సిరియా: ఇక్కడ నీళ్లు బంగారం కంటే ఎక్కువ..

తుర్కియే, సిరియా, వైమానిక దాడులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ముడి చమురు, సహజవాయువు, ఎర్దోవాన్
ఫొటో క్యాప్షన్, హస్సకేహ్‌లో నివసిస్తున్న వారికి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరే ఆధారం
    • రచయిత, నమక్ ఖోస్నావ్, క్రిస్టఫర్ గైల్స్, సఫోరా స్మిత్
    • హోదా, బీబీసీ ఐ

తుర్కియే వైమానిక దాడులతో ఈశాన్య సిరియాలో పది లక్షల మందికి విద్యుత్, తాగునీటి సరఫరా ఆగిపోయింది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని నిపుణులు చెబుతున్నారు.

కుర్దిష్ అటానమస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్త్ అండ్ ఈస్ట్ సిరియా (ఏఏఎన్ఈఎస్) అధీనంలో 2019 అక్టోబర్ నుంచి 2024 జనవరి వరకు ఉన్న ముడి చమురు క్షేత్రాలు, సహజవాయు కేంద్రాలు, విద్యుత్ ‌ఉత్పత్తి కేంద్రాలపై తుర్కియే వందకు పైగా దాడులు జరిపినట్లు బీబీసీ వరల్డ్ సర్వీస్ సేకరించిన డేటాలో తేలింది.

వాతావరణ మార్పుల వల్ల ఈ ప్రాంతంలో నాలుగేళ్ల నుంచి తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఏడాది నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధంతో పరిస్థితులు క్షీణించాయి. తాజా దాడుల వల్ల మానవతా సంక్షోభం మరింత ముదిరింది.

ఇక్కడ ఇప్పటికే తాగునీటి కొరత ఉంది. అయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన దాడుల వల్ల అలౌక్‌లోని ప్రధాన తాగునీటి సరఫరా కేంద్రానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ మంచినీటి కేంద్రం మూతపడింది. బీబీసీ ఈ ప్రాంతాన్ని రెండు సార్లు సందర్శించినప్పుడు అక్కడి ప్రజల తాగునీటి ఇబ్బందులను గుర్తించింది.

తాను టెర్రరిస్టు గ్రూపుగా గుర్తించిన కుర్దిష్ వేర్పాటు వాద గ్రూపుల ఆదాయ మార్గాలు, సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తుర్కియే చెబుతోంది.

ఈ ప్రాంతంలో కరవు ఉందని అందరికీ తెలుసు. దీనికితోడు తాగునీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం, మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం పరిస్థితులను మరింత దిగజార్చాయి.

“తుర్కియే తమ ప్రజల ఉనికిని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని” ఏఏఎన్ఈఎస్ గతంలో ఆరోపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తుర్కియే, సిరియా, వైమానిక దాడులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ముడి చమురు, సహజవాయువు, ఎర్దోవాన్
ఫొటో క్యాప్షన్, హస్సకేహ్‌లో ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు.

హస్సకేహ్ ప్రావిన్స్‌లో పది లక్షల మందికి పైగా ప్రజలు ఉన్నారు. వీరికి కావాల్సిన తాగునీరు అలౌక్‌ నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు వీరంతా 12 కిలోమీటర్ల దూరం నుంచి అప్పుడప్పుడు వస్తున్న నీటి మీద ఆధారపడుతున్నారు.

ప్రతి రోజూ వందల సంఖ్యలో ట్యాంకులు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని కూడా ముందుగా స్కూళ్లు, అనాథ ఆశ్రమాలు, ఆసుపత్రులు, అత్యవసరంగా నీరు అవసరమైన వారికే అందిస్తున్నారు. కానీ, ఈ నీరు అందరికీ సరిపోవడం లేదు.

హస్సకేహ్ నగరంలో ప్రజలు నీటి ట్యాంకర్ల కోసం వేచి చూస్తూ, అవి రాగానే కొంచెం నీళ్లివ్వండని డ్రైవర్లను బతిమలాడటాన్ని బీబీసీ బృందం చూసింది. “ఇక్కడ నీళ్లు బంగారం కంటే విలువైనవి. ప్రజలందరికీ సరిపడా నీరు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది” అని ట్యాంకర్ డ్రైవర్ అహ్మదుల్ అహ్మద్ చెప్పారు.

తుర్కియే, సిరియా, వైమానిక దాడులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ముడి చమురు, సహజవాయువు, ఎర్దోవాన్

నీటి కోసం తాము యుద్ధం చేస్తున్నామని కొందరు స్థానికులు చెప్పారు. “మీరు (ట్యాంకర్ డ్రైవర్లు) నీళ్లు ఇవ్వకపోతే, మీ వాహనాల టైర్లను పంక్చర్ చేస్తాను” అని ఒక మహిళ వారిని బెదిరించారు.

“మీకొక నిజం చెప్పనివ్వండి, ఈశాన్య సిరియా తీవ్రమైన మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది” అని హస్సకేహ్ వాటర్ బోర్డు కో ఆర్డినేటర్ యహ్య అహ్మద్ చెప్పారు.

ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు, సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధంతోనే కాకుండా, తుర్కియే, కుర్దిష్ నాయకత్వంలోని దళాల మధ్య పోరులోనూ నలిగిపోతున్నారు. అమెరికా మద్దతున్న సంకీర్ణంతో కలిసి 2018లో ఏర్పడిన ఏఏఎన్ఈఎస్ ఈ ప్రాంతం నుంచి ఇస్లామిక్ స్టేట్‌ను తరిమివేసింది. ఇస్లామిక్ స్టేట్ మళ్లీ పుంజుకోకుండా సంకీర్ణ దళాలు ఇప్పటికీ ఈ ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నాయి.

ఏఏఎన్ఈఎస్‌ను ప్రపంచ దేశాలు గుర్తించలేదని, అది తమ సరిహద్దుల్లో ఏర్పడిన “ఉగ్రవాద రాజ్యం అని” అని తుర్కియే అధ్యక్షుడు రెచెప్ తయిప్ ఎర్దొవాన్ అన్నారు.

తుర్కియేలో కుర్దుల స్వయం ప్రతిపత్తి కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి అనుబంధంగా ఏర్పడిన ఏఏఎన్ఈఎస్ ఒక మిలిషియా గ్రూపు అని తుర్కియే ప్రభుత్వం భావిస్తోంది. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీని తుర్కియేతోపాటు యూరోపియన్ యూనియన్, అమెరికా, బ్రిటన్ టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించాయి.

2023 అక్టోబర్ నుంచి 2024 జనవరి మధ్య ఏఏఎన్ఈఎస్ ఆధీనంలో ఉన్న మూడు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కేంద్రాలు పని చెయ్యడం లేదు. అమౌదా, క్వామిషిలి, దార్బాసియాతో పాటు ఈ ప్రాంతానికి కీలకమైన స్వాదియేహ్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా పని చేయడం ఆగిపోయింది.

శాటిలైట్ చిత్రాలు, ప్రత్యక్ష సాక్షులు పంపిన వీడియోలు, న్యూస్ రిపోర్టులతో పాటు ఈ ప్రాంతంలో పర్యటించడం ద్వారా విద్యుత్ సరఫరాకు జరిగిన నష్టాలను బీబీసీ ధృవీకరించుకుంది.

జనవరి, 2024లో దాడులకు ముందు తర్వాత ఈ ప్రాంతంలో రాత్రి పూట లైట్లు ఉన్నప్పుడు లేనప్పుడు తీసిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఇక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయిందని తేలింది. “జనవరి 18న ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయి”అని శాటిలైట్ చిత్రాలను విశ్లేషించిన నాసా శాస్త్రవేత్త రంజయ్ శ్రేష్ఠ చెప్పారు.

ఈశాన్య సిరియాలో కరవు తర్వాత అంతర్యుద్దం వల్ల పది లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీటి సౌకర్యం దూరమైంది. ప్రజలకు నీరు అంచేందుకు ఇంజనీర్లు, ట్యాంకర్ డ్రైవర్లు చేస్తున్న ప్రయత్నాలను ఈ వీడియోలో చూడవచ్చు.

మధ్యలో ఉన్న గీతను అటు ఇటు జరపడం ద్వారా రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా అంతరాయాన్ని చూపే శాటిలైట్ చిత్రాలను ఈ కింద చూడవచ్చు

స్వాదియేహ్‌, అముడా, ఖమిష్లిలో తుర్కియే దళాలు దాడులు చేసినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. దర్బసియెహ్‌ మీద జరిగిన దాడుల వెనుక తుర్కియే ఉందని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి.

తాము కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ, ది పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్(వైపీజీ), కుర్దిష్ డెమోక్రటిక్ యూనియన్ (పీవైడీ) పార్టీని లక్ష్యంగా చేసుకున్నామని తుర్కియే చెబుతోంది.

అమెరికా మద్దతున్న సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్‌లో వైపీజీ అతి పెద్ద మిలీషియా, దీంతో పాటు పీవైడీకి చెందిన మిలటరీ విభాగం కూడా. ఏఏఎన్ఈఎస్‌లో వైపీజీ ముఖ్యమైన పార్టీ.

“పౌరులు లేదా పౌరులకు సంబంధించిన మౌలిక వసతుల్ని ఎన్నడూ లక్ష్యంగా చేసుకోలేదు” అని తుర్కియే ప్రభుత్వం బీబీసీతో చెప్పింది.

“ఇరాన్, సిరియాల్లో కుర్తిస్తాన్ వర్కర్స్ పార్టీ, వైపీజీకి చెందిన మౌలిక వసతులు, భారీ భవనాలు, ఇంధన ఉత్పత్తి కేంద్రాలు మా సైన్యం, భద్రత బలగాలు, నిఘా వర్గాలకు అత్యున్నత లక్ష్యాలు” అని తుర్కియే విదేశాంగమంత్రి హకన్ ఫిదాన్ 2023 అక్టోబర్‌లో చెప్పారు.

తుర్కియే, సిరియా, వైమానిక దాడులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ముడి చమురు, సహజవాయువు, ఎర్దోవాన్
ఫొటో క్యాప్షన్, మౌలిక వసతుల విధ్వంసం జరిగినట్లు చూపిస్తున్న ఏరియల్ గ్రాఫిక్ చిత్రం

‘‘యుద్ధ నేరాలుగా పరిగణించాలి’’

ఈ అంతర్యుద్దం పరిణామాలకు వాతావరణ మార్పుల ప్రభావం కూడా తోడైంది.

2020 నుంచి ఈశాన్య సిరియా, ఇరాక్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన, అసాధారణమైన కరవు వ్యవసాయ రంగాన్ని బాగా దెబ్బ తీసింది.

టైగ్రిస్- యూఫ్రటిస్ నదీ పరివాహక ప్రాంతంలో గత 70 ఏళ్లలో ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్ డిగ్రీలు పెరిగాయని యూరోపియన్ క్లైమేట్ డేటా వెల్లడించింది.

ఖాబౌర్ నది నుంచి గతంలో హస్సాకేహ్‌ నగరానికి నీటి సరఫరా జరిగేది. అయితే ఈ నదిలో నీటి పరిమాణం క్రమేపీ తగ్గిపోవడంతో ప్రజలు అలౌక్ వాటర్ స్టేషన్ వైపు మళ్లాల్సి వచ్చింది.

తుర్కియే 2019లో రస్ అల్ ఏయిన్ ప్రాంతం మీద పట్టు సాధించింది. అలౌక్ ఈ ప్రాంతంలోనే ఉంది. దేశాన్ని టెర్రరిస్ట్ దాడుల నుంచి కాపాడేందుకు తాము “రక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు’’ తుర్కియే చెబుతోంది.

ఇది జరిగిన రెండేళ్ల తర్వాత అలౌక్ నుంచి ఈశాన్య సిరియాకు జరిగే నీటి సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోందని ఐక్యరాజ్య సమితి అభ్యంతరాలు లేవనెత్తింది. దాదాపు 19 సార్లు నీటి సరఫరాను అడ్డుకున్నట్లు తెలిపింది.

విద్యుత్ సరఫరా మౌలిక వసతుల మీద 2023 అక్టోబర్‌లో జరిగిన దాడులు, పౌరులకు తాగునీరు అందకుండా అడ్డుకోవడం వంటి వాటిని యుద్ధ నేరాలుగా పరిగణించాలని 2024 ఫిబ్రవరిలో స్వతంత్ర ఐక్యరాజ్యసమితి కమిషన్ ప్రచురించిన నివేదిక తెలిపింది.

తుర్కియే, సిరియా, వైమానిక దాడులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ముడి చమురు, సహజవాయువు, ఎర్దోవాన్

బీబీసీ తాను కనుగొన్న అంశాల గురించి అంతర్జాతీయ న్యాయవాదుల వద్ద ప్రస్తావించింది.

“ఇంధన వసతుల మీద తుర్కియే దాడుల వల్ల పౌరుల మీద దారుణమైన ప్రభావం పడింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే” అని ఆరిఫ్ అబ్రహాం చెప్పారు. ఆయన డౌటీ స్ట్రీట్ చాంబర్స్‌లో న్యాయవాదిగా పని చేస్తున్నారు.

“అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన సంకేతాలు చాలా బలంగా ఉన్నాయి. వాటిపై న్యాయ నిపుణులతో దర్యాప్తు చెయ్యాలి” అని యూరోపియన్ సెంటర్ ఫర్ కాన్‌స్టిట్‌ట్యూషనల్ అండ్ హ్యూమన్ రైట్స్‌లో ఇంటర్నేషనల్ క్రిమినల్ లాయర్ పాట్రిక్ క్రోకర్ చెప్పారు.

తాము “అంతర్జాతీయ చట్టాలను సంపూర్ణంగా గౌరవిస్తామని” తుర్కియే ప్రభుత్వం చెప్పింది. 2024లో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికను ప్రస్తావిస్తూ “ అందులో పేర్కొన్న అంశాలకు ఎలాంటి ఆధారాలు లేవు. అవి నిరాధార ఆరోపణలు” అని తెలిపింది.

“దీర్ఘకాలంగా తాగునీటి కల్పన వసతుల్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్లనే” నీటి కొరత ఏర్పడిందని, దీనికి వాతావరణ మార్పులు కూడా కారణమని ఆరోపించింది.

తమను ఎవరూ పట్టించుకోవడం లేదని హస్సాకేహ్ ప్రజలు బీబీసీతో చెప్పారు.

“మేము అనేక త్యాగాలు చేశాం. యుద్ధంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మేం కేవలం తాగునీరు అందించమని మాత్రమే అడుగుతున్నాం” అని వాటర్‌ బోర్డులో నీటిని పరీక్షించే విభాగానికి అధిపతి ఒస్మాన్ గడ్డో చెప్పారు.

అదనపు రిపోర్టింగ్ : అహ్మద్ నౌర్, ఇర్వాన్ రివాల్ట్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)