సిరియాలో సైనిక చర్య చేపట్టిన టర్కీపై తీవ్రమైన ఆంక్షలు విధించిన అమెరికా

ఫొటో సోర్స్, AFP
సిరియాలోని ఉత్తర ప్రాంతం మీద టర్కీ సైనిక దాడులకు ప్రతిస్పందనగా.. టర్కీ మంత్రిత్వ శాఖలు రెండిటితో పాటు, ముగ్గురు సీనియర్ అధికారుల మీద అమెరికా ఆంక్షలు విధించింది.
టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫోన్ చేసి, తక్షణం సంధి చేసుకోవాలని కూడా డిమాండ్ చేశారని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పారు.
సాధ్యమైనంత త్వరగా తాను ఆ ప్రాంతానికి వెళ్లి చర్చలు జరుపుతానని ఆయన అన్నారు.
దీనికి ముందు సిరియా బలగాలు ఈశాన్య ప్రాంతంలోకి ప్రవేశించాయి. అవి టర్కీ సారథ్యంలోని బలగాలతో పోరు జరిగే అవకాశముంది. కిందటి వారం వరకూ అమెరికా మిత్రపక్షంగా ఉన్న కుర్దు బలగాలతో చేసుకున్న ఒప్పందం మేరకు సిరియా సైనిక బలగాలు రంగంలోకి దిగాయి.
సిరియాలో తమ సరిహద్దు ప్రాంతం నుంచి కుర్దు బలగాలను వెనుకకు తరిమివేసి.. అక్కడ 'సురక్షిత మండలి'ని ఏర్పాటు చేయటం లక్ష్యంగా తాము సైనిక చర్య చేపట్టినట్లు టర్కీ చెప్తోంది.
సిరియా భూభాగంలోపలికి 30 కిలోమీటర్ల ఈ 'సురక్షిత మండలి'ని ఏర్పాటు చేయటం ద్వారా.. తన భూభాగంలో ఉన్న దాదాపు 20 లక్షల మంది సిరియా శరణార్థులకు ఆ ప్రాంతంలో పునరావాసం కల్పించాలన్నది టర్కీ యోచన.
ఆ శరణార్థుల్లో చాలా మంది కుర్దులు కాదు. టర్కీ తాను అనుకుంటున్నట్లు చేస్తే... స్థానిక కుర్దు ప్రజల జాతి నిర్మూలన జరిగే ప్రమాదం ఉందని చాలా మంది విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
అమెరికా ఆంక్షల సంగతి ఏమిటి?
అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ ముంచిన్ మీడియాతో మాట్లాడుతూ, అమెరికా విధించిన ఆంక్షలు చాలా తీవ్రమైనవని అవి టర్కీ ఆర్థిక వ్యవస్థ మీద దుష్ప్రభావం చూపుతాయన్నారు.
టర్కీకి చెందిన రక్షణ, ఇంధన మంత్రిత్వశాఖల మీద, రక్షణ, ఇంధన, అంతర్గత వ్యవహారాల మంత్రుల మీద చర్యలు చేపట్టామని అమెరికా విత్త మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
''టర్కీ ప్రభుత్వ చర్యలు అమాయక ప్రజల జీవితాలకు ప్రమాదకరంగా పరిణమించాయి. ఆ ప్రాంతాన్ని అస్థిరపరుస్తున్నాయి. ఐసిస్‌ను ఓడించే కార్యక్రమాన్ని దెబ్బతీస్తున్నాయి'' అని ఆ ప్రకటన తప్పుపట్టింది.
టర్కీ తక్షణం కాల్పుల విరమణ పాటించి, హింసను నిలిపివేసి, దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్చలు జరపటానికి అంగీకరించే వరకూ.. ఆ దేశం మీద ఆంక్షలు కొనసాగుతాయని, మరింత తీవ్రమవుతాయని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హెచ్చరించారు.
ట్రంప్ ఇదే విషయాన్ని ఎర్డోగన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ పునరుద్ఘాటించారని పెన్స్ తెలిపారు. ''సిరియాను ఆక్రమించటానికి టర్కీకి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు'' అని కూడా ఆయన ఉద్ఘాటించారు.
సిరియాలో టర్కీ చొరబాటు ఆమోదనీయం కాదంటూ, ఆ చర్యల ఫలితంగా చాలా బంది ఐస్ బందీల విడుదలయ్యారని అమెరికా ఇంతకుముందు తప్పుపట్టింది.
యూరోపియన్ యూనియన్ దేశాలు సైతం టర్కీకి ఆయుధాల ఎగుమతిని నిలిపివేయాలని నిర్ణయించాయి. దీనికి టర్కీ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్ వైఖరి ''చట్టవ్యతిరేకం, వివక్షపూరితం'' అని తప్పుపట్టింది. ఈయూతో తన సహకారం మీద పున:పరిశీలిస్తామని పేర్కొంది.

ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది?
సిరియా ఉత్తర ప్రాంతంలో టర్కీ ఏర్పాటు చేయదలచుకున్న ''సురక్షిత మండలి'' ప్రాంతంలోని వ్యూహాత్మక పట్టణం 'మాన్బిజ్'లోకి రష్యా మద్దతు గల సిరియా సైనిక దళాలు ప్రవేశించాయని సిరియా అధికారిక మీడియా తెలిపింది.
టర్కీ బలగాలు, దానికి మద్దతుగా ఉన్న సిరియా మిలీషియాలు ఆ పట్టణం సమీపంలో మోహరిస్తున్నాయి.
కుర్దుల సారథ్యంలోని బలగాలతో ఒప్పందం.. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను బలోపేతం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో తిరుగుబాటుదారులతో పోరాటం కోసం ఆయన బలగాలు 2012లో ఈశాన్య ప్రాంతం నుంచి తప్పుకున్నాయి. దానివల్ల కుర్దు మిలీషియాలు ఈ ప్రాంతం మీద పట్టు సాధించాయి. ఇప్పుడు మళ్లీ అసద్ ప్రభుత్వ బలగాలు ఈ ప్రాంతంలో తిరిగి అడుగుపెడుతున్నాయి.

ఫొటో సోర్స్, AFP
కుర్దుల స్వయం పాలన ప్రయత్నాలతో అసద్ విభేదించినప్పటికీ.. ఆ ప్రాంతాన్ని తిరిగి తన స్వాధీనంలోకి తీసుకోవటానికి ఆయన ప్రయత్నించలేదు. క్షేత్రస్థాయిలో ఇస్లామిక్ స్టేట్ మీద పోరాటంలో అమెరికా బలగాల సంకీర్ణంలో కుర్దులు భాగస్వాములవటం దీనికి కారణం.
ఐఎస్ మీద పోరాటంలోనే కాదు.. అమెరికా ప్రత్యర్థులైన రష్యా, ఇరాన్‌ల ప్రభావాన్ని సిరియాలో పరిమితం చేయటంలోనూ కుర్దులు కీలక పాత్ర పోషించారు.
ఎర్డోగన్‌కు సన్నిహిత మిత్రపక్షమైన రష్యా.. సిరియాలో రష్యా - టర్కీ బలగాల మధ్య ఘర్షణకు తావు ఇవ్వకూడదని తాను భావిస్తున్నట్లు చెప్పింది. టర్కీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
టర్కీ సైనిక చర్య ఫలితంగా దాదాపు 1,60,000 మంది పౌరులు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓసీహెచ్ఏ తెలిపింది. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని కూడా పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP
సిరియాలో 50 మంది పౌరులు, టర్కీలోని సరిహద్దు ప్రాంతంలో మరో 18 మంది పౌరులు చనిపోయినట్లు వార్తలు చెప్తున్నాయి. కుర్దు బలగాలు తమ ఫైటర్లు 56 మంది చనిపోయారని నిర్ధారించాయి. టర్కీ.. తన సైనికులు నలుగురు, టర్కీ అనుకూల సిరియా ఫైటర్లు 16 మంది సిరియాలో చనిపోయినట్లు చెప్తోంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత వారంలో ఎర్డోగన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత.. సిరియాలోని ఈశాన్య ప్రాంతం నుంచి డజన్ల సంఖ్యలో అమెరికా సైనిక బలగాలను అర్ధంతరంగా ఉపసంహరించుకున్నారు.
ఈ పరిణామం.. సిరియా ఈశాన్య ప్రాంతంలో టర్కీ సైనిక చర్య చేపట్టటానికి మార్గం పరిచింది. సిరియాలోని కుర్దు గ్రూపులు.. టర్కీలో కుర్దు స్వయంప్రతిపత్తి కోసం మూడు దశాబ్దాల పాటు పోరాడిన నిషిద్ధ కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయని టర్కీ భావిస్తోంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఇవి కూడా చదవండి:
- రెడ్డి సుభానా: "మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి" అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు?
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- నిరసన ప్రదర్శనలు, అహింసా ఉద్యమాలతో సమాజంలో మార్పు రాదా? ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ ఏమంటోంది?
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








