‘క్యాట్’స్తాంబుల్: ఈ నగరంలో 2 లక్షల 50 వేల పిల్లులు ఉన్నాయి

ఇస్తాంబుల్ పిల్లి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జెఫ్ బోగల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇస్తాంబుల్‌ నగరానికి, పిల్లులకు మధ్యనున్న అనుబంధం శతాబ్దాల నాటిది. ఒట్టోమన్ కాలం నుంచే ఉన్న ‘పిల్లుల సంరక్షణ’ నేటికీ ఇక్కడి వీధుల్లో కనిపిస్తుంటుంది.

వంపుతిరిగిన వీధులు, మసీదులు, మెట్రోస్టేషన్లు, కెఫేలలో ఇలా ఇస్తాంబుల్‌లో ప్రతిచోటా పిల్లులు కనిపిస్తుంటాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పిల్లులు ఇస్తాన్‌బుల్ తుర్కియే

ఫొటో సోర్స్, Marcel Heijnen

ప్రజలే సంరక్షకులు

తుర్కియేలో అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్ జనాభా కోటి 50 లక్షలమంది. ఈ నగరాన్ని బోస్ఫరస్ జలసంధి అటు యూరప్, ఇటు ఆసియా ఖండాల మధ్య విభజించింది. సగం సోఫా మీద, మరో సగం కాఫీటేబుల్‌పై ఓ పిల్లి ఒరిగితే ఎలా ఉంటుందో ఈ నగరం కూడా అలాగే రెండు ఖండాల మధ్యన విస్తరించి కనిపిస్తుంటుంది.

ఈ పిల్లి పోలిక సరైనదే. ఎందుకంటే ఈ నగరంలో 2లక్షల 50వేల వీధి పిల్లులు ఉన్నాయని అంచనా.

ఈ నగరంలో ప్రతి మూలా పర్షియన్ కంబళ్ల అమ్మకం ఎంతటి సాధారణమో పిల్లులు కూడా ఇస్తాంబుల్ చరిత్ర, సంస్కృతిలో అంతగా ముడిపడిపోయాయి. నిరంతరం ప్రేమాస్పద జీవితాన్ని పంచే నగరం ఇది.

‘‘ఇస్తాంబుల్‌లో పిల్లలు అటు పెంపుడు జంతువులుగానూ, ఇటు వీధి జంతువుల్లానూ కాకుండా ఆ రెండిటి మధ్య ఓ ప్రత్యేక స్థానంలో ఉంటాయి’’ అని ఫోటోగ్రాఫర్, సిటీ క్యాట్స్ ఆఫ్ ఇస్తాంబుల్ పుస్తక రచయిత మార్సెల్ హైనెన్ అన్నారు.

ఆయన చెప్పినట్లు, ఈ పిల్లులకు ఒకే యజమాని ఉండరు. అవి నివసించే ప్రాంతంలోని ప్రజలే వాటిని చూసుకుంటారు.

పిల్లులు ఇస్తాన్‌బుల్ తుర్కియే

ఫొటో సోర్స్, Marcel Heijnen

ఇతర నగరాల్లో కనిపించని విధంగా ఇక్కడ పిల్లుల పట్ల స్థానికుల్లో ఒక ప్రత్యేక అభిమానం కనిపిస్తుందని హైనెన్ అన్నారు.

"ప్రతి మునిసిపాలిటీ పరిధిలో వీధి జంతువులను చూసుకునే వెటర్నరీ విభాగం ఉంటుంది. ఇవి వీధిపిల్లుల సంతానోత్పత్తిని నియత్రించే సేవలు ఉచితంగా అందిస్తాయి" అని ఇస్తాంబుల్ క్యాట్ మ్యూజియం సహ వ్యవస్థాపకురాలు ఫాతిహ్ దాగ్లి వివరించారు.

ప్రైవేట్ జంతు వైద్య కేంద్రాలు కూడా వీధి పిల్లులకు తగ్గింపు ధరలతో చికిత్స అందిస్తాయి. అవసరమైతే స్థానికులందరూ కలిసి వాటి చికిత్స ఖర్చును భరిస్తారు.

పిల్లులు ఇస్తాన్‌బుల్ తుర్కియే

ఫొటో సోర్స్, Marcel Heijnen

ఇస్తాంబుల్‌కు పిల్లులు ఎలా వచ్చాయి?

ఇస్తాంబుల్ ప్రజల ప్రేమ కొత్తది కాదు. వీధి పిల్లులపై అభిమానం చూపడానికి మూలాలు ఒట్టోమన్ సామ్రాజ్యంలో కనిపిస్తాయి" అని హైనెన్ చెప్పారు. ఆ కాలంలో స్థానిక ధార్మిక సంస్థలు వీధి జంతువుల సంరక్షణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేవి.

కాలక్రమేణా ఈ బాధ్యత ఒక పూర్తి స్థాయి వృత్తిగా మారింది. అప్పట్లో "మాన్‌కాకీ" అంటే ‘‘పిల్లి సంరక్షకుడు’’ అని పిలిచే ఒక ఉద్యోగం ఉండేది. వీరి పని నగరంలోని పిల్లులకు ఆహారం అందుతోందో లేదో చూసుకోవడం.

నగర ప్రజలకు కూడా వారి నుంచి ఆహారం కొనుగోలు చేసి, పిల్లులకు పెట్టే అవకాశం కూడా ఉండేది.

ఈ సంబంధం ఇంకా వెనకటిదని దాగ్లి చెబుతున్నారు. ‘‘ఫోనిషియన్‌ల కాలం నుంచి సముద్ర వర్తకులు తమ నౌకల్లో సరుకులను ఎలుకల నుంచి రక్షించుకోవడానికి పిల్లులను తీసుకెళ్లేవారు’’.

రోమన్, ఒట్టోమన్ కాలాల్లో సిల్క్, మసాలా సరుకులతో నిండిన నౌకలు రద్దీగా ఉండే ఇస్తాంబుల్ నౌకాశ్రయాలకు చేరుకునే సమయంలో, ఆ నౌకల్లో అనేక పిల్లులు కూడా ఈ నగరానికి చేరుకున్నాయి.

పిల్లులు ఇస్తాన్‌బుల్ తుర్కియే

ఫొటో సోర్స్, Jeff Bogle

ఇప్పటికీ ఇస్తాంబుల్ ప్రజలు తమ ఇళ్లలోనూ బయటా ఈ పిల్లులతో సంతోషం పంచుకుంటున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా పిల్లి ప్రేమికులు ఈ నగరాన్ని ప్రేమగా "క్యాట్‌స్తాంబుల్" అని పిలుస్తారు.

అనేక మంది పర్యటకులు ప్రత్యేకంగా పిల్లులను చూడటానికి ఇక్కడికి వస్తుంటారు.

ఈ నగరాన్ని సందర్శించినప్పుడు నేనో విషయం గమనించాను. ఎప్పుడూ గోలతో, హడావుడిగా ఉండే ఈ మహానగరంలో వీధి పిల్లులే అత్యంత ప్రశాంతమైన పౌరుల్లా కనిపిస్తాయి.

గలాటా టవర్ వైపు ఎక్కుతూ అలసిపోయి బెంచ్ మీద కూర్చుంటే పక్కనే ఒక పిల్లి నిశ్శబ్దంగా కూర్చుంటుంది.

బోస్ఫరస్ తీరంలో నగరాన్ని చూస్తూ ఉంటే మరో పిల్లి దగ్గరికి వచ్చి ఒదిగిపోతుంది.

పిల్లులు ఇస్తాన్‌బుల్ తుర్కియే

ఫొటో సోర్స్, Marcel Heijnen

ఆత్మీయతను అందిస్తాయి

ఈ పిల్లులు కలిగించే ప్రశాంతత ఆ రద్దీ నగరంలో ఒక చిన్న విరామంలా అనిపిస్తుంది. వీధి పిల్లులు కూడా మనుషులకు ఒక చిన్న ఆత్మీయతను అందిస్తాయి. ఎవరో ఒకరు ఆగి వాటిని ముద్దాడితే, అవి మోకాళ్లపైకి ఎక్కి కూర్చుంటాయి. భాషా, దేశ సరిహద్దులకతీతంగా ఉన్న ఆ ఆత్మీయత ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది.

హైనెన్ చెప్పినట్లుగా, ఒక ఇస్తాంబుల్ పిల్లి మీ మోకాళ్లపై నిద్రపోవాలని ఎంచుకున్న క్షణంలో నగరం ఒక్కసారిగా మరింత మృదువుగా అనిపిస్తుంది. చుట్టూ కబాబ్ మాంసం వాసన, కుంకుమపువ్వు సువాసన, కాల్చిన మొక్కజొన్న, తాజా మాకెరెల్ చేపల వాసన ముక్కుపుటాలను తాకుతుంటే, ఆ అనుభూతి మరింత ప్రత్యేకంగా మారుతుంది.

పిల్లి

ఫొటో సోర్స్, Getty Images

సాధారణంగా నగరాలు హడావుడిగా ఉంటాయి. అవి మనుషుల అవసరాల కోసం ఏర్పడినవి. రోడ్లు, భవనాలు, వంతెనలు వంటి భారీ నిర్మాణాలతో నిండినవి. ఇటుకలు, కాంక్రీట్, గాజు, ఉక్కు వంటి కఠిన పదార్థాలతో నిర్మితమైనవి.

అలాంటి నగర నిర్మాణంలో మరో జీవ జాతి తనకో స్థలం ఏర్పరచుకోవడం చాలా అరుదైన విషయం అని హైనెన్ అంటారు.

అంతేకాదు, ఆ జంతువులను స్థానిక ప్రజలు ప్రేమతో చూసుకోవడం మరింత ప్రత్యేకం.

ప్రపంచంలోని కొన్ని నగరాల్లో వీధి జంతువుల జీవితం కష్టంగా ఉంటుంది. కానీ ఇస్తాంబుల్‌లొ పిల్లులు తమ జీవితాన్ని కొంత సౌకర్యంగానే వెళ్లదీస్తున్నాయి.

బ్లూ మసీదు, హాగియా సోఫియా చూడటానికి వెళ్లినప్పుడు, సులో అనే ప్రసిద్ధ పిల్లిని మీరు చూసే అవకాశం ఉంటు ది. బూడిద-తెలుపు రంగు కలగలసి ఉండే ఆ పిల్లి సుల్తానాహ్మెట్ స్క్వేర్‌లో పర్యటకుల ఫోటోల కోసం పోజులు ఇస్తూ కనిపిస్తుంది. దగ్గరలోని వార్తాపత్రిక దుకాణదారుడు దానిని చూసుకుంటారు.

పిల్లులు ఇస్తాన్‌బుల్ తుర్కియే

ఫొటో సోర్స్, Marcel Heijnen

మీ దగ్గరకు వస్తాయి

బోస్ఫరస్ తీరంలోని కొండ ప్రాంతాల్లో పిల్లులు బెంచ్‌లపై, మెట్లపై విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తాయి. వాటి మధ్యాహ్నపు నిద్ర కోసం నిర్మించిన చిన్న చిన్న గూళ్లలో నక్కుతాయి. మార్కెట్లు, మెట్రో స్టేషన్ల వెలుపల ఆహారం, నీటి పాత్రలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

కేఫేల్లో కూర్చున్న స్థానికులు, పర్యటకులు తమ ఆహారంలో కొంత భాగాన్ని పక్కనే తిరుగుతున్న పిల్లులతో పంచుకుంటారు.

అనేక దుకాణాల్లో పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. అవి దుకాణంలోకి వచ్చే కస్టమర్లకు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మరికొన్ని దుకాణాలు వీధిలో తిరిగే పిల్లుల కోసం ఆహారం, నీటి పాత్రలను బయట ఉంచుతాయి.

"ఈ ప్రపంచంలో మనుషులు పిల్లుల మధ్య సహజీవనం మొదలైన ప్రాంతం ఇదే," అని హైనెన్ చెప్పారు. ‘‘ఒట్టోమన్ కాలంలో పిల్లులను ధాన్యం సంరక్షించుకోవడానికి పెంచేవారు’’ అని తెలిపారు.

ఇస్తాంబుల్‌లో పిల్లి

ఫొటో సోర్స్, Getty Images

అనధికార రాయబారులు

ఇస్తాంబుల్ నగరంలో పిల్లులకు మరో పాత్ర ఉంది. అవి ఆ నగరానికి అనధికారిక రాయబారుల్లా మారాయి. హడావుడితో సాగిపోయే నగరానికి అవి ఒక మృదుత్వాన్ని జోడిస్తాయి.

ఇస్తాంబుల్ వీధి పిల్లులు మీ పాదాల దగ్గర కనిపిస్తాయి. మీ ఫోటోల్లోకి చొరబడతాయి. మీరు నగరాన్ని వదిలి వెళ్లిన తర్వాత కూడా వాటి ముఖాలు, పాదాలు,అవి చేసే మృదువైన శబ్దాలు మీ జ్ఞాపకాలలో నిలిచిపోతాయి.

మన నివాస స్థలాలను, ఆహారాన్ని, జీవితాన్ని ఇతర జీవులతో పంచుకుంటే ఎలా ఉండొచ్చో గుర్తుచేసే ఒక సున్నితమైన సందేశంగా అవి నిలుస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)