టన్నెల్ ఆఫ్ హోప్: ఒక మీటర్ వెడల్పున్న ఈ సొరంగం 4 లక్షల మందిని ఎలా కాపాడింది?

టన్నెల్ ఆఫ్ హోప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరజెవో నగర ప్రజలు రాత్రీ పగలు కష్టపడి సొరంగాన్ని నిర్మించారు
    • రచయిత, జొవానా జార్జియెవ్‌స్కీ
    • హోదా, బీబీసీ న్యూస్

దురదృష్టకర పరిస్థితుల కారణంగా ఊహించని ఘటనలు చాలా జరిగాయి.

‘‘ఆయుధాలు, ఆహారం, ఔషధం, చమురు పైప్‌లైన్‌లు, హై-వోల్టేజీ కేబుల్స్, టెలిఫోన్ కేబుల్స్, ప్రజలు..’’ ఇలా 49 ఏళ్ల ఎడిస్ కోలార్ ఓ జాబితాను చెబుతున్నారు.

‘‘సైనికులు, పౌరులు, గాయపడినవారు, కొన్నిసార్లు మృతదేహాలు కూడా..." అంటూ ఆయన కొనసాగిస్తున్నారు.

‘‘ఆ సొరంగం గుండా వెళ్ళగలిగేవన్నీ దాదాపు దాని గుండా వెళ్లాయి. అప్పుడు సరజెవో నగరవాసులకు ఉన్న ఏకైక మార్గం ఈ సొరంగం’’ అని ఆయన చెప్పారు.

1993లో సరిగ్గా తన గ్రాండ్‌పేరెంట్స్ ఇంటి కింద నిర్మించిన ఒక సొరంగం గురించి వివరిస్తూ పై విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

‘ద టన్నెల్ ఆఫ్ హోప్’ అని పిలిచే ఈ సొరంగాన్ని బోస్నియా రాజధాని సరజెవోలో నిర్మించారు.

బోస్నియా యుద్ధం (1992-1995) సమయంలో ఈ సొరంగం కీలకపాత్ర పోషించింది. ఆ యుద్ధం కారణంగా లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 22 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అయితే, ఈ సొరంగం కారణంగా దాదాపు నాలుగు లక్షల మంది ప్రాణాలతో బయటపడగలిగారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సరజెవో నగరంలోని కొండపై సమాధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరజెవో నగరంలోని కొండపై ఉన్న ఈ తెల్లటి సమాధులు బోస్నియా యుద్ధం తాలూకూ అవశేషాలు

1990ల ప్రారంభంలో యుగోస్లేవియా విచ్ఛిన్నమైన సమయంలో అత్యంత జాతి వైవిధ్యాన్ని కలిగి ఉన్న బోస్నియా, హెర్జెగోవినా ప్రాంతాలు చాలా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.

బోస్నియా, హెర్జెగోవినాలోని వివిధ జాతులు ఏళ్లపాటు భీకరంగా పోరాడిన తర్వాత 1995లో పశ్చిమ దేశాలు కాల్పుల విరమణను విధించాయి. 1999లో యుగోస్లేవియా తన ఉనికిని కోల్పోయింది.

నాలుగేళ్ల బోస్నియన్ యుద్ధకాలంలో బోస్నియా, హెర్జెగోవినా రాజధాని అయిన సరజెవో పూర్తిగా సెర్బియా దళాల నిర్బంధంలో ఉంది.

20వ శతాబ్దంలో ఆధునిక యూరోపియన్ చరిత్రలో ఇదే సుదీర్ఘమైన నిర్బంధం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లెనిన్‌గ్రాడ్‌ను నాజీలు 872 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు.

ఆ సమయంలో సరజెవోలో నివసిస్తోన్న దాదాపు 4 లక్షల మంది ప్రజల మనుగడకు ఒక మీటరు వెడల్పు, 1.7 మీ. ఎత్తు, దాదాపు 800 మీటర్ల పొడవున్న ఈ సొరంగమే ఏకైక మార్గం. ఈ సొరంగం గుండానే ఆయుధాలు, ప్రజల్ని, సామగ్రిని తరలించారు.

మ్యూజియం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టన్నెల్‌లో 20 మీటర్ల వరకు మాత్రమే సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు

1993 మార్చి- జూన్‌ల మధ్య ఈ సొరంగాన్ని తవ్వారు. సెర్బియా దళాల ముట్టడితో పూర్తిగా ఒంటరిగా మారిన ఈ నగరాన్ని ఐక్యరాజ్య సమితి నియంత్రణలో ఉన్న ఎయిర్‌పోర్ట్ ప్రాంతంతో అనుసంధానించాలనే లక్ష్యంతో ఈ సొరంగాన్ని నిర్మించారు.

నగరవాసులే పారలు, గడ్డపారలతో ఈ సొరంగాన్ని తవ్వారు.

ఈ సొరంగం నిర్మాణానికి ముందు, ఆ నగరంలోకి వెళ్లడానికి, అక్కడి నుంచి బయటకు రావడానికి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం ఎయిర్‌పోర్ట్ రన్‌వే. ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ మార్గం స్నైపర్‌లకు లక్ష్యంగా ఉండేది.

ప్రస్తుతం ఈ సొరంగాన్ని ఒక మ్యూజియంగా మార్చారు. పర్యాటకులు సొరంగంలో కేవలం 20 మీటర్ల పొడవు వరకే సందర్శించగలరు. అయినప్పటికీ ఇది ఇప్పటికీ బోస్నియా, హెర్జెగోవినాలో ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో ఒకటిగా ఉంది.

ఎడిస్ కొలార్
ఫొటో క్యాప్షన్, టన్నెల్ ఆఫ్ హోప్ నిర్మించిన ప్రాంతంలోని ఇంటి పెరట్లో చిన్నతనంలో ఎడిస్ ఆడుకున్నారు

తమ ఇంటి కింద సొరంగం నిర్మించినప్పుడు ఎడిస్ కోలార్ వయస్సు 18 ఏళ్లు.

‘‘మా ఇల్లు వీధి చివరలో ఉన్నందున, యుద్ధం మొదలైనప్పుడు మొదట మా ఇంటిపైనే దాడి జరిగింది. విమానాశ్రయానికి కూడా మా ఇల్లు దగ్గరగా ఉండేది. అందువల్ల సొరంగం నిర్మాణానికి అత్యంత అనుకూలమైన ప్రదేశం కూడా ఇదేనని భావించారు’’ అని ఆయన వివరించారు.

తన ఇంటిపై బాంబు దాడి జరిగిన తర్వాత తండ్రితో పాటు సైన్యంలో చేరాలని ఎడిస్ నిర్ణయించుకున్నారు. వారు లేని సమయంలోనే ఆ ఇంటి కింద సొరంగం నిర్మాణం మొదలైంది.

నాలుగు నెలల్లో సొరంగం తవ్వారు. దీనికోసం దాదాపు 300 మంది ప్రజలు పగలు రాత్రీ కష్టపడ్డారు.

గ్రాండ్‌మా సిదాస్ రూమ్
ఫొటో క్యాప్షన్, మ్యూజియంలోని కొంత భాగానికి ఎడిస్ బామ్మ గౌరవార్థం ‘గ్రాండ్‌మా సిదాస్ రూమ్’ అని పేరు పెట్టారు

యుద్ధం జరిగినంత కాలం తన గ్రాండ్ పేరెంట్స్, సొరంగానికి దగ్గరలో ఉన్న అదే ఇంట్లో గడిపారని ఎడిస్ వివరించారు.

వారు నివసించిన గది ఇప్పుడు మ్యూజియంలో భాగంగా ఉంది. ఆయన బామ్మ గౌరవార్థం మ్యూజియంలోని ఆ భాగాన్ని ‘గ్రాండ్‌మా సిదాస్ రూమ్’ అని పిలుస్తున్నారు.

వారి కుటుంబం నేటికీ అదే ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉమ్మడిగా నివసిస్తున్నారు. ఎడిస్ అదే మ్యూజియంలో పనిచేస్తున్నారు.

‘‘ఆ ఇల్లును నేను ఇక నా పుట్టిల్లుగా చూడలేను. అది నేను పని చేసే ప్రదేశం’’ అని ఎడిస్ అన్నారు.

టన్నెల్ ఆఫ్ హోప్

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధ సమయంలో తనకు ఎదురైన వ్యక్తిగత సవాళ్ల గురించి మ్యూజియం వద్ద టూర్‌ గైడ్‌గా పనిచేసే మిధాత్ మాట్లాడారు.

‘‘మా ఇల్లు ఉన్న ప్రాంతంలో ఎలాంటి నిర్బంధం లేదు. నా తల్లికి క్యాన్సర్ ఉంది. ఆమెకు చికిత్స అందాలంటే నిర్బంధంలో ఉన్న సరజెవో ఆసుపత్రికి తరలించాలి. అప్పుడు నేను నా తల్లిని ఇదే సొరంగం గుండా ఆ ఆసుపత్రికి తీసుకెళ్లాను. కొన్ని నెలల తర్వాత ఆమె చనిపోయారు. ఆమె మృతదేహాన్ని మళ్లీ అదే సొరంగం ద్వారా మా ఇంటికి తీసుకెళ్లి ఖననం చేశాం’’ అని ఆయన వివరించారు.

యుద్ధం ముగియడానికి రెండు నెలల ముందు తాను గాయపడ్డానని అప్పుడు తనను కూడా సొరంగం ద్వారానే తరలించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

టన్నెల్ ఆఫ్ హోప్

ఫొటో సోర్స్, Getty Images

సొరంగంలో సులువుగా నడవలేమని ఆయన అన్నారు. అందులో ఎప్పుడూ నడుము లోతు వరకు భూగర్భజలాలు ఉండేవని చెప్పారు.

‘‘అది చాలా ఇరుకుగా ఉండేది. అన్ని వస్తువులతో చిందరవందరగా ఉండేది. కేబుల్స్, చమురు పైపులు అందులో ఉండేవి. అందుకే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎవరు? ఎప్పుడు వెళ్లాలో నిర్ణయించుకునేవాళ్లమని’’ ఆయన చెప్పారు.

యుద్ధ సమయంలో ఈ సొరంగం స్థానికులకు మాత్రమే కాకుండా స్వతంత్ర బోస్నియా- హెర్జెగోవినా మొదటి అధ్యక్షుడు అలీజా ఇజెట్‌బెగోవిక్ వంటి ముఖ్యమైన వ్యక్తులకు కూడా ఇది ఒక కీలక మార్గంగా ఉపయోగపడింది.

‘‘అప్పటికే ఆయన వృద్ధుడు. ఆయన శాంతి చర్చలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయన ఒక కుర్చీలో కూర్చునేవారు. ఆ కుర్చీని ఒక బండిపై ఉంచి సొరంగంలో నెట్టుతూ తీసుకెళ్లేవారు’’ అని మిధాత్ గుర్తు చేసుకున్నారు.

టన్నెల్ ఆఫ్ హోప్ మ్యూజియంలోని ప్రదర్శనలో ఉంచిన వాటిలో ఆ కుర్చీ కూడా ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)