సిరియా అంతర్యుద్ధం ఎలా మొదలైంది, 11 ఏళ్ల తర్వాత ఇప్పుడెలా ఉంది?

సిరియా అంతర్యుద్ధంలో లక్షలమంది సామాన్యులు మరణించారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సిరియా అంతర్యుద్ధంలో లక్షలమంది సామాన్యులు మరణించారు

పదకొండేళ్ల కిందట సిరియాలో నిశ్శబ్ధంగా మొదలైన ఉద్యమం పూర్తి స్థాయి అంతర్యుద్ధంగా మారింది. లక్షలమంది ప్రజలు మరణించగా, ఇంకా అనేకమంది దేశం విడిచి విదేశాలలో తలదాచుకున్నారు.

అసలు ఎలా మొదలైంది?

సిరియాలో సంక్షోభం ప్రారంభం కావడానికి ముందే ఆ దేశ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం, అసంతృప్తి నెలకొని ఉన్నాయి. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో అవినీతి, నిరుద్యోగం పెచ్చుమీరాయి. రాజకీయ స్వేచ్ఛ లేదు.

నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పొరుగు దేశాలలో సాగుతున్న ఉద్యమాల నుంచి స్ఫూర్తి పొంది సిరియాలో కూడా ఆందోళనలు పుట్టుకు రావడం మొదలయ్యాయి.

ముందుగా 2011 మార్చిలో సిరియాలోని డీరా నగరంలో ఒక్కసారిగా ఆందోళనలు ఎగిసిపడ్డాయి. దీన్ని ప్రభుత్వం కఠినంగా అణచివేసింది. అయితే ఆ తర్వాత బషర్ అల్ అసద్ గద్దె దిగాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి.

దేశంలో ఆందోళనలు, నిరసనలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం కూడా వాటిపై ఉక్కుపాదం మోపుతూ వచ్చింది. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, మద్ధతుదారులు తుపాకులు పట్టారు. ముందు తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలు పట్టిన ప్రజలు, ఆ తర్వాత సైన్యం మీద దాడులు చేయడం మొదలు పెట్టారు.

వీడియో క్యాప్షన్, సిరియాలో ఏం జరుగుతోంది! 95 సెకన్లలో మొత్తం చూడండి

''విదేశాల మద్ధతుతో రెచ్చిపోతున్న టెర్రరిస్టు ముఠా చర్య''గా అధ్యక్షుడు అల్ అసద్ ఈ తిరుగుబాటును అభివర్ణించారు.

చివరకు ఈ హింసే సివిల్ వార్‌గా మారింది. వందల కొద్దీ ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు ముఠాలు పుట్టుకొచ్చి అల్ అసద్ సైన్యంపై పోరాటం మొదలు పెట్టాయి. చివరకు ఇది సిరియా ప్రజలకు, అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మధ్య యుద్ధంలా మారింది.

విదేశీ శక్తులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు వివిధ రూపాల్లో సాయం చేయడం ప్రారంభించాయి. ఆయుధాలు, డబ్బు, సైనికులను అందించాయి. ఇక ఈ ఆందోళనల్లోకి అతివాద ఇస్లామిక్ గ్రూప్‌లైన అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లాంటివి కూడా చేరడంతో పరిస్థితి మరింత బీభత్సంగా మారింది.

సిరియాలో అల్ అసద్ పాలన నుంచి విముక్తి కోరుతూ, స్వయం పాలన కోసం డిమాండ్ చేస్తున్న కుర్దులు కూడా ఈ పోరాటంలో చేరడంతో సంక్షోభం ముదిరింది.

ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య సామాన్యులు నలిగిపోయారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య సామాన్యులు నలిగిపోయారు

ఎంతమంది మరణించారు?

2011 మార్చి నుంచి 2021 మార్చి మధ్య కాలంలో కనీసం 3.5 లక్షలమంది చనిపోయి ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, ఈ సంఖ్య చాలా తక్కువని, లెక్కకు రాని మరణాలెన్నో ఉన్నాయని కూడా వెల్లడించింది.

చనిపోయిన వారిలో 26,727 మంది మహిళలు కాగా, 27,126 మంది చిన్నారులు ఉన్నారని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంస్థ అధిపతి మిషెల్లీ బాషెలె వెల్లడించారు.

2021 జూన్ నాటికి కనీసం 4.94 లక్షల మంది మరణించి ఉంటారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్ఓహెచ్ఆర్) అంచనా వేసింది. వాస్తవ సంఖ్య 6 లక్షలకు పైగానే ఉంటుందని వెల్లడించిన ఆ సంస్థ, ప్రభుత్వ సైన్యాల చేతిలో మరణించిన వారి సంఖ్య సుమారు 1.59 లక్షలని పేర్కొంది.

ప్రభుత్వ జైళ్లలో మగ్గి చనిపోయిన వారి సంఖ్య 47,000పైగా ఉంటుంది, కనీసం 53,000 మరణాలు రికార్డులకు కూడా ఎక్కలేదని ఎస్ఓహెచ్ఆర్ పేర్కొంది.

ఫిబ్రవరి 2022 నాటికి సిరియాలో యుద్ధం వల్ల దాదాపు 2.38 లక్షలమంది మరణించారని, ఇందులో సుమారు 1.44లక్షలమంది సామాన్యులని మరో మానిటరింగ్ గ్రూప్ ది వయోలేషన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా తమ కార్యకర్తల నెట్‌వర్క్‌ సాయంతో ఈ లెక్కలు సేకరించినట్లు ఆ సంస్థ చెబుతోంది. ఈ మరణాలలో 1.65 లక్షలమంది ప్రభుత్వ దళాల చేతుల్లో, సుమారు 35 వేలమంది తిరుగుబాటుదారుల చేతిలో మరణించారని పేర్కొంది.

సిరియా అంతర్యుద్ధంలో 27వేలమంది చిన్నారులు కూడా మరణించినట్లు అంచనా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సిరియా అంతర్యుద్ధంలో 27వేలమంది చిన్నారులు కూడా మరణించినట్లు అంచనా

ఎవరెవరు పాల్గొన్నారు?

రష్యా, ఇరాన్‌లు సిరియా ప్రభుత్వానికి మద్ధతివ్వగా, టర్కీ, కొన్ని పశ్చిమదేశాలు, మరికొన్ని గల్ఫ్‌దేశాలు తిరుగుబాటుదారులకు వివిధ స్థాయిల్లో సహకరించాయి.

రష్యా: సివిల్ వార్‌కు ముందే సిరియాలో రష్యాకు మిలిటరీ బేస్‌ ఉంది. అధ్యక్షుడు అసద్‌కు మద్ధతుగా రష్యా రంగంలోకి దిగింది. రష్యా సహకారంతో 2015 నాటికి తిరుగుబాటును చాలా వరకు ప్రభుత్వం అణచి వేయగలిగింది. తిరుగుబాటు దళాలపై నేరుగా దాడులు చేస్తూ రష్యా సైన్యం వారికి తీవ్ర నష్టాన్ని కలిగించింది.

అసద్‌కు సాయం చేసేందుకు ఇరాన్ లక్షల డాలర్ల నిధులను, పెద్ద సంఖ్యలో సైన్యాన్ని సమకూర్చిందని చెబుతారు. లెబనాన్ హిజ్బొల్లా ఉద్యమంలో శిక్షణ పొందిన షియా ముస్లింలు ప్రభుత్వానికి మద్ధతుగా పోరాడారు. ఇటు ఇరాక్, అఫ్గానిస్తాన్, యెమెన్ నుంచి కూడా బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి సాయం లభించింది.

అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాలు పరోక్షంగా తిరుగుబాటుదారులకు సహకారం అందించాయి. అయితే, జిహాదీ తీవ్రవాద సంస్థలు కూడా ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటుండటంతో ఈ దేశాలు ఆయుధాలు కాకుండా ఇతర సాయంపై ఎక్కువగా దృష్టి పెట్టాయి.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ అణ్వాయుధాలు కొనడానికి ప్రయత్నించిందా

అమెరికా ఆధ్వర్యంలోని గ్లోబల్ కోయిలిషన్ గ్రూప్ 2014లో వైమానిక దాడులకు కూడా దిగాయి. ఒకప్పుడు ఐఎస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని మళ్లీ వాళ్లకు చిక్కకుండా ఉండేందుకు కుర్దిష్, అరబ్ మిలిటెంట్ల ఆధ్వర్యంలో ఏర్పడిన సిరియన్ డెమొక్రాటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్)కు అమెరికా మద్ధతుగా నిలిచింది.

టర్కీ: ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులకు ప్రధాన మద్ధతదారులలో టర్కీ ఒకటి. అయితే, ఎస్డీఎఫ్‌పై ఆధిపత్యం వహిస్తున్న కుర్దిష్ గ్రూపులకు వ్యతిరేకులైన వారికి సాయం చేయడం ప్రారంభించింది టర్కీ. ఎస్డీఎఫ్ రూపంలో కుర్దులు తమ దేశంలో కూడా విస్తరిస్తారన్నది టర్కీ ఆందోళన.

టర్కీ సైన్యాలు, తిరుగుబాటుదారులు కలిసి సిరియాలోని కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించారు. ప్రత్యర్ధుల చేతిలో ఉన్న ఇడ్లిబ్ నగరం ప్రభుత్వం చేతిలోకి వెళ్లకుండా చూసేందుకు తనవంతుగా సహకారం అందించింది టర్కీ.

సౌదీ అరేబియా: సిరియాలో ఇరాన్ ప్రాబల్యాన్ని తగ్గించాలన్న పట్టుదలతో ఉన్న సౌదీ అరేబియా, బషర్‌పై తిరుగుబాటు చేస్తున్న వారికి ఆర్ధికంగా, సైనికపరంగా సాయం అందించింది. సౌదీకి ప్రత్యర్థిలాంటి ఖతార్ కూడా అదే విధంగా సాయం చేసింది.

సౌదీ లాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు తిరుగుబాటు దళాలపై వైమానిక దాడులు చేసింది. ఇరాన్ నుంచి హిజ్బొల్లాకు ఆయుధాలు అందకుండా చూసేందుకు ఇజ్రాయెల్ అనేక రూపాలతో దాడులు చేసింది.

ఇరాన్, రష్యాలు సిరియాకు మద్ధతివ్వగా, తిరుగుబాటుదారులకు అనేక దేశాలు వివిధ రూపాలలో సాయం చేశాయి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఇరాన్, రష్యాలు సిరియాకు మద్ధతివ్వగా, తిరుగుబాటుదారులకు అనేక దేశాలు వివిధ రూపాలలో సాయం చేశాయి

సిరియాపై ఎలాంటి ప్రభావం పడింది?

దాదాపు 11 సంవత్సరాలపాటు సిరియాలో అంతర్యుద్ధం కొనసాగింది. సిరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిరియా జనాభా (2.2 కోట్లమంది)లో సగం మంది వలసబాట పట్టారు. సుమారు 70లక్షలమంది ఇళ్లు, వాకిళ్లు వదిలేసి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.

శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లలో, అరకొర సౌకర్యాల మధ్య దాదాపు 20 లక్షలమంది నివసిస్తున్నారు. మరో 68 లక్షలమంది విదేశాలలో శరణార్థులుగా తలదాచుకుంటున్నారు. వీరిలో దాదాపు 84శాతం మంది పొరుగున ఉన్న లెబనాన్, జోర్డాన్, టర్కీలకు పారిపోయారు.

2022 ఫిబ్రవరి నాటికి సిరియాలో జీవిస్తున్న 1 కోటీ 46 లక్షలమందికి మానవతా సాయం అవసరమని, వీరిలో 50 లక్షలమంది తీవ్రమైన సమస్యల్లో ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. సుమారు 1 కోటి 20లక్షలమందికి రోజూ సరిపడా ఆహారం లేదని, కనీసం 5 లక్షలమంది చిన్నారులు సరైన పోషకారం లేక ఇబ్బందులు పడుతున్నారని తేలింది.

గత రెండేళ్లుగా ఆర్ధిక సంక్షోభం కూడా చుట్టుముట్టడంతో సిరియాలో పరిస్థితులు మరింత దిగజారాయి. మరోవైపు అమెరికా ఆంక్షలు, లెబనాన్‌ ఆర్థిక మాంద్యం ప్రభావం, కోవిడ్ మహమ్మారి లాంటివి ఈ కష్టాలకు జతచేరాయి.

ద్రవ్యోల్బణం కారణంగా సిరియాలో కరెన్సీ విలువ 80శాతం పడిపోయింది. 2022నాటికి అది 140 శాతానికి చేరుకుంది. ధరలు విపరీతంగా పెరిగాయి. పేదరికం 90 శాతం పెరిగినట్లు అంచనాలు వెలువడ్డాయి.

పరస్పర దాడులతో సిరియా నగరాలు శిథిలాలుగా మారాయి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పరస్పర దాడులతో సిరియా నగరాలు శిథిలాలుగా మారాయి

సరైన మౌలిక సదుపాయాలు, టెస్టింగ్ సౌకర్యాలు లేకపోవడంతో సిరియాలో ఎంతమందికి కోవిడ్ సోకిందో తెలియని పరిస్థితి ఉంది. 2022 మార్చి నాటికి కేవలం 7.4 శాతం మందికి మాత్రమే రెండు డోసుల టీకాలు వేయగలిగింది ఆ దేశం. కోవిడ్ మహమ్మారికి కారణంగా సిరియాలో సుమారు 3100 మంది మరణించారు.

యుద్ధం కారణంగా దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలన్నీ దెబ్బతిన్నాయి. ఒక్క అలెప్పో సిటీలోనే సుమారు 35000 నిర్మాణాలు దెబ్బతిన్నట్లు అమెరికాకు చెందిన శాటిలైట్ ఎనాలిసిస్ వెల్లడించింది.

కీలకమైన వైద్య సదుపాయాలపై దాడులు జరపవద్దన్న నిబంధనలు ఉన్నా, ఈ సౌకర్యాలకు సంబంధించిన 350 నిర్మాణాలపై కనీసం 599 దాడులు జరిగినట్లు ఫిజిషియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. ఈ లెక్కలు 2021 మార్చి నాటి వరకే.

దాడుల కారణంగా సుమారు 930మంది వైద్య సిబ్బంది మరణించినట్లు తేలింది. ఈ దాడులు ఎక్కువగా రష్యా, సిరియా సంయుక్త దళాల కారణంగానే జరిగాయి. యుద్ధ వాతావరణం కారణంగా దేశంలో సగం వైద్య వ్యవస్థ కుప్పకూలింది.

సిరియాలోని అనేక సాంస్కృతిక కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ దేశంలో యునెస్కో గుర్తించిన ఆరు హెరిటేజ్ సెంటర్లు కూడా ధ్వంసమైన వాటిలో ఉన్నాయి. పల్మైరా నగరంలోని చాలా కట్టడాలను ఐఎస్ తీవ్రవాదులు ఉద్దేశపూర్వకంగానే పేల్చేశారు.

గత పదేళ్లలో లక్షలమంది సిరయన్లు శరణార్ధులుగా మారారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గత పదేళ్లలో లక్షలమంది సిరియన్లు శరణార్థులుగా మారారు

ఇప్పుడెలా ఉంది?

తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో చాలావాటిని అల్ అసద్ ప్రభుత్వం తిరిగి తన అధీనంలోకి తెచ్చుకున్నా, చాలా ప్రాంతాలు ఇప్పటికీ తిరుగుబాటుదారులు, జిహాదీ గ్రూపులు, కుర్దుల ఆధ్వర్యంలోని ఎస్డీఎఫ్ గుప్పిట్లో ఉన్నాయి.

గత రెండేళ్లుగా ఇందులో పెద్దగా మార్పులు లేవు. వాయువ్య ఇడ్లిబ్ నగరం, హమా ఉత్తర ప్రాంతం, అలెప్పో పశ్చిమ ప్రాంతాలలో తిరుగుబాటు దళాలు తమ పట్టును కొనసాగిస్తున్నాయి.

జిహాదీ గ్రూపులు, ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాలలో ఇప్పటి వరకు 28 లక్షలమంది వలస పోయినట్లు తెలుస్తోంది. ఇందులో మహిళలు, పిల్లలు ఎక్కువమంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉంటున్న వారి పరిస్థితి కూడా కనీస సదుపాయాలు కూడా లేకుండా దయనీయంగా ఉంది.

2020 మార్చిలో ఇడ్లిబ్ ప్రాంతంలో ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకు మధ్య కాల్పుల విరమణకు రష్యా, టర్కీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి అక్కడ హింస మరింత పెరిగింది. గత ఏడాదికాలంగా ఈ ప్రాంతంలో కాల్పులు ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి.

వాయువ్య ప్రాంతంలో టర్కీ సైన్యాలు సిరియా రెబెల్ వర్గాలు, ఎస్డీఎఫ్‌కు వ్యతిరేకంగా దాడులకు దిగాయి. ఈ దాడులను తట్టుకోవడానికి కుర్దుల ఆధ్వర్యంలోని ఎస్డీఎఫ్, సిరియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో సిరియా ప్రభుత్వ సేనలు అడుగు పెట్టగలిగాయి.

అయితే, ఎస్డీఎఫ్ దళాలు, టర్కీ సైన్యాల మధ్య ఇక్కడ తరచూ పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి.

అంతర్యుద్ధం కారణంగా సిరియాలో పేదరికం తీవ్ర స్థాయికి చేరుకుంది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అంతర్యుద్ధం కారణంగా సిరియాలో పేదరికం తీవ్ర స్థాయికి చేరుకుంది

శాంతి ఏర్పడుతుందా?

ఈ ప్రాంతంలో హింసను తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి తొమ్మిదిసార్లు శాంతి చర్చలకు ప్రయత్నించినా, ప్రతిపక్షాలు, తిరుగుబాటుదారులతో చర్చలకు అధ్యక్షుడు అల్ అసద్ విముఖత వ్యక్తం చేయడంతో ఇవి సఫలం కాలేదు.

2017లో అస్థానా ప్రాసెస్ పేరుతో టర్కీ, రష్యా, ఇరాన్‌లు కూడా సంధి ప్రయత్నాలు ప్రారంభించాయి. చివరకు కొత్త రాజ్యాంగం తయారు చేసేందుకు 150 మంది సభ్యుల కమిటీ ఏర్పాటుకు సిరియా ప్రభుత్వం అంగీకరించింది.

ఇక్కడ స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని, అవి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో సాగాలని ఈ శాంతి చర్చల్లో నిర్ణయించారు.

అయితే, ఈ కమిటీ సభ్యులు ఇంత వరకు రాజ్యాంగ రచనలో ఏమాత్రం ముందడుగు వేయలేకపోయారని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి గెయిర్ పెడెర్సెన్ 2021 అక్టోబర్‌లో వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ఈ సంఘర్షణ 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని, ఈ సమస్యకు మిలిటరీ అనేది పరిష్కారం కాదని, అందరూ మనసుపెట్టి ప్రయత్నిస్తే రాజకీయ పరిష్కారం లభిస్తుందని గెయిర్ పెడెర్సెన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, సిరియా: సొంత ప్రజలపైనే రసాయన దాడులు చేయించిన ప్రబుత్వం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)