మంగినపూడి బీచ్-సునామీ: సరిగ్గా 21 ఏళ్ల కిందట ఆ రోజు ఏం జరిగిందంటే..

 రాకాసి అలలుగా సునామీ గురించి చెప్పుకున్న ప్రజలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, 2004లో సునామీ తర్వాత మంగినపూడి బీచ్‌లో దృశ్యాలు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డిసెంబరు 26, 2004…

ఆ ప్రళయానికి రెండు దశాబ్దాలు నిండిపోయాయంటే నమ్మలేకుండా ఉంది.

అది విరుచుకుపడేనాటికి దాని పేరు కూడా తెలియదు.

ఇప్పటికీ ఆ సంఘటన తలచుకుంటే గుండెల్లో తెలియని ఆందోళన, వణుకు వస్తుంటాయి.

సుమారు 20-30 అడుగుల ఎత్తున అలలు విరుచుకుపడి ప్రజల ప్రాణాలను అమాంతం మింగేశాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గత రెండు దశాబ్దాలుగా డిసెంబరు అనగానే గుర్తుకొస్తుంది...సునామీ.

నేను జర్నలిజంలోకి అడుగుపెట్టి అప్పటికి రెండు నెలలే అయింది.

మచిలీపట్నంలో ఈనాడు టౌన్ విలేఖరిగా పనిచేస్తున్నాను. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఆదివారం ఉదయం సీపీఐ ఆధ్వర్యంలో జరిగే ఓ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లాను.

టైం దాదాపు 10.30-11 గంటలు అవుతోంది.. అప్పటికి సెల్‌ఫోన్లు అంత పాపులర్ కాదు. అందుకే ఈ సంఘటన గురించి తెలిసే సరికి కాస్త టైం పట్టిందనుకుంటా.

ఆ సమయంలో బందరు(మచిలీపట్నం)లో తెలియని అలజడి మొదలైంది.

''సముద్రం ముందుకు వచ్చేసిందట. బందరును కూడా ముంచేసేలా వచ్చేసిందట. బీచ్ లో చాలామంది చనిపోయారట'' అంటూ ప్రచారం చేశారు.

బందరు నుంచి మంగినపూడి బీచ్‌ దాదాపు 12 కిలోమీటర్లు ఉంటుంది.

''కాసేపటికే సముద్రం శాంతించిందట. కానీ బీచ్‌ మునిగిపోయేలా అలలు వచ్చాయి'' అని చెప్పారు.

సీపీఐ నాయకులు తమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని బీచ్‌కు బయల్దేరారు.

వారితో నేను కూడా మంగినపూడి బీచ్‌కు వెళ్లాను. దారిలో వెళ్తూ వెళ్తూ చుట్టూ చూసుకుంటూ భయంభయంగానే వెళ్లాల్సి వచ్చింది.

ఎందుకంటే అప్పటికి సముద్రం ముందుకు దూసుకురావడం అంటే ఏమిటో ఎవరికి పెద్దగా తెలియదు. ఆ మాటకొస్తే, అసలు ఏమైందో ఈ ప్రపంచానికి కూడా తెలియదు.

చిన్నతనంలో కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలకు వెళ్లడం...అక్కడ ఆడుకోవడమే తెలుసు.

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయని తెలుసు.

కానీ, సముద్రం ఈ స్థాయిలో తీరానికి చొచ్చుకు రావడమన్నది అప్పటివరకు నేను వినలేదు.

మంగినపూడి బీచ్ వద్దకు వెళ్లగానే...నిజంగానే సముద్రం చాలా ముందుకు వచ్చినట్లు అర్థమైంది. చిన్నతనం నుంచి చూసిన సముద్రానికి, ఆ రోజు చూసిన దానికి చాలా తేడా ఉంది.

బీచ్ ముందు ఒక చిన్న రోడ్డు ఉండేది. రెండింటి మధ్య దూరం అర కిలోమీటరు పైగానే ఉంటుంది. అక్కడి వరకు బీచ్ దూసుకొచ్చినట్లుగా కనిపించింది.

ఆసియా దేశాలను వణికించిన సునామీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మంగినపూడి బీచ్ సమీపంలో అనేక ఇళ్లు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి.

ఎక్కడ చూసినా నీళ్లు.. బురదే

తీరం దగ్గర్లో ఉన్న లారీ, సుమో కొట్టుకువచ్చి బురదలో కూరుకునిపోయి కనిపించాయి.

బీచ్ దగ్గరకు వెళ్లే సరికి చాలామంది ఏడుస్తూ కనిపించారు.

ఏం జరిగిందో తెలుసుకోవాలని కారు దిగి గబగబా నడుస్తున్నాను.

నాలుగు అడుగులు ముందుకు వేయగానే, ఒక మహిళ మృతదేహం కనిపించింది.

అప్పటికే మృతదేహం బాగా ఉబ్బిపోయి ఉంది. ఒక్కసారిగా చెమటలు పట్టాయి నాకు.

ఒకపక్కన అసలు ఏం జరిగిందో తెలియదు.. మరోవైపు మృతదేహాలు కొట్టుకువచ్చి అక్కడ కనిపిస్తున్నాయి.

అవన్నీ కూడా సముద్రంలోకి కొట్టుకువెళ్లి.. తిరిగి ఒడ్డుకు వచ్చినట్లుగా ఉన్నాయి. చనిపోయినవారిలో చాలామంది మహిళలే.

అన్ని మృతదేహాలు ఉబ్బి కనిపించాయి. అప్పటికే కొన్నింటిని ఒడ్డుకు తీసుకువచ్చారు.

ఉదయం కావడంతో సముద్ర స్నానాలు చేసేందుకు బీచ్ కు 50-60 మంది వరకు వచ్చారు.

అప్పట్లో బీచ్ కూడా పెద్దగా అభివృద్ధి కాలేదు. కేవలం కొన్ని చిరుతిళ్లు అమ్మే తోపుడు బండ్లు, ఐస్ క్రీములు అమ్మేవారే అక్కడ ఉండేవారు.

తోపుడుబండ్లు కూడా ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. కొన్ని విరిగిపోయి కనిపించాయి.

పెదపట్నం, గుల్లలమోద, పల్లెపాలెం, గిలకలదిండి, నాగాయలంక, పాలకాయతిప్ప, తాళ్లపాలెం, గొల్లపాలెం, కానూరు సహా సముద్ర తీరంలోని ఉన్న చాలా గ్రామాల్లో మత్స్య కారుల పడవలు కొట్టుకుపోయాయి. వలలు చిరిగిపోయాయి.

తాళ్లపాలెం వంటి గ్రామాల్లో కొందరి గుడిసెలు కూడా కూలిపోయాయి.

సముద్రం ముందుకు వచ్చిందని తెలిసి, బందరుతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది చూసేందుకు వచ్చారు.

పోలీసులు వారిని దూరంలోనే అడ్డుకున్నారు. సహాయక చర్యలు మొదలుపెట్టారు.

సునామీ
ఫొటో క్యాప్షన్, 2004లో సునామీ వచ్చేనాటికి ఇలాంటి పరిణామాలను ఏమంటారో చాలామందికి తెలియదు.

మధ్యాహ్నానికి బయటికొచ్చిన వివరాలు

మంగినపూడి బీచ్‌లో 36 మంది చనిపోయారని పోలీసులు చెప్పారు. ప్రభుత్వాసుపత్రికి కొన్ని మృతదేహాలు తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబీకులకు అప్పగించారు.

సముద్రం తీరంలో ఉన్న గ్రామాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయించారు.

ఏం జరిగిందో అర్ధం కాలేదు. సముద్రం ఎందుకలా ముందుకు వచ్చిందో, అలా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు. అందుకే ఈ చర్యలు తీసుకున్నారు.

దాదాపు ఐదుసార్లు సముద్రం ముందుకు వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు అప్పట్లో నాకు చెప్పినట్లు గుర్తు.

సాయంత్రం, మరుసటి రోజు ఏ పత్రిక చూసినా సముద్రంలో భారీ అలలు ఎగిసిపడ్డాయన్న వార్తలే కనిపించాయి.

కానీ, అలా సముద్రం ముందుకు రావడాన్ని ఏమంటారో అప్పటికీ చాలామందికి తెలియదు.

ఇలాంటి పరిణామాన్ని సునామీ అంటారని తర్వాత తెలిసింది. ఇంగ్లిష్‌లో TSUNAMI అని రాస్తుండగా, తెలుగులో కూడా మొదట్లో 'త్సునామీ' అని రాసేవారు. ఇది పలకడం వచ్చేది కాదు. తర్వాత అందరూ 'సునామీ'గా రాయడం మొదలుపెట్టారు.

అలల తాకిడికి ఇళ్లు, పడవలు, వలలు కొట్టుకుపోయి జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.

'' చాలామంది సముద్రం మీద వేటకు వెళ్లారు. నేను ఆ రోజెందుకో వెళ్లలేదు. ఉదయం లేచేసరికి సముద్రం ముందుకు వచ్చేసిందని ఊళ్లో ఒకటే గోలగా ఉంది. ఏమైందో తెలియదు. మధ్యాహ్నం వెళ్లి చూసేసరికి పడవలు చాలావరకు కొట్టుకుపోయాయి. వలలు కనిపించలేదు'' అని పల్లెపాలేనికి చెందిన ఇమాన్యుయేల్ అనే మత్స్యకారుడు బీబీసీకి చెప్పారు.

ఇప్పటికీ డిసెంబరు నెల వస్తుందంటే సునామీనే కళ్ల ముందు మెదులుతుందని ఆయన అన్నారు.

సునామీ ధాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సునామీ ధాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది చనిపోయారు.

ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య రెండు లక్షల పైనే

సునామీ కేవలం ఆంధ్రప్రదేశ్ తీరానికే పరిమితం కాలేదు, తమిళనాడుతోపాటు శ్రీలంక, థాయ్‌లాండ్, ఇండోనేషియా సహా చాలా దేశాలపై ప్రభావం చూపింది.

ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో మొదలైన భూ ప్రకంపన మానవాళిపై ఉపద్రవంలా విరుచుకుపడింది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్ కాయిస్ చెప్పిన వివరాల ప్రకారం 9.3 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. దాదాపు 30 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి.

మొత్తం 2లక్షల 40వేల మంది చనిపోయారని అంచనా. భారత్ థాయ్‌లాండ్, శ్రీలంకలోమ దాదాపు 58వేల మంది చనిపోయారని ఇన్ కాయిస్ చెబుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)