ఫ్రాన్స్: అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి కూలిన ప్రభుత్వం

మిషెల్ బార్నియర్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ మూడు నెలల కిందటే మిషెల్ బార్నియర్‌ను ప్రధానిగా ఎంపిక చేశారు
    • రచయిత, అమీ వాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫ్రాన్స్‌లో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాన మంత్రి మిషెల్ బార్నియర్ నేతృత్వంలోని సర్కారు, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది.

నో కాన్ఫిడెన్స్ మోషన్‌‌లో ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఎంపీలు ఓటేశారు. అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ మూడు నెలల కిందటే ఆయన్ను ప్రధానిగా ఎంపిక చేశారు.

బడ్జెట్‌ను ఓటింగ్ లేకుండా ఆమోదించడానికి మిషెల్ బార్నియర్ గట్టిగా ప్రయత్నించడంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.

1962 తర్వాత ఫ్రాన్స్‌లో ఒక ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ద్వారా పడిపోవడం ఇదే మొదటిసారి.

వీడియో క్యాప్షన్, త్వరలోనే కొత్త ప్రధానిని నియమిస్తానని ప్రకటించిన ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రాన్
బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తాజా పరిణామాలతో ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది వేసవిలో ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. అయితే, పార్లమెంటులో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాలేదు.

ఈ తీర్మానం పాస్ కావాలంటే 288 ఓట్లు కావాల్సి ఉంది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఆయనకు వ్యతిరేకంగా, తీర్మానానికి మద్దతుగా 331 ఓట్లు నమోదయ్యాయి.

ఇప్పుడు బార్నియర్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, నిరుపయోగంగా మారుతుంది.

అయితే, కొత్త ప్రధానమంత్రి వచ్చే వరకు బార్నియర్ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తారు.

ఫ్రాన్స్ ప్రభుత్వం, అవిశ్వాస తీర్మానం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మిషెల్ బార్నియర్‌

ప్రధానిగా బార్నియర్ ఎంపికను పార్లమెంటరీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న లెఫ్ట్ వింగ్ కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది.

బార్నియర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను లెఫ్ట్ వింగ్‌తోపాటు, రైట్ వింగ్ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి.

‘‘ఈ బడ్జెట్ ఫ్రెంచ్ ప్రజలకు విషం లాంటిది’’ అని రైట్ వింగ్ పార్టీ నేషనల్ ర్యాలీకి చెందిన మహిళా నాయకురాలు మరైన్ లీ పెన్ విమర్శించారు.

అయితే, తనను పదవి నుంచి తొలగించినంత మాత్రాన ఫ్రాన్స్ ఆర్థిక సమస్యలు పరిష్కారం కావని ఓటింగ్‌కు ముందు నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ బార్నియర్ వ్యాఖ్యానించారు.

‘‘మనం నిజాలు, బాధ్యతలు అనే అంశాలను చూడాలి. అలాగే మన అప్పులకు సంబంధించిన వాస్తవాలను కూడా తెలుసుకోవాలి. కఠిన నిర్ణయాలను ప్రకటించడం నాకేమీ ఆనందం కాదు’’ అని బార్నియర్ అన్నారు.

బార్నియర్‌ను పదవి నుంచి దించడం తప్ప వేరే మార్గం లేదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లీ పెన్ వ్యాఖ్యానించారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడి పరిస్థితి గురించి అడగగా, ‘నేను ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ రాజీనామాను కోరడం లేదు’ అని ఆమె అన్నారు.

ఓటర్ల మనోగతాన్ని గుర్తించకపోయినా, రాజకీయ శక్తులను గౌరవించకపోయినా అధ్యక్షుడి మీద ఒత్తిడి తీసుకువస్తామని లీ పెన్ అన్నారు.

ఫ్రాన్స్ ప్రభుత్వం, అవిశ్వాస తీర్మానం

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

ఫొటో క్యాప్షన్, బార్నియర్‌ను పదవి నుంచి దించడం తప్ప వేరే మార్గం లేదని లీ పెన్ అన్నారు

సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లి ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చిన అధ్యక్షుడు మేక్రాన్ గురువారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తారు.

ప్రెసిడెంట్‌కు, ప్రధానికి వేర్వేరు ఓటింగ్ ఉండటం వల్ల ఈ తీర్మానం ప్రభావం ఆయనపై పడదు. ఆయన పదవికి ఇబ్బంది ఉండదు.

బుధవారం నాటి ఓటింగ్ ఫలితం ఎలా వచ్చినా తాను రాజీనామా చేయబోనని మేక్రాన్ ఇంతకు ముందే చెప్పారు.

2019లో జరిగిన అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న నాట్రడామ్‌ కేథడ్రల్ చర్చిని పున:ప్రారంభించడానికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ ఈ వారాంతంలో పారిస్ రాబోతున్నారు. ఈలోగా కొత్త ప్రధానిని ఎంపిక చేయాలని మేక్రాన్ భావిస్తున్నారు.

జులై వరకు కొత్త పార్లమెంటరీ ఎన్నికలు జరగవు. ప్రస్తుతం సభలో ఏ వర్గానికీ పూర్తి మెజారిటీ లేదు. కాబట్టి అప్పటి వరకు ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)