడవిదున్నలపై ఆధారపడకుండా మనుగడ సాగించే ఇతర దేశాలతో పోలిస్తే, వీటిపై ఆధారపడి జీవించే దేశాలు చాలా అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఆ ప్రభావాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని వీటిపై నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపింది.

పుర్రెలు

ఫొటో సోర్స్, Detroit Public Library

స్థానిక అమెరికన్ ఇండియన్లు వందల ఏళ్లుగా ఈ అడవి దున్నలను వేటాడారు. వారి సంచార సంస్కృతిలో వేట ఒక భాగం. వేటతో వారు జీవనోపాధి పొందేవారు. ఈ జంతువుల మాంసాన్ని ఆహారంగా, చర్మాన్ని దుస్తులుగా, ఎముకలను ఆయుధాలుగా ఉపయోగించుకునేవారు.

ఉత్తర అమెరికా వ్యాప్తంగా స్థానికులంతా ఈ జంతువులపైనే ఆధారపడ్డారని హుబ్బర్డ్ చెప్పారు.

''ఈ జంతువులను నిర్మూలించడం అంటే స్థానిక జాతి ప్రజలకు ఆహార కొరత సృష్టించడం. వారిపై ఆకలిని ఆయుధంగా ప్రయోగించడం. వారి భూభాగాల నుంచి వారిని తొలగించేందుకు, వారిని బలహీనపరిచి, వారి ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు పన్నిన ప్రణాళిక'' అని హుబ్బర్డ్ అభిప్రాయపడ్డారు.

స్థానిక అమెరికన్లకు అడవిదున్నలతో ఇంత ప్రయోజనం ఉన్నప్పటికీ వారు సంవత్సరానికి లక్షలోపే జంతువులను వేటాడేవారని అంచనా. ఈ కారణంగా 1800లలో 3-6 కోట్ల మధ్య ఉన్న దున్నల జనాభాకు స్థానికుల వేట వల్ల పెద్దగా ముప్పు వాటిల్లలేదు.

కానీ, 1889 జనవరి 1 నాటికి అమెరికాలో స్వచ్ఛమైన జాతి అడవి దున్నలు 456 మాత్రమే మిగిలాయి. వీటిలోని 256 అడవి దున్నలను యెల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో సంరక్షిస్తున్నారు. మరికొన్ని ఇతర అభయారణ్యాలలో ఉన్నాయి.

అడవి దున్నలు

అడవిదున్నల సామూహిక వధకు చాలా కారణాలున్నాయి. ఈ జంతువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల గుండా మూడు రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టడం ఒక కారణం కాగా, దీని కారణంగా వీటి మాంసం, చర్మానికి కొత్త డిమాండ్ ఏర్పడింది.

ఆధునాతన రైఫిళ్లు రావడంతో వీటిని చంపడం చాలా సులభమైంది. వేటకు కళ్లెం వేసే భద్రతా చర్యలు లేకపోవడం కూడా ఒక కారణం. అడవి దున్నల ఆధారిత ఉత్పత్తులకు ఏర్పడిన డిమాండ్ మాత్రమే కాకుండా వీటిని అంతం చేయడం వెనుక మరో క్రూరమైన, లక్షిత కారణం కూడా ఉంది.

''సంపద పట్ల కోరిక, భూయాజమాన్యం రూపంలో అధికారాన్ని కోరుకోవడం, బానిసత్వం, అంతులేని లాభాలు వృద్ధి కోసం పాకులాట, సహజ వనరులను స్వప్రయోజనాల కోసం వాడుకోవడం వంటి కారణాలతో అడవిదున్నలను విపరీతంగా వేటాడారు. స్థానికులపై భౌతిక, రాజకీయ దాడులకు పాల్పడ్డారు. 500 ఏళ్ల పాటు ఈ రకంగా ప్రవర్తించారు'' అని మిషిగన్ యూనివర్సిటీ నేటివ్ అమెరికన్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బెథానీ హ్యూస్ వివరించారు.

వేలాది అడవిదున్నల పుర్రెల ఫోటోను మిషిగన్ కార్బన్ వర్క్స్ సంస్థ దగ్గర తీశారు. ఇది ఎముకలను ప్రాసెస్ చేసే ఒక రీఫైనరీ సంస్థ. ఇక్కడ అడవిదున్నల ఎముకలను చక్కెర పరిశ్రమలో చక్కెరను శుద్ధి చేయడానికి ఉపయోగింగే బొగ్గుగా మార్చేవారు. వీటి ఎముకలను గమ్ కోసం, ఎరువుగానూ వాడేవారు.

''అమెరికా పశ్చిమ విస్తరణలో భాగంగా ఏర్పడిన వ్యర్థాల నుంచి పుట్టిన ఒక విజయవంతమైన వ్యాపారానికి ఈ ఫోటో ఒక చిహ్నంగా ఉంది'' అని హ్యూస్ వర్ణించారు.

మిలిటరీ వ్యూహాత్మక చర్యల్లో ఈ అడవి దున్నలను చంపడం ఒక భాగం.

అడవి దున్నల పుర్రెలు
ఫొటో క్యాప్షన్, అడవి దున్న

స్థానిక అమెరికన్ల వనరులను నాశనం చేసేందుకు అడవిదున్నలను చంపడాన్ని ఒక మార్గంగా భావించి, పశ్చిమ దేశాల ఆర్మీ అధికారులు ఈ పని చేయడం కోసం సైనికులను పంపించినట్లు చరిత్రకారుడు రాబర్ట్ వూస్టర్ రాసిన 'ద మిలిటరీ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ పాలసీ' అని పుస్తకంలో పేర్కొన్నారు.

అమెరికన్ ఇండియన్లు తమ సంచార సంస్కృతిని మార్చుకునేలా ఒత్తిడి తీసుకురావడానికి అడవి గేదెలను నిర్మూలించడం ఒక మంచి మార్గమని జనరల్ ఫిలిప్ షెరిడాన్ అనే ఆర్మీ అధికారి భావించినట్లు ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అడవిదున్నలు, గేదెలు వేర్వేరు అయినప్పటికీ ఆంగ్లేయులు అప్పట్లో వీటిని గేదెలు అనే సంబోధించేవారు.

''మీకు సాధ్యమైనంతవరకు ప్రతీ గేదెను చంపేయండి. ఒక గేదె చనిపోయిందంటే ఒక ఇండియన్ వెళ్లిపోయినట్లే లెక్క'' అని ఒక హంటర్‌తో మరో ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ డాడ్జ్ అన్నారు.

స్థానిక అమెరికన్ ఇండియన్ తెగల వారికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు.

''గేదెలను నిర్మూలించడం అంటే ఇండియన్లను అంతం చేయడమే' అని గ్రేట్ ప్లెయిన్స్‌లోని కియోవాస్ తెగ పెద్ద సటాంటా గుర్తించారు.

జంతువుల పుర్రెలు

స్థానిక అమెరికన్లకు అడవిదున్నలను అందుబాటులో లేకుండా చేయడం అంటే, వారి కోసం వెస్ట్రన్ ఆర్మీ ఏర్పాటు చేసిన కొత్త ఆహారపు అలవాట్లకు బలవంతంగా మారడమే.

ఆర్మీ వ్యూహాలు ఫలించాయి. ఓక్లహామాలోని కియోవా తెగ ప్రజలు కొత్త ప్రాంతంలోకి వెళ్లారు. దీంతో అప్పటి వరకు అడవిదున్నలను ప్రధాన ఆహారంగా తీసుకున్న స్థానిక అమెరికన్ల సగటు ఎత్తు ఒక తరంలోపే 2.5 సెం.మీకు పైగా తగ్గిపోయింది.

20వ శతాబ్దం మొదట్లో శిశు మరణాల రేటు 16 శాతం పెరిగింది. అడవిదున్నలపై ఆధారపడని దేశాలతో పోలిస్తే వాటిపై ఆధారపడే దేశాల తలసరి ఆదాయం 25 శాతం తక్కువగా ఉంది.

ఈ జంతువుల మరణాలపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. 3 నుంచి 6 కోట్లు ఉన్న జంతువులను వేటగాళ్లు ఎలా చంపగలరు? అని 2018 నాటి ఒక అధ్యయనంలో ప్రశ్నించారు. ఈ మరణాలకు మహమ్మారి ఒక కారణం కావొచ్చని ఆ అధ్యయనంలో సూచించారు. ఆ సమయంలో వచ్చిన ఆంత్రాక్స్, టెక్సాస్ టిక్ ఫీవర్ అనే రెండు వ్యాధులు లక్షలాది జంతువుల మరణాలకు కారణం అయ్యే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)