టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’

టర్కీ ట్యాంకు

ఫొటో సోర్స్, Reuters

ఉత్తర సిరియాలోని ప్రతిపాదిత 'సేఫ్ జోన్' నుంచి వెనక్కివెళ్లకపోతే 'తలలు చిదిమేస్తామ'ని కుర్దు ఫైటర్ల‌ను టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ హెచ్చరించారు.

కుర్దు దళాల ఉపసంహరణకు వీలుగా.. ఐదు రోజుల పాటు సైనిక చర్యను నిలిపివేసేందుకు టర్కీ గురువారం అంగీకరించింది. కానీ, శనివారం ఇరుపక్షాలూ పరస్పరం కాల్పుల విరమణ ఉల్లంఘనల ఆరోపణలు చేసుకున్నాయి.

కుర్దు మిలీషియా గ్రూపు పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ (వైపీజీ)ని టర్కీ 'ఉగ్రవాద సంస్థ'గా చూస్తోంది. దాన్ని వెనక్కినెట్టి సిరియాలోని సరిహద్దు ప్రాంతంలో ఒక 'సేఫ్ జోన్'ను ఏర్పాటు చేయాలనుకుంటోంది.

కుర్దు దళాలు, టర్కీకి మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఉన్నప్పటికీ అడపాదడపా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. రస్ అల్-అయిన్ పట్టణ సరిహద్దుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది.

ఎర్డోగన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎర్డోగాన్

ఎర్డోగాన్ ఏమన్నారంటే..

శనివారం టీవీల్లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఎర్డోగాన్ మాట్లాడారు.

కాల్పుల విరమణపై కుదిరిన అంగీకారం ప్రకారం మంగళవారం సాయంత్రంలోపు కుర్దు ఫైటర్లు వెనక్కివెళ్లాలని ఆయన అన్నారు.

''లేకపోతే, ఆపిన దగ్గర నుంచి మళ్లీ మొదలుపెడతాం. ఉగ్రవాదుల తలలు చిదిమేస్తాం'' అని ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వచ్చే వారం ఎర్డోగాన్ చర్చలు జరపాల్సి ఉంది. ఆ చర్చల్లో ఓ పరిష్కారం దొరక్కపోతే, 'సొంత ప్రణాళికల అమలు'ను టర్కీ మొదలుపెడుతుందని ఎర్డోగన్ అన్నారు.

36 గంటల వ్యవధిలో కుర్దు బలగాలు తమను 'రెచ్చగొట్టేలా' 14 దాడులు చేశాయని, వీటిలో ఎక్కువ ఘటనలు రస్ అల్-అయిన్‌లోనే జరిగాయని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. టర్కీ బలగాలు సంయమనం పాటిస్తున్నాయని, కాల్పుల విరమణకు పూర్తిగా కట్టుబడి ఉంటున్నాయని వివరించింది.

మరోవైపు, కాల్పుల విరమణను టర్కీ ఉల్లంఘిస్తోందని కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్) ఆరోపించింది.

సిరియా, కుర్దు

ఫొటో సోర్స్, Reuters

పౌరులను, గాయపడ్డవారిని తరలించడం కోసం సేఫ్ కారిడార్‌ను ఏర్పాటు చేయడంలో టర్కీ బలగాలు విఫలమయ్యాయని ఆరోపించింది.

కుర్దు బలగాలకు, టర్కీకి మధ్య కాల్పుల విరమణ అంగీకారం కోసం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మధ్యవర్తిత్వం వహించారు.

పౌరుల తరలింపును అనుమతించేలా టర్కీపై ఒత్తిడి తేవాలని మైక్ పెన్స్‌కు ఎస్‌డీఎఫ్ విజ్ఞప్తి చేసింది.

''అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నా, సమస్యను పరిష్కరిస్తామని వాళ్లు హామీ ఇచ్చినా, వాస్తవంగా ఇంతవరకూ ఎలాంటి పురోగతీ జరగలేదు'' అని ఎస్‌డీఎఫ్ తన ప్రకటనలో వివరించింది.

సిరియా, కుర్దు

ఫొటో సోర్స్, Getty Images

కుర్దు బలగాల ఉపసంహరణ కోసం అమెరికా ఒత్తిడి పెంచాలని తమ దేశం కోరుకుంటున్నట్లు టర్కీ అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి ఇబ్రహీం కలిన్ చెప్పారు.

రస్ అల్-అయిన్‌కు మానవీయ సాయాల సరఫరా ఆగిపోయిందని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది.

టర్కీ ఆపరేషన్‌లో మరణించిన పౌరుల సంఖ్య 86కు చేరిందని తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత వారం ఎర్డోగాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత.. సిరియాలోని ఈశాన్య ప్రాంతం నుంచి డజన్ల సంఖ్యలో అమెరికా సైనిక బలగాలను అర్ధంతరంగా ఉపసంహరించుకున్నారు.

అమెరికా బలగాల ఉపసంహరణ ప్రకటన వచ్చిన అనంతరం, టర్కీ అక్టోబర్ 9న సైనిక చర్య మొదలుపెట్టింది.

ఎర్డోగన్, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఉత్తర సిరియాలో 'సేఫ్ జోన్' ఉండాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు

తమతో సరిహద్దులున్న సిరియా ప్రాంతం నుంచి కుర్దు బలగాలను వెనక్కి తరిమివేసి.. అక్కడ 'సేఫ్ జోన్‌'ను ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ చర్యకు దిగినట్లు టర్కీ చెప్తోంది.

సరిహద్దు వెంబడి 440 కి.మీ.ల పొడవున, 30 కి.మీ.ల లోపలికి దీన్ని ఏర్పాటు చేయాలని టర్కీ యోచిస్తోంది. దాదాపు 20 లక్షల మంది సిరియా శరణార్థులకు ఆ ప్రాంతంలో పునరావాసం కల్పించాలన్నది ప్రణాళిక.

అయితే, ఆ శరణార్థుల్లో చాలా మంది కుర్దులు కాదు. టర్కీ తాను అనుకుంటున్నట్లు చేస్తే... స్థానిక కుర్దుల జాతి నిర్మూలన జరిగే ప్రమాదం ఉందని చాలా మంది విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

సైనిక చర్య సమయంలో టర్కీ, దాని మిలీషియాలు యుద్ధ నేరాలకు పాల్పడుతుండవచ్చని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

యుద్ధ నేరాలు, ఉల్లంఘనలకు సంబంధించి 'గట్టి ఆధారాలు' తాము సేకరించిట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది.

ఈ ఆరోపణలపై విచారణ జరపాలని ఐక్య రాజ్య సంస్థ టర్కీకి సూచించింది.

టర్కీ అనుబంధ బలగాలు పాస్ఫరస్ రసాయనిక ఆయుధాన్ని వాడినట్లు కూడా వార్తలు వచ్చాయి.

రస్ అల్-అయిన్‌ సమీపంలో టర్కీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఎస్‌డీఎఫ్ అధికార ప్రతినిధి ముస్తఫా బాలీ ట్వీట్ చేశారు.

అయితే, ఈ ఘర్షణల గురించిన వార్తలు తప్పుడు కథనాలేనని ఎర్డోగాన్ అన్నారు. అయితే, రస్ అల్-అయిన్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన పేలుళ్లను అంతర్జాతీయ మీడియా రికార్డ్ చేసింది.

సరిహద్దు ప్రాంతం నుంచి వెనక్కివెళ్లే ప్రక్రియను ఎస్‌డీఎఫ్ ఇంకా మొదలుపెట్టలేదని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ శనివారం తెలిపింది.

కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి రస్ అల్-అయిన్‌లో 13 మంది కుర్దు ఫైటర్లు, ఐదుగురు పౌరులు చనిపోయినట్లు స్థానిక కుర్దు మీడియా కథనాలు ప్రసారం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)