వీధి కుక్కలే లేని దేశంగా నెదర్లాండ్స్ ఎలా నిలిచింది, ఈ సమస్యను కొన్ని దేశాలు ఎలా పరిష్కరించుకున్నాయి?

వీధి కుక్కలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల తెలంగాణలో 350కుపైగా వీధి కుక్కలను చంపిన ఘటనలపై పోలీసు కేసులు నమోదయ్యాయి. మరోపక్క సుప్రీంకోర్టు కూడా వీధికుక్కల సమస్యపై విచారణ జరుపుతోంది.

ఇండియాలో సుప్రీంకోర్టు కూడా దృష్టి సారించిన వీధికుక్కల సమస్యను కొన్ని దేశాలు ఎలా పరిష్కరించుకున్నాయి?

ప్రపంచంలోనే వీధి కుక్కలే లేని మొదటి దేశంగా నెదర్లాండ్స్ గుర్తింపు పొందింది. ఒక్క కుక్కను కూడా చంపకుండా నెదర్లాండ్స్ ఈ ఘనత సాధించిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా.

వీధి కుక్కల నియంత్రణ‌లో ముందంజలో ఉన్న కొన్ని దేశాలు పాటించిన విధానాలు, తీసుకున్న చర్యలు, వాటి ప్రణాళికలేమిటో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నెదర్లాండ్స్ వీధి కుక్కలు లేని మొదటి దేశం

ఫొటో సోర్స్, Getty Images

నెదర్లాండ్స్ ఏం చేసింది?

నెదర్లాండ్స్‌లో వీధికుక్కలు లేకుండా చేయడం రాత్రికి రాత్రే జరిగింది కాదు. అలా అని వారికి కుక్కల పట్ల ద్వేషం కూడా లేదు.

పూర్వం నెదర్లాండ్స్‌లో కుక్కలను పెంచుకోవడాన్ని ఒక హోదాగా చూసేవారని, దీంతో 19వ శతాబ్దంలో నెదర్లాండ్స్‌లో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిందని నెదర్లాండ్స్‌కు చెందిన ఆన్‌లైన్ మ్యాగజీన్ డచ్ రివ్యూ ఓ కథనంలో తెలిపింది.

‘అయితే రేబిస్ వ్యాప్తి కారణంగా ప్రజల్లో భయాలు నెలకొని రోగాల బారిన పడిన కుక్కలను యజమానులు విడిచిపెట్టడం మొదలైంది. దీంతో కుక్కల ఆరోగ్యాన్ని కాపాడటం యజమానుల బాధ్యత అని డచ్ ప్రభుత్వం భావించిందని’ ఆ కథనం తెలిపింది.

వీధికుక్కల సంఖ్యను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా డచ్ ప్రభుత్వం యజమానులపై 'హోండెన్ బెలాస్టింగ్' అనే పన్ను (డాగ్ ట్యాక్స్) విధించింది.

కానీ, ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. పెంపుడు కుక్కలను కూడా యజమానులు వదిలేయడంతో వీధికుక్కల సంఖ్య మరింత పెరిగింది.

దేశంలో తొలి జంతు సంరక్షణ సంస్థ అయిన 'డచ్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్' 1864లో హేగ్‌లో ఏర్పాటైంది.

తర్వాత జంతు సంరక్షణ చట్టాలను తీసుకొచ్చారు.

యానిమల్ వెల్ఫేర్ యాక్ట్-2013 కింద, డచ్ ప్రభుత్వం జంతువులను భావోద్వేగాలున్న జీవులుగా గుర్తించింది. ఈ చట్టం ప్రకారం, జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే భారీ జరిమానాలతో (సుమారు 15 లక్షల రూపాయలు) పాటు జైలు శిక్ష విధిస్తారు.

అలాగే వీధికుక్కల నియంత్రణ కోసం డచ్ ప్రభుత్వం సీఎన్‌వీఆర్ (కలెక్ట్, న్యూటర్, వ్యాక్సినేట్, రిటర్న్) అనే పద్ధతిని అమలు చేసింది. అంటే వీధికుక్కలను పట్టుకొని వాటికి కుటుంబ నియంత్రణ చికిత్స చేయడం, రేబిస్ వ్యాధులు వంటివి రాకుండా టీకాలు వేయడం, తిరిగి వాటిని తమ ప్రాంతాల్లో వదిలేయడం అన్నమాట. ఈ స్టెరిలైజేషన్ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నిర్వహిస్తారు.

అలాగే దుకాణాలలో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకునే పెంపుడు కుక్కలపై 'డాగ్ ట్యాక్స్' భారీగా పెంచింది. దీని ద్వారా షెల్టర్ల నుంచి కుక్కలను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించింది.వాటిపై నేరాలు జరగకుండా చూసుకోవడానికి 'యానిమల్ పోలీస్ ఫోర్స్' అనే దళాన్ని ఏర్పాటు చేసింది.

వీధి కుక్కలు

ఫొటో సోర్స్, Getty Images

జర్మనీ: 'నో-కిల్' పాలసీ

జర్మనీలో కుక్కను పెంచుకోవడం సామాజిక బాధ్యతతో కూడుకున్న పని. జర్మనీలోని జంతు సంరక్షణ చట్టం ప్రకారం, తగిన కారణం లేకుండా వెన్నెముక కలిగిన ఏ జీవినైనా చంపడం నేరం. షెల్టర్లలో స్థలం లేదని వీధి కుక్కలను చంపడానికి వీల్లేదు.

'తీవ్రమైన అనారోగ్యం లేని కుక్కలను చంపడం నేరం. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. పెంపుడు జంతువులను వదిలేయడం పూర్తిగా నిషిద్ధం. తీవ్రమైన అనారోగ్యం ఉంటే తప్ప జంతువులకు యుథనేసియా (కారుణ్య మరణం) అనుమతించకూడదు' అని ఈ చట్టంలోని సెక్షన్ 17లో పేర్కొన్నారు. అందుకే అక్కడ కుక్కలను షెల్టర్లలోనే ఉంచుతారు తప్ప చంపరు.

బెర్లిన్‌లో కుక్కను పెంచుకునే యజమాని కచ్చితంగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. తర్వాత నుంచి ఏటా 120 యూరోలు అంటే దాదాపు రూ. 11 వేలు పన్నుగా చెల్లించాలి. దీన్నే 'హుండెస్టాయర్' (Hundesteuer) డాగ్ ట్యాక్స్ అని పిలుస్తారు.

ట్యాక్స్ రూపంలో వచ్చే ఈ డబ్బుతోనే బెర్లిన్ నగరం యూరప్‌లోనే అతిపెద్ద యానిమల్ షెల్టర్ 'టైర్హీమ్ బెర్లిన్'ను నిర్వహిస్తోంది. ఇక్కడ కుక్కలకు శిక్షణ ఇచ్చి మళ్లీ కొత్త యజమానులకు అప్పగిస్తారు. వీధికుక్కలకు మైక్రోచిప్స్ అమర్చుతారు.

వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకొని షెల్టర్లలో పునరావాసం కల్పిస్తారు. వాటిని దత్తత ఇవ్వడానికి 450 రోజుల వరకు షెల్టర్లలోనే ఆశ్రయం ఇచ్చి సంరక్షిస్తారు.

యూకేలో జంతు సంక్షేమం

ఫొటో సోర్స్, Getty Images

యూకే: 7 రోజుల గడువు

బ్రిటన్‌లో వీధి కుక్కల నిర్వహణ పూర్తిగా స్థానిక యంత్రాంగం చేతిలో ఉంటుందని యూకే ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1990లోని సెక్షన్ 149 తెలుపుతుంది.

ఈ సెక్షన్ ప్రకారం, వీధిలో ఒంటరిగా కనిపించే కుక్కను అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుంటారు.

సదరు కుక్క యజమాని 7 రోజుల్లోపు వచ్చి జరిమానా చెల్లించి తీసుకెళ్లాలి. లేనిపక్షంలో ఆ కుక్కను దత్తతకు ఇచ్చేస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత, షెల్టర్లు వాటి సామర్థ్యానికి మించి నిండిపోతున్న తరుణంలో వాటికి కారుణ్యమరణం కల్పిస్తారు.

బ్రిటన్‌ చట్టం ప్రకారం, 8 వారాల వయస్సు దాటిన ప్రతి కుక్కకు మైక్రోచిప్ అమర్చడం తప్పనిసరి. దీనివల్ల కుక్క తప్పిపోయినప్పుడు దాని యజమాని ఎవరో గుర్తించడం సులభమవుతుంది.

వీధి కుక్కల సమస్య

ఫొటో సోర్స్, Getty Images

భూటాన్: 100 శాతం స్టెరిలైజేషన్

ఆసియా ఖండంలో వీధి కుక్కల నియంత్రణలో భూటాన్ ఆదర్శంగా నిలిచినట్లు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (డబ్ల్యూవోఏహెచ్) పేర్కొంది.

నేషనల్ డాగ్ పాపులేషన్ మేనేజ్‌మెంట్ అండ్ రేబిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద 2021లో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన భూటాన్, 2023 నాటికి దేశంలోని 100 శాతం వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, 90 శాతం కుక్కలకు రేబిస్ టీకా పూర్తి చేసినట్లు తన నివేదికలో డబ్ల్యూవోఏహెచ్ ప్రస్తావించింది.

2030 నాటికి సంపూర్ణ రేబిస్ రహిత దేశంగా నిలవాలని భూటాన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2023 అక్టోబర్ నాటికి దేశంలో లక్ష కంటే ఎక్కువగా ఉన్న వీధికుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తి చేసింది. అలాగే ప్రతీ పెంపుడు కుక్కకు మైక్రో చిప్ అమర్చి వాటి వివరాలను ప్రభుత్వ డేటాబేస్‌లో పొందుపరిచింది.

స్విట్జర్లాండ్

ఫొటో సోర్స్, Getty Images

స్విట్జర్లాండ్: మైక్రో‌చిప్ తప్పనిసరి

స్విస్ జంతు సంరక్షణ చట్టం, జంతువుల హక్కులకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తోంది.

చట్టం ప్రకారం, స్విట్జర్లాండ్‌లో వీధికుక్కలకు మైక్రోచిప్ అమర్చడం తప్పనిసరి. ఇక్కడ వీటికి కారుణ్యమరణాన్ని చాలా అరుదుగా అనుమతిస్తారు. పెంపుడు జంతువులను వదిలేసే వారికి జరిమానాలు విధిస్తారు.

అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే షెల్టర్లు ఉండవు. ప్రైవేట్ లేదా స్వచ్ఛంద సంస్థలే ఈ షెల్టర్లను నిర్వహిస్తాయి.

తప్పిపోయిన వీధి కుక్కలను యజమానులు వచ్చి తీసుకెళ్లడానికి రెండు నెలల సమయం ఇస్తారు. ఆ తర్వాత వాటిని దత్తతకు అనుమతిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)