సిరియా యుద్ధం: కూలిన ఇజ్రాయెల్ యుద్ధ విమానం

ఫొటో సోర్స్, Reuters
సిరియాలోని ఇరాన్ స్థావరాలను ఇజ్రాయెల్ ఎఫ్-16 ఫైటర్ జెట్ టార్గెట్ చేసింది. దాంతో సిరియా సైన్యం కాల్పులు జరిపిందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.
యుద్ధ విమానం కూలిపోవడానికి ముందుగానే అందులోని ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో సురక్షితంగా దిగారు.
సిరియా వివాదంలో ఇజ్రాయెల్ ఒక యుద్ధ విమానాన్ని కోల్పోవడం ఇదే తొలిసారి.
ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ తమ భూభాగంలోకి రావడంతో ఇజ్రాయెల్ దాన్ని అడ్డుకుంది. తర్వాత సిరియాలోని ఇరాన్ స్థావరాలు లక్ష్యంగా దాడులు ప్రారంభించింది.
అయితే, దీన్ని దురాక్రమణగా భావించిన సిరియా ఇజ్రాయెల్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌పై కాల్పులు జరిపింది.
సిరియాలో ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కాదని బీబీసీ మిడిలీస్ట్ ప్రతినిధి టామ్ బాటిమెన్ అన్నారు. ఇజ్రాయెల్ జెట్ కూలిపోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరాన్ స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నామని ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
సిరియా, ఇరాన్‌లకు చెందిన 12 సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నామని, ఇవి ఇంకా పెరుగుతాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ - ఐడీఎఫ్ అధికార ప్రతినిధి జొనాథన్ ట్వీట్ చేశారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

శనివారం ఉదయం ఏం జరిగింది?
సిరియా భూభాగం నుంచి ప్రయోగించిన ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడిందని, దాన్ని తమ యుద్ధ హెలికాప్టర్ నిలువరించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
డ్రోన్‌ను ముందే పసిగట్టి, దాన్ని కూల్చేసే వరకు నిఘా పెట్టామని వివరించింది. ప్రస్తుతం ఈ డ్రోన్ తమ ఆధీనంలోనే ఉందని, ఐడీఎఫ్ అధికార ప్రతినిధి బ్రిగ్ జన్ రోనెన్ మనిలిస్ అన్నారు.
ఫైటర్ జెట్ నుంచి సురక్షితంగా బయటపడిన ఇద్దరు పైలట్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని ఐడీఎఫ్ తెలిపింది.
అయితే, సిరియా కాల్పుల వల్లే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ కుప్పకూలిందా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తమకు స్పష్టంగా తెలియదని ఐడీఎఫ్ పేర్కొంది.

ఫొటో సోర్స్, EPA
ఇజ్రాయెల్‌తో పాటు ఇజ్రాయెల్ ఆధీనంలోని సిరియా భూభాగంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
జోర్డాన్, సిరియా సరిహద్దుల్లో భారీ పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు.
తమ భూభాగంలోని ఒక సైనిక స్థావరంపై ఇజ్రాయెల్ పైటర్ జెట్ దాడికి ప్రయత్నించడంతో కాల్పులు జరిపామని సిరియా సైన్యం చెప్పినట్లు ఆ దేశ పత్రికలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సిరియా భూభాగంలో ఇరాన్ స్థావరాలు ఎందుకున్నాయి?
ఇరాన్- ఇజ్రాయెల్‌కు శత్రువు. అంతేకాదు, సిరియా అధ్యక్షుడు అసద్‌కు కీలక మద్దతుదారు. 2011 నుంచి అసద్ సేనలు తిరుగుబాటుదారులతో యుద్ధం చేస్తున్నాయి. అసద్ సేనలకు ఇరాన్ అండగా నిలుస్తోంది.
మిలిటరీ సలహాదార్లు, వలంటీర్లతో పాటు టెహ్రాన్ పెద్ద సంఖ్యలో సైన్యాన్ని కూడా పంపింది.
అంతేకాదు, సిరియా అధ్యక్షుడు అసద్ సేనలకు సహాయంగా టన్నుల కొద్ది ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా ఇరాన్ పంపించినట్లు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








