వెదురు వర్సెస్ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ - ఏది మంచిది

పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆనా సాంటి
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏటా కోట్ల టూత్‌బ్రష్‌లను బయటపడేస్తుంటారు.

కానీ, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మనం బ్రష్ చేసుకోవడం ఎలా?

నేను ఆఫీసులో పనిచేసేటప్పుడు నా డెస్క్ డ్రాలో ఎప్పుడూ ఒక ప్లాస్టిక్ టూత్‌బ్రష్ ఉండేది. భోజనం చేసిన తర్వాత ప్రతి మధ్యాహ్నం చేతిలో ఆ టూత్‌బ్రష్ పెట్టుకుని బాత్‌రూమ్‌కు వెళ్లడాన్ని చూసి నా సహోద్యోగులు నన్ను ఆటపట్టించేవారు.

ఇంట్లో నాకు ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ ఉండేది. నా పళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకునేదాన్ని. కానీ, నేను వాడే టూత్‌బ్రష్ బ్రాండ్ గురించి, దానిలో ఉన్న మెటీరియల్ లేదా పర్యావరణంపై అది చూపించే ప్రభావం గురించి అడిగితే మాత్రం నేను చెప్పలేను.

టూత్‌బ్రష్‌తో నా బంధం కొద్దికాలం పాటు దాన్ని వాడి పడేసే వరకే. నేనొక్కదాన్నే ఇలానా అనే అనుమానం వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యూనివర్సిటీ కాలేజీ లండన్ (యూసీఎల్) ఈస్ట్‌మన్ డెంటల్ ఇనిస్టిట్యూట్.. ట్రినిటీ కాలేజీ డబ్లిన్‌లకు చెందిన విద్యావేత్తల బృందం వివిధ రకాల టూత్‌బ్రష్‌ల సస్టైనబులిటీపై ఒక సంయుక్త నివేదిక విడుదల చేసింది.

ఈ నివేదికలో టూత్‌బ్రష్‌ల ప్రత్యేకతలను పేర్కొంది. అలాగే, కోట్ల బ్రష్‌లను వాడి పడేస్తున్నారని తెలిపింది.

టూత్‌బ్రష్‌ల లైఫ్ సైకిల్ అసెస్‌మెంట్‌ (ఎల్‌సీఏ)ను వాడుతూ.. వాటి తయారీ నుంచి వాడి పడేసే వరకు అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకుని, ప్లాస్టిక్ మేన్యువల్ టూత్‌బ్రష్‌లను, పైభాగాన్ని మార్చుకోగలిగేలా రూపొందే ప్లాస్టిక్ మేన్యువల్ టూత్‌బ్రష్‌లను, వెదురు, ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌లను పోల్చి చూసింది.

పైన చెప్పిన రెండు రకాల ప్లాస్టిక్ బ్రష్‌ల తయారీలో పాలీప్రొపైలిన్‌ను వాడారు. టూత్‌బ్రష్‌ల లైఫ్ సైకిల్ అసెస్‌మెంట్ విషయానికి వస్తే, ఇది పర్యావరణంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) విడుదల చేసిన తన గ్లోబల్ ప్లాస్టిక్ అవుట్‌లుక్‌లో.. ఏటా ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా వేసింది.

దానిలో వినియోగదారుల ఉత్పత్తుల నుంచే 4.3 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుందని తెలిపింది.

ఈ ఉత్పత్తుల్లో 3.7 శాతం అంటే 1.4 కోట్ల టన్నుల వ్యర్థాలు పాలిప్రొపైలిన్‌తో తయారు చేసినవై ఉంటున్నాయని పేర్కొంది.

ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ విషయానికి వస్తే, దాని పర్యావరణ ప్రభావం వెదురు టూత్‌బ్రష్‌లతో పోలిస్తే 11 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎల్‌సీఏలో తెలిసింది.

అయితే, పర్యావరణ ప్రభావంలో ఎలక్ట్రిక్ బ్రష్ చివరి స్థానంలో నిలిస్తే, మరి ఏ బ్రష్ టాప్‌లో ఉంది?

నోటి ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఎలక్ట్రిక్ బ్రష్‌లు హానికరమైన బ్యాక్టీరియాలను తొలగిస్తున్నప్పటికీ దంత క్షయం వంటి విషయాల్లో ఏ బ్రష్ కూడా క్లినికల్‌గా అంత సమర్థంగా పనిచేస్తున్నట్లు ఆధారాలు లేవని విద్యావేత్తల బృంద అధ్యయన నివేదిక, ఎన్‌హెచ్ఎస్ రెండూ తెలిపాయి.

బాంబూ బ్రష్‌లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెదురు బ్రష్

వెదురుతో చేసిన బ్రష్‌లు

పైభాగాన్ని మార్చేసుకునే ప్లాస్టిక్ మేన్యువల్ టూత్‌బ్రష్‌లు టాప్‌లో ఉన్నాయని, ఆ తర్వాత వెదురు టూత్‌బ్రష్‌లు ఉన్నాయని యూసీఎల్, ట్రినిటీ కాలేజీ స్టడీ రిపోర్టు పేర్కొంది.

వెదురు బ్రష్‌లతో పోలిస్తే పైభాగాన్ని మార్చుకునేందుకు వీలున్న ప్లాస్టిక్ టూత్‌బ్రష్‌లు మరింత సస్టైనబుల్‌ అని అధ్యయనాలు చెప్తున్నాయి.

‘‘సంప్రదాయ, ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ల వంటి వాటితో పోలిస్తే పర్యావరణంపై కాస్త తక్కువగా ప్రభావం చూపుతున్నప్పటికీ, ఎక్కువ మంది నమ్ముతున్నట్లు పర్యావరణానికి ఇదేమీ ఉత్తమమైన ఎంపిక కానవసరం లేదు’’ అని యూసీఎల్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్, సహ రచయిత పాల్ ఆష్లే అన్నారు.

వెదురు, ఇతర ప్లాంట్ బేస్డ్ టూత్‌బ్రష్‌లను తయారు చేసే స్వీడిష్ కంపెనీ హంబుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్రిక్ వెర్క్‌ల్యాండ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. తాము సరఫరాదారులతో కలిసి పనిచేస్తున్నామని, పర్యావరణ వ్యవస్థను పరిరక్షిస్తూ వారు వెదురు పెంచుతున్నారని చెప్పారు.

సురి టూత్‌బ్రష్‌లు

ఫొటో సోర్స్, Suri

వీటిని రీసైకిల్ చేసే ప్రక్రియ కూడా అతిపెద్ద సవాలుగా మారుతుంది.

తమ కంపెనీ తయారుచేసే వాటిలో సుమారు 60 శాతం టూత్‌బ్రష్‌ హ్యాండిల్స్ 100 శాతం ప్లాంట్ బేస్డ్ ఉంటున్నాయని ‘హంబుల్’ చెప్పింది.

రానున్న ఏడాది కాలంలో అన్ని టూత్‌బ్రష్‌ల హ్యాండిల్స్‌ను పూర్తిగా ప్లాంట్ ఆధారితంగా మారుస్తామని కంపెనీ చెబుతోంది.

సస్టైనబుల్ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ను డిజైన్ చేసేందుకు ప్రయత్నించే సమయంలో ఒక సమస్య వెలుగులోకి వచ్చిందని యూకేకు చెందిన ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ కంపెనీ సురి వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గైవ్ సఫావి చెప్పారు.

ప్లాస్టిక్ టూత్‌బ్రష్‌ పైభాగాలను మార్చుకునే వాటిని రీసైకిల్ చేసుకునే అవకాశంపై ఆయన పరిశోధన చేశారు.

ఆ సమయంలో యూకేలోని వివిధ రీసైక్లింగ్ స్ట్రీమ్‌లతో మాట్లాడారు.

‘పైభాగాలను రీసైకిల్ చేసుకోవచ్చు. కానీ అవి చాలా చిన్నగా ఉంటాయి. వాటిని ప్రాసెస్ చేయడం చాలా కష్టం. అందుకే చేయడం లేదు’ అని వారు ఆయనకు చెప్పారు.

ప్రజలు తేలిగ్గా ఓపెన్ చేసే టూత్‌బ్రష్ హ్యాండిల్‌ను రూపొందించే తయారీదారుల కోసం చూస్తున్నప్పుడు సఫావి ఇదే రకమైన సమస్యను ఎదుర్కొన్నారు.

కానీ, ఆయన పరిష్కారం కనుగొన్నారు. కార్న్‌స్ట్రాచ్(మొక్కజొన్నల నుంచి తయారు చేసే పిండి) నుంచి టూత్‌బ్రష్‌ల పైభాగాన్ని, ఆముదం నూనె నుంచి దాని కుంచెలను సురి కంపెనీ తయారు చేసింది.

కస్టమర్లు వారు వాడిన టూత్‌బ్రష్ పైభాగాలను రీసైక్లింగ్ చేసేందుకు సురికి పంపించే వారు. అంతేకాక, పాడయ్యే దశలో ఉన్న అన్ని బ్రష్‌లను ఆ సంస్థ తీసుకునేది.

‘‘సింగిల్ చార్జింగ్‌‌తో పనిచేసే ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌లతో పోలిస్తే రెండు నుంచి మూడింతలు ఎక్కువ కాలం, బ్యాటరీతో తాము రూపొందించిన బ్రష్‌లు ఉంటాయి. అంటే, వీటికి ఛార్జింగ్ తక్కువగా అవసరం పడుతుంది. మొత్తంగా బ్యాటరీ లైఫ్‌ను పెంచి, టూత్‌బ్రష్ జీవిత కాలాన్ని పెంచుతున్నాం’’ అని సఫావి చెప్పారు.

‘‘ఏదైనా ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ కర్బన్ ప్రభావమనేది దాని మోటార్‌లో, బ్యాటరీలో వాడే మెటీరియల్స్‌పై ఆధారపడి ఉంటుంది’’ అని యూసీఎల్ రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ విజిటింగ్ ప్రొఫెసర్, సర్క్యులర్ డిజైన్ ఎక్స్‌పర్ట్ సోఫీ థామస్ అన్నారు.

టూత్‌బ్రష్‌లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతి సంవత్సరం కోట్ల టూత్‌బ్రష్‌లను వాడి పడేస్తున్నారు

ప్రస్తుతం ప్లాస్టిక్ పరంగా చూస్తే, టూత్‌బ్రష్‌లను పెద్ద ఎత్తున రీసైక్లింగ్ చేసే వ్యవస్థ లేదని థామస్ అన్నారు. సగటున నాలుగు రకాల కో-మౌల్డెడ్ పాలీమర్స్‌తో ప్లాస్టిక్ టూత్‌బ్రష్‌లను రూపొందిస్తున్నారు. వాటిని ఒకే స్ట్రీమ్‌లో రీసైకిల్ చేయలేమని చెప్పారు. ‘‘రీసైక్లింగ్ అనేది పూర్తిగా వాటి ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది’’ అని వివరించారు.

రీసైకిల్ చేసే ప్లాస్టిక్ పదార్థాలు కూడా సమస్యాత్మకమని ట్రినిటీ కాలేజీ పబ్లిక్ డెంటల్ హెల్త్ అసోసియేట్ ప్రొఫెసర్, రిపోర్టుకు చెందిన ప్రముఖ పరిశోధకులు బ్రెట్ డ్వేన్ అన్నారు. 2023లో చేసిన అధ్యయనాన్ని ఉటంకించిన డ్వేన్, రీసైక్లింగ్ ప్రాసెస్ తర్వాత వ్యర్థ జలాల్లో 13 శాతం మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

‘‘భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించడానికి అనుమతించడానికి సహజంగా పండించగల, పదేపదే రీసైకిల్ చేయగల ఒక ఉత్పత్తి అవసరం. అందుకే, శిలాజేతర ఇంధన ఉత్పత్తులను రీసైక్లింగ్ చేయడం ముందున్న ఉత్తమ మార్గం. ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడంలో ఇంకా చాలా సమస్యలున్నాయి’’ అని డ్వేన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)