రాయచోటి: విద్యార్థులు కొడితే ఆ టీచర్ చనిపోయారా? అసలేం జరిగింది? పోలీసులు ఏం చెప్పారు?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు చనిపోవడం కలకలం సృష్టించింది.
ఆ స్కూల్లో అసలు ఏం జరిగింది? ఈ ఘటన గురించి ఎవరు ఏం చెబుతున్నారు? అన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. రాయచోటిలోని ఆ స్కూల్‌కు వెళ్లింది.
రాయచోటిలోని కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇది రాయచోటి బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ.
సుండుపల్లి రోడ్డు నుంచి ఇరుకైన దారిలో వెళ్తే జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల వస్తుంది. మూడు అంతస్తుల స్కూల్ భవనం అది.
ఈ స్కూల్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉంది.


అసలేం జరిగిందంటే...
బుధవారం (డిసెంబర్ 4) మధ్యాహ్నం 3.10కు ఏజాష్ అహ్మద్ తన క్లాస్‌కు ఎదురుగా ఉన్న మరో క్లాస్‌లో 9వ తరగతి విద్యార్థులు అల్లరి చేస్తుండటంతో, వారిని మందలించడానికి వెళ్లారని, ఆ గదిలో గొడవ జరిగిందని కొందరు విద్యార్థులు చెప్పారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షబ్బీర్ బాషా బీబీసీకి చెప్పారు.
తమ కళ్ల ముందే ఏజాష్ అహ్మద్ గుండెనొప్పితో కుప్పకూలిపోయారని ఆయన తెలిపారు.
''గొడవ జరిగిన తర్వాత విద్యార్థులపై సైన్స్ టీచర్ (ఏజాష్ అహ్మద్) నాకు ఫిర్యాదు చేశారు. తర్వాత మళ్లీ సార్ క్లాస్‌కు వెళ్లి పాఠాలు చెప్పారు. ఆ తర్వాత కాసేపయ్యాక మా దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ‘ఆ పిల్లలు నాపై తిరగబడ్డారు, వాళ్ల తల్లిదండ్రులను పిలిపించండి’ అన్నారు. తర్వాత ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి సార్‌కు క్షమాపణ చెప్పించాం. ఆ పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చాం. తర్వాత మధ్యాహ్నం 3.40 గంటలప్పుడు కుర్చీలో కూర్చున్న ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాం. మధ్యాహ్నం 3.10కి గొడవ జరిగితే, 3.40కి గుండెనొప్పి అని చెప్పారు. సార్ గుండె నొప్పి అంటే మేం టాబ్లెట్ ఇచ్చాం. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో ఆయన బాగానే శ్వాస తీసుకుంటున్నారు" అని హెడ్ మాస్టర్ షబ్బీర్ బాషా వివరించారు.
‘‘ఆ తర్వాత రోజు ఉదయం పిల్లల్ని అడిగితే పెద్ద అబ్బాయి సార్‌ను కొట్టారని చెప్పారు. వాళ్లు ఇద్దరు అన్నదమ్ములు. చిన్న అబ్బాయిని సార్ కొట్టాడు. వెంటనే ఆ అబ్బాయి అన్న వచ్చి సార్‌ని కొట్టాడని పిల్లలు నాకు చెప్పారు. ఆ గదిలో ఏం జరిగిందో నేనైతే చూడలేదు'' అని షబ్బీర్ బాషా బీబీసీతో చెప్పారు.

'నా భర్తను కొట్టి చంపేశారు'
మృతుడు ఏజాష్ అహ్మద్ భార్య రెహమూన్ మాత్రం ముగ్గురు విద్యార్థులు తన భర్తను కొట్టి చంపేశారని, మిగతా టీచర్లు ఎవరూ ఆయన్ను కాపాడటానికి ముందుకు రాలేదని ఆరోపించారు.
"మా ఆయన్ను ముగ్గురు తొమ్మిదో తరగతి పిల్లలు మధ్యాహ్నం 7వ పీరియడ్‌లో కొట్టి చంపేశారు. ఆయన ఒళ్లంతా గాయాలు చేసి, కొట్టి చంపేశారు. అక్కడ టీచర్లు, హెచ్ఎం అందరూ ఉన్నారు. ఎవరు కాపాడలేదంట. గమ్మున చూస్తూ ఉండిపోయారు అంట. వాళ్లు వెళ్తే తమను చంపేస్తారని టీచర్లు వెళ్లలేదంట. ఒక్కరు వెళ్లి కాపాడినా మా ఆయన బతికి ఉండేవారు" అని రెహమూన్ అన్నారు.
తన భర్తకు పిల్లలంటే ప్రాణమని, ఎవర్నీ ఒక్క మాట కూడా అనేవారు కాదని, ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదని మృతుడి భార్య చెప్పారు.
‘‘స్కూల్లో ఆయనకు మంచి పేరు వస్తుండటం చూసి ఓర్వలేక మిగతా టీచర్లు విద్యార్థులను తన భర్తపైకి ఉసిగొల్పారు’’ అంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే, ఆమె చేసిన ఆరోపణలపై స్పందించేందుకు మిగతా ఉపాధ్యాయులు ముందుకు రాలేదు.
అలాగే, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడేందుకు, బీబీసీ వారి ఇంటికి వెళ్లింది. కానీ మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడలేదు.
"ఆయనకు పిల్లలంటే ప్రాణం. ఇంట్లో కూడా ఎవరినీ ఒక మాట అనరు. అయిదు పూటల నమాజ్ చేస్తారు. చెడు అలవాట్లు లేవు. బీపీ, షుగర్ ఏమీ లేవు. అలాంటి మనిషిని చంపేసి, నా జీవితం నాశనం చేశారు. స్కూల్లో పిల్లలను క్రమశిక్షణలో పెడతారని హెడ్ మాస్టర్‌కు బదులు తల్లిదండ్రులందరూ మా ఆయనతో మాట్లాడతారు. ఇందులో హెడ్ మాస్టర్ హస్తం ఉంది. ఎవరేం చెప్పినా పిల్లల మనసు మారిపోతుంది. అలాంటి పిల్లలను ఎంచుకొని వీళ్లు ఇలా చేయించారు. అంతమంది టీచర్లు ఉండి కూడా ఇట్లా జరిగింది అంటే అది కావాలని చేయించినట్టే కదా" అని మృతుడి భార్య రెహమూన్ అన్నారు.
''మా ఆయన శరీరంపైన దెబ్బలు ఉన్నాయి. కడియం వేసుకొని కొట్టినట్లు అచ్చుపడి ఉంది. నా భర్తకు ఎటువంటి జబ్బూ లేదు, హార్ట్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? మాకు పిల్లలు లేకపోతే నా భర్త నాకు బిడ్డ. హెచ్‌ఎంను, మిగతా టీచర్లను డిస్మిస్ చేయాలి. వాళ్లు ఉపాధ్యాయులుగా పనికిరారు. ఒక టీచర్ని చంపుతుంటే మిగిలిన టీచర్లు సినిమా చూసినట్టు చూశారు. బాల నేరస్థులను తయారు చేస్తున్నారు. హెచ్ఎం నిజం చెప్పడం లేదు. ఒక్క టీచర్ కూడా మా ఇంటికి రాలేదు" అని రెహమూన్ చెప్పారు.

పోలీసులు ఏం చెబుతున్నారు?
ఛాతీలో నొప్పి ఉందని ఏజాష్ అహ్మద్ చెప్పడంతో ఆయన్ను తోటి ఉపాధ్యాయులు ఆస్పత్రికి తీసుకెళ్లారని, ఆ తర్వాత ఆయన చనిపోయారని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ బీబీసీకి చెప్పారు.
"ఆయన్ను తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆయన్ను బతికించడానికి చాలా ప్రయత్నించారు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి డాక్టర్ మరో ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఏజాష్ అహ్మద్ చనిపోయారు. మీడియాలో వస్తున్నట్లు స్కూల్లో విద్యార్థులు కొట్టి చంపారనేది అవాస్తవం" అని డీఎస్పీ తెలిపారు.
అయితే, మృతుడి భార్య ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తులో అసలు నిజాలు బయటికి వస్తాయని డీఎస్పీ చెప్పారు.
''మృతి చెందిన టీచర్ భార్య మాకు ఫిర్యాదు చేశారు. భర్త మృతిపై సందేహాలు వ్యక్తం చేశారు. స్కూల్లోనే విద్యార్థులు గొడవపడి ఆయన్ను కొట్టారని ఫిర్యాదు చేశారు. దీనిని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆ స్కూల్లో పనిచేసే టీచర్లు, మిగతా విద్యార్థులని విచారిస్తున్నాం. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపాం. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత ఏం జరిగిందో వాస్తవాలు తెలుస్తాయి" అని ఆయన అన్నారు.

తాము ఏజాష్ అహ్మద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు ఆయన బాగానే ఉన్నారని స్కూల్ ఉపాధ్యాయులు చెబుతుంటే, ఆయన్ను మొదట తీసుకెళ్లిన రాయచోటిలోని కేర్ ఆస్పత్రి వైద్యులు మాత్రం ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ఏజాష్ స్పృహలో లేరని తెలిపారు.
ఆయనకు సీపీఆర్ చేశామని, పరిస్థితి విషమంగా ఉండటంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేశామని కేర్ ఆస్పత్రి వైద్యులు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















