రష్యా సైన్యం శిక్షణ ఇచ్చిన “గూఢచారి తిమింగలం” రష్యా నుంచి ఎందుకు పారిపోయింది? చివరికి ఏమైంది?

ఫొటో సోర్స్, Norwegian Orca Survey
- రచయిత, జోనా ఫిషర్, ఒక్సానా కుండిరెంకో
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గుర్రాలకు తొడిగే జీను లాంటి బెల్టును నడుము భాగంలో ధరించిన బెలూగా తిమింగలం నార్వే తీరంలో ఎందుకు కనిపించింది? ఐదేళ్ల కిందట ఇదొక రహస్యం. అయితే దాని గురించి ఇప్పుడు తెలిసిపోయింది.
ఈ తెల్ల తిమింగలానికి స్థానికులు ‘హ్వాల్దిమిర్’ అనే పేరు పెట్టారు. ఇది రష్యన్ గూఢచారి తిమింగలం కావచ్చనే ఊహాగానాల వల్ల ఐదేళ్ల కిందట వార్తల్లో నిలిచింది.
ఈ తిమింగలం నిజంగానే సైన్యానికి చెందినదని, ఆర్కిటిక్ సర్కిల్‌లోని నేవీ స్థావరం నుంచి తప్పించుకుని ఉంటుందని సముద్ర జీవుల నిపుణురాలు డాక్టర్ ఓల్గా ష్పాక్ అంటున్నారు.
అయితే, ఆ తిమింగలం గూఢచారి అని ఆమె భావించడం లేదు. నేవీ స్థావరం దగ్గర కాపలా కాసేందుకు దానికి శిక్షణ ఇచ్చారని, అయితే అది వారి కన్నుగప్పి పారిపోయి ఉంటుందని ఆమె భావిస్తున్నారు.

తమ సైన్యం బెలూగా తిమింగలానికి శిక్షణ ఇచ్చిందనే విషయాన్ని రష్యా సైన్యం అంగీకరించలేదు, అలాగని ఆ వాదనను తిరస్కరించలేదు.
అయితే, 1990ల నుంచి సముద్ర జీవులపై పరిశోధన చేస్తున్న డాక్టర్ ష్పాక్ మాత్రం, ఈ తిమింగలం నూటికి నూరు శాతం సైనిక శిక్షణ పొందిందని బీబీసీతో చెప్పారు. 2022లో ఆమె స్వదేశం యుక్రెయిన్ వచ్చే దాకా, ఆమె సముద్ర జీవుల మీద పరిశోధన చేస్తూనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Jørgen Ree Wiiig
ఐదేళ్ల కిందట ఈ రహస్య తిమింగలం వ్యవహారం నార్వే ఉత్తర తీరంలోని మత్స్యకారుల ద్వారా ప్రపంచం దృష్టికి వచ్చింది.
“ఆ తిమింగలం తన శరీరాన్ని పడవకేసి రుద్దుతోంది. ఆపదలో ఉన్న జంతువులు మనుషుల సాయం కోసం ప్రయత్నిస్తాయనే విషయం గురించి నేను విన్నాను. అది చాలా తెలివైన జంతువు” అని మత్స్యకారుడు జోర్ హోస్టన్ చెప్పారు.
ఆ తిమింగలాన్ని అలా చూడటం అసాధారణమైన అంశం. ఎందుకంటే అది ఎవరో పెంచుకుంటున్నట్లుగా ప్రవర్తించింది. ఇవి నార్వే తీరంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.
దీని శరీరానికి కెమెరా అమర్చేందుకు వీలుగా ఒక బెల్టును చుట్టారు. ఆ బెల్టు మీద ఇంగ్లీష్‌లో “ఎక్విప్‌మెంట్ సెయింట్ పీటర్స్‌బర్గ్” అని రాసి ఉంది.
తిమింగలం శరీరానికి ఉన్న ఆ బెల్టును తొలగించడంలో హోస్టన్ సాయం చేశారు. బెల్టు తొలగించిన తర్వాత అది ఈదుకుంటూ హామర్‌ఫెస్ట్ పోర్ట్‌కు చేరుకుంది. అక్కడే కొన్ని నెలల పాటు ఉంది.

ఫొటో సోర్స్, Oxford Scientific Films
ఈ తిమింగలం ఆహారం కోసం, ప్రాణంతో ఉన్న చేపలను పట్టుకోలేకపోతున్నట్లు కనిపించింది. సందర్శకులు దీని వైపు కెమెరాలు పెట్టినప్పుడు శరీరాన్ని ఊపుతూ వారిని అలరించే ప్రయత్నం చేసింది. ఒక సందర్భంలో సందర్శకుడి మొబైల్ ఫోన్‌ను తీసుకుని తిరిగి ఇవ్వడం ద్వారా అందర్నీ ఆకర్షించింది.
“ఈ ప్రత్యేకమైన తిమింగలం తాను లక్ష్యంగా భావించిన వాటి వైపు తన ముక్కును కేంద్రీకరిస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన విషయం” అని నార్వేజియన్ ఓర్కా సర్వే పరిశోధకురాలు ఈవ్ జోర్డైన్ చెప్పారు.
“అయితే ఆ తిమింగలం ఏ సైనిక కేంద్రం నుంచి వచ్చిందో మేము చెప్పలేం. దానికి ఎలాంటి శిక్షణ ఇచ్చారో కూడా మాకు తెలియదు” అని ఆమె అన్నారు.
ఈ తిమింగలాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నార్వే, దీన్ని పర్యవేక్షించడానికి, ఆహారం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా దీనికి “హ్వాల్దిమిర్” అని పేరు పెట్టింది. నార్వేలో హాల్డ్ అంటే తిమింగలం, వ్లాదిమిర్ పుతిన్ పేరులో మిర్ ఉంది. ఈ రెంటినీ కలిపి ఆ పేరు పెట్టారు.

ఫొటో సోర్స్, Oxford Scientific Films
గూఢచారి బెలూగా తిమింగలం రష్యన్ సముద్ర జీవుల్లో ఒకటని, నార్వే దీని గురించి ప్రపంచానికి చెప్పినప్పుడు రష్యన్లు దీన్ని గుర్తించినట్లు రష్యన్ అధికారుల్లో ఒకరు తనతో చెప్పారని డాక్టర్ ష్పాక్ తెలిపారు. అయితే భద్రత కారణాల దృష్ట్యా ఆ అధికారి పేరు బయటపెట్టేందుకు ఆమె నిరాకరించారు.
“పశువైద్యులు, శిక్షకుల ద్వారా నాకు ఆ సమాచారం అందింది. అండ్రూగా అని పిలుచుకునే బెలూగా తిమింగలం తమ దగ్గరి నుంచి పారిపోయిందని వాళ్లకు తెలిసింది” అని ఆమె చెప్పారు.
“అండ్రూహా లేదా హ్వాల్దిమిర్” పేరు ఏదైనా ఈ బెలూగా తిమింగలం తొలిసారిగా 2013లో రష్యా సముద్ర జలాల్లో కనిపించింది. ఏడాది తర్వాత సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో డాల్ఫినారియం ఆధీనంలోని ఓ కేంద్రం నుంచి ఈ తిమింగలాన్ని రష్యన్ ఆర్కిటిక్‌లోని సైనిక స్థావరానికి తరలించారు. అక్కడ ఇది నిపుణులు, శిక్షకుల స్వాధీనంలో ఉంది. అక్వేరియంలో కాకుండా సముద్ర జలాల్లో పని చెయ్యడం మొదలుపెట్టిన తర్వాత వాళ్లు ఇది పారిపోదని, తమ వద్దే ఉంటుందని నమ్మారు. అందుకే దాన్ని స్వేచ్చగా వదిలేశారు” అని డాక్టర్ ష్పాక్ చెప్పారు.
“సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లోని డాల్ఫినారియంలో ఈ తిమింగలం ఉన్నప్పుడు దీన్ని పర్యవేక్షించే వారి నుంచి నేను విన్న విషయం ఏంటంటే.. అండ్రూహా చాలా తెలివైనది. అందుకే దానికి శిక్షణ ఇవ్వడం తేలిక. అయితే అదే సమయంలో దానికి ‘పోకిరి’ తరహా స్వభావం ఉంది. చురుగ్గా ఉంటుంది. అందుకే అది రష్యన్ నేవీకి చెందిన నౌకల వెనుక వెళ్లడానికి బదులుగా తాను కోరుకున్న చోటకు వెళ్లింది. దాని ప్రవర్తనకు రష్యన్ సైనికులేమీ ఆశ్చర్యపోలేదు” అని ష్పాక్ అన్నారు.

ముర్మాన్స్క్‌లోని రష్యన్ నేవీ స్థావరం అండ్రూహా(హల్ద్విమిర్) పాత ఆవాసం అయ్యుంటుందని శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. పెన్స్ నీటి లోపల తెల్లటి తిమింగలాలు ఉన్నట్లు ఈ చిత్రాలు చూపుతున్నాయి.
“బెలూగా తిమింగలాలు ఉన్న ప్రాంతం జలాంతర్గాములకు, నౌకలకు దగ్గరగా ఉంది. దీన్ని బట్టి తిమింగలాలు నేవీ వ్యవస్థలో భాగమని చెప్పవచ్చు” అని నార్వేజియన్ ఆన్‌లైన్ పత్రిక ద బార్నెట్స్ అబ్జర్వర్‌లో పని చేస్తున్న థామస్ నీల్సన్ చెప్పారు.
తాము అండ్రూహాకు శిక్షణ ఇచ్చినట్లు రష్యన్ సైన్యం ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. అయితే సైనిక ప్రయోజనాల కోసం సముద్ర జంతువులకు శిక్షణ ఇచ్చిన సుదీర్ఘ చరిత్ర రష్యన్ సైన్యానికి ఉంది.
ఇదంతా పక్కన పెడితే అండ్రూహా( హ్వాల్దిమిర్) కథ విషాదాంతంగా ముగిసింది.
తనను తాను పోషించుకోవడం నేర్చుకున్న తరువాత అది నార్వే తీరం వెంబడి దక్షిణాన ప్రయాణించి చాలా కాలం గడిపింది. 2023 మేలో ఈ బెలూగా తిమింగలాన్ని నార్వే తీరంలో గుర్తించారు.
2024 సెప్టెంబర్ 1న నార్వే నైరుతి తీరంలోని రిసావికా పట్టణానికి సమీపంలో ఉన్న సముద్రంలో దాని మృతదేహం తేలుతూ కనిపించింది.
ఈ తిమింగలాన్ని కాల్చివేశారన్న కొంతమంది కార్యకర్తల మాటలను నార్వే పోలీసులు తిరస్కరించారు.
మానవ చర్యల కారణంగా అది చనిపోయిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వారు స్పష్టం చేశారు.
అండ్రూహా లేదా హ్వాల్దిమిర్ నోటిలో కర్ర గుచ్చుకోవడం వల్ల చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














