అత్యాధునిక ఆయుధాలు పట్టుకున్న సైనికులకు ఖాళీ చేతులతో ఎదురెళ్లిన ఈమె ఎవరు?

 అన్ గ్వి-రియోంగ్

ఫొటో సోర్స్, Screenshot/BBC

దక్షిణ కొరియాలో మార్షల్ లా విధిస్తున్నట్లు మంగళవారం రాత్రి అధ్యక్షుడు ప్రకటించిన కొద్దిసేపటికి వందలాది మంది పార్లమెంట్ భవనం ఎదురుదుగా నిరసనకు దిగారు.

కొంతమంది బారికేడ్లు, కంచెలపై నుంచి దూకి పార్లమెంట్‌లోకి ప్రవేశించారు.

పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది.

ఈ సందర్భంగా ఒక దృశ్యం చాలామంది దృష్టిని ఆకర్షించింది. పార్లమెంట్ సభ్యులను జాతీయ అసెంబ్లీలోకి ప్రవేశించకుండా ఆపుతున్న సైనికులకు ఒక మహిళ ధైర్యంగా ఎదురెళ్లారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ మహిళ ఎవరు?

దక్షిణకొరియాలోని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి, అన్ గ్వి-రియోంగ్ తోపులాట సమయంలో సైనికుడి ఆయుధాన్ని లాక్కున్న దృశ్యాలు షోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

'నేను ఏమాత్రం ఆలోచించలేదు.. దీన్ని(సైనిక పాలన) ఆపాలని మాత్రమే నాకు తెలుసు' అని 35 ఏళ్ల అన్ గ్వి-రియోంగ్‌ బీబీసీ కొరియన్ సర్వీస్‌తో చెప్పారు.

దక్షిణ కొరియా అంతటా మార్షల్ లా ప్రకటించిన తరువాత సైనికులు అసెంబ్లీ భవనంలోకి వెళుతుండగా ఆమె పార్లమెంట్‌లోకి ప్రవేశించారు.

దక్షిణ కొరియా యువత మాదిరిగానే అన్ గ్వి రియోంగ్‌కు కూడా 'మార్షల్ లా' అనే పదం కొత్త. ఆ దేశంలో చివరిగా 1979లో మార్షల్ లా ప్రకటించారు.

ఆ తరువాత మంగళవారం రాత్రి మళ్లీ ఆ పదం వినగానే ఆమె ఆందోళన చెందారు.

మార్షల్ లా అమల్లోకి వస్తే ర్యాలీలు, ప్రదర్శనలు వంటి రాజకీయ కార్యక్రమాలను నిషేధిస్తారు. కార్మిక సమ్మెలు కూడా నిషేధం. మీడియా, ప్రచురణ పనులను అధికారులే నియంత్రిస్తారు. వీటిని ఉల్లంఘిస్తే వారెంట్ లేకుండానే అరెస్టు చేయొచ్చు, నిర్బంధించవచ్చు.

మార్షల్ లా ప్రకటించిన కొద్దిసేపటికే, ప్రతిపక్ష నాయకుడు లీ జే-మ్యూంగ్ పార్లమెంట్ సభ్యులను జాతీయ అసెంబ్లీలో సమావేశపరచి, మార్షల్ లా డిక్లరేషన్‌ను రద్దు చేయడానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

దీంతో రాత్రి దాదాపు 11 గంటల సమయంలో అసెంబ్లీకి చేరుకున్నఅన్.. భవనంపై తిరుగుతున్నహెలికాప్టర్‌లు తమను గుర్తించకుండా ఉండటానికి ఆఫీసు లైట్‌లను ఆపేసినట్లు గుర్తు చేసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అన్ గ్వి-రియోంగ్
ఫొటో క్యాప్షన్, 21వ శతాబ్దపు దక్షిణ కొరియాలో మార్షల్ లా విధించడం కలచివేసిందని అన్ గ్వి-రియోంగ్ చెప్పారు.

‘‘ముందు భయపడ్డా’’

అన్ గ్వి-రియోంగ్ ప్రధాన భవనానికి చేరుకునే సమయానికి సైనికులు అక్కడ అధికారులు, పౌరులతో వాగ్వాదానికి దిగారు.

'నేను ఆయుధాలతో ఉన్న సైనికులను చూసినప్పుడు పాత రోజుల్లోకి వెళ్తున్నట్లు అనిపించింది' అని ఆమె అన్నారు.

అన్, ఆమె సహచరులు ఓటింగ్ జరిగే ప్రధాన భవనంలోకి దళాలు ప్రవేశించకుండా ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించారు.

రివాల్వింగ్ తలుపులను లోపలి నుంచి లాక్ చేసి, అవి తెరుచుకోకుండా ఉండేందుకు ఫర్నీచర్, ఇతర బరువైన వస్తువులను పేర్చారు.

సైన్యం ప్రధాన భవనం వైపు వస్తున్నప్పుడు, అన్ కూడా ముందుకు వచ్చారు. సైనికుడి తుపాకీకి ఎదురెళ్లారు.

సైనికుడి రైఫిల్ బారెల్‌ను ఎత్తి చూపుతున్న సమయంలో తుపాకీని లాక్కోటానికి ప్రయత్నించిన వీడియో వైరల్‌ అయింది.

'చెప్పాలంటే, నేను మొదట భయపడ్డాను. కానీ అలా ముందుకు వస్తున్న సైన్యాన్ని చూసి, నేను మౌనంగా ఉండలేను అని అనుకున్నాను' అని ఆమె చెప్పారు.

దాదాపు 01:00 గంటలకు మార్షల్ లా ఎత్తివేయాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. హాజరైన మొత్తం 190 మంది సభ్యులు మార్షల్ లా రద్దు చేయాలని ఓటు వేశారు.

వేకువన 4:26గంటలకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. వాతావరణం సద్దుమణిగిన తర్వాత అన్ అసెంబ్లీ భవనంలోనే కొద్దిసేపు నిద్రపోయారు.

'ఉదయం అసెంబ్లీ బయటకు వెళ్లడానికి నేను కొంచెం భయపడ్డాను. అక్కడ టాక్సీలు నడుస్తున్నట్లు కనిపించలేదు" అన్నారామె.

బీబీసీతో సంభాషణ సమయంలో ఆమె ముందు రోజు రాత్రి ఫుటేజీలో కనిపించిన నల్ల డ్రెస్సు, లెదర్ జాకెట్‌లోనే కనిపించారు.

బీబీసీతో మాట్లాడుతూ ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 'ఇది 21వ శతాబ్దపు కొరియాలో జరగడం హృదయాన్ని కలచివేసింది. చాలా నిరాశపరిచింది" అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)