హరీష్ రావుపై ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్ ఎవరు?

Harish Rao Thanneeru

ఫొటో సోర్స్, Harish Rao Thanneeru/facebook

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈమేరకు డిసెంబరు 1న పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో క్రైం నెం.1205/2024తో ఎఫ్ఐఆర్ నమోదైంది.

తన ఫోన్‌తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఇంటెలిజెన్స్ విభాగం సహకారంతో ట్యాప్ చేశారని, దీని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు

కాగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందునే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు హరీష్ రావు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫిర్యాదులో ఏముంది?

చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా నమోదుచేసిన కేసులో ఏ1గా హరీష్ రావు, ఏ2గా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌ను పేర్కొన్నారు.

హరీష్ రావుపై ఫిర్యాదు చేసిన గాధగోని చక్రధర్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందినవారు. గతంలో బీజేపీలో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరి సిద్ధిపేట నియోజకవర్గం నుంచి హరీష్ రావుపై పోటీ చేసి ఓడిపోయారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫార్మర్స్ ఫస్ట్ అనే ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు.

‘‘2023లో సిద్ధిపేట నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేశాను. ఆత్మహత్య చేసుకున్న 250 మంది కౌలు రైతులు, రైతు కుటుంబాలకు రెండు దఫాలుగా రూ. లక్ష చొప్పున సాయం చేశాను. సిద్ధిపేట నియోజకవర్గంలో నా సేవా కార్యక్రమాలు చూసి తట్టుకోలేక నాపై అప్పట్లో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. సేవా కార్యక్రమాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని పోలీసులు బెదిరించారు. ఆ తర్వాత నాకు బెయిల్ రావడంతో విడుదలయ్యాను. నా ఫోన్ నంబర్, నా భార్య ఫోన్ నంబర్ అక్రమంగా ట్యాప్ చేసి నా కదలికలు, కార్యకలాపాలపై నిఘా పెట్టారనే విషయాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. దీని వెనుక అప్పట్లో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు హస్తం,అప్పటి అదనపు డీసీపీ రాధా కిషన్ రావు, ఇంకొందరి పాత్ర ఉందనే అనుమానం ఉంది’’ అని చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

పోలీసు అధికారుల అరెస్టు

తెలంగాణలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ నడుస్తోంది. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర రావు సహా మరికొందరిపై నమోదైన కేసు దర్యాప్తులో ఉంది. ఆయన అమెరికాలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఏడాది మార్చి 10న డీఎస్పీ ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగంపై మార్చి 12న ఆయన్ను అరెస్టు చేశారు. తర్వాత ఇదే కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రిటైర్డ్ అదనపు ఎస్పీ రాధాకిషన్ రావును అరెస్టు చేశారు.

ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు

ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. అడుగడుగునా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

‘‘ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించినవ్. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించినవ్. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే తలాతోక లేని అక్రమ కేసొకటి మానకొండూరులో పెట్టించినవ్. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించినవ్’’ అని ఎక్స్ వేదికగా స్పందించారు హరీష్ రావు.

హరీష్ రావు చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదు.

అయితే, రెండు నాల్కల ధోరణి సీఎం రేవంత్ రెడ్డిది కాదని, అది కేసీఆర్‌దేనని హరీష్ రావు వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి.

తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

హైకోర్టు ఏం చెప్పింది?

పంజాగుట్ట పోలీసుస్టేషన్లో తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని డిసెంబర్ 4న తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు.

‘‘రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారు. నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారు. ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారు. కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి’’ అని పిటిషన్‌లో హైకోర్టును కోరారు.

ఈ పిటిషన్‌‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు.. ఈ కేసులో హరీష్ రావును అరెస్టు చేయవద్దంటూ డిసెంబరు 5న ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చి విచారించవచ్చని, అందుకు హరీష్ రావు సహకరించాలని స్పష్టం చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)