టాయిలెట్ పేపర్‌‌కు ఈ ఆకులు ప్రత్యామ్నాయం కానున్నాయా?

టాయిలెట్ పేపర్, ఆకు

ఫొటో సోర్స్, Robin Greenfield

    • రచయిత, సో మిన్ కిమ్

టాయిలెట్ పేపర్ తయారీకి ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల చెట్లను కొట్టేస్తున్నారు. టాయిలెట్ పేపర్ కోసం సొంతంగా మొక్కల పెంపకం మరింత పర్యావరణ హితమా?

తూర్పు కెన్యాలో మెరూ పట్టణంలో, పచ్చని, దట్టమైన ఆకులతో ఈ మొక్క భూమిపై విస్తరించి ఉంది.

మెరూకు చెందిన బెంజమిన్ ముటెంబీ ప్లెక్ట్రాంథస్ బార్బటస్ అనే మొక్కను పెంచుతున్నారు. దీని ఆకులను టాయిలెట్ పేపర్‌గా వాడుతున్నారు. 1985 నుంచి ఆయన ఈ మొక్కను పెంచడం ప్రారంభించారు.

''మా తాత ద్వారా దీని గురించి తెలుసుకున్నా. అప్పటి నుంచి దీన్ని వాడుతున్నా. ఇది చాలా మృదువుగా, మంచి వాసనతో ఉంటుంది'' అని తెలిపారు.

ప్లెక్ట్రాంథస్ బార్బటస్ అనే మొక్క 2 మీటర్ల వరకు అంటే 6.6 అడుగుల వరకు పెరుగుతుంది. దీని ఆకులు దాదాపు సాధారణ టాయిలెట్ పేపర్ పరిణామంలోనే ఉంటాయి. ఇవి పుదీనా, నిమ్మ వాసనను వెదజల్లుతుంటాయి. ఈ మొక్క ఉష్ణమండల వాతావరణంతోపాటు, పాక్షిక సూర్యకాంతిలోనూ పెరుగుతాయి. ఆఫ్రికా అంతటా ఈ మొక్కలు విస్తరించాయి. కొన్నిసార్లు ఈ మొక్కలను ఆస్తుల సరిహద్దులను నిర్ణయించడానికి కూడా ఉపయోగిస్తారు.

''దీనిని సుదీర్ఘకాలంగా ఆఫ్రికన్ టిస్యూలాగా వినియోగిస్తున్నారు. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మొక్కను వాడతారు. ఈ మొక్కకున్న ఆకులన్నింటిని వాడిన తరువాతే అధునాతన టాయిలెట్ రోల్స్‌ కొంటాను'' అని ముటెంబీ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఖర్చును తగ్గిస్తున్నాయి

ముటెంబీకి ఈ ఆకులు టాయిలెట్ పేపర్ కొనే ఖర్చును తప్పిస్తున్నాయి. ఆఫ్రికాలో ఇతర వస్తువుల మాదిరే టాయిలెట్ పేపర్ ధరకూడా ఎక్కువ. టాయిలెట్స్ రోల్ ఉత్పత్తి కోసం దిగుమతి చేసుకునే కలపగుజ్జు, ఇతర పదార్థాల ధరలు ఎక్కువకావడంతో వీటి మొత్తం ఉత్పత్తి ఖర్చులో దిగుమతి చేసుకునే పదార్థాల ధరలే 75 నుంచి 80శాతం దాకా ఉంటున్నాయని కెన్యాలో తయారీదారుల సంఘం తెలిపింది.

టాయిలెట్ పేపర్ తయారు చేసేందుకు ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల చెట్లను నరుకుతున్నట్లు ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ కన్సల్టెన్సీ ఎడ్జ్ పరిశోధన తెలిపింది.

వర్జిన్ వుడ్‌ను , కాగితం పరిశ్రమ భారీగా వినియోగిస్తుంటుంది. . నరికిన చెట్లలో సుమారు 35 శాతం పేపర్ ఉత్పత్తి కోసం వాడుతున్నారు.

దీనివల్ల, అటవీ నిర్మూలన, జీవవైవిధ్యం దెబ్బతినడం, భూమికోతకు గురికావడం, జాతులు అంతరించిపోవడం, పర్యావరణ వ్యవస్థ దెబ్బంటోందని ఎథికల్ టాయిలెట్ పేపర్‌పై ఇటీవల రూపొందించిన ఎథికల్ కన్జూమర్ రిపోర్టు వెల్లడించింది.

''ప్లెక్ట్రాంథస్ బార్బటస్ అనేది ఆఫ్రికన్ టాయిలెట్ పేపర్. ప్రస్తుత యువతలో చాలామందికి ఈ మొక్క గురించి పెద్దగా తెలియదు. కానీ, టాయిలెట్ పేపర్‌కు పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయంగా మారే సామర్థ్యం దీనికి ఉంది'' అని సంప్రదాయ మొక్కలపై అధ్యయనం చేసే కెన్యా నేషనల్ మ్యూజియం నిపుణుడు మార్టిన్ ఒధియాంబో అన్నారు.

బెంజమిన్

వినియోగం పెరుగుతోందా?

కెన్యాలో ఎంతమంది ఈ మొక్కను టాయిలెట్ పేపర్‌గా వాడుతున్నారనే విషయమై అధికారిక సమాచారమేదీ లేదు. కానీ, ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో ఈ మొక్కను పెంచుతున్నారు. చాలా గ్రామీణ ప్రాంతాలలో దీన్ని వాడుతున్నట్లు ఒధియాంబో చెప్పారు.

ప్లెక్ట్రాంథస్ బార్బటస్ మొక్కను కోసిన తర్వాత ఒకటి లేదా రెండు నెలల్లో పూర్తి గా ఎదుగుతుంది. దీన్నికత్తిరించడానికి సుమారు 50 కెన్యన్ షిల్లింగ్స్ అంటే 30 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

పరిశ్రమలు తయారు చేసే టాయిలెట్ పేపర్ సైజులోనే ఈ ఆకులు ఉంటాయి. అధునాతన ఫ్లష్ టాయిలెట్లకు లేదా మరుగుదొడ్లలో కంపోస్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటాయని ఒధియాంబో చెప్పారు.

ప్లెక్ట్రాంథస్ బార్బటస్ మొక్క వినియోగం, దాని ఉపయోగాలపై ఒధియాంబో ఉపన్యాసాలను వినేందుకు కెన్యాలో ఇతర ప్రాంతాల నుంచి పలువురు సందర్శకులు వస్తుంటారు. ఇతర దేశాల్లో కూడా ఈ మొక్క ఉపయోగాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అమెరికాలోని ఫ్లోరిడాలో పర్యావరణహితమైన సుస్థిర జీవనం కోసం లాభాపేక్ష లేని ఒక సంస్థను నడుపుతున్న పర్యావరణ కార్యకర్త రాబిన్ గ్రీన్‌ఫీల్డ్ ఈ ప్లెక్ట్రాంథస్ బార్బటస్ ఆకులను గత ఐదేళ్లుగా వాడుతున్నారు.

గ్రీన్‌ఫీల్డ్ సొంతంగా తన ఫ్లోరిడా నర్సరీలో వందకి పైగా ప్లెక్ట్రాంథస్ బార్బటస్ మొక్కలను పెంచుతున్నారు. వీటి ఆకులను ఆయన ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. టాయిలెట్ పేపర్‌ కోసం ఈ మొక్కలను పెంచాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

ఇప్పటి వరకు, వందల మందికి ఈ మొక్క ఆకులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మొక్కను వాడిన ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని గ్రీన్‌ఫీల్డ్‌ తెలిపారు.

ప్లెక్ట్రాంథస్ బార్బటస్ మొక్క

ఫొటో సోర్స్, Robin Greenfield

ఫొటో క్యాప్షన్, ప్లెక్ట్రాంథస్ బార్బటస్ మొక్క

జనామోదం లభిస్తుందా?

డబ్ల్యూఈపీఏ అనేది యూరప్‌లోనే అతిపెద్ద టాయిలెట్ పేపర్ తయారీదారుల్లో ఒకటి. ఇటువంటి కంపెనీలు, సంప్రదాయ టాయిలెట్ పేపర్ వల్ల కలుగుతున్న పర్యావరణ ప్రభావాన్ని ప్రత్యామ్నాయ మార్గాలలో తగ్గిస్తున్నాయి.

ఫైబర్లను బ్లీచింగ్ చేయని టాయిలెట్ పేపర్‌ను ఉత్పత్తి చేసేందుకు రీసైకిల్ చేసిన కార్డుబోర్డును వాడే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసినట్లు డబ్ల్యూఈపీఏ అధికార ప్రతినిధి చెప్పారు.

''సాధారణంగా కాగితంగా మార్చడానికి ముందు చెక్కగుజ్జును బ్లీచ్ చేస్తారు. దీనివల్ల పర్యావరణంలోకి క్లోరినేటెడ్ కాంపౌండ్లు విడుదల అవుతాయి. కార్బన్ ఆధారిత వస్తువులకు ఈ కాంపౌండ్లు ప్రతిస్పందిస్తాయి. క్యాన్సర్, ఇతర ఆరోగ్య ప్రమాదాలను దారితీసే అత్యంత హానికరమైన రసాయనాలుండే డయాక్సిన్లను ఇవి సృష్టిస్తాయి'' అని నేచురల్ రిసోర్సస్ డిఫెన్స్ కౌన్సిల్ నివేదిక తెలిపింది.ఈ కౌన్సిల్ ఓ లాభాపేక్ష లేని సంస్థ.

అయితే, ప్లెక్ట్రాంథస్ బార్బటస్ పండించే ప్రాంతాలు, దేశాలపై కూడా పరిమితులు ఉన్నాయని మిస్సోరి బొటానికల్ గార్డెన్ అసోసియేట్ సైంటిస్ట్ చెప్పారు.

ఉదాహరణకు, దక్షిణాఫ్రికాలో ప్లెక్ట్రాంథస్ బార్బటస్‌ను ఆక్రమణ(స్థానికేతర) జాతుల్లో ఒకదానిగా పరిగణిస్తారు. వీటిని అక్కడ పెంచడం, విక్రయించడం నిషేధం. స్థానికేతర జాతుల మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా 423 బిలియన్ డాలర్ల(రూ.35,81,689 కోట్ల) నష్టం వాటిల్లుతోంది. జీవవైవిధ్య నష్టానికి ఇదే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.

అయితే, ప్రధాన స్రవంతిలోకి ఈ మొక్క వెళ్లడానికి ఉన్న అతిపెద్ద సవాలు, ప్రజల ఆమోదం. నైరోబీలో ఉన్న తన ప్లాంట్ నర్సరీపై ఒధియాంబో ఆశాజనకంగానే ఉన్నారు.

''టాయిలెట్ పేపర్‌గా ఈ మొక్కలను వాడేందుకు కొందరు వెనకడుగు వేయొచ్చు. కానీ, ఈ మొక్క ప్రయోజనాలను తెలుసుకున్నాక, ఇది పర్యావరణహితమైన ప్రత్యామ్నాయంగా నిలవనుందని నమ్ముతున్నా'' అని చెప్పారు ఒధియాంబో.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)