మొజాంబిక్: జైలు నుంచి 1500 మంది ఖైదీల పరారీ.. అసలేం జరిగింది?

మొజాంబిక్‌లో జైలు నుంచి 1500మంది ఖైదీలు తప్పించుకున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొజాంబిక్‌ రాజధాని మపుటోలో ఆందోళనాకారులు పోలీసులతో ఘర్షణలకు దిగుతున్నారు.

మొజాంబిక్‌లో ఓ జైలు నుంచి 1500మంది ఖైదీలు తప్పించుకున్నారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు దేశంలో అశాంతిని రేకెత్తించాయి. దీన్ని అదునుగా తీసుకున్న ఖైదీలు జైలు నుంచి పారిపోయారు.

జైలు సిబ్బందితో జరిగిన ఘర్షణలో 33మంది మరణించగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీస్ చీఫ్ బెర్నార్డినో రాఫెల్ మీడియాతో చెప్పారు. పారిపోయిన వారిలో దాదాపు 150 మందిని పట్టుకున్నామని తెలిపారు.

మొజాంబిక్‌లో 1975నుంచి అధికారంలో ఉన్నఫ్రిలీమో పార్టీ అక్టోబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికలను గెలిచినట్టు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఆందోళనలు ముదిరాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనాకారులు రాజధాని మపుటొలోని జైలును సమీపించినప్పుడు ఏర్పడిన గందరగోళాన్ని అవకాశంగా తీసుకున్న ఖైదీలు జైలు గోడను బద్దలుకొట్టి తప్పించుకున్నారని రాఫెల్ చెప్పారు.

మొజాంబిక్‌లో అక్టోబరులో వివాదాస్పద ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అధికార ఫ్రీలిమో పార్టీ అధ్యక్ష అభ్యర్థి డానియేల్ చాపో గెలిచినట్టు అధికారిక ఫలితాలు చెబుతున్నాయి.

బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కోర్టు తీర్పు తరువాత...

చాపో గెలిచినట్టుగా కోర్టు తీర్పునివ్వడం తాజా నిరసనలకు కారణం.అయితే కోర్టు ఆయనకు వచ్చిన ఓట్ల శాతాన్ని తగ్గించింది. తొలుత ప్రకటించిన ఫలితాల్లో 71% ఓట్లను చాపో , 20% ఓట్లను ప్రత్యర్థి వెనన్షియో మొండ్లనే దక్కించుకున్నట్టుగా ఉంది. అయితే చాపో 65% ఓట్లే గెలుచుకున్నారని మొండ్లనే 24% ఓట్లు గెలుచుకున్నారని కోర్టు తీర్పు వెల్లడించింది.

కోర్టు తీర్పుతో మొజాంబిక్‌లో నిరసనలు మళ్ళీ ఊపందుకున్నాయి.

క్రిస్మస్ రోజున మపుటో నగరంలో దాదాపు అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

ఫ్రిలీమో పార్టీ మొట్ట మొదట 1975లో అధికారంలోకి వచ్చిన తరువాత రేగిన అల్లర్ల తరువాత మళ్లీ అంత బీభత్సమైన అల్లర్లు ఇప్పుడు మొజాంబిక్ దేశాన్ని కుదిపేస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా ఫ్రిలీమోకు చెందిన ఆఫీసులతోపాటు పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు చోరీకి, ధ్వంసానికి గురయ్యాయి.ఆందోళనాకారులు కొన్నింటిని తగులబెట్టారు కూడా. ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన అల్లర్లలో దాదాపు 150 మంది మరణించగా కోర్టు తీర్పు వెలువడిన తరువాత 21 మంది మృతి చెందారని అంతర్గత వ్యవహారాలశాఖామంత్రి వెల్లడించారు.

ఎన్నికల ఫలితాలపై నిరసన తెలపాలని ప్రవాసంలో ఉన్న ప్రతిపక్ష అభ్యర్థి మొండ్లనే తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలను ఉపసంహరించకోకపోతే ఒక 'కొత్త తిరుగుబాటు' మొదలవుతుందని ఆయన సోషల్ మీడియా వేదికగా చెప్పారు.

మొజాంబిక్‌లో ఎన్నికల నాటి నుంచి మూడునెలల్లో మొత్తం 150మంది చనిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)