సిరియా నుంచి బలగాల ఉపసంహరణపై ట్రంప్: "అది మా సరిహద్దు కాదు, అక్కడ మా సైనికులు చనిపోకూడదు"

ఫొటో సోర్స్, Getty Images
సిరియా భూభాగంలోకి ప్రవేశించి టర్కీ దాడులు జరపడంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందిస్తూ- ఆ ప్రాంతం తమ సరిహద్దు కాదన్నారు.
సిరియాలో టర్కీ ఆపరేషన్ తమ సమస్య కాదని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఆయన "టర్కీ-సిరియా సరిహద్దుల్లో టర్కీకి సమస్య ఉంది. అది మా సరిహద్దు కాదు. ఈ అంశంలో మా సైనికులు ప్రాణాలు కోల్పోకూడదు" అని చెప్పారు.
టర్కీ-సిరియా సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా అనుకూలంగా ఉందని ట్రంప్ చెప్పారు.
"మా సైనికులు అక్కడి నుంచి వచ్చేశారు. వార పూర్తి సురక్షితంగా ఉన్నారు. అక్కడ సమస్యను వాళ్లు (టర్కీ) పరిష్కరించుకోవాల్సి ఉంది. వాళ్లు యుద్ధం లేకుండానే పరిష్కరించుకోవచ్చనుకుంటున్నా" అని ట్రంప్ చెప్పారు.
తాము పరిస్థితులను గమనిస్తున్నామని, చర్చలు జరుపుతున్నామని, టర్కీ సరైన చర్య చేపట్టేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎందుకంటే యుద్ధాలు ఆపాలని కోరుకొంటున్నామని ఆయన వివరించారు.
సిరియాలో అమెరికా మాజీ మిత్రపక్షమైన కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్)ని ఉద్దేశించి- వాళ్లేమీ దైవదూతలు కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
"ఎస్‌డీఎఫ్ మాతో కలసి పోరాడింది. మాతో కలిసి పోరాడేందుకు వాళ్లకు మేం చాలా డబ్బిచ్చాం. మాతో కలిసి పోరాడినప్పుడు వాళ్ల తీరు బాగుంది. కానీ మాతో కలిసి పోరాడనప్పుడు వారి తీరు సరిగా లేదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బలగాల ఉపసంహరణను ఖండించిన ప్రతినిధుల సభ
సిరియా నుంచి అమెరికా ఇటీవల సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. టర్కీ బలగాలు సిరియాలోకి ప్రవేశించి దాడులు జరపడానికి అమెరికా చర్య ఊతమిచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ- అమెరికా పోలీసింగ్ ఏజెంట్ కాదని చెప్పారు. సిరియా నుంచి తమ బలగాలను స్వదేశానికి రప్పించాల్సిన సమయం వచ్చేసిందని, అందుకే ఉపసంహరించుకొన్నామని తెలిపారు.
సిరియా నుంచి ట్రంప్ అమెరికా బలగాలను ఉపసంహరించడాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఖండించింది. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ ఈ చర్యను వ్యతిరేకించారు.
సిరియాపై అమెరికా పార్లమెంటు కాంగ్రెస్ నాయకులతో సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ సంయమనం కోల్పోయారని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ విలేఖరులతో చెప్పారు. నాన్సీ పెలోసీని అధ్యక్షుడు 'థర్డ్-రేట్ రాజకీయ నాయకురాలు' అని అన్నారని, దీంతో తమ పార్టీ నాయకులు సమావేశంలోంచి వచ్చేశారని డెమొక్రటిక్ సెనేటర్ చుక్ ష్కుమర్ చెప్పారు.
పెలోసీ సంయమనం కోల్పోయారని ట్రంప్ ఆరోపించారు.
పెలోసీ వ్యవహారశైలి అనుచితంగా ఉందని రిపబ్లికన్ పార్టీ నాయకులు ఆరోపించారు. సమావేశంలోంచి ఆమె వెళ్లిపోవడంపై విమర్శలు గుప్పించారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
టర్కీ దాడులు ఎందుకు?
'పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ (వైపీజీ)' అనే సిరియన్ కుర్దు మిలీషియా సభ్యులను టర్కీ-సిరియా సరిహద్దు నుంచి వెనక్కు తరిమేసి, సరిహద్దుల్లో సిరియా భూభాగంలో ఒక 'సేఫ్ జోన్' ఏర్పాటు చేసేందుకు టర్కీ వారం క్రితం తాజా ఆపరేషన్ చేపట్టింది.
సరిహద్దు వెంబడి 480 కిలోమీటర్ల పొడవున, 32 కిలోమీటర్ల లోపలి వరకు దీనిని ఏర్పాటు చేస్తామని టర్కీ చెప్పింది. తాను ఆశ్రయమిస్తున్న 36 లక్షల మంది సిరియా శరణార్థుల్లో 20 లక్షల మంది వరకు శరణార్థులకు ప్రతిపాదిత సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించాలని టర్కీ ఆశిస్తోంది.
అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకొన్న తర్వాత టర్కీ ఈ ఆపరేషన్ మొదలుపెట్టింది. సిరియాలో కుర్దు, అరబ్ మిలీషియాలతో కూడిన ఎస్‌డీఎఫ్‌లో వైపీజీ బలమైన భాగస్వామి. వైపీజీని టర్కీలో కుర్దుల స్వయంప్రతిపత్తి కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న నిషేధిత 'కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే)'కి అనుబంధ సంస్థగా టర్కీ పరిగణిస్తుంది. పీకేకేను ఉగ్రవాద సంస్థగానూ టర్కీ ప్రకటించింది.
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌పై పోరాటంలో ఇటీవలి వరకు అమెరికాకు ఎస్‌డీఎఫ్ కీలక మిత్రపక్షంగా ఉంటూ వచ్చింది. అమెరికా నాయకత్వంలోని వివిధ దేశాల కూటమి వైమానిక దాడుల తోడ్పాటుతో గత నాలుగేళ్లలో సిరియాలో పావు వంతు భూభాగం నుంచి ఈ గ్రూప్‌ను ఎస్‌డీఎఫ్ తరిమేసింది. అమెరికా బలగాల ఉపసంహరణ, టర్కీ దాడులు, ఇతర పరిణామాల నేపథ్యంలో ఏర్పడ్డ అస్థిరత ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు పుంజుకోవడానికి దారితీయొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, AFP
పీకేకేతోనే ముప్పు ఎక్కువ: ట్రంప్
కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ తీవ్రస్థాయిలో ఉగ్రవాదానికి పాల్పడుతోందని ట్రంప్ చెప్పారు. చాలా కోణాల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కంటే కూడా ఈ పార్టీ ఎక్కువ ఉగ్రవాద ముప్పును కలిగిస్తోందన్నారు.
ఉత్తర సిరియాలో ఆపరేషన్ చేపట్టేందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తాయిప్ ఎర్దోగాన్‌కు తాను పచ్చజెండా ఏమీ ఊపలేదని ట్రంప్ మీడియాతో చెప్పారు. సిరియాలో ఆపరేషన్ చేపట్టాక ఈ అంశంపై తాను ఎర్దోగాన్‌తో మాట్లాడానని, ఆ తర్వాత ఆయనకు 'చాలా శక్తిమంతమైన లేఖ' రాశానని పేర్కొన్నారు.
టర్కీ ఆపరేషన్‌ను మొదలుపెట్టిన అక్టోబరు 9న రాసిన ఈ లేఖ 16న వెలుగులోకి వచ్చింది. సిరియా విషయంలో సరైన విధంగా, మానవీయ పద్ధతిలో వ్యవహరిస్తే మిమ్మల్ని చరిత్ర సానుకూలంగా గుర్తుంచుకుంటుందని, అక్కడ పరిణామాలు బాగోలేకపోతే ఎప్పటికీ రాక్షసుడిగానే చూస్తుందని లేఖలో టర్కీ అధ్యక్షుడినుద్దేశించి ట్రంప్ చెప్పారు. అతికటువుగా వ్యవహరించొద్దని, అవివేకిగా మిగలొద్దని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, EPA
వైపీజీపై ఎవరి వైఖరి ఏమిటి?
వైపీజీని పీకేకే అనుబంధ సంస్థగా టర్కీ పరిగణిస్తుంది.
పీకేకేను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. పీకేకే, వైపీజీ మధ్య సంబంధాలున్నట్లు ఇంతకుముందు చెప్పింది. అయితే పీకేకేకు వైపీజీ అనుబంధ సంస్థ అనే టర్కీ వాదనను తోసిపుచ్చింది.
ఉత్తర సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ మొదలయ్యాక, దాడుల్లో టర్కీ సేనలు పైచేయి సాధించాక ఈ ప్రాంతంలోని కుర్దు బలగాలు సిరియా ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి అంగీకరించాయి. దీని ప్రకారం- సిరియా సరిహద్దులో టర్కీ దాడులను ఎదుర్కోవడంలో తమకు సహకరించేందుకు ప్రభుత్వం సిరియా సైన్యాన్ని మోహరించాలి.

ఫొటో సోర్స్, Reuters
దాడులు కొనసాగిస్తామన్న టర్కీ
టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్‌తో చర్చించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపేయో టర్కీ రాజధాని అంకారాకు వెళ్తున్నారు.
ఈ నెల 14న టర్కీపై అమెరికా ఆంక్షలను ప్రకటించింది. సిరియాలో దాడులను ఆపేసేలా ఒత్తిడి తెచ్చేందుకు టర్కీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
తాము కూడా అమెరికాపై ఆంక్షలకు సిద్ధమవుతున్నామని టర్కీ అధ్యక్షుడి అధికార ప్రతినిధి ఈ నెల 16న ప్రకటించారు.
సిరియాలో దాడులను కొనసాగిస్తామని, కుర్దు ఫైటర్లతో చర్చలు జరపబోమని టర్కీ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, AFP
'కొబానేకు చేరుకున్న రష్యా బలగాలు'
ఉత్తర సిరియాలోని సరిహద్దు పట్టణం కొబానేకు సిరియా, రష్యా బలగాలు చేరుకున్నాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే 'సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్' ఈ నెల 16న తెలిపింది. టర్కీ దాడుల నేపథ్యంలో కుర్దు ఫైటర్లు, సిరియా ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ బలగాలు ఇక్కడకు వచ్చాయి.
ఉత్తర సిరియాలో టర్కీ ఆపరేషన్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారని, లక్షా 60 వేల మంది ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
దాడులను ఆపాలని ఈ నెల 16న ఐరాస భద్రతా మండలి మరోమారు టర్కీకి పిలుపునిచ్చింది.

ఫొటో సోర్స్, AFP
ఈ నెల 15న వ్యూహాత్మకంగా ముఖ్యమైన మన్బీజ్ పట్టణంలోకి సిరియా ప్రభుత్వ సేనలు ప్రవేశించాయి. టర్కీ ప్రతిపాదిత సేఫ్ జోన్ పరిధిలోనే ఈ పట్టణం ఉంది.
టర్కీ బలగాలు, టర్కీ అనుకూల బలగాలు, సిరియా ప్రభుత్వ వ్యతిరేక ఫైటర్లు కూడా మన్బీజ్ పట్టణం సమీపంలో పోగవుతున్నాయి.
గత రెండేళ్లలో వందల కొద్దీ అమెరికా సైనికులు ఈ కీలక పట్టణంలో గస్తీ కాశారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ- షీ జిన్‌పింగ్ సమావేశం: చిన్న పట్టణం మహాబలిపురాన్నే ఎందుకు ఎంచుకున్నారు
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ముఖద్వారంపై ట్రాన్స్‌వుమన్ రేవతి పేరు
- 'పప్పు' చేసిన అద్భుతం... అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో జంటకు నోబెల్
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- అణ్వస్త్రాలు: ''మేం మొదట ఉపయోగించం'' అన్న హామీని ఇండియా ఇప్పుడు ఎందుకు సమీక్షిస్తోంది
- సౌరవ్ గంగూలీ: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’ - BBC exclusive
- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








