'చిరుతను చంపిన వీరుడు' అనే బిరుదు కోసం..

ఫొటో సోర్స్, Adaobi Tricia Nwaubani
- రచయిత, అడోబి ట్రిసియా ఎన్వబానీ
- హోదా, లెటర్ ఫ్రమ్ ఆఫ్రికా సిరీస్, ఒగుటా
60 ఏళ్ల వయసులో నైజీరియన్ వ్యాపారి, ఆరోగ్య రంగ నిపుణుడు కెన్ ఒకోరోఫర్ ‘చిరుతను చంపిన వీరుడు’ అనే బిరుదు పొందాలన్న తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నారు.
దీంతో ఆయన ఈశాన్య నైజీరియాలోని ఆయన స్వస్థలం ఒగుటాలో కేవలం పురుషులు మాత్రమే ఉండే ప్రఖ్యాత ఇగ్బూ సొసైటీలో ఆయనకు ప్రవేశం దొరికింది.
ఆ సందర్భంగా వారంతా సంబరాలు చేసుకున్నారు.
పురాతన కాలంలో నైజీరియా సమాజంలో చిరుతను చంపడమనేది కేవలం ధైర్యానికి మాత్రమే కాకుండా సామాజిక హోదాకు, ఆచారాల పరంగా సాధించిన ఘనతలకు చిహ్నంగా ఉండేది.
‘చిరుతను చంపిన వీరుడు’ని స్థానిక ఇగ్బో భాషలో "ఒగ్బువాగు" అని పిలిచేవారు.
ఈ గుర్తింపు పొందడానికి చిరుతను చంపిన వ్యక్తి తాను చంపిన ఆ చిరుతను స్థానిక రాజుకు బహుమతిగా ఇవ్వాలి. దాని మాంసం ఒగుటా చుట్టు పక్కల ఉన్న 25 గ్రామాల్లో పంచాలి.
కాలం గడిచేకొద్దీ, ఈ పద్ధతి మారింది. ఇప్పుడు అక్కడి ప్రజలెవరూ చిరుతలను వేటాడటం లేదు.
‘1955లో నా తండ్రి చిరుత పులిని వేటాడి ఈ టైటిల్ పొందారు.. అప్పుడు మా ఇంట్లో ఓ చిరుత మృత దేహం పడి ఉందని అమ్మ గుర్తు చేసుకున్నారు.
మా నాన్న చిరుతను చంపడం కోసం ఒక ప్రొఫెషనల్ వేటగాడు దాన్ని బంధించి తెచ్చాడు’ అని ఒకోరోఫర్ చెప్పారు.
‘చిరుత మాంసం రెండు సార్లు తిన్నాను.. కొంచెం ఉప్పుగా ఉంటుంది’ అని మా అమ్మ చెప్పారు అన్నారు ఒకోరోఫర్.
ఈ ప్రాంతంలో పులుల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకోవడంతో వేట ఆగిపోయింది.
ఇక్కడ 1987లో చివరిసారిగా చిరుతను వేటాడారు.
నైజీరియాలో ప్రస్తుతం చిరుతలు కేవలం నేషనల్ పార్క్‌లలో మాత్రమే కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Adaobi Tricia Nwaubani
‘ఇగ్బూ సమూహంలో చేరితే మీకు గౌరవం దక్కుతుంది. ఈ సమూహంలో చేరితేనే మీరు నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములు అవుతారు" అని ఒకోరోఫర్ చెప్పారు.
ఆయన కొన్ని దశాబ్దాల పాటు అమెరికాలో జీవించారు. ‘ఒగ్బువాగు’ కావడానికి మళ్లీ తన మూలాలు వెతుక్కుంటూ సొంత ప్రాంతానికి వచ్చారు.
"అవి నన్ను ఆకర్షించాయి. నేను బాలుడిగా ఉన్నప్పటి నుంచే ఈ సొసైటీలో చేరాలని అనుకునేవాడిని" అని ఆయన చెప్పారు.
సమూహంలో చేరేందుకు పులిని పట్టుకోవడానికి బదులుగా డబ్బులు ఇవ్వడం అనేది తొలిసారి 1942లో మొదలైంది.
ఎంబెర్కే ఒజిరికా అనే ఒకరు చిరుతను పట్టుకున్నారు, కానీ, అదే సమయంలో అతని తల్లి మరణించారు.
తల్లి మరణంతో ఒజిరికా దుఃఖంలో మునిగిపోయారు.. సంప్రదాయాన్ని కొనసాగించలేకపోయారు. తర్వాత కూడా ఆయన చిరుతను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఆయన కష్టాన్ని చూసిన బంధువులు, ఒగుటా సంప్రదాయ రాజు ఎగే ఇగ్వే.. చిరుతపులికి బదులుగా డబ్బు చెల్లించి ఆ సొసైటీలో చేరే వీలు కల్పించారు.
"అప్పటి నుంచి డబ్బులు చెల్లించి సొసైటీలో చేరడం ఒక ఆప్షన్‌గా మారింది" అని 52 ఏళ్ల విక్టర్ అనిచే చెప్పారు. ప్రస్తుతం ఆయన ఇగ్బూ సమూహానికి కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఒజిరికా మనవడు.

ఫొటో సోర్స్, Adaobi Tricia Nwaubani
"2012లో నేను ఆ సొసైటీలో చేరాలనుకున్నప్పుడు, ఉత్తర నైజీరియా నుంచి చిరుతను పంపిస్తామని చెప్పారు. వాళ్ల దగ్గర ఉన్న ఒక చిరుతను నాకు అమ్ముతామన్నారు. అయితే నేను అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న చిరుతను చంపడానికి అంగీకరించలేదు" అని అనిచే చెప్పారు. ఆయన మెకానికల్ ఇంజినీర్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివారు.
చిరుతను వేటాడాల్సిన అవసరం లేకున్నా ఇప్పటికీ సొసైటీలో చేరే ప్రక్రియ చాలా కఠినంగా ఉంది. అందులో మూడు దశలు ఉన్నాయి.
ఇగ్బూ సొసైటీలో ప్రస్తుతం 75 మంది సభ్యులు ఉన్నారు. ఒగుటా చాలా పాత పట్టణం. పురాతన బెనిన్ సామ్రాజ్యం నుంచి వందల ఏళ్ల క్రితం ఈ పట్టణానికి వచ్చిన వారు ఈ సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఇగ్బోలుగా వారిని వర్గీకరించినప్పటికీ ఒగుటా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నైజీరియాతో పాటు విదేశాల్లో ఉంటున్న వారితో కలిపి వీరి జనాభా 2 లక్షల వరకు ఉంటుందని అంచనా.
ఒగ్బువాగు కావాలని కోరుకునేవారు అనేక మంది క్రిస్మస్ సీజన్‌లో తమ వేడుకలు జరుపుకోవాలని భావిస్తారు. ఈ సమయంలో విదేశాల్లో ఉన్న వారు కూడా రావడంతో స్థానికంగా ఎక్కువమంది కనిపిస్తారు.
2024 డిసెంబర్ 21న నైజీరియా చమురు విభాగంలో పని చేస్తున్న జుబ్బీ నుడ్పు "ఒగ్బువాగు" అయ్యేందుకు తొలి దశలో భాగంగా "చిరుతను చంపిన వీరుడు"గా మారేందుకు వేటను తిరిగి ప్రారంభించారు.
ఆ రోజు ఉదయం 9 గంటలకు ఒగ్బువాగు నుడ్పు ఇంటి దగ్గర ఒగ్బువాగుల సమావేశం మొదలైంది.
ఒగ్బువాగు సభ్యులు తమ అధికారిక హోదా ప్రకారం వరుసలో కూర్చున్నారు.

ఫొటో సోర్స్, Adaobi Tricia Nwaubani
ఈ సమావేశాలకు మహిళలను అనుమతించరు.
మధ్యాహ్నం విందు ముగిసిన తర్వాత నుడ్పుఇంటి నుంచి ఊరేగింపు మొదలైంది.
చిరుతను వేటాడిన వారంతా ఇందులో వరుస క్రమంలో పాల్గొన్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం నుడ్పు ఊరేగింపు చివరలో ఉన్నారు.
వాళ్లంతా ఊరేగింపుగా స్థానిక రాజు ఇజే ఇగ్వే ప్యాలస్ చేరుకున్నారు. అక్కడ వారు చిరుతకు బదులుగా డబ్బు చెల్లించారు.
రెండో దశను "ఇగ అజి" అని పిలుస్తారు. ఇందులో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
చివరి దశను "ఇపు అఫియ అగు"అని పిలుస్తారు. ఇందులో ఒగ్బువాగు అయ్యే వ్యక్తి సభ్యత్వాన్ని ఆమోదించిన తర్వాత భారీ విందు చేసుకుంటారు.
ఈ వేడుక సభ్యుడయ్యే వ్యక్తి తల్లి ఇంటి నుంచి మొదలై సభ్యుడి ఇంటి వద్దకు చేరుకోవడంతో ముగుస్తుంది.
మూడో దశ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందులో మేకలు, గొర్రెల మాంసం, చేపలు, భారీగా మద్యం వినియోగిస్తారు.
వందల మంది అతిధులకు ఖరీదైన విందు ఇస్తారు.
ప్రస్తుతం ఇగ్బూ సొసైటీ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ సొసైటీ సభ్యుల్లో సగం మంది విదేశాల్లో జీవిస్తున్నారు. వాళ్లు ఏ దేశంలో ఉన్నా తమ మూలాలను మర్చిపోరు.
‘నేను ఏటా మూడుసార్లు ఇక్కడకు వస్తాను. నాకు ఒగుటా సంస్కృతి చాలా ఇష్టం’ అని అడిజువా చెప్పారు.
ఒకోరోఫర్ చిరుతను చంపిన వీరుడిగా గుర్తింపు పొందాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారు. ఇప్పుడాయన ఒగ్బువాగు కాగలిగినందుకు ఆనందంగా ఉన్నారు.
"ఒగుటా చాలా అందమైన పట్టణం. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చినవారు ఉంటారు" అని ఆయన సొంతూరు గురించి గర్వంగా చెప్పారు.
(అడోబి ట్రిసియా ఎన్వబానీ నైజీరియాకు చెందిన స్వతంత్ర జర్నలిస్ట్, రచయిత)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














