అల్లు అర్జున్ అరెస్ట్: వెల్లడించిన హైదరాబాద్ పోలీసులు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా తెలిపింది.
అల్లు అర్జున్‌ను పోలీసులు తీసుకెళుతున్న దృశ్యాలతో ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో ''దుస్తులు మార్చుకుని వస్తా...కొంచెం టైం ఇవ్వండి.'' అని అల్లు అర్జున్ అడుగుతున్నట్లుగా ఉంది. ''మేం రిక్వెస్ట్‌గానే అడుగుతున్నాం.'' అని ఏసీపీ రమేశ్ కుమార్ అందులో అల్లు అర్జున్‌కు చెబుతున్నారు.
ఇంట్లో బెడ్ రూంలోకి వచ్చి తీసుకెళ్లడమే అభ్యంతరకరమని అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్లుగా ఈ వీడియోలో ఉంది.
మరోవైపు ఆ సమయంలో అల్లు అర్జున్ సతీమణి స్నేహ కన్నీరు పెట్టుకోగా, ఆమెను ఓదార్చారు అర్జున్.
తర్వాత ఆయన్ను చిక్కడపల్లి పోలీసులు స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్, సోదరుడు అల్లు శిరీష్ చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు.
ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి డిసెంబరు 8వ తేదీన ముగ్గుర్ని అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు.
సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం.సందీప్, థియేటర్ సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇంచార్జ్ జి. విజయ చందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసుతో తమకు సంబంధం లేదని, సంధ్య థియేటర్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది బెనిఫిట్ షో కావడంతో థియేటర్ తో సంబంధం లేకుండా ఎగ్జిబిటర్స్ ఆ షో ప్రదర్శించారని థియేటర్ యాజమాన్యం పిటిషన్ లో చెప్పింది.
గురువారమే దిల్లీలో పుష్ప2 ది రూల్ సక్సెస్ మీట్ నిర్వహించారు అల్లు అల్లు అర్జున్.
పోలీసుల చర్యలపై స్పందించిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, ప్రభుత్వం ఎంత అభద్రతాభావంతో ఉందో దీనిని బట్టి అర్థమవుతోందని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇటీవలే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్.
ఈనెల 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
థియేటర్ కు వస్తున్నట్లుగా ముందుగానే సమాచారం ఇచ్చానని, మహిళ చనిపోవడానికి తనకు సంబంధం లేదని పిటిషన్ లో చెప్పారు అల్లు అర్జున్.
మరోవైపు, మహిళ చనిపోయిన ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఘటనకు ఎంతో చింతిస్తున్నానని చెప్పారాయన.
అలాగే వారి కుటుంబానికి రూ.25లక్షలు సాయంగా ఇస్తానని ప్రకటించారు

ఫొటో సోర్స్, allu arjun/facebook
అసలేం జరిగింది?
అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యురిటీ విభాగంపై కేసు నమోదు చేశామని ఇటీవలే ప్రకటించారు పోలీసులు.
బీఎన్ఎస్ యాక్ట్ 105, 118(1) రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు పోలీసులు వెల్లడించారు.
‘థియేటర్‌లో లోయర్ బాల్కనీలో సినిమా చూస్తున్న సమయంలో అల్లు అర్జున్, అతని సెక్యురిటీ విభాగంలోని 30-40 మంది ఒక్కసారిగా థియేటర్ లోనికి వచ్చారు.
ఆ సమయంలో ఒక్కసారిగా పెద్దసంఖ్యలో అభిమానులు, సెక్యురిటీ సిబ్బంది రావడంతో గాలి ఆడక రేవతి, ఆమె కుమారుడు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఘటనపై మరింత విచారణ జరుగుతోంది’’ అని అంతకు ముందు డీసీపీ అక్షాంశ్ యాదవ్ చెప్పారు.
పోలీసుల భద్రత అక్కడ ఉందని, ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, PTI
బాధితులు ఎవరు?
డిసెంబర్ 5న ‘పుష్ప 2:ది రూల్’ సినిమా విడుదలైంది. అంతకు ఒకరోజు ముందు అంటే డిసెంబరు 4వ తేదీన ఏపీ, తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించారు.
సంధ్య థియేటర్‌లోనూ బెనిఫిట్ షో వేశారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్, ఆయన భార్య రేవతి (35), కుమారుడు శ్రీతేజ (9), కుమార్తె శాన్వికతో కలిసి అక్కడికి వచ్చారు.
ఆ థియేటర్‌లో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ కూడా వచ్చారు. ఆ సమయంలో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జీ చేశారు.
‘‘రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే రేవతిని, శ్రీతేజను పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశాం. ఆ తర్వాత విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు’’ అని చిక్కడపల్లి పోలీసులు చెప్పారు.
శ్రీతేజ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, చికిత్స అందుతోందని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














