‘మృతదేహం కాళ్లకు నమస్కరించి క్షమాపణలు చెబుతా’ అంటున్న ఆ సెక్స్ వర్కర్ మీదున్న కేసులు ఏంటి?

ఫొటో సోర్స్, BIMAL SAINI
- రచయిత, బిమల్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
గమనిక: ఈ కథనంలో మిమ్మల్ని కలచివేసే అంశాలు ఉంటాయి.
''అతను నన్ను మోసం చేశాడు. సెక్స్ తర్వాత డబ్బులు ఇవ్వలేదు. పైగా కొట్టాడు. దీంతో ఆయన గొంతు నులిమి చంపేశాను.''
11 హత్యలకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన ఒక వ్యక్తి చెప్పిన విషయమిది.
పంజాబ్‌లోని రూప్‌నగర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) గల్నీత్ సింగ్ ఖురానా సింగ్ మాట్లాడుతూ, 11 హత్యలు చేసిన ఒక స్వలింగ సంపర్కుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా చౌరా గ్రామానికి చెందిన నిందితుని పేరు రామ్ స్వరూప్ అలియాస్ సోధీ అని ఆయన తెలిపారు.

ఈ హత్యలు ఎలా చేశారంటే?
నిందితుడు రామ్ స్వరూప్ సింగ్ ఒక హోమోసెక్సువల్ సెక్స్ వర్కర్ అని ఎస్‌ఎస్‌పీ గల్నీత్ సింగ్ చెప్పారు.
'' రోడ్డు మీద కారు డ్రైవర్లు, మోటార్‌సైక్లిస్టుల దృష్టిని ఆకర్షించేవారు. తర్వాత లిఫ్ట్ అడిగి వారితో ప్రయాణించేవారు. వారితో శారీరక సంబంధాలు పెట్టుకునేవారు. డబ్బు విషయంలో వాగ్వాదం జరిగినప్పుడు వారిని చంపేవారు'' అని గల్నీత్ సింగ్ తెలిపారు.
‘‘తన ఆధారాలేమీ అక్కడ మిగలకుండా జాగ్రత్తపడి, తర్వాత మృతదేహంపై ఒక సందేశం రాసి అక్కడినుంచి పారిపోయేవారు'' అని గల్నీత్ సింగ్ వెల్లడించారు.
నిందితుడు వారి గొంతు నులమడం లేదా గాయపరిచి హత్యలు చేసేవారని పోలీసు అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, BIMAL SIANI
పోలీసులు నిందితున్ని ఎలా పట్టుకున్నారు?
''కీరత్‌పూర్ సాహిబ్‌కు చెందిన మణిందర్ సింగ్ కుమారుడు భజన్ సింగ్ మృతదేహం మనాలీ రోడ్‌లోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలోని పొదల్లో లభ్యమైంది. పోలీసులు ఈ కేసును సాంకేతికంగా ఛేదించడానికి ప్రయత్నించినప్పుడు రామ్ స్వరూప్ గురించి తెలిసింది. మరింత లోతుగా దర్యాప్తు చేశాక అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి'' అని గుల్నీత్ సింగ్ వివరించారు.
రామ్ స్వరూప్‌ను అరెస్ట్ చేసి ప్రశ్నించగా, మిగతా హత్యల వివరాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, BIMAL SAINI
హత్యలు చేసినట్లు ఒప్పుకోలు
భజన్ సింగ్ కేసు విచారణ సమయంలో తాను మరో 10 హత్యలు చేసినట్లు నిందితుడు వెల్లడించారని పోలీసులు చెప్పారు. ఇందులో రూప్‌నగర్ జిల్లాలో జరిగిన 2 హత్యలు కూడా ఉన్నాయి.
ఈ మేరకు కీరత్‌పూర్ సాహిబ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2024 జనవరి 24న రూప్‌నగర్‌లోని నిరంకారి భవన్ సమీపంలో కారులో ఒక యువకుని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు రూప్‌నగర్‌కు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ సన్నీ అని పోలీసులు వెల్లడించారు.
ఈ యువకుడి మృతదేహంపై దుస్తులు కూడా లేవని ఎస్‌ఎస్‌పీ తెలిపారు.
2024 ఏప్రిల్ 5వ తేదీన బేగంపురాకు చెందిన ముకందర్ సింగ్ అలియాస్ బిల్లా మృతదేహం, పంజెహరా రోడ్ వద్ద లభ్యమైందని ఆయన చెప్పారు. అతని శరీరంపై గాయాల ఆనవాళ్లు కనిపించాయని అన్నారు.
ఫతేగఢ్ సాహిబ్, హోషియార్‌పూర్ జిల్లాల్లో జరిగిన హత్యల్ని కూడా తానే చేసినట్లు నిందితుడు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
రామ్ స్వరూప్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు తర్వాత కస్టడీకి తీసుకున్నారు. తర్వాతి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని వారి కుటుంబీకులు రెండేళ్ల కిందటే ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
''హత్య చేసి మృతదేహానికి క్షమాపణలు''
నిందితుడు రామ్ స్వరూప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ''నేను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ చంపలేదు'' అని నిందితుడు మీడియాతో అన్నారు.
రూప్‌నగర్ హత్య కేసు గురించి మాట్లాడుతూ, ''అతను మోసగాడు. నేను అతన్ని కలిసిన తర్వాత కారులో నన్ను తీసుకెళ్లాడు. 200 రూపాయల కోసం నేను అతనితో సెక్స్‌లో పాల్గొన్నా. కానీ, తర్వాత నాకు డబ్బులు ఇవ్వనన్నాడు. నన్ను కారులో నుంచి బయటకు తోసేశాడు. తలపై కర్రతో కొట్టాడు. అందుకే మఫ్లర్‌తో ఆయన గొంతు నులిమాను.’’ అని నిందితుడు వెల్లడించారు.
‘‘హత్యల తర్వాత నేను వారి కాళ్లకు నమస్కరిస్తాను. క్షమించమని కోరతాను. ఇలా చేసినందుకు చింతిస్తున్నాను’’ అని రామ్ స్వరూప్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














