గుజరాత్: ఓ చిన్న వాక్యం కిడ్నాప్, హత్యకేసు నిందితుడిని ఎలా పట్టించిందంటే..

ఫొటో సోర్స్, Dinesh Makwana
- రచయిత, భార్గవ్ పారిఖ్,
- హోదా, బీబీసీ ప్రతినిధి
చంపాలో దీపావళి వేడుకలు, ఛట్‌పూజ సజావుగా జరగడంతో అంకలేశ్వర్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీపావళి పూర్తయినా ఛట్‌పూజ మిగిలే ఉంది. గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో పని చేస్తున్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారికి ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఛట్‌పూజను ఇక్కడి ప్రజలు బాగా జరుపుకుంటారు.
అంతా సవ్యంగా జరుగుతోందని పోలీసులు భావించారు. వారు అనుకున్నట్టుగానే ఛట్‌ఘాట్ పూజలు బాగానే జరిగాయి.
పండుగ ముగిసి అంతా సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో 8 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలుడిని విడిచిపెట్టాలంటే 5 లక్షలరూపాయలు చెల్లించాలని కిడ్నాపర్ డిమాండ్ చేశాడు.
అంకలేశ్వర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు మొదట ఎలాంటి ఆనుపానులు దొరకలేదు. దీంతో కిడ్నాపర్ డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించేటప్పుడు అతడిని పట్టుకోవాలని భావించారు. కానీ కిడ్నాప్‌కు గురైన చిన్నారి అంతకు ముందే చనిపోయాడు.
ఇలాంటి కేసుల్లో మొదట ఇరుగుపొరుగు వారిని పోలీసులు అనుమానిస్తారు. అయితే ఈ కేసులో ఆ సొసైటీలో నివసిస్తున్న వ్యక్తే నిందితుడిగా తేలాడు. అప్పులు తీర్చేందుకు అతనే ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని నడిపాడు.


ఫొటో సోర్స్, Dinesh Makwana
డబ్బు కోసం తల్లికి సందేశం
ఈ కేసుకు సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు కిడ్నాపర్ తెలివితేటలు, అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం మొదలు పెట్టారు. కిడ్నాపర్‌కు మహిళల మనస్తత్వం గురించి తెలుసని,అతడికి తెలివి తేటలు పెద్దగా లేవని గుర్తించారు.
“ఈ కేసు తీవ్రమైనదే, ఎందుకంటేపిల్లవాడు బతికి ఉండాలంటే తనకు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలనే సందేశాన్ని కిడ్నాపర్ తండ్రికి కాకుండా తల్లికి పంపించాడు” అని అంకలేశ్వర్ డీఎస్పీ డాక్టర్ కుశాల్ ఓజా బీబీసీతో చెప్పారు.
“దీన్ని బట్టి అతనికి మహిళల మనస్తత్వం గురించి అవగాహన ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. తల్లికి మెసేజ్ చేస్తే, ఆమె కిడ్నాపర్ గురించి పోలీసులకు చెప్పకుండా త్వరగా డబ్బు ఇచ్చి పిల్లవాడిని విడిపించాలని భర్తపై ఒత్తిడి తెస్తుందని కిడ్నాపర్ భావించాడు. అయితే పిల్లవాడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు” అని ఆయన చెప్పారు.
పోలీసులకు ఫిర్యాదు అందిన తర్వాత కిడ్నాపర్ వాట్సాప్ నుంచి పంపించిన మెసేజ్ ఎక్కడ నుంచి వచ్చిందా అని పోలీసులు ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే అప్పటికే ఫోన్ స్విచ్చాఫ్ అయింది. చివరిగా ఆ ఫోన్ లొకేషన్ బాలుడు కిడ్నాప్ అయిన డ్రీమ్ సొసైటీ నుంచే వచ్చినట్లు గుర్తించారు.
“ఇది మాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సొసైటీ అంకలేశ్వర్ దగ్గర్లోని దాదల్ గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో ఇలాంటి నేరాలు జరిగిన దాఖలాలు లేవు. కిడ్నాపర్ పంపిన మెసేజ్‌లు అల్తాఫ్ అనే పేరుతో వచ్చాయి.’’
“మేము ఆ సొసైటీలో ఉన్న వారిని విచారిస్తే, అల్తాఫ్ అనే పేరు గల వ్యక్తులు ఎవరూ లేరని స్థానికులు చెప్పారు. దీంతో కిడ్నాపర్ గుర్తు తెలియని వ్యక్తి అయి ఉండవచ్చని మేము మొదటి నుంచి అనుమానిస్తూ వచ్చాం” అని డాక్టర్ ఓజా చెప్పారు.
దర్యాప్తులో పురోగతి సాధించడంతో నిందితుడు ఎవరో తెలిసింది. అయితే ఆ నిజాన్ని నిర్థరించుకోవడంతో పాటు నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసులతోపాటే నిందితుడు..
సొసైటీలో చిన్నారిని అపహరించారనే వార్త గ్రామంలో వేగంగా వ్యాపించింది. దీంతో గ్రామస్తులు, ఇరుగుపొరుగు గ్రామాలవారు కూడా ఆ ఎనిమిదేళ్ల బాలుడిని వెదికే పనిలో పడ్డారు.
“ఆ రోజు ఛట్ పండుగ. నా భార్య పూజ చేసుకోవడానికి ఘాట్‌కు వెళ్లింది. నేను పనికి వెళ్లాను. నేను తిరిగి వచ్చే సరికి మా సొసైటీ వాళ్లు మా అబ్బాయి కోసం వెదుకుతున్నారు. పిల్లవాడు ఎక్కడా కనిపించలేదు. దీంతో మేం ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాం” అని పిల్లవాడి తండ్రి భీష్మ రాజ్‌భర్ బీబీసీతో చెప్పారు.
“పోలీసులు వచ్చిన తర్వాత నా భార్య తన ఫోన్‌కు కిడ్నాపర్ పంపించిన సందేశాన్ని చూపించింది. అందులో కిడ్నాపర్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నా భార్య తన ఆభరణాలు అమ్మేసి ఆ సొమ్ము ఇచ్చేందుకు సిద్ధమైంది. మా అబ్బాయిని ఇంటికి పంపిస్తే ఆ సొమ్ము ఇవ్వడానికి నేను కూడా సిద్ధపడ్డాను” అని భీష్మ రాజ్‌భర్ వివరించారు.
“పిల్లవాడు క్షేమంగా ఉన్నాడని తెలిసేలా మాకు ఒక ఫోటో పంపించమని అడిగాను. దానికి ప్రతిగా కిడ్నాపర్ ఒక వీడియో పంపిస్తానని చెప్పాడు. నేను డబ్బులు సిద్ధం చేసుకుంటూ ఉండగానే పోలీసులు నా కుమారుడి మృతదేహాన్ని చూపించారు” అని చెబుతూ రాజ్‌భర్ కన్నీటి పర్యంతం అయ్యారు.
పోలీసులు పిల్లవాడి కోసం వెదుకులాట ప్రారంభించగానే సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ శైలేంద్ర సింగ్ రాజ్‌పుత్ కూడా వారితో కలిశాడు. వేరే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న శైలేంద్ర సింగ్ సెలవు పెట్టి గ్రామానికి వచ్చారు. ఛట్ పండుగకు ఆయన భార్య, పిల్లలు వారి స్వగ్రామానికి వెళ్లారు.
బాలుడి అపహరణకు సంబంధించి తన మీద ఎలాంటి అనుమానం రాకుండా శైలేంద్ర సింగ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. అయితే ఒక వాక్యం ఆయన్ని చట్టానికి పట్టించింది.

ఫొటో సోర్స్, Dinesh Makwana
ఒక్క వాక్యంతో దొరికిన నిందితుడు
పోలీసులు ఒకవైపు బాలుడి ఆచూకీ కోసం వెదుకుతూనే మరో వైపు అందుబాటులో ఉన్న సాంకేతికత ద్వారా దర్యాప్తు కొనసాగించారు. వాట్సాప్ సందేశం వచ్చిన మొబైల్ నెంబర్ ‘7490’తో మొదలవుతోంది. దీంతో పోలీసులు ఈ కోణంలో విచారించడం మొదలు పెట్టారు. కొత్తగా విడుదలైన ఈ నెంబర్ సిరీస్ ఆంధ్రప్రదేశ్ లేదా గుజరాత్‌కు చెంది ఉండవచ్చని అనుమానించారు.
“బాలుడిని అపహరించి, డబ్బు చెల్లించాలని అడిగినప్పుడు ఈ కేసులో మా దగ్గర ఎలాంటి క్లూ లేదు. డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాట్సాప్ మెసేజ్ పంపిన ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయింది. దీనికి తోడు ఆ ఫోన్ చివరిసారిగా ఆన్‌లో ఉన్నప్పుడు లొకేషన్ బాలుడి ఇంటి వద్దే చూపించింది” అని డీఎస్పీ డాక్టర్ ఓజా చెప్పారు.
తర్వాతి రోజు కిడ్నాపర్ నుంచి మరో సందేశం వచ్చింది. అందులో ఒక ప్రత్యేక పదాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వాక్యం ఆధారంగా దర్యాప్తు చేసి ఈ మిస్టరీని చేధించారు.
“తర్వాతి రోజు వచ్చిన మెసేజ్‌లో ఒక వాక్యం “జాదా తేజ్ మత్ హోనా” (ఎక్కువ తెలివి తేటలు చూపించవద్దు) అని ఉంది. సాధారణంగా పోలీసులు, పారా మిలటరీబలగాలు లేదా భద్రతా బలగాలకు చెందిన వ్యక్తులే అలాంటి పదాన్ని ఉపయోగిస్తారు” అని డాక్టర్ ఓజా చెప్పారు.
మేం వెంటనే మా ఇన్‌ఫార్మర్ల ద్వారా కిడ్నాప్ జరిగిన సొసైటీలో పోలీస్, పారామిలటరీ బలగాలకు చెందిన వారు ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశాం. కిడ్నాపైన బాలుడి ఇంటికి మూడు ఇళ్ల అవతల ఒక సీఆర్‌పీఎఫ్ జవాను ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అతను సెలవు మీద దాదల్ వచ్చినట్లు తెలుసుకున్నాం” అని డీఎస్పీ ఓజా బీబీసీతో చెప్పారు.
“మా అనుమానాలు బలపడ్డాయి. వెంటనే మేం అతని ఇంటిని సోదా చేశాం. సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉపయోగించే పెద్ద ఇనుప పెట్టెలో బాలుడి మృతదేహాన్ని గుర్తించాం” అని డీఎస్పీ వివరించారు.
పోలీసులు వెంటనే శైలేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాలుడిని ఎందుకు కిడ్నాప్ చేశాడో ఆయన పోలీసులకు చెప్పాడు.

ఫొటో సోర్స్, Dinesh Makwana
అప్పులు తీర్చేందుకు నేరం
శైలేంద్ర సింగ్ అప్పులు చేసి, ఆ డబ్బును స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ అప్పులు తీర్చేందుకు అతను బాలుడి కిడ్నాప్ పథకం రచించాడు.
“ఎనిమిదేళ్ల బాలుడు వీధిలో సైకిల్ తొక్కుతున్న సమయంలో శైలేంద్ర సింగ్ ఆ బాలుడిని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో పిల్లవాడు కేకలు వెయ్యడంతో బాలుడి నోరు నొక్కేసి, టేపు అంటించాడు. బాలుడి కాళ్లు చేతులు కట్టేశాడు. అంతకుముందు బాలుడు నిందితుడితో కలబడ్డాడు. నిందితుడు ఎక్కువ బలం ఉపయోగించి బాలుడి నోటిని గట్టిగా నొక్కేయడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో బాలుడిని ఇనుప పెట్టెలో పెట్టాడు. పెట్టెలో బాలుడికి గాలి ఆడక మరణించాడు. ఈ విషయాలను శైలేంద్ర సింగ్ పోలీసుల సమక్షంలో అంగీకరించినట్లు” డీఎస్పీ ఓజా చెప్పారు.
“శైలేంద్ర సింగ్ మా ఇంటికి మూడిళ్ల అవతల నివసించేవాడు. కిడ్నాప్ జరగడానికి ముందు రోజు రాత్రి మా ఇంటికి వచ్చి మా బాబును చూశాడు. అతను ఇలా చేస్తాడని మేము ఎన్నడూ అనుకోలేదు” అని భీష్మ రాజ్‌భర్ చెప్పారు.
నిందితుడు కేంద్రబలగాల్లో పని చేస్తున్నప్పటికీ కిడ్నాప్, హత్య లాంటి చట్ట విరుద్దమైన పనులకు పాల్పడటం స్థానికుల్ని అయోమయంలో పడేసింది.
“భద్రతా బలగాల్లో పని చేసే వారికి నేర మనస్తత్వం గురించి అవగాహన ఉంటుంది. వారికి పోలీసులను తప్పుదారి పట్టించడం ఎలాగో తెలుసు.” అని ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రశాంత్ బిమానీ బీబీసీకి చెప్పారు.
“నిందితుడికి మహిళల సైకాలజీ గురించి తెలుసు. అతను భారీ మొత్తంలో అంటే 25 లేదా 50 లక్షలు కావాలని అనుకుని ఉంటే తండ్రికి మెసేజ్ పంపించేవాడు. అతనికి ఐదు లక్షల రూపాయలు అత్యవసరం కావడంతో తల్లికి మెసేజ్ పంపాడు. సహజంగా మహిళలు భయపడి వెంటనే డబ్బులిచ్చి పిల్లల్ని కాపాడుకోవాలని భావిస్తారు. అయితే ఇక్కడ ఆ మహిళ భయపడలేదు. ఆమె ఎవరికీ చెప్పకుండా డబ్బులు ఇస్తుందని అతను భావించి ఉంటాడు” అని బిమానీ చెప్పారు.
బాలుడి మృతదేహాన్ని దగ్గరున్న పొలాల్లో పడేయాలని భావించినట్లు శైలేంద్ర సింగ్ పోలీసులకు చెప్పాడు. అయితే అంతకు ముందే పోలీసులు అతడిని పట్టుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














