చైనా శానిటరీ ప్యాడ్ కంపెనీలు మహిళలకు క్షమాపణలు ఎందుకు చెబుతున్నాయి?

శానిటరీ ప్యాడ్, మహిళలు, మహిళల ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కో యూవ్
    • హోదా, బీబీసీ న్యూస్

అడ్వర్టయిజ్‌మెంట్‌లో చెప్తున్న కంటే తక్కువ సైజులో ఉన్న శానిటరీ ప్యాడ్స్ విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో చైనాకు చెందిన ప్రధాన శానిటరీ ప్యాడ్ కంపెనీలు క్షమాపణలు చెప్పాయి.

ప్రముఖ కంపెనీలకు చెందిన శానిటరీ ప్యాడ్స్‌ సైజును కొలుస్తున్న చైనీస్ మహిళల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆగ్రహం పెల్లుబికింది.

ఆ వీడియోలు చాలావరకు ప్యాకెట్‌పై తయారీ కంపెనీలు పేర్కొన్న కంటే ప్యాడ్స్ తక్కువ సైజులో ఉన్నాయని చూపుతున్నాయి.

స్త్రీల ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులకు సంబంధించిన ఈ వివాదం మహిళలంటే పట్టింపు లేకపోవడానికి నిదర్శనమంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

నిత్యం వినియోగించే శానిటరీ ప్యాడ్‌లలో లోపాలు ఉన్నాయంటూ చైనా మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలోనూ చైనాలో ఇలాంటి కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి.

నవంబర్ 3న చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం జియాంగ్జు యూజర్ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆమె 9 ప్రముఖ కంపెనీలకు చెందిన శానిటరీ ప్యాడ్‌లను ఒక టేప్‌తో కొలిచారు, అవన్నీ వాటి ప్యాకెట్‌పై ముద్రించిన దానికంటే తక్కువ సైజులో ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''ప్యాడ్ సైజుని తగ్గిస్తే మీరు ధనవంతులు అవుతారా?'' అని ఆమె ఆ వీడియోలో కంపెనీలను ప్రశ్నించారు.

దీంతో ప్యాడ్‌ల తయారీ కంపెనీలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శానిటరీ ప్యాడ్స్ తయారీదారులు మోసం చేస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి.

‘ఈ ఉబ్బిన శానిటరీ ప్యాడ్ మగాళ్ల పాదాల కింద ఉన్న ఇన్‌సోల్‌లాగా ఉంది’ అని మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వీబోలో ఓ యూజర్ కామెంట్ చేశారు.

ఇది సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చగా మారడంతో, చైనీస్ వార్తా సంస్థ 'ది పేపర్' కూడా 20కి పైగా వివిధ శానిటరీ ప్యాడ్‌లపై విశ్లేషణ జరిపింది. అందులో దాదాపు 90 శాతం ప్యాడ్స్ కంపెనీలు చెబుతున్న పరిమాణం కంటే కనీసం 10 మిల్లీమీటర్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది.

ప్యాడ్‌ లోపలి పొరలు కూడా చాలావరకు కుచించుకుపోయి ఉన్నట్లు పేర్కొంది.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శానిటరీ ప్యాడ్‌లు

చైనా ప్రమాణాల ప్రకారం.. శానిటరీ ప్యాడ్‌ల తయారీలో సైజుకి సంబంధించి హెచ్చుతగ్గులు 4 శాతం వరకూ ఉండొచ్చని, అయితే వాటి లోపల ఉపయోగించే పొరల సైజు గురించి అందులో స్పష్టంగా పేర్కొనలేదని ‘ది పేపర్’ రిపోర్ట్ చేసింది.

ఈ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో.. శానిటరీ ప్యాడ్‌ల జాతీయ ప్రమాణాలను సవరించనున్నట్లు అధికారులు చెబుతున్నారని స్థానిక మీడియా పేర్కొంది.

శానిటరీ ప్యాడ్ సైజుల్లో వైరుధ్యాలపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రముఖ చైనీస్ కంపెనీ ఏబీసీ స్పందిస్తూ ''మీకు నచ్చితే కొనండి లేకపోతే లేదు'' అనడంపై మరింత ఆగ్రహం వ్యక్తమైంది.

దీంతో నవంబర్‌ మధ్యలో ఏబీసీ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఏబీసీ.. తమ అనుచిత స్పందనకు క్షమించాలని కోరడంతో పాటు, ఇకపై ఏ చిన్నతేడా కూడా రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.

షీకేర్, బీషూట్ వంటి కంపెనీలు కూడా క్షమాపణలు చెప్పాయి.

ఈ విషయంపై దృష్టి సారించిన చైనా నేషనల్ మీడియా కూడా, తయారీదారులు ప్యాడ్ అంచులను తగ్గిస్తున్నారని విమర్శించింది.

''మహిళల రోజువారీ జీవితంలో కీలకమైన శానిటరీ ప్యాడ్‌ల నాణ్యత అంశం స్త్రీల ఆరోగ్యానికి, వారి సౌకర్యానికి సంబంధించినది'' అని జిన్హువా తన ఆర్టికల్‌లో రాసింది.

మహిళలు, మహిళల ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో శానిటరీ ప్యాడ్‌ల మార్కెట్ విలువ దాదాపు 13 బిలియన్ డాలర్లు. అంటే, దాదాపు ఒక లక్షా 9 వేల 843 కోట్ల రూపాయలు. అంత భారీ వ్యాపారం జరుగుతున్నప్పటికీ, మహిళల ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులపై కొన్నేళ్లుగా వివాదాలు ఏర్పడుతున్నాయి.

2016లో ఆగ్నేయ చైనాలో భారీ ''నకిలీ శానిటరీ టవల్'' ఆపరేషన్‌ను పోలీసులు ఛేదించారు.

అక్కడ కనీస పరిశుభ్రత, ప్రమాణాలు పాటించకుండా, ప్రముఖ కంపెనీల పేర్లతో లక్షల సంఖ్యలో తయారవుతున్న నకిలీ శానిటరీ ప్యాడ్‌లను గుర్తించారు. 2021లో తన శానిటరీ ప్యాడ్‌లో సూది వచ్చినట్లు ఒక మహిళ ఆందోళన వ్యక్తం చేయడంతో మరో ప్రముఖ కంపెనీ స్పేస్ 7 క్షమాపణలు చెప్పింది, దీనిపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది.

మహిళల నుంచి వెల్లువెత్తిన ఈ ఆగ్రహం, స్త్రీల ఆరోగ్య సంబంధిత వస్తువుల నాణ్యతపై నెలకొన్న ఆందోళనలకు కూడా అద్దంపడుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)