'రూ. 9 లక్షలు ఇచ్చి నా కొడుకు చావును నేనే కొనుక్కున్నా''- ఓ తండ్రి ఆవేదన

ఫొటో సోర్స్, Ammar Bajwa/ Naveed Asghar
- రచయిత, ఎహ్తెషామ్ అహ్మద్ షమీ
- హోదా, బీబీసీ ఉర్దూ
13 ఏళ్ల కుమారుడిని చట్టవిరుద్ధంగా యూరప్‌కు పంపించాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా చింతిస్తున్నానని బీబీసీతో సౌదీ అరేబియాలో కార్పెంటర్‌గా పనిచేస్తోన్న జావేద్ ఇక్బాల్ అన్నారు.
''ఏజెంట్లు మా గ్రామానికి చెందిన కొంతమంది యువకులను గ్రీస్, ఇటలీలకు పంపించారు. మా అబ్బాయి చాలా మొండివాడు. ఏజెంట్ల మాటలకు పడిపోయాడు. తనను యూరప్‌కు పంపించకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని పదే పదే అనేవాడు'' అని జావేద్ ఇక్బాల్ గుర్తు చేసుకున్నారు.
గ్రీస్‌కు సమీపంలోని సముద్ర జలాల్లో మృతి చెందిన అయిదుగురు పాకిస్తాన్ పౌరుల్లో జావేద్ కుమారుడు మొహమ్మద్ అబిద్ కూడా ఉన్నాడు. వలసదారులను తీసుకెళ్తున్న మూడు పడవలు బోల్తా పడటంతో వీరంతా చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదం గతవారం జరిగింది.
తమ పిల్లలు ఇలాంటి ప్రయాణాలకు వెళ్లకుండా ఆపాలంటూ తల్లిదండ్రులను పాకిస్తాన్ అధికారులు కోరారు. కానీ, ఈ విజ్ఞప్తులు వందల మంది యువకుల ప్రయత్నాలను అడ్డుకోలేకపోయాయి.

గ్రీస్‌లోని ఎంబసీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో 47 మందిని ప్రాణాలతో కాపాడగలిగారు. ఆచూకీ తెలియకుండా పోయిన 35 మందిని చనిపోయినట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే, బుధవారంనాడు రెస్క్యూ ప్రయత్నాలను కోస్ట్‌గార్డ్ నిలిపేసింది.
సెంట్రల్ పంజాబ్‌లోని పస్రూర్ జిల్లాకు చెందిన రెండు బాధిత కుటుంబాలతో బీబీసీ మాట్లాడింది.
'నేను యూరప్ వెళ్లే రోజు ఎప్పుడొస్తుంది?'
జావేద్‌కు నలుగురు పిల్లలు. అందులో మూడోవారు అబిద్.
''అబిద్ కంటే పెద్దవారైన ఇద్దరు స్కూలుకు వెళ్తున్నారు. కానీ, అబిద్ స్కూలు మానేశాడు'' అని సౌదీ అరేబియాలో ఉంటున్న జావేద్ చెప్పారు.
గత రెండేళ్లలో తమ బంధువుల్లో పలువురితో పాటు గ్రామంలోని చాలామంది యువకులు, ఏజెంట్ల సహాయంతో గ్రీస్‌కు వెళ్లారని ఆయన తెలిపారు.
గ్రీస్‌కు వెళ్లిన వారంతా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెడుతుండటం చూసి, 'నేను యూరప్ వెళ్లే రోజు ఎప్పుడొస్తుందని' అబిద్ అడిగేవాడని జావేద్ చెప్పారు.
‘‘ 'నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. పెద్దయ్యాక యూరప్ వెళ్దువు’ అని చాలాసార్లు చెప్పి చూశా. కానీ, మొండిపట్టు పట్టాడు. సౌదీ అరేబియాకు రమ్మని చెప్పాను. కానీ, యూరప్‌కు వెళ్లడమే అతని లక్ష్యం'' అని జావేద్ వివరించారు.
పడవ ప్రమాదంలో మరణించిన వారిలో చిన్నపిల్లాడు కూడా ఉండటంతో ఆశ్చర్యపోయానని విలేఖరుల సమావేశంలో గ్రీస్‌లోని పాకిస్తాన్ రాయబారి అమర్ అఫ్తాబ్ ఖురేషి అన్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో కూడా చిన్నారులు ఉన్నారని తెలిపారు.
''పిల్లలను అక్రమంగా పంపించే ఈ ధోరణి చాలా ప్రమాదకరం'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏజెంట్లను కలిసినప్పుడల్లా ఇంటికి వెళ్లి, యూరప్‌కు వెళ్లేందుకు డబ్బు ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని తన తల్లిని అబిద్ బెదిరించేవాడని జావేద్ చెప్పారు.
''నా భార్య నాకు ఫోన్ చేసి అబిద్‌ను సముదాయించమని చెప్పేది. నేను మాట్లాడినప్పుడు కాస్త ఓపిక పట్టేవాడు. రెండు, మూడు రోజులు గడవగానే మళ్లీ యూరప్ వెళ్తానంటూ మొదలుపెట్టేవాడు'' అని జావేద్ వివరించారు.
ఇక చేసేదేం లేక జావేద్ తన పొలంలో కొంతభాగాన్ని, ఆయన భార్య తన నగల్లో కొన్నింటిని అమ్మేశారు. అబిద్‌ను యూరప్‌కు పంపించేందుకు ఏజెంట్లకు రూ.7.80 లక్షలు చెల్లించారు.
అబిద్ మొదట ఫైసలాబాద్ నుంచి ఈజిప్టుకు చేరుకొని తర్వాత లిబియాకు వెళ్లాడని ఆయన చెప్పారు. అక్కడ రెండు నెలల పాటు ఉన్నాడని, ఈ సమయంలో కుటుంబీకులతో ఎప్పుడూ మాట్లాడేవాడని తెలిపారు.
''చాలా సంతోషపడ్డాడు. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అవి తాత్కాలికమేనని, వాటిని తట్టుకుంటే తన గమ్యానికి చేరుకుంటానని తరచుగా చెప్పేవాడు. అతని గమ్యం యూరప్ కాదు మృత్యువు అని మాకు అప్పుడు తెలియలేదు'' అని జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు.
''గ్రీస్‌కు దగ్గరలో ఒక పడవ బోల్తా పడిందంటూ వదంతులు వచ్చినప్పుడు మేం మా పిల్లాడి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాం. కానీ, సమాచారం రాలేదు. గ్రీస్‌లోని ఒక స్నేహితుడిని సంప్రదించాం. అతను అక్కడి ఆసుపత్రికి వెళ్లి చూస్తే అబిద్ మృతదేహం కనిపించింది.'' అని ఆయన చెప్పారు.
తర్వాత గ్రీస్‌లోని పాకిస్తాన్ ఎంబసీ నుంచి కూడా తమకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు.

ఫొటో సోర్స్, Naveed Asghar
'క్షణక్షణం చస్తున్నాం'
సెంట్రల్ పంజాబ్‌లోని ఉచా జజ్జా గ్రామంలోని మరో కుటుంబం కూడా తమ కుమారుడిని మృతితో విషాదంలో మునిగింది.
ఇర్ఫాన్ అర్షద్ 19 ఏళ్ల కొడుకు ముహమ్మద్ సుఫ్యాన్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రీస్‌లోని పాకిస్తాన్ అధికారులు ధ్రువీకరించారు.
''మీ అబ్బాయిని సురక్షితమైన బోటులో పంపిస్తున్నామంటూ చెప్పి ఆఖరి నిమిషం వరకు ఏజెంట్ మమ్మల్ని మోసం చేశాడు'' అని ఇర్ఫాన్ అర్షద్ అన్నారు.
''గ్రీస్‌లో పడవ బోల్తాపడిందంటూ మా గ్రామంలో అందరూ చెప్పుకుంటుంటే విన్నప్పుడు నా కళ్ల ముందు చీకటి ఆవరించింది. 9 లక్షలు ఇచ్చి నా కొడుకు చావును నేనే కొన్నానని అనిపించింది'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయిల్, ఫెర్టిలైజర్ దుకాణాన్ని నడిపే ఇర్ఫాన్‌కు నలుగురు కొడుకులు. వీరిలో ఇద్దరు బహ్రెయిన్‌లో, మరొకరు గ్రీస్‌లో ఉంటున్నారు. అందరి కంటే చిన్నవాడైన సుఫ్యాన్‌ను గ్రీస్‌కు పంపించడానికి ఎకరం పొలాన్ని అమ్మినట్లు ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, PM Office
ముహమ్మద్ సుఫ్యాన్ మృతి నేపథ్యంలో ఎఫ్‌ఐఏ నలుగురిపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేసింది.
సుఫ్యాన్‌ను లిబియాకు తీసుకెళ్లిన తర్వాత రెండు నెలల పాటు సురక్షితమైన ఒక ఇంటిలో ఉంచి, అతనికి రోజుకు ఒకే పూట భోజనం ఇచ్చారని రిపోర్టులో ఇర్ఫాన్ పేర్కొన్నారు.
''పాచిపోయిన ఆహారం తినడం వల్ల మా అబ్బాయికి కలరా వచ్చింది. దాని వల్ల చాలా బలహీనపడ్డాడు. మేం మాట్లాడినప్పుడల్లా అతను భయంగా ఉన్నట్లుగా కనిపించేవాడు. మొదటిసారి ఇంటి నుంచి దూరంగా ఉన్నందువల్ల భయపడుతున్నాడని, గ్రీస్‌కు చేరుకోగానే సంతోషంగా జీవిస్తాడని అనుకున్నాం'' అని ఇర్ఫాన్ చెప్పారు.
చివరకు సుఫ్యాన్ సహచరుడి ద్వారా ఆ కుటుంబానికి అతని మరణవార్త తెలిసింది.
2023లో గ్రీస్‌లోని ఇదే ఏరియాలో వలసదారులతో వెళ్తున్న ఒక పడవ మునిగిపోవడంతో 262 మంది పాకిస్తాన్ పౌరులు చనిపోయారు. ఈ విషాదం తర్వాత మానవ అక్రమ రవాణాదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు.
తాజా పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో బుధవారం భేటీ అయిన అధికారులు మళ్లీ ఇదే మాటను నొక్కి చెప్పారు.
ఇలాంటి ఘటనలు పదే పదే జరగడం ఆందోళన కలిగిస్తోందని, మానవ అక్రమ రవాణాదారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు.
అనుమానితులు చాలా కాలంగా వివిధ దేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాలను నడుపుతున్నారని బీబీసీతో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రీజినల్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖమర్ చెప్పారు.
''పస్రూర్‌లోని యువకులను అక్రమంగా విదేశాలకు పంపిన నిందితులు ఒకే కుటుంబానికి చెందిన వారని ఎఫ్‌ఐఏ దర్యాప్తులో తేలింది. నిందితులు ఇప్పటివరకు వేల మందిని అక్రమంగా విదేశాలకు పంపించారు'' అని ఆయన వెల్లడించారు.
మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటివరకు కోర్టుల్లో 174 కేసులు నమోదు కాగా, నలుగురికి మాత్రమే శిక్ష పడింది.
సుఫ్యాన్ మృతదేహం జనవరి ప్రారంభంలో పాకిస్తాన్‌కు చేరుకుంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ చెప్పినట్లు ఇర్ఫాన్ తెలిపారు.
''ఇది తల్చుకొని క్షణక్షణం మేం చచ్చిపోతున్నాం. మా అబ్బాయి మృతదేహాన్ని చూసేవరకు మేం బతకలేం, అలాగని చావలేం. కొడుకుల్ని కోల్పోయిన వారు ప్రశాంతంగా ఎలా బతకగలరు?'' అని ఇర్ఫాన్ ఆవేదనతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














