పుష్ప 2 రివ్యూ: లాజిక్‌కు అందని మాస్ మసాలా ఎంటర్‌టైనర్..

ఫొటో సోర్స్, @MythriOfficial
- రచయిత, తాడి ప్రకాశ్
- హోదా, బీబీసీ కోసం
అల్లు అర్జున్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా విడుదలైంది. మంచి విజువల్ ప్రజెంటేషన్, నరాల్లో నెత్తురును పరిగెత్తించే సంగీతం, సౌండ్ ఎఫెక్ట్స్, ఒక సన్నివేశం వెంట మరో ఉద్విగ్న సన్నివేశం...వేగం...నెత్తురు...పగ...ప్రతీకారం- కలిసిన ఒక అరుదైన సినీ అనుభవం ఈ సినిమా.
హీరో ఎర్ర చందనం స్మగ్లర్. కరడుగట్టిన నేరస్థుడు. భార్య మాట మన్నించే మంచి మనిషి. తల్లినీ బంధువుల్నీ, తనకింద పని చేసేవాళ్లను ప్రేమించే సహృదయుడు. మూర్ఖుడు, మంచివాడు. ఇవన్నీ పుష్పలో కనిపిస్తాయి.
సినిమా మొదటి నుంచి చివరిదాకా అతనే. ఒక భుజం కొంచెం పైకెత్తి వంకరగా నడుస్తాడు- అంతే! సన్నివేశం పేలిపోతుంది.
కూరలో ఉప్పు ఎక్కువైందని శ్రీవల్లి( రష్మిక మందాన) తో గొడవపడినా, ఫహాద్ ఫాజిల్‌ను సవాల్ చేసినా, విజృంభించి నృత్యం చేస్తూ శత్రువును ఎదుర్కొన్నా, అల్లు అర్జున్ ఆ పాత్రలో జీవించాడు.
మూడు గంటల ఇరవై నిమిషాలసేపు ఊపిరాడనివ్వని ఒక సూపర్ పెర్ఫార్మెన్స్. చీర కట్టుకుని, పసుపు రాసుకుని, గంధం పూసుకుని, నిమ్మకాయల దండ మెడలో వేసుకుని, జాతరలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డాన్స్ చేస్తుంటే, థియేటర్లో వందల సెల్‌ఫోన్లు గాల్లోకి లేచాయి. ఆ దృశ్యాలను ప్రేక్షకులు ఉత్సాహంగా రికార్డు చేసుకున్నారు.
ముఖ్యంగా డైలాగులు, పంచ్‌లు, వన్‌లైనర్లు జనాల్ని కట్టిపడేశాయి.


ఫొటో సోర్స్, @MythriOfficial
నెత్తురు చిమ్మే ఈ పచ్చి కమర్షియల్ సినిమాలో సెంటిమెంట్‌ని కన్నీటి తడిలో పండించారు. భర్తని ప్రేమించే భార్యగా శ్రీవల్లి తెర మీద మేలిమి బంగారంలా మెరిసింది.
ఒక నవ్వుతో, ఒక్క చూపుతో, అలకతో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి- అనే డైలాగ్ జనాన్ని ఆకట్టుకుంది. ఎగిరి, అల్లు అర్జున్ మీదికి ఎక్కి డాన్స్ చేసి ప్రేక్షక హృదయాల్ని కొల్లగొట్టింది శ్రీవల్లి.
పుష్ప నూరు శాతం మాస్ సినిమా. పదహారణాల తెలుగు సినిమా. చిత్తూరు జిల్లా యాస విరగబండింది. ఆల్‌ఇండియా, గ్లోబల్ అని కబుర్లు చెప్పినా అంతా ఆంధ్రప్రదేశ్‌లోనే నడిచింది. ప్రవాహం లాంటి ఒక ఉధృతి, టెంపో, నెత్తురు, ఫైట్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి.
పాత సెంటిమెంటే, పాతపగలే , అవే ఫార్ములా పాటలే...మనం ఊహించగల ఎత్తుకు పై ఎత్తులే. అయినా వాటిని గుదిగుచ్చిన తీరు, కథ నడిపించిన తీరు, చేజింగ్ సన్నివేశాలు, అందం, వేగం...ఇది పూర్తిగా సుకుమార్ మార్క్ స్టోరీ టెల్లింగ్.
అయితే, కొన్ని సన్నివేశాలు, ఫైటింగ్‌లు, చేజింగ్‌లు లాజిక్కులకు అందవు. కేవలం ఎలివేషన్, ఎంటర్‌టైన్మెంట్.. అంతే.
కమర్షియల్ కథని కళ్లు చెదిరేలా నడిపించిన కళాత్మక వేషం. వెయ్యి కోట్ల కోసం పన్నిన పంచరంగుల వల. ఇప్పటికైతే ఇది తెలుగు సినిమా సాధించిన అపూర్వ విజయం.

ఫొటో సోర్స్, @MythriOfficial
కోట్లు కొల్లగొట్టే వ్యాపారమే అయినా, సినిమా మన జీవిత భాగస్వామి. మన సంస్కృతి. ఈ వెనకబడిన బడుగు దేశంలో అన్ని వర్గాల వారికీ ఆనందం పంచిచ్చే ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్. పుష్ప 2 బలమైన బాహువుల్ని చూపింది, ఆత్మవిశ్వాసంతో.
ఈ సినిమా ఉత్తర భారత దేశాన్ని కబళించబోతోంది. చాలా హిందీ సినిమాలు కోటీశ్వరుల విలాసాలు, ప్రేమ పాటలతో తెగ విసిగించాయి. పొగాకు నములుతూ, బీడీ కాలుస్తూ, మందు తాగే ఒక కూలీ సక్సెస్ స్టోరీ బిహార్‌ను, ఉత్తరప్రదేశ్‌ను గడగడలాడిస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ అభిమానులనే కాక, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, హోటళ్లలో పనిచేసే వాళ్లు, కిళ్లీలు కట్టేవాళ్లు, మెకానిక్‌లు, జులాయిగా తిరిగేవారిని పుష్ప 2 ఉత్తేజంతో ఊగిస్తోంది.
లక్షల్లో ఉన్న ఆ నిరుపేద నిరుద్యోగ, నిర్భాగ్యులంతా అల్లు అర్జున్ తో ఐడెంటిఫై అవుతారు. ఈ సినిమా విజయానికి అదే ఆయువు పట్టు.
ఎర్రచందనం అనేది ఒక ఖరీదైన సాకు మాత్రమే. ఇంటి పేరు కూడా లేని, ఎవరికో పుట్టి, బతుకంతా అవమాన భారాన్ని మోస్తున్న, కూటికి గతిలేని కూలీ అసాధారణ విజయగాథ జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
వెండితెర లాభాల చరిత్రను తిరగరాస్తోంది.
పుష్పలో చిట్టచివరి ఫైట్ క్రూరంగా సుదీర్ఘంగా ఉన్నా, దానిని కంపోజ్ చేసిన తీరు, తాళ్లతో కాళ్లూ చేతులు కట్టేసి ఉన్నా, అల్లు అర్జున్ అంతఎత్తున ఎగిరి చేసే సాహసం మరిచి పోలేనిది. జగపతిబాబు, రావు రమేశ్, శ్రీలీల, సునీల్, ఫహాద్ ఫాజిల్ ఎంత బాగా కుదిరారో చెప్పలేం అసలు.
కథ, ఫోటోగ్రఫీ, సంగీతం ఈ మూడింటిని త్రిశూలంగా ధరించిన అల్లు అర్జున్‌తో సుకుమార్ చేసిన మేజిక్, అదిగో....కాసుల వర్షమై కురుస్తోంది, బీభత్సంగా.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














