కారడవిలో.. - 20 డిగ్రీల చలిలో, 5 వారాల తర్వాత ప్రాణాలతో దొరికిన యువకుడు

బ్రిటిష్ కొలంబియా

ఫొటో సోర్స్, RCMP

ఫొటో క్యాప్షన్, సామ్ బెనాస్టిక్
    • రచయిత, జెస్సికా మర్ఫీ
    • హోదా, బీబీసీ న్యూస్

బ్రిటిష్ కొలంబియాలోని మారుమూల అటవీ ప్రాంతంలో కనిపించకుండా పోయిన యువకుడిని ఐదు వారాల తర్వాత సజీవంగా గుర్తించారు.

పది రోజులపాటు హైకింగ్ ట్రిప్‌కు (చేపలు పట్టుకుంటూ, కొండప్రాంతాల్లో తిరిగొద్దామని) బ్రిటిష్ కొలంబియా అడవుల్లోని రెడ్‌ఫెర్న్ - కెయిలీ పార్కుకి వెళ్లారు 20 ఏళ్ల సామ్ బెనాస్టిక్.

రోజులు గడచిపోతున్నా ఆయన తిరిగి రాకపోవడంతో సామ్ కనిపించడం లేదంటూ అక్టోబర్ 19న ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు సామ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే, సామ్ ఆచూకీ తెలియకపోవడం.. అడవిలో ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీలకు పడిపోవడంతో పోలీసులు కూడా ఆశ వదిలేశారు. అక్టోబర్ చివర్లో గాలింపు చర్యలు నిలిపివేశారు.

బీబీసీ న్యస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ తరువాత రెడ్‌ఫెర్న్ లేక్ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు మంగళవారం సామ్ బెనాస్టిక్ తారసపడ్డారు. వారిద్దరినీ చూసి ఆయన వారివైపు వచ్చారు, ఆయన్ను సామ్‌గా వారు గుర్తించారు.

''ఆయన కనిపించకుండాపోయి చాలా రోజులు కావడంతో ఏదైనా చెడువార్త వినాల్సి వస్తుందేమోనని భయపడ్డాం'' అని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కార్పరల్ పోలీస్ మడోన్నా సాండర్సన్ బుధవారం బీబీసీతో చెప్పారు.

'' చాలా సంతోషం, ఆయన కుటుంబ సభ్యులైతే ఆశ్యర్యపోయారు'' అని ఆమె అన్నారు.

కొద్దిరోజులు తన కారులోనే ఉన్నానని, ఆ తర్వాత ఒక వాగు దగ్గర క్యాంప్ వేసుకుని 10 - 15 రోజులు అక్కడే ఉన్నట్లు సామ్ పోలీసులతో చెప్పారు. ఆయన కనిపించకుండాపోయే సమయానికి, ఒక టార్ప్ (టెంట్), ఒక బ్యాగ్, క్యాంప్ వేసుకోవడానికి పనికొచ్చే కొన్ని వస్తువులు మాత్రమే సామ్ వద్ద ఉన్నాయి.

ఆ తర్వాత ఆయన లోయలోకి దిగి, వాగు ఒడ్డున పొడిగా ఉన్న ప్రదేశంలో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోయి, మంచు కురవడం మొదలైంది.

చివరికి, రెడ్‌ఫెర్న్ లేక్ వైపు వచ్చినవారికి కనిపించారు.

''చాలా తక్కువ ఆహారం, పరిమిత వనరులతో అలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని బతికుండడం నిజంగా చాలా కష్టం'' అని ప్రిన్స్ జార్జ్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెర్చ్ మేనేజర్ ఆడమ్ హాకిన్స్ బీబీసీతో చెప్పారు.

గాలింపు బృందాలు, కెనడియన్ రేంజర్స్, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ), కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఈ భారీ అటవీ ప్రాంతంలో గాలించడంతో పాటు ఎయిర్ సెర్చ్ కూడా చేసినట్లు హాకిన్స్ చెప్పారు.

పట్టణ ప్రాంతం నుంచి దూరంగా ఉన్న మారుమూల పర్వతప్రాంతాలు, చిన్నచిన్న కొండలు, నిటారుగా ఉండే అల్పైన్ పర్వత ప్రాంతాలతో పాటు మంచుతో పరుచుకుని ఉండే ప్రాంతాల్లోనూ గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

అసలు అలాంటి పరిస్థితుల్లో సామ్ ఎలా గడిపారు, సజీవంగా ఎలా తిరిగొచ్చారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు, ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చలి నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం స్లీపింగ్ బ్యాగ్(పడుకునేందుకు ఉపయోగించే బ్యాగ్‌)ను కత్తిరించి వెచ్చదనం కోసం తన కాళ్లకు చుట్టుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు తనతో చెప్పారని స్థానిక హోటల్ యజమాని మైక్ రీడ్ వార్తా సంస్థ సీబీసీతో చెప్పారు. సామ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు రీడ్ హోటల్‌లోనే ఉన్నారు.

అంబులెన్సులో ఎక్కించేప్పటికి సామ్ దాదాపు కుప్పకూలిపోయారని, ఆయన పరిస్థితి అంత బాగులేదని కుటుంబ సభ్యులు చెప్పారని రీడ్ తెలిపారు.

సామ్ కనిపించకుండాపోవడానికి ముందు, చివరగా రెడ్‌ఫెర్న్ లేక్ వద్ద దుమ్ముకొట్టుకుపోయిన తన ఎర్రని బైక్‌తో కనిపించారని ఆర్‌సీఎంపీ తెలిపింది.

బెనాస్టిక్ మళ్లీ కనిపించిన ప్రదేశం, తప్పిపోయినప్పుడు ఆయన ఏం చేశారనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నానని, అవి భవిష్యత్తులో గాలింపు చర్యలకు ఉపయోగపడతాయని హాకిన్స్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)