తెలంగాణ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై ఏం చెప్పారు?

దిల్ రాజు, నాగార్జున, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫొటో సోర్స్, TelanganaCMO

ఫొటో క్యాప్షన్, తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు సినీ పరిశ్రమకు మధ్య విభేదాలున్నాయనే ప్రచారం జరిగింది.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం (డిసెంబర్ 26న) సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరిగింది.

రెండు రోజుల కిందట నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు డిసెంబరు 26వ తేదీన సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఉంటుందని మీడియాకు చెప్పారు. ఈమేరకు సినీ పరిశ్రమ ప్రముఖులు.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దాదాపు రెండు గంటలపాటు చర్చించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత సినీ పరిశ్రమ, తెలంగాణ ప్రభుత్వం మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో సినీ ప్రముఖులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సీఎం రేవంత్ రెడ్డితో సినిమా ప్రముఖుల సమావేశం

ఫొటో సోర్స్, TelanganaCMO

ఫొటో క్యాప్షన్, సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశానికి టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ పరిశ్రమకు చెందిన 36మంది ప్రముఖులు హాజరయ్యారు.

సినీ పరిశ్రమ నుంచి ఎవరెవరు వెళ్లారంటే...

తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ పరిశ్రమకు చెందిన 36మంది సమావేశానికి హాజరయ్యారు.

నటులు వెంకటేష్, నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ హాజరయ్యారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితరులు హాజరు కాలేదు.

ఇక నిర్మాతల నుంచి దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్, మురళీమోహన్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సంస్థ అధినేత సునీల్ నారంగ్, సుప్రియ యార్లగడ్డ, చినబాబు, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవి శంకర్, విశ్వప్రసాద్.. దర్శకుల తరపున కె.రాఘవేంద్రరావు, వీర శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, సాయి రాజేష్, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు.

ఇక ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హోం శాఖ కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్ హాజరయ్యారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం

ఫొటో సోర్స్, TelanganaCMO

ఫొటో క్యాప్షన్, తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచస్థాయిలో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయించినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు

వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు: సీఎం

సమావేశంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు శాలువా కప్పి సన్మానించారు. అక్కినేని నాగార్జున, వెంకటేశ్, మురళీమోహన్, రాఘవేంద్రరావు తదితరులు సీఎంను సన్మానించారు.

''సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారానికి మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నాం. సినీ పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

''మా ప్రభుత్వంలో ఎనిమిది సినిమాలకు స్పెషల్ జీవో లు ఇచ్చింది. పుష్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచస్థాయిలో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఐటీ, ఫార్మా తో పాటుగా మాకు సినిమా పరిశ్రమ అంతే ముఖ్యం.

తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని సినీ పరిశ్రమ నటులు, దర్శకులు ప్రమోట్ చేయాలి. హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాం.'' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైనా సినీ పరిశ్రమ ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

''సినిమా పరిశ్రమ కు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇళ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి. దాన్ని కొనసాగిస్తాం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాది. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు. మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది.'' అని రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ సీఎంతో సినీ ప్రముఖులు సమావేశం

ఫొటో సోర్స్, TelanganaCMO

ఫొటో క్యాప్షన్, తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయడానికి సినీ పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని సీఎం సూచించారని దిల్ రాజు మీడియాకు చెప్పారు.

బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై ఏం చెప్పారంటే..

సమావేశం తర్వాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.

ఇటీవలి సంఘటనల కారణంగా ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య గ్యాప్ ఉందనే అపోహ ఉందని, తెలుగు ఫిలిం చాంబర్, తెలంగాణ చాంబర్ ద్వారా సమస్యలు విన్నవించామని చెప్పారు దిల్ రాజు.

''తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయడానికి సినీ పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. హైదరాబాద్‌లో అన్ని భాషల సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి. దేశీయంగానే కాకుండా హలీవుడ్ సినిమాలుసైతం ఇక్కడ షూటింగ్ జరుపుకునేలా చేయడానికి తగిన సలహాలు ఇవ్వాలని సీఎం చెప్పారు. డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలోనూ, యువతకు ఉపయోగపడే విషయాల్లో సినీ పరిశ్రమ నుంచి మద్దతు కావాలని ప్రభుత్వం అడిగింది. మరో సమావేశం పెట్టుకుని అన్ని విషయాలపై ఏం చేస్తే బాగుంటుందనే అంశాలను ప్రభుత్వానికి వివరిస్తాం.'' అని చెప్పారు.

టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలపై చర్చించారా.. అని మీడియా ప్రశ్నించగా..

''టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు చిన్న భాగం మాత్రమే.. అది పెద్ద సమస్య కాదు. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాను ఎలా తీసుకెళ్లాలనేదే మా కీలక బాధ్యత.'' అని చెప్పారు దిల్ రాజు. అయితే, ఈ విషయంపై మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని చేస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు.

తెలంగాణ సీఎంతో తెలుగు సినిమా ప్రముఖుల సమావేశం

ఫొటో సోర్స్, TelanganaCMO

ఫొటో క్యాప్షన్, ఇంటర్‌నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని దర్శకుడు కె.రాఘవేంద్రరావు కోరారు.

‘ఇంటర్‌నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ నిర్వహించాలి’

సినీ పరిశ్రమ వర్గాల నుంచి ఉన్న సమాచారం ప్రకారం సీఎంతో జరిగిన సమావేశంలో పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు.

''తెలంగాణలో మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఫిలిమ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం'' అని దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు.

''యూనివర్సల్‌ స్థాయి స్టూడియో సెటప్‌ ఉండాలి. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తే తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచస్థాయికి ఎదుగుతుంది.'' అన్నారు నటుడు నాగార్జున.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)