74 ఏళ్ల వయసులో గుడ్డు పెట్టిన పక్షి

ఫొటో సోర్స్, US Fish and Wildlife Service
- రచయిత, రాబర్ట్ గ్రీనాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్నదిగా భావిస్తున్న ఓ పక్షి గుడ్డు పెట్టింది. ఇది 74 ఏళ్ల వయసులో గుడ్డు పెట్టినట్లు అమెరికా జీవశాస్త్రవేత్తలు తెలిపారు.
విజ్డమ్ అని శాస్త్రవేత్తలు పేరుపెట్టిన లేసాన్ అల్బట్రాస్ (సముద్రాలపై ఎగిరే ఒక జాతి పక్షి) పసిఫిక్ మహా సముద్రంలోని ‘మిడ్ వే అటోల్ వైల్డ్ లైఫ్ రెఫ్యూజ్’లో గుడ్డు పెట్టింది.
ఈ గుడ్డును దాని ప్రస్తుత భాగస్వామి పరిశీలిస్తుండగా ‘యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్’(యూఎస్ఎఫ్‌డబ్ల్యూఎస్) సిబ్బంది ఫొటో తీశారు.
లేసన్ అల్బట్రాస్ జాతి పక్షులు సాధారణంగా 12 నుంచి 40 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి.
కానీ, విజ్డమ్ వయసు చాలా ఎక్కువ.
విజ్డమ్‌కు ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు గుర్తింపు కోసం 1956లో దాని కాలికి ఒక ట్యాగ్‌ను తగిలించారు. ఆ ట్యాగ్ నెంబర్ జెడ్ 333.
చివరిసారిగా విజ్డమ్ 2021లో గుడ్డు పెట్టి పొదిగింది. అది తన జీవితకాలంలో 30 కంటే ఎక్కువ పిల్లలను పొదిగినట్లు అంచనా.

యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ తాజాగా ‘ఎక్స్’లో పేర్కొన్న ప్రకారం విజ్డమ్ ఈ ఏడాది కొత్త భాగస్వామితో గడిపింది.
ఇంతకు ముందు భాగస్వామి ‘అకేకమై’ చాలా సంవత్సరాలుగా కనిపించడం లేదు.
ఈ జాతి పక్షులు సాధారణంగా జీవితమంతా ఒకే పక్షితో సహజీవనం చేస్తాయి.
కానీ, విజ్డమ్ ఇప్పటి వరకు మూడు కంటే ఎక్కువ మగ పక్షులతో సహజీవనం చేసిందని భావిస్తున్నారు.
సంతానం కోసం ఈ జాతి పక్షులు పసిఫిక్ మహాసముద్రంలో ‘మిడ్ వే అటోల్’కు వస్తుంటాయని, ఇక్కడికి వచ్చే దాదాపు 30 లక్షల లేసన్ అల్బట్రాస్‌లలో విజ్డమ్ ఒకటని ఈ రెఫ్యూజ్‌లో వైల్డ్‌లైఫ్ బయాలజిస్ట్‌గా పని చేస్తున్న జాన్ ప్లిస్‌నర్ బీబీసీ రేడియో4కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
విజ్డమ్ అంత వయసున్న పక్షులు ఇంకా ఏవైనా ఉన్నాయా లేదా అనేది తమకు తెలియదని.. విజ్డమ్ తరువాత తమకు తెలిసినంతవరకు అతి పెద్ద పక్షి వయసు 45 ఏళ్లని ప్లిస్‌నర్ తెలిపారు.
"ఇది నిజంగా గొప్ప విషయం. విజ్డమ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఆసక్తి కలిగించింది. అది ఏటా ఇక్కడికి వచ్చేవరకు మేం ఎదురు చూస్తుంటాం" అని ప్లిస్‌నర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విజ్డమ్‌కు మరో పిల్లను పెంచే శక్తి ఇంకా ఉన్నట్లు కనిపించిందని, గుడ్డు పొదిగి పిల్ల అయ్యే అవకాశం 70 నుంచి 80 శాతం వరకు ఉందని ప్లిస్‌నర్ అభిప్రాయపడ్డారు.
అల్బట్రాస్ పక్షులు తమ పిల్లలను పొదిగే పనిని మగ, ఆడ రెండూ పంచుకుంటాయి.
గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చాక, దానికి ఆహారం అందించే పనిని కూడా అవి షేర్ చేసుకుంటాయి.
1956లో గుడ్డు పెట్టిన తర్వాత విజ్డన్‌కు గుర్తింపు ట్యాగ్ ఇచ్చారు. లేసన్ అల్బట్రాస్ పక్షులు ఐదేళ్లలోగానే గుడ్లు పెడతాయన్న విషయం అప్పటికి తెలియదు.
మిడ్‌వే అటోల్ అనే పగడపు దిబ్బ హవాయి ద్వీప సమూహంలో భాగం.
ఇది అమెరికా రాష్ట్రమైన హవాయి పరిధిలోకి రాదు. అమెరికాకు చెందని భూభాగంగా దీనిని చెబుతారు.
ది వైల్డ్ లైఫ్ రెఫ్యూజ్‌కు అల్బట్రాస్ పక్షులకు ప్రపంచంలోనే అతి పెద్ద కాలనీగా పేరుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














