అమెరికాలో ‘డౌన్‌వోట్’ మీటను పరీక్షిస్తున్న ఫేస్‌బుక్

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా దిగ్గజం 'ఫేస్‌బుక్' ఒక సరికొత్త మీటను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
అసందర్భమైన, తప్పుదోవ పట్టించే కామెంట్లను, మనసును గాయపరిచే కామెంట్లను కనిపించకుండా చేసేందుకు, వాటిపై ఫేస్‌బుక్‌కు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు వీలు కల్పించేలా 'డౌన్‌వోట్' బటన్‌ను తీసుకురావాలని ఫేస్‌బుక్ యోచిస్తోంది.
ప్రస్తుతం అమెరికాలోని కొందరు యూజర్ల సాయంతో ఈ మీటను సంస్థ పరీక్షించి చూస్తోంది.
పబ్లిక్ పేజ్ పోస్టులపై కామెంట్ల గురించి ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు వీలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది.
చాలా మంది యూజర్లు 'డిజ్‌లైక్' మీటను తీసుకురావాలని ఎంతో కాలంగా కోరుతున్నారు. డౌన్‌వోట్ మీట అలాంటి ఫీచర్ కాదని సంస్థ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, @MattNavarra
ఎలా పనిచేస్తుంది?
మీరు ఏదైనా కామెంట్‌కు డౌన్‌వోట్ మీటను నొక్కితే ఆ కామెంట్ మీ న్యూస్‌ఫీడ్‌లో కనిపించదు. మీటను నొక్కిన తర్వాత, సంబంధిత కామెంట్ మనసును నొప్పించేలా ఉందా, లేక తప్పుదోవ పట్టించేలా ఉందా, లేక అసందర్భంగా ఉందా అన్నది అక్కడ తెలియజేయవచ్చు.
ఇలా చేయడంవల్ల ఇతర యూజర్ల న్యూస్‌ఫీడ్‌లో సంబంధిత పోస్టు కనిపించకుండా ఏమీ పోదు. న్యూస్‌ఫీడ్‌లో పోస్టు ర్యాంకింగ్ కూడా మారదు.
తమ ప్లాట్‌ఫాంపై ఏ కంటెంట్ తప్పుదోవ పట్టించేలా ఉంది, ఏది అనుచితంగా ఉంది అన్నది నిర్ణయించే బాధ్యత ఫేస్‌బుక్‌ది కాదని, ఆ బాధ్యతను యూజర్లే తీసుకోవాలని ఫేస్‌బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ భావిస్తున్నారని స్పష్టమవుతోందని 'సీసీఐ ఇన్‌సైట్'కు చెందిన టెక్నాలజీ విశ్లేషకులు మార్టిన్ గార్నర్ అభిప్రాయపడ్డారు.
అదనంగా ఇంజినీర్ల నియామకం
ఫేస్‌బుక్ ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు లండన్‌లో ఉండే తమ ఇంజినీర్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని సంస్థ శుక్రవారం ప్రకటించింది.
అదనంగా ఎంత మంది ఇంజినీర్లను నియమించుకోబోతున్నదీ ఫేస్‌బుక్ వెల్లడంచలేదు. ఫేస్‌బుక్‌లో అనుచిత కంటెంట్ లేకుండా చేసేందుకు తాము పెడుతున్న పెట్టుబడిలో వీరి నియామకం ఒక భాగమని తెలిపింది.
వేధించడం, తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం లాంటి సమస్యలను నిపుణుల తోడ్పాటుతో అర్థం చేసుకొని, పరిష్కారాలు కనుగొనేందుకు ఈ ఇంజినీర్లు ప్రయత్నిస్తారని ఫేస్‌బుక్ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
కమ్యూనిటీ గ్రూపులకు రూ.65 కోట్లు
ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంపై రాజకీయపరమైన విభజన ఒక సమస్యగా మారింది. దీనిని ఎదుర్కొనే ప్రయత్నాల్లో భాగంగా కమ్యూనిటీ గ్రూపులకు సుమారు రూ.65 కోట్లు అందిస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది.
రాజకీయ విభజన అనే సమస్య పరిష్కారానికి క్రీడా గ్రూపులు, పేరెంటింగ్ గ్రూపులు లాంటి రాజకీయేతర గ్రూపులను ప్రోత్సహించడమే ఉత్తమ మార్గమని ఫేస్‌బుక్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ తెలిపారు.
ప్రజలను ఒకరికొకరిని దగ్గర చేసే మార్గాల కోసం అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- గూగుల్ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా
- సోషల్ మీడియా: అల్లం, తేనె ఫ్లేవర్లలో కండోమ్‌లు!
- రిపబ్లిక్ డే పరేడ్: ఆసియాన్ ఎందుకంత ప్రత్యేకం?
- ప్రపంచంలోని అద్భుత వనాలు.. అత్యద్భుత ఫొటోల్లో!!
- #BollywoodSexism: బాలీవుడ్, టాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై కథనాలు
- హైదరాబాద్‌లో పదిలంగా ఉన్న ‘పద్మావత్’ రాతప్రతి
- శంషాబాద్ విమానాశ్రయ వివాదాన్ని వాజ్‌పేయి ఎలా పరిష్కరించారు?
- ఒక దేశం - ఒక ఓటు... ఎంతవరకూ సాధ్యం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








